SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఈ సవరణతో.. భారత్‌లోకి వచ్చే వెండి దిగుమతులు ”స్వేచ్ఛా విధానం” నుంచి ”పరిమిత విధానానికి” మారాయి.
అంటే, ఇంతకుముందు వెండి దిగుమతికి కేవలం సుంకం మాత్రమే అవసరమయ్యేది, కానీ ఇకపై అది మాత్రమే కాదు.
వెండిని దిగుమతి చేసుకోవాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వద్ద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే.. వెండి దిగుమతికి అనుమతి లభిస్తుంది.
అయితే, వెండి కంటే అత్యంత ఖరీదైన బంగారానికి ఇలాంటి నిబంధనలు ఏవీ వర్తించవు. ఇలా ఎందుకు? దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటి?

విదేశీ మారకపు నిల్వలను ఆదా చేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆ తర్వాత మే 12న బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది ప్రభుత్వం.
బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల వాటి కొనుగోళ్లు తగ్గుతాయని, దీంతో భారత్ వాటి దిగుమతుల కోసం తక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
వెండి దిగుమతులపై ఎందుకు ఆంక్షలు?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) మే 16న వెండి దిగుమతులపై సరికొత్త ఉత్తర్వులను జారీ చేసింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచిన నాలుగు రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
“ఇప్పటివరకు మీరు దిగుమతి సుంకం చెల్లించి మీకు కావల్సినంత వెండిని దిగుమతి చేసుకోగలిగేవారు. కానీ, ఇప్పుడు వెండి దిగుమతి చేసుకోవడానికి మీకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అని డీజీఎఫ్‌టీ నిర్ణయిస్తుంది” అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఐఐ) డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
”వాస్తవానికి 2022లో భారత్, యూఏఈ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. యూఏఈ నుంచి దిగుమతి చేసుకునే వెండిపై భారత్ ప్రతేడాది దిగుమతి సుంకాన్ని 1 శాతం తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం యూఏఈ నుంచి దిగుమతి చేసుకునే వెండిపై కేవలం 7 శాతం దిగుమతి సుంకాన్ని మాత్రమే భారత్ చెల్లిస్తోంది. అదే బ్రిటన్ నుంచి వెండిని దిగుమతి చేసుకోవాలనుకుంటే, మీరు 15 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించాల్సి వస్తుంది” అని తెలిపారు.
”ఇది చాలా పెద్ద తేడా. ఈ నిర్ణయం వెనుకనున్న కారణాన్ని ప్రభుత్వం వెల్లడించనప్పటికీ.. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ఉద్దేశమైతే, వెండికంటే ఎన్నో రెట్లు ఖరీదైన బంగారంపై ఇలాంటి నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకుని ఉండేవారు” అని అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
అజయ్ శ్రీవాస్తవ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో ‘అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్’ బాధ్యతలను నిర్వహించారు.
”ఇతర దేశాలతో పోలిస్తే యూఏఈ నుంచి వచ్చే బంగారం దిగుమతులపై కేవలం 1 శాతం రాయితీ మాత్రమే ఉంది. అంటే ఈ సుంకం 14 శాతం. అంత పెద్ద తేడా ఏమీ లేదు. కానీ, వెండి విషయంలో అలా కాదు. ఎవరైనా వ్యాపారవేత్త తమ విధానాన్ని దుర్వినియోగం చేసి, యూఏఈ గుండా భారత్‌కు వెండిని తీసుకొస్తాడేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతూ ఉండొచ్చు. ప్రస్తుతం అలా జరుగుతుండటం కనిపిస్తోంది” అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
48 గంటల్లో పెరిగిన సీఎన్‌జీ ధరలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఆ తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం మొదలైంది. ధరల పెరుగుదల ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది.
ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటరుపై రూ.3 చొప్పున పెరిగాయి. అలాగే, సీఎన్‌జీ ధరలు కూడా కేజీకి రూ.2 పెరిగింది.
ఈ ధరల పెంపుపై ఇండియా యూత్ కాంగ్రెస్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించింది. ”ఈ ఉదయం రెండు వార్తలు. ఒకటి ప్రధానమంత్రి తన విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఇక రెండోది రెండు రోజుల్లోనే దిల్లీలో రెండుసార్లు సీఎన్‌జీ ధరలు పెరిగాయి. ఇక మీరు దేశాన్ని కాపాడుతూ ఉండండి” అని విమర్శలు చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌కు సంబంధించిన వార్తలను కొట్టేసిన హెచ్‌పీసీఎల్
డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి అనేక వీడియోలలో, ప్రజలు ఆ రద్దీని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిహార్‌లో చాలా పెట్రోల్ బంకులు మూసివేసినట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖండించింది.
“బిహార్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే, నిరాధారమైన, వాస్తవాలకు విరుద్ధమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అక్కడ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయని, అమ్మకాలపై ఆంక్షలు విధించారని ఆ వీడియోలో చెబుతున్నారు” అని హెచ్‌పీసీఎల్ తెలిపింది.
”ఈ వీడియోలోని వాదనలు పూర్తిగా అవాస్తవం. రిటైల్ అవుట్‌లెట్‌లోని ప్రస్తుత పరిస్థితిని ఇవి ప్రతిబింబించడం లేదు. ప్రస్తుత కాలమంతా సరిపోయేంత సరుకు అవుట్‌లెట్‌లో అందుబాటులో ఉంది” అని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



