SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఒక గంట క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న మూడు కార్గో నౌకలపై బుధవారం దాడులు జరిగాయి. వాటిలో రెండింటిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ దాడులు జరిగాయి.
యూకే మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ (యూకేఎంటీవో) ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మొదట ఒక నౌకపై కాల్పులు జరిపింది.
హార్ముజ్ జలసంధిలో మూడు నౌకలను ఐఆర్‌జీసీ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఐఆర్‌జీసీ అనుబంధ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, యూఫోరియా అనే నౌకను టార్గెట్ చేశారు. అది ప్రస్తుతం ఇరాన్ తీరానికి సమీపంలో ఉంది.
ఎంఎస్‌సీ ఫ్రాన్సెస్కా, ఎపామినోండాస్ అనే కార్గో నౌకలను సీజ్ చేసి ఇరాన్ తీరానికి మళ్లించినట్లు ఐఆర్‌జీసీ నౌకాదళం తెలిపింది. ఇవి ‘అనుమతులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నాయి, నేవిగేషన్ వ్యవస్థలను తారుమారు చేస్తున్నాయి’ అని నౌకాదళం పేర్కొంది.
పాకిస్తాన్‌లో జరగబోయే చర్చలకు ముందు ఒత్తిడి పెంచే లక్ష్యంతో హార్ముజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమరణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు.

అయితే, చర్చల జరుగుతాయా, లేదా అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌కు బయలుదేరలేదు.
మరోవైపు, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
కాల్పుల విరమణను పొడిగించడం ‘అర్థరహితమని’, ‘ఆకస్మిక దాడికి సిద్ధమయ్యేందుకు సమయం కోసం వేసి ఎత్తుగడ’గా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలీబాఫ్ సలహాదారు ఒకరు అభివర్ణించారు.
“ఓడిపోతున్న వారు షరతులు నిర్దేశించలేరు. దిగ్బంధం కొనసాగించడం బాంబు దాడులతో సమానమే. దీనిని సైనిక చర్యతోనే ఎదుర్కోవాలి” అని మహదీ మొహమ్మదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాశారు.
“అనూహ్య దాడికి సిద్ధమవడం కోసం ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించారు. ఇక ఇరాన్ మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన రాశారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏప్రిల్ 22న కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
మొదటి ఓడపై గ్రీకు జెండా
యూకేఎంటీవో ప్రకారం, హార్ముజ్ జలసంధిలో ఓ కంటైనర్ నౌకపై ఐఆర్‌జీసీ కాల్పులు జరిపింది.
ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటిష్ రాయల్ నేవీ నేతృత్వంలోని యూకేఎంటీవో తెలిపింది.
బీబీసీ వెరిఫై ప్రకారం, ఎపామినోండాస్ అనే ఆ నౌక గ్రీకు జెండాతో ఉంది.
ఐఆర్‌జీసీకి చెందిన ఒక గన్‌బోట్ నౌక దగ్గరకు వచ్చిందని, ఎలాంటి రేడియో హెచ్చరిక చేయలేదని ఆ రిపోర్ట్ పేర్కొంది.
అనంతరం, నౌకపై గన్‌బోట్ నుంచి కాల్పులు జరపడంతో నౌకలోని కంట్రోల్ సెంటర్ దెబ్బతింది.
ఇరాన్ సైన్యం చేసిన హెచ్చరికలను ఆ నౌక పట్టించుకోలేదని ఇరాన్ వార్తా సంస్థలు తెలిపాయి.
రెండోది యూఏఈ కంపెనీ నౌక
బీబీసీ వెరిఫై ప్రకారం, బుధవారం ఉదయం దాడి జరిగిన రెండో కార్గో నౌక పనామా జెండాతో ఉంది. దాని పేరు యూఫోరియా. ఇది యూఏఈ కంపెనీకి చెందిన నౌక.
కెప్లర్ ఏఐఎస్ డేటా ప్రకారం, భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 22, ఉదయం 6.30 గంటలకు ఆ నౌక హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణం ప్రారంభించింది.
యూకేఎంటీవో, వాన్‌గార్డ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇరాన్‌కు పశ్చిమంగా సుమారు 8 నాటికల్ మైళ్ల దూరంలో, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ నౌకపై దాడి జరిగింది.
దీంతో కెప్టెన్ నౌకను నిలిపేశారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని. నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం.
ఫొటో సోర్స్, AFP via Getty Images
మూడో నౌకపై పనామా జెండా
బీబీసీ వెరిఫై, వాన్‌గార్డ్ అనే మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ వివరాల ప్రకారం, బుధవారం మూడు కార్గో నౌకపై కూడా దాడి జరిగింది.
పనామా జెండాతో వస్తున్న ఎంఎస్‌సీ ఫ్రాన్సెస్కా అనే నౌకను ఇరాన్ తీరానికి 6 నాటికల్ మైళ్ల దూరంలో టార్గెట్ చేశారు.
ఆ సమయంలో ఆ నౌక హార్ముజ్ దాటి ఒమన్ గల్ఫ్ వైపు వెళ్తోంది.
వాన్‌గార్డ్ ప్రకారం, ఎంఎస్‌సీ ఫ్రాన్సెస్కాను ఐఆర్‌జీసీ నిలిపేసి, ‘లంగరు వేయాల’ని ఆదేశించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



