Home జాతీయ national telgu స్లోజమస్తాన్‌: ‘ప్రపంచాన్ని చుట్టలేని వ్యక్తి ఏకంగా ఈ దేశాన్నే సృష్టించుకున్న కథ

స్లోజమస్తాన్‌: ‘ప్రపంచాన్ని చుట్టలేని వ్యక్తి ఏకంగా ఈ దేశాన్నే సృష్టించుకున్న కథ

23
0

SOURCE :- BBC NEWS

రాండీ విలియమ్స్, స్లోజమస్తాన్‌, చిన్నదేశం

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

కాలిఫోర్నియాలోని కోచెల్లా వ్యాలీ ఖర్జూర తోటలకు, మెక్సికో సరిహద్దుకు మధ్య ఒక ఎడారి ప్రాంతం ఉంది.

పాత ఖాకీ రంగు దుస్తుల్లా కనిపించే ఆ ఇసుక తిన్నెలపై మోకాళ్లెత్తు పొదలు, ఎండిన కొమ్మలు కనిపిస్తాయి. పురుగుల రొద తప్ప మరేమీ వినిపించని ఆ నిర్జన ప్రదేశంలో అకస్మాత్తుగా ఒక జలాంతర్గామి (సబ్ మెరైన్) కనిపిస్తుంది.

అదే ‘రిపబ్లిక్ ఆఫ్ స్లోజమస్తాన్‌’. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు గల ‘చిన్నదేశం’. 11 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ దేశంగుండా వాహనదారులు కనీసం పక్కకు కూడా చూడకుండా వెళ్లిపోతుంటారు.

కానీ, ఒక్కసారి ఆ సరిహద్దు దాటి లోపలికి వెళ్తే అదో కొత్త ప్రపంచం.

అక్కడ క్రాక్స్ రకం చెప్పులు ధరించడం రాజ్యాంగ విరుద్ధం. ఈమెయిల్‌లో ‘రిప్లై ఆల్’ కొట్టడం నేరం. ఇంటికి టాకోలు (తినే పదార్థం) తీసుకువెళ్తున్నప్పుడు మాత్రమే స్పీడ్ లిమిట్ దాటడానికి అనుమతి ఉంటుంది. వీరి జాతీయ జంతువు ‘రకూన్’.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
స్లోజమస్తాన్‌, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

ఈ ‘చిన్న దేశం’ ఎవరిది?

ఈ వింత సామ్రాజ్యానికి అధిపతి రాండీ విలియమ్స్. ప్రజలు ఆయన్ను ‘సుల్తాన్ ఆఫ్ స్లోజమస్తాన్‌’ అని పిలుస్తారు. ఆయన శాన్ డియాగోలోని జెడ్90, మ్యాజిక్ 92.5 రేడియో స్టేషన్లకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తారు.

రేడియో ప్రపంచంలో ‘ఆర్ డబ్’గా పేరున్న ఆయన, 1994 నుంచి ‘సండే నైట్ స్లో జామ్స్’ అనే షో నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 250 స్టేషన్లలో ప్రసారమవుతుంది.

ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయాలనేది విలియమ్స్ కోరిక. ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని దేశాలను 2020 నాటికి ఆయన సందర్శించారు. కేవలం ఒక్క దేశం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కరోనా లాక్‌డౌన్ వచ్చింది.

స్లోజమస్తాన్‌, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

సొంత దేశం.. సొంత చట్టాలు

ప్రయాణాలు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉండిపోయిన విలియమ్స్ మనసు మాత్రం స్థిరంగా లేదు.

“నేను వేరే దేశానికి వెళ్లలేకపోతే, నా కోసం నేనే ఒక దేశాన్ని ఎందుకు నిర్మించుకోకూడదు?” అనే ఆలోచన ఆయనకు వచ్చింది.

“చిన్నప్పటి నుంచీ నాకు సృజనాత్మక పనులంటే చాలా ఇష్టం. కథలు రాయడం, బొమ్మలు గీయడం లేదా పాఠశాల ప్రాజెక్టులు చేసేవాడిని. అందుకే ఇది (సొంత దేశాన్ని నిర్మించడం) అన్నింటికంటే గొప్ప సృజనాత్మక పనిగా అనిపించింది” అని సుల్తాన్ వివరించారు.

రేడియో స్టేషన్‌లోని తన కార్యాలయాన్నే ఆయన కాన్సులేట్‌గా పిలుస్తారు. అక్కడ ప్రపంచంలోని వివిధ నియంతృత్వ దేశాలకు చెందిన ప్రచార సామాగ్రిని ఆయన భద్రపరిచారు.

విలియమ్స్ తన ఆలోచనను తన బెస్ట్‌ఫ్రెండ్ మార్క్ కొరోనాతో పంచుకున్నారు. అది వినగానే ఆయన నవ్వేశారు. అయితే, విలియమ్స్ వెనక్కి తగ్గలేదు.

రియల్ ఎస్టేట్ సైట్లలో తన దేశం కోసం భూమి వెతకడం ప్రారంభించారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండి, తారు రోడ్డు సౌకర్యం కలిగి, శాన్ డియాగోలోని తన ఇంటికి దగ్గరగా ఉండే స్థలం కోసం వెతికారు.

ఆ సమయంలోనే ఒక ఖాళీ స్థలం కనిపించింది. 19,500 డాలర్ల ధరతో అమ్మకానికి ఉన్న ఆ స్థలం.. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా, కేవలం రాళ్లు, పొదలు, ఇసుకతో నిండి ఉంది. అది చూడగానే ఆయనకు నచ్చేసింది.

స్లోజమస్తాన్, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

“చూడగానే ప్రేమలో పడ్డాను” అని విలియమ్స్ అన్నారు. 2021లో ఆ భూమిని కొనుగోలు చేశారాయన.

వెంటనే మార్క్ కొరోనా సాయంతో ఫీనిక్స్ నగరం నుంచి ఒక రాజసం ఉట్టిపడే డెస్క్‌ను తెప్పించి, ఆ భూమి మధ్యలో వేశారు. అలా తన సొంత దేశ సరిహద్దులను నిర్ణయించుకున్నారు. అనంతరం, రోడ్డు పక్కన ‘రిపబ్లిక్ ఆఫ్ స్లోజమస్తాన్’ అనే బోర్డులు పెట్టారు విలియమ్స్.

స్థానిక అధికారులు అభ్యంతరం చెప్పడంతో, నిబంధనలకు అనుగుణంగా బోర్డులను కొంచెం పక్కకు జరిపి తన దేశపు సైన్ బోర్డును నిర్మించారు. అక్కడితో ఆగకుండా సరిహద్దు చెక్‌పోస్టులు, జెండాలు, పాస్‌పోర్టులు సిద్ధం చేశారు. క్రమంగా అది ఒక నిజమైన దేశం రూపు సంతరించుకుంది. పోలీసు కార్లు, కరెన్సీ నాణేలు, ఇమ్మిగ్రేషన్ బూత్‌లు కూడా వచ్చాయి.

“ప్రజలు అటుగా వెళ్తూ అసలు ఇక్కడేం జరుగుతోందని ఆశ్చర్యపోయారు. బహుశా మమ్మల్ని ఉగ్రవాదులు అనుకొని ఉండవచ్చు. దానివల్ల మాపై చాలామంది దృష్టి పడింది” అని కొరోనా అన్నారు.

విలియమ్స్ తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకుని, లిబియా నిరంకుశ పాలకుడు గడ్డాఫీ తరహా సైనిక దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. ఒక ప్రత్యేక యాసను సృష్టించుకుని, తన దేశానికి ఒక జాతీయ గీతాన్ని కూడా రాశారు. ఈ దేశంలో డబ్లాండియా, బక్సీల్వేనియా వంటి రాష్ట్రాలు కూడా ఏర్పాటుచేశారు.

స్లోజామస్తాన్, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

పౌరసత్వం.. పదవులు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఎవరికైనా ఈ దేశ పౌరసత్వం ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతం 120 దేశాలకు చెందిన సుమారు 25,000 మంది ఇక్కడ పౌరులుగా నమోదు చేసుకున్నారు. వాటికన్ సిటీ, తువాలు వంటి చిన్న దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువే.

ఇక్కడ, చిన్న మొత్తంలో ఫీజు చెల్లించి పార్లమెంటు సభ్యుడిగా లేదా అంబాసిడర్‌గా పదవినీ పొందవచ్చని విలియమ్స్ చెప్పారు. అంబాసిడర్ పదవి కోసం నెలకు 10 నుంచి 25 డాలర్లు చెల్లిస్తే చాలని ఆయన తెలిపారు.

‘దేశంలోకి’ అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడానికంటూ ‘ఎస్ఎస్ బాడాసిన్’ అనే పాత పగిలిపోయిన జలాంతర్గామిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ‘దేశ’ పౌరులంతా సోషల్ మీడియా ద్వారా అనుసంధానమై ఉంటారు.

స్లోజమస్తాన్‌, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

‘విభేదాలకు తావులేని చోటు’

ప్రజలు వివిధ కారణాల వల్ల స్లోజమిస్తానీలుగా మారతారని సుల్తాన్ అన్నారు. కొందరు ఉత్సుకతతో, కొందరు వినోదం కోసం, మరికొందరు కేవలం మిగతా ప్రపంచం నుంచి ఉపశమనం కోసం చూస్తుంటారని తెలిపారు.

“ప్రపంచం చాలా చీలిపోయింది. ఫేస్‌బుక్ తెరిస్తే రాజకీయాల కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారు. స్లోజమస్తాన్‌ వీటన్నింటి నుంచి ఒక ఉపశమనం. ఇక్కడ మా దేశ రాజకీయాలు తప్ప వేరే ఏ రాజకీయాలూ మాట్లాడకూడదు” అన్నారు సుల్తాన్.

అమెరికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి కూడా ఇక్కడి పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారని ఆయన చెప్పారు.

స్టెఫానీ హెడ్డన్ అనే మహిళ ‘జియోపార్టీ’ అనే షో ద్వారా ఈ దేశం గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత లాంగ్ బీచ్ ట్రావెల్ షోలో సుల్తాన్‌ను స్వయంగా కలిశారు.

“నా జీవితంలో సంతోషాన్ని నింపినందుకు సుల్తాన్‌కు కృతజ్ఞతలు” అని స్లోజమస్తాన్‌ పౌరురాలైన స్టెఫానీ అన్నారు.

అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నుంచి స్లోజమస్తాన్‌ ఒక ఉపశమనాన్ని ఇస్తోందని ఆమె భావిస్తున్నారు. ఈ దేశం పెట్టే సోషల్ మీడియా పోస్టులు, వింత చట్టాలు పౌరులకు ఎంతో వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు.

స్లోజమస్తాన్‌, చిన్నదేశం, రాండీ విలియమ్స్

ఫొటో సోర్స్, Slowjamastan Ministry of Propaganda

భవిష్యత్తు ప్రణాళికలు

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వందలాది చిన్నదేశాలున్నాయి. వచ్చే ఏడాది స్లోజమస్తాన్‌ ఆధ్వర్యంలో ‘మైక్రోకాన్ 2027’ అనే సమావేశం జరగనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరై సార్వభౌమాధికారం, సొంత గుర్తింపు చిహ్నాల గురించి చర్చించనున్నారు.

స్లోజమస్తాన్‌ ఎడారి ప్రాంతానికి సందర్శకులు ఎప్పుడైనా రావచ్చునని సుల్తాన్ ఆహ్వానిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి అక్కడ రాత్రిపూట బస చేయడానికి వసతులు లేవు. అందుకే ఈ సమావేశాన్ని శాన్ డియాగోలోని ఒక పెంట్‌హౌజ్‌లో నిర్వహించనున్నారు.

ప్రయాణాలు అంటే అమితంగా ఇష్టపడే విలియమ్స్, 2023లో తుర్క్‌మెనిస్తాన్‌ను సందర్శించి తన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు స్లోజమస్తాన్‌ ఆయనకు కేవలం ఒక సరదా ప్రాజెక్టు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రజలను ఒకచోట చేర్చే ఒక మార్గంగా మారింది.

“అవును, నేను ఒక నియంతనే. అయితే, స్లోజమస్తాన్‌ నాకు మాత్రమే చెందినది కాదు, అందరిది” అంటున్నారు సుల్తాన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)