SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, NAMITATHAPAR
2 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
వ్యాపారవేత్త, టీవీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ న్యాయనిర్ణేత, ఎంక్యూర్ ఫార్మా కంపెనీ ఇండియా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇన్‌క్రెడిబుల్ వెంచర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలైన 48 ఏళ్ల నమిత థాపర్ వివాదంలో చిక్కుకున్నారు. నమాజ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
వ్యాపార కుటుంబానికి చెందిన నమిత థాపర్, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 15 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. వివిధ అంశాలపై ఆమె తన అభిప్రాయాలను పంచుకుంటూ రీల్స్ షేర్ చేస్తుంటారు.
మూడు వారాల కిందట, ముస్లింల ప్రార్థనా విధానం నమాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక రీల్‌ను షేర్ చేశారు.
ఆ రీల్ షేర్ చేసిన తర్వాత, ఆమె విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆమెను విమర్శిస్తూ చాలామంది కామెంట్లు చేశారు.
నమిత దీనిపై మరో రీల్ చేశారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

నమిత థాపర్ 1977 మార్చి 21న మహారాష్ట్రలోని పుణెలో పుట్టారు.
ఆమె తండ్రి సతీశ్ మెహతా. ఐఐఎం అహ్మదాబాద్ పట్టభద్రులు.
సతీశ్ మెహతా ఫార్మా కంపెనీ ‘ఎంక్యూర్’ వ్యవస్థాపకులు.
ఫొటో సోర్స్, NAMITATHAPAR
21 ఏళ్లకే చార్టర్డ్ అకౌంటెంట్
నమిత 21 ఏళ్లకే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పట్టా పొందారు. తన తండ్రి కంపెనీలో మేనేజ్‌మెంట్ బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆమె అమెరికాలోని గైడెంట్ కార్పొరేషన్‌లో ఆరేళ్లపాటు పనిచేశారు.
డ్యూక్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు.
ఎంక్యూర్ ఫార్మాలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్‌వో)గా 2007లో చేరారు నమిత. ఆ తర్వాత ఆ కంపెనీకి ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ అయ్యారు.
ఎంక్యూర్ ఫార్మా దాదాపు 70 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని, వాటిలో పదివేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని నమిత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మూడేళ్ల కిందట చేతన్ భగత్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, “నేను కంపెనీ ఇండియా ఆపరేషన్స్ చూసుకుంటాను” అని నమిత చెప్పారు.
సీఏ డిగ్రీ కోసం నాలుగేళ్లు వెచ్చించానని, అమితమైన ఇష్టం వల్లే అది సాధ్యమైందని అన్నారు.
“నాకు అకౌంట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మా నాన్న ‘మునీమ్ జీ’ (అకౌంటెంట్ గారు) అని పిలుస్తుంటారు” అని ఆమె చెప్పారు.
ఈ ఇంటర్వ్యూలో నమిత తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేదు, కానీ ఎంక్యూర్ ఫార్మా ఏటా రూ.7 వేల కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఎంక్యూర్, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువ కలిగిన ఒక పబ్లిక్ కంపెనీగా ఉంది.
ఫొటో సోర్స్, NAMITATHAPAR
ఒకవైపు కార్పొరేట్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు యాక్టివ్ ఇన్వెస్టర్‌గానూ రాణిస్తున్నారు. అలాగే, బిజినెస్ రియాలిటీ షో ‘షేర్ ట్యాంక్ ఇండియా’ న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఈ టీవీ షో మొదటి సీజన్ సమయంలో నమిత 10 కోట్ల రూపాయలను 25 కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత మరికొన్ని కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేశారు.
టీవీ షోలు, బిజనెస్ కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలోనూ నమిత చురుగ్గా ఉంటారు. కోవిడ్ సమయంలో ‘అన్‌కండిషన్ యువర్‌సెల్ఫ్’ పేరుతో టాక్ షో నిర్వహించారు.
అంతేకాకుండా నీతి ఆయోగ్ “డిజిటల్ హెల్త్ టాస్క్ ఫోర్స్”లోనూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన “చాంపియన్స్ ఆఫ్ చేంజ్” కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు నమిత. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు.
ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “జీవితంలో 80 శాతం పనే ఉంటుంది. కాబట్టి చేస్తున్న పనిని ప్రేమించడం చాలా ముఖ్యం. లేకపోతే నిత్య అసంతృప్తితో మిగిలిపోతారు” అని అన్నారు.
బిజినెస్ టుడేకి 2021లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, కేవలం డిగ్రీ వల్ల సమాజంలో గౌరవం దక్కడం చాలా కష్టమని థాపర్ అన్నారు.
తమ సంస్థలో అత్యుత్తమ ఆలోచనలను ప్రోత్సహించేందుకుగాను భిన్నాభిప్రాయాలకు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తానని నమిత పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, NAMITATHAPAR
నమిత థాపర్ ఎన్నో విషయాల్లో తన అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
యోగా గురు, వ్యాపారవేత్త బాబా రాందేవ్ 2025లో ‘రూహ్ అఫ్జా’ అనే శీతల పానీయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆయనపై కేసు కూడా నమోదైంది.
రాందేవ్ వ్యాఖ్యలను నమిత థాపర్ ‘హేట్ మార్కెటింగ్’గా అభివర్ణించారు. “మన పిల్లలకు మనం ఎలాంటి భారత దేశాన్ని ఇవ్వబోతున్నాం” అని ఆమె ప్రశ్నించారు.
అదే సమయంలో ఆమె ఓ నెపో కిడ్ అని, తండ్రి డబ్బుతోనే ఇదంతా సాధ్యమైందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అయితే, ఆమె మాత్రం తన తండ్రి ఫార్మా కంపెనీని రూ.500 కోట్ల నుంచి రూ.8000 కోట్ల విలువైన కంపెనీగా మార్చానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
“నా కష్టార్జితాన్ని నా ఇష్టప్రకారం ఖర్చు చేసుకోవాలనుకుంటున్నా. నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నా” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత్ జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా 87 శాతంగా నమిత పేర్కొన్నారు. మొదటితరం మాత్రమే కాకుండా, తర్వాతి తరాలు కూడా ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు.
షార్క్ ట్యాంక్ ఇండియాలో సంపన్నులైన న్యాయమూర్తుల్లో నమిత కూడా ఒకరు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, ఆమె విలాసవంతమైన జీవనశైలితోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, ఆమె వద్దనున్న విలాసవంతమైన కార్లలో రూ.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్7 సహా మెర్సిడెస్ బెంటజ్ జీఎల్‌ఈ, ఆడి క్యూ7 వంటివి ఉన్నాయి.
నమిత 20 లక్షల రూపాయల బూట్లు వేసుకుంటారని షార్క్ ట్యాంక్ ఇండియాలో సహ న్యాయనిర్ణేతగా ఉన్న అమిత్ జైన్ ఒకసారి సరదాగా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



