SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
-
- రచయిత, కె.శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
ప్రచురణ 17 మే 2026, 12:26 IST
-
చదివే సమయం: 6 నిమిషాలు
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లోని ఫిష్ ట్యాంక్‌లో గత వారం ఓ పాము కనిపించడంతో ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ వలంటీర్లను సహాయం కోసం పిలిచారు.
ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి చల్లని ప్రదేశం వెతుకుతూ ఆ భవనంలోకి ప్రవేశించిన పాము ఫిష్ ట్యాంక్‌లోకి వెళ్లి ఉండవచ్చని, దానిని రక్షించామని ఆ సంస్థ తమ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.
అలాగే, గత జనవరి నెలలో ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నాగుపాము చొరబడింది.
అక్కడి వాషింగ్ మెషీన్‌లో దాక్కున్న ఆ పామును, పట్టణ వన్యప్రాణుల సంరక్షణ పనుల్లో నిమగ్నమైన ఒక స్వచ్ఛంద సేవకుడి సహాయంతో సురక్షితంగా బయటకు తీసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
జనావాసాల్లోకి పాములు దర్శనమీయడం ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది. జనావాసాల్లోకి వచ్చే పాములు చీకటి మూలలు లేదా సందులు, వాషింగ్ మెషీన్ల వంటి యంత్రాలలో, టూ-వీలర్, ఫోర్-వీలర్ లాంటి వాహనాలు ఫిష్ ట్యాంకులు అలాగే గుట్టలుగా పడేసిన వస్తువుల కింద… ఇలా రకరకాల ప్రదేశాలలో తలదాచుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పాములను చూసిన ఎవరికైనా భయం కలగడం సహజం.
కాబట్టి, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, అలాగే ప్రకృతి, పర్యావరణంపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
పాములు అసలు ఎందుకు ఇలాంటి ప్రదేశాలలోకి వస్తాయి, ఒకవేళ అలా వస్తే ఏం చేయాలి? అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
ఫొటో సోర్స్, UGC
జనావాసాల్లోకి పాములు ఎందుకొస్తాయి?
ఈ సంవత్సరం ప్రారంభంలో, ‘వైల్డ్‌లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్’ (డబ్ల్యూఎన్‌సీటీ) పరిశోధకులు విడుదల చేసిన ఒక అధ్యయనంలో.. ఉత్తర కోయంబత్తూరులో 2022 నుంచి 2024 వరకు నమోదైన 2,318 పాములను రక్షించిన సంఘటనలను విశ్లేషించారు.
పాములు చెత్త కుప్పలు, గదుల లోపలి భాగాలు, స్టోర్ రూమ్‌లు, యంత్రాలు వంటి ప్రదేశాలను దాక్కోవడానికి సురక్షితమైన ఆశ్రయాలుగా భావిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
అయితే, పాములు ప్రజలపై “దాడి చేయడానికి” నివాస ప్రాంతాలలోకి ప్రవేశించడం లేదని.. కేవలం నివాసం, రక్షణ, ఆహారం, తేమ, అనుకూలమైన ఉష్ణోగ్రత కోసమే ఇలాంటి వాతావరణంలోకి వచ్చి చిక్కుకుపోతాయని వన్యప్రాణి కార్యకర్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా, వేసవి వేడి, వర్షాలు, సహజ నివాస స్థలాలు దెబ్బతినడం వంటి వివిధ కారణాల వల్ల… ఇటీవల నివాస ప్రాంతాలలో పాములు కనిపించడం పెరుగుతోంది.
వాహనాల కింద, ఫిష్ ట్యాంకుల దగ్గర, పార్కింగ్ స్థలాలలో, కట్టెల మోపుల కింద, రిఫ్రిజిరేటర్ల వెనుక, అలాగే చీకటి మూలల్లో పాములు తరచుగా కనిపించడానికి కారణాలేమిటో హెర్పటాలజిస్టులు చెబుతున్నారు.
పాములు మానవ ఆవాసాలలోకి కావాలని ప్రవేశించవని వన్యప్రాణి ప్రేమికుడు, స్నేక్ రెస్క్యూయర్ శాంసన్ కృపాకరన్ చెప్పారు.
”పాములు సాధారణంగా మనుషులకు ఎదురుపడకుండా ఉండటానికే ప్రయత్నిస్తాయి” అని నొక్కి చెప్పారు.
వన్యప్రాణి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, పాములు ఎవరి కంటా పడకుండా ఉండేలా దాక్కోవడానికి అనుకూలంగా ఉండే చీకటి, ఏకాంత ప్రదేశాలనే ఇష్టపడతాయి.
కానీ, వాటి సహజ నివాస స్థలాలు తగ్గిపోవడం వల్ల, అలాగే మానవ ఆవాసాలలోని కొన్ని నిర్మాణాలు వాటికి అలాంటి సురక్షితమైన దాక్కునే ప్రదేశాలుగా ఉండటం వల్లే పాములు ఎక్కువగా నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని శాంసన్ కృపాకరన్ వివరించారు.
ఫొటో సోర్స్, UGC
ఎలాంటి ప్రదేశాలను వెతుక్కుంటూ వస్తాయి…
చాలా రోజులుగా ఒకేచోట నిలిపి ఉంచిన వాహనాలు, ఫిష్ ట్యాంకులు, వాటి చుట్టుపక్కల ఉండే చల్లని ప్రదేశాలు, నీడ, ఏకాంతాన్ని ఇచ్చే స్టోర్ రూమ్‌లు, వస్తువులను ఒక క్రమపద్ధతి లేకుండా గుట్టలుగా పడేసిన నిర్మాణ స్థలాలు, కొబ్బరికాయలు లేదా చెత్త కుప్పలు వంటివి పాములు దాక్కోవడానికి అనువైన ఆశ్రయాలుగా మారుతున్నాయి.
సరిపడా ఆహారం దొరకడం, తమకు అనుకూలమైన నివాస వాతావరణం, శరీరానికి సరిపోయే ఉష్ణోగ్రత వంటి కారణాల వల్ల.. ఇలాంటి ప్రదేశాలు పాములకు అనుకూలంగా మారుతున్నాయి. అందుకే అవి వీటిని వెతుక్కుంటూ వస్తాయి” అని శాంసన్ కృపాకరన్ అన్నారు.
ఎండలు ఎక్కువ ఉండే వేసవి కాలంలో పాములు చల్లని నీడ ఉండే ప్రదేశాలను.. అలాగే చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ప్రదేశాలను వెతుక్కుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆహార లభ్యత, దాక్కోవడానికి సురక్షితమైన నివాస వాతావరణంతో పాటు, అనుకూల ఉష్ణోగ్రత పరిస్థితులు కూడా పాములు మానవ నివాస ప్రాంతాలను వెతుక్కుంటూ రావడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి అని శాంసన్ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, UGC
వాహనాల్లోకి పాములు ఎందుకు చొరబడతాయి?
పాములు వేటి కోసమైతే వెతుకుతాయో, వాటిని వాహనాలు సహజంగానే అందిస్తాయి.
వాటిలో మొదటిది, వాహనాల కింది భాగం నీడను, చీకటిని ఇస్తుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం సమయంలో, ఒక కారు కింద ఉండే నేల, దాని చుట్టుపక్కల కంటే కాస్త చల్లగా ఉంటుంది. తీవ్రమైన ఎండ వేడిమి నుంచి తప్పించుకోవాలని చూసే పాములకు ఇది అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది.
రెండవది, నిలిపి ఉంచిన వాహనాలు ఇతర క్రూర జంతువులు, మనుషుల నుంచి కలిగే ఆపద నుంచి రక్షణను అందిస్తాయి.
”ఎవరి కంటైనా పడే అవకాశం ఉందనుకుంటే , పాములు వెంటనే దగ్గరలోని వాహనాల లోపలికి దూరిపోవడం వాటి నైజం. టైర్లు, యాక్సిల్స్, ఇంజిన్ భాగాల చుట్టూ ఉండే ఇరుకైన ప్రదేశాలు.. మనుషులతో ఎదురుపడటాన్ని నివారించడానికి, సురక్షితంగా దాక్కోవడానికి వీలు కల్పిస్తాయి” అని శాంసన్ కృపాకరన్ చెప్పారు.
అదేవిధంగా, ఎలుకల వంటి ఆహారాన్ని వెతుక్కుంటూ కూడా పాములు వాహనాల లోపలికి రావచ్చని ఆయన వివరించారు.
ఎలుకలు, కప్పలు వంటివి చాలా రకాల పాములకు ప్రధాన ఆహారం. ఇవి ఎక్కువగా పార్కింగ్ స్థలాలు, చాలా రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన వాహనాలు, స్టోర్ రూమ్‌లను తమ నివాసాలుగా మార్చుకుంటాయి. అందువల్ల, తమ ఆహారం కోసం పాములు వాహనాలు, యంత్రాలు, పార్కింగ్ స్థలాల వంటి ప్రదేశాల్లోకి వస్తాయని శాంసన్ చెబుతున్నారు.
కోయంబత్తూరులో ‘వైల్డ్‌లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్’ నిర్వహించిన అధ్యయనంలో కూడా.. కొన్ని నిర్దిష్ట కాలాల్లో పాములను రక్షించిన ఘటనలు పెరగడం, అవి సాధారణంగా పైన పేర్కొన్నట్లుగా మానవ నిర్మిత ఆశ్రయాలను, వాహనాల భాగాలను వెతుక్కుంటూ వచ్చి ఆక్రమించుకోవడం నిర్ధరణ అయ్యింది.
ఇలాంటి ప్రదేశాలను పాములు వెతుక్కుంటూ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి వాటికి నివాస ప్రదేశాల కొరత అని శాంసన్ పేర్కొన్నారు.
అంటే, “సహజ సిద్ధమైన భూభాగాలు తగ్గిపోవడం, అవి ఆక్రమణకు గురై భవనాలుగా, మానవ నివాస ప్రాంతాలుగా మారిపోవడం వల్ల పాములు వంటి జీవులకు నివాస కొరత ఏర్పడుతోంది. ఇది కూడా మానవ నివాసాలలో తమకు అనుకూలమైన పరిస్థితులను వెతుక్కోవాల్సిన పరిస్థితికి వాటిని నెడుతోంది” అని ఆయన వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
వాహనంలో పాము కనిపిస్తే ఏం చేయాలి?
వాహనాలలో పాము కనిపిస్తే ఆందోళనకు గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. అనుకోని పరిస్థితుల్లో పాములకు అంతరాయం కలిగించడం, భయంతోనో లేదా అతి తెలివితో ప్రమాదాన్ని గుర్తించకుండా వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, చంపడానికి లేదా రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం వల్లే చాలావరకు పాముకాటు సంఘటనలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, పాములు మనుషులపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఉండవని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు, “పాముకు, మనకు మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించడం ఎంతో అవసరం” అని స్నేక్ రెస్క్యూ నిపుణుడు శాంసన్ కృపాకరన్ సూచించారు.
అలాగే , “పామును తాకడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. విషం లేని పాములు కూడా తమకు ముప్పు ఉందని భావిస్తే ఆత్మరక్షణ కోసం కరుస్తాయి. సరైన శిక్షణ లేని వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఆ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ చర్యల సమయంలో ఓపిక, ప్రశాంతమైన దృక్పథం చాలా అవసరం. కాబట్టి, అందులో నైపుణ్యం ఉన్న స్నేక్ రెస్క్యూయర్లను సహాయం కోసం పిలవాలి లేదా వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలి వెంటనే పాము ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి,, అక్కడికి ఎవరూ వెళ్లకుండా చూసుకోవాలి” అని శాంసన్ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



