Home జాతీయ national telgu లోక్‌సభ ఎన్నికలు 2024: 100 మంది సంపన్న అభ్యర్థులలో 64 మంది తెలుగువాళ్లే, ఈ జాబితాలో...

లోక్‌సభ ఎన్నికలు 2024: 100 మంది సంపన్న అభ్యర్థులలో 64 మంది తెలుగువాళ్లే, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..

2
0

SOURCE :- BBC NEWS

Kompella Madhavi Latha

ఫొటో సోర్స్, Kompella Madhavi Latha /facebook

57 నిమిషాలు క్రితం

2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో తెలుగువాళ్లే ఎక్కువ ఆస్తులు ప్రకటించారు.

మే 13న పోలింగ్ జరగనున్న నాలుగో దశ ఎన్నికలలో 10 రాష్ట్రాలలోని 96 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులే రిచ్ కేండిడేట్స్‌గా తేలారు.

నాలుగో దశలో పోటీ చేస్తున్నవారిలో టాప్ 3 సంపన్న అభ్యర్థులు తెలుగువాళ్లే. టాప్ 10లో 8 మంది తెలుగువాళ్లే.

అంతేకాదు.. తొలి 20 మంది సంపన్న అభ్యర్థులలో 17 మంది, టాప్ 50లో 37 మంది, టాప్ 100లో 64 మంది.. టాప్ 200లో 104 మంది ఏపీ, తెలంగాణల నుంచి పోటీ చేస్తున్నవారే.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవారిలో అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు ప్రస్తుత ఎన్నికలలోని నాలుగు దశలలో దేశవ్యాప్తంగా పోటీ చేసిన అందరిలోనూ అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచారు.

ఫోర్త్ ఫేజ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సంపన్నులు

నాలుగో దశ టాప్ 10లో 8 మంది తెలుగు అభ్యర్థులు వీళ్లే..

పెమ్మసాని చంద్రశేఖర్:

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 5,705 కోట్లు.

కొండా విశ్వేశ్వర రెడ్డి:

తెలంగాణలోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈయన ప్రకటించిన ఆస్తులు రూ. 4,568 కోట్లు.

వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి:

ఏపీలోని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన తన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల విలువ రూ. 716 కోట్లు.

సీఎం రమేశ్:

ఏపీలోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఆస్తుల విలువ రూ. 497 కోట్లు.

గడ్డం రంజిత్ రెడ్డి:

తెలంగాణలోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 435 కోట్లు.

మతుకుమిల్లి శ్రీభరత్:

ఏపీలోని విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న భరత్‌ ఆస్తుల విలువ రూ. 298 కోట్లు.

కాసాని జ్ఞానేశ్వర్:

తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన అస్తుల విలువ రూ. 227 కోట్లు.

కొంపెల్ల మాధవీలత:

తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె ఆస్తుల విలువ రూ. 221 కోట్లు.

Vemireddy Prabhakar Reddy

ఫొటో సోర్స్, Vemireddy Prabhakar Reddy /facebook

విశ్వేశ్వర రెడ్డికి, వేమి రెడ్డికి మధ్య..

నాలుగో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో మూడో స్థానంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ జరిగిన మొత్తం నాలుగు దశలలలో పోటీ చేస్తున్న అందరు అభ్యర్థులలో చూసుకుంటే అయిదో స్థానంలో ఉన్నారు.

మూడో దశలో పోటీ చేసిన సౌత్ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవి శ్రీనివాస్ డెంపో రూ. 1,361 కోట్లు, మొదటి దశలో పోటీ చేసిన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్ రూ. 716 కోట్ల 94 లక్షల ఆస్తితో మూడు, నాలుగు స్థానాలలో ఉన్నారు.

వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రూ. 716 కోట్ల 33 లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, గడ్డం రంజిత్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook

చేవెళ్ల, మచిలీపట్నంలో ప్రధాన పార్టీ అభ్యర్థులంతా వందల కోట్లు ఉన్నవారే..

తెలంగాణలోని చేవెళ్ల, ఏపీలోని మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు అందరూ టాప్ 20 సంపన్న అభ్యర్థుల లిస్ట్‌లో ఉన్నవారే.

చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌లు ముగ్గురూ టాప్ 10 సంపన్న అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.

ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖర్ రావు రూ. 138 కోట్ల ఆస్తులతో 18వ స్థానంలో ఉన్నారు.

ఆయన ప్రత్యర్థి జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి రూ. 133 కోట్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు.

తక్కువ ఆస్తులున్న అభ్యర్థులూ తెలుగువాళ్లే..

ఫోర్త్ ఫేజ్‌లో భాగంగా దేశంలోని 96 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో నిరుపేద అభ్యర్థులు కూడా తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు.

వీరంతా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో స్వతంత్రంగా, చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్నవారు.

నాలుగో దశలో 24 మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించగా మరికొందరు అతి తక్కువ ఆస్తులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం బాపట్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్టా ఆనందబాబు అందరి కంటే తక్కువగా తనకు 7 రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం పెద్దపల్లి నుంచి రాష్ట్రీయ మానవ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తనకు రూ. 1,000 విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలోని వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న చిలువేరు ప్రతాప్ కూడా రూ. వెయ్యి ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

మహబూబాబాద్ ఎస్టీ స్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్న ఎం.అరుణ్ కుమార్ కూడా రూ. వెయ్యి ఆస్తులున్నట్లు వెల్లడించారు.

నాగర్‌కర్నూలు ఎస్సీ స్థానంలో పోటీ చేస్తున్న ఎల్. భిక్షపతి తనకు రూ. 1500 మాత్రమే ఆస్తులున్నాయని వెల్లడించారు.

katta anand babu

ఫొటో సోర్స్, katta anand babu

కట్టా ఆనందబాబు.. చేతిలో 7 రూపాయలు, 2.5 లక్షల అప్పు

ఫొర్త్ ఫేజ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అతి తక్కువ ఆస్తులు చూపించిన అభ్యర్థి కట్టా ఆనందబాబు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట వడ్డెసంఘం గ్రామానికి చెందిన 32 ఏళ్ల ఆనందబాబు అఫిడవిట్ దాఖలు చేసిననాటికి తన చేతిలో రూ. 7 ఉన్నట్లు పేర్కొన్నారు.

అది తప్ప వేరే చరాస్తులు కానీ, స్థిరాస్తులు కానీ తనకు లేవని ఆయన ప్రకటించారు.

రూ. 2.5 లక్షల అప్పు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఆధారం: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్

ఇవి కూడా చదవండి: