Home వినోదం entertainment telgu హనుమాన్ గా చిరు, రాముడిగా మహేష్.. ఒక్క రికార్డు కూడా మిగలదు..!

హనుమాన్ గా చిరు, రాముడిగా మహేష్.. ఒక్క రికార్డు కూడా మిగలదు..!

1
0

SOURCE :- TELUGU ONE

మైథలాజికల్ సినిమాల ట్రెండ్ మళ్ళీ మొదలైంది. పలువురు స్టార్లు పురాణ పురుషుల పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకే స్క్రీన్ పై హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీరాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తే ఎలా ఉంటుంది?. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కదా. ఈ అద్భుతం త్వరలోనే సాధ్యమైనా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ఆ దిశగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అడుగులు వేస్తున్నాడు.

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘హనుమాన్’ మూవీ ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.270 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. రూ.300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కుర్ర హీరో తేజ సజ్జాని హీరోగా పెట్టి ప్రశాంత్ వర్మ చేసిన మ్యాజిక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ తో హనుమంతుడిని చూపించిన తీరు కట్టిపడేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు సీక్వెల్ లో స్టార్స్ నటిస్తారని కూడా ఇప్పటికే చెప్పాడు ప్రశాంత్. ఇక తాజాగా తన మనసులో ఉన్న స్టార్ల పేర్లు కూడా బయటపెట్టాడు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ.. ‘జై హనుమాన్’ను భారీస్థాయిలో రూపొందించనున్నట్లు తెలిపాడు. అంతేకాదు హనుమంతుడిగా చిరంజీవిని, శ్రీరాముడిగా మహేష్ బాబుని అనుకుంటున్నట్లు చెప్పాడు. “హనుమంతుడి పాత్ర చేయడానికి కొందరు నటులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ పాత్ర పోషించాలంటే ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలి అనిపించాలి. ఆ జాబితాలో చిరంజీవి గారు ఉంటారు. త్వరలోనే వెళ్లి ఆయనను కలిసి నా మనసులో మాట చెప్తా. అన్నీ కుదిరితే ఆయనే హనుమంతుడిగా కనిపించవచ్చు. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేష్ గారు. సోషల్ మీడియాలో ఆయనను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశాను. మా టీం కూడా రాముడి పాత్రను ఆయన ఫేస్ తో రీక్రియేట్ చేసి చూసుకున్నాం” అని చెప్పుకొచ్చాడు.

మరి ప్రశాంత్ వర్మ కోరుకున్నది నిజమై.. హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ కనిపిస్తే మాత్రం ‘జై హనుమాన్’ సినిమా స్థాయి ఒక్కసారిగా ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

SOURCE : TELUGU ONE