Home జాతీయ national telgu పైలట్లు ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటే గాల్లో ఢీకొన్న రెండు యుద్ధవిమానాలు, ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే..

పైలట్లు ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటే గాల్లో ఢీకొన్న రెండు యుద్ధవిమానాలు, ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే..

18
0

SOURCE :- BBC NEWS

యుద్ధ విమానాలు, మిషన్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ కొరియాలో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్న ఘటన 2021లో జరిగింది.

ఈ ప్రమాదానికి కారణమేంటని విచారణ చేసినప్పుడు, రెండు విమానాల పైలట్లు ఫోటోలు తీసుకోవడమేనని తేలింది.

సోల్ ఆడిట్ అండ్ ఇన్‌స్పెక్షన్ బోర్డ్ ప్రకారం, కొరియాలోని డేగు నగరంలో రెండు యుద్ధ విమానాలు ఒక మిషన్‌లో పాల్గొన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనలో పైలట్లు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ, విమానాలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం సైన్యానికి 880 మిలియన్ వాన్‌లు (సుమారు రూ.5.5 కోట్లు) ఖర్చయ్యాయి.

ఆ తర్వాత, సైన్యం నుంచి తప్పుకున్న పైలట్లలో ఒకరికి 88 మిలియన్ వాన్‌ల (సుమారు రూ.55 లక్షలు) జరిమానా విధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

సదరు పైలట్ సైన్యంలో తన చివరి ప్రయాణానికి గుర్తుగా ఫోటోలు తీసుకోవాలనుకోవడం వల్లే ఈ సంఘటన జరిగింది.

“అప్పట్లో ముఖ్యమైన ప్రయాణాల సందర్భంగా పైలట్లు విమానాల్లో నుంచి ఫోటోలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది” అని బుధవారం ప్రచురితమైన రిపోర్ట్‌లో ఆడిట్ బోర్డ్ పేర్కొంది.

విమాన ప్రయాణానికి ముందే ఆ పైలట్ దీని గురించి చెప్పినట్లు నివేదిక తెలిపింది.

ప్రమాద సమయంలో ఏం జరిగింది?

ఆ మిషన్‌లో భాగంగా సదరు పైలట్ వింగ్‌మ్యాన్ విమానం నడుపుతూ, ముందు వెళ్తున్న లీడ్ (ప్రధాన) విమానాన్ని అనుసరించారు. తిరిగి తమ స్థావరానికి బయలుదేరిన తర్వాత, ఆయన తన మొబైల్‌ ఫోన్‌తో ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు.

అది గమనించిన లీడ్ విమానంలోని పైలట్.. ఆ వింగ్‌మ్యాన్ విమానాన్ని వీడియో తీయాలని తన సహ పైలట్‌ను కోరారు.

అనంతరం, కెమెరాలో మరింత స్పష్టంగా కనిపించడం కోసం వింగ్‌మ్యాన్ పైలట్ తన జెట్‌ను ఒక్కసారిగా పైకి తీసుకెళ్లి, తల్లకిందులు చేశారు. ఈ విన్యాసంతో రెండు విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి.

ప్రమాదాన్ని నివారించేందుకు, లీడ్ విమానాన్ని వేగంగా కిందకు దించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ రెండు ఎఫ్ -15కె జెట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ఘటనలో లీడ్ విమానం ఎడమ రెక్క భాగం, వింగ్‌మ్యాన్ విమానం వెనుక భాగంలోని స్టెబిలైజర్ భాగాలు దెబ్బతిన్నాయి.

దీంతో దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ ఆ వింగ్‌మ్యాన్ పైలట్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం, ఆయన సైన్యం నుంచి వైదొలగి, ఒక వాణిజ్య విమానయాన సంస్థలో చేరారు.

ఆ తర్వాత, మరమ్మతులకు అయిన పూర్తి ఖర్చును వింగ్‌మ్యాన్ పైలట్‌పై జరిమానాగా విధించేందుకు ఎయిర్ ఫోర్స్ ప్రయత్నించింది. అయితే, పైలట్ అప్పీల్‌కు వెళ్లడంతో ఆడిట్ బోర్డు దర్యాప్తు మొదలుపెట్టింది.

విమానాలు ఢీకొనడానికి తన విన్యాసం కారణం కావచ్చని అంగీకరించిన వింగ్‌మ్యాన్ పైలట్.. కాకపోతే ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నట్లు లీడ్ విమాన పైలట్‌కు కూడా తెలుసని, ఆయన కూడా అందుకు అంగీకరించినట్లు వాదించారు.

చివరికి, ఎయిర్ ఫోర్స్ కోరిన మొత్తంలో పదోవంతును వింగ్‌మ్యాన్ పైలట్ చెల్లించాలని ఆడిట్ బోర్డు తీర్పునిచ్చింది.

పైలట్లు తమ సొంత అవసరాలకు కెమెరాలను వినియోగించడంపై సరైన నియంత్రణ చర్యలు లేనందున వైమానిక దళం కూడా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.

ఈ ఘటన జరగానికి ముందువరకు సదరు పైలట్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, అలాగే తన విమానాన్ని వెంటనే సురక్షితంగా బేస్‌కు తీసుకురావడం ద్వారా భారీ నష్టాన్ని నివారించగలిగారనే విషయాన్ని కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుంది.

అయితే, ఈ సంఘటనతో సంబంధమున్న ఇతర పైలట్లపై చర్యల గురించి ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)