Home జాతీయ national telgu యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

1
0

SOURCE :- BBC NEWS

అనుమానిత క్షిపణి దాడి

ఫొటో సోర్స్, Conflict Armament Research

  • రచయిత, జీన్ మెకెంజీ
  • హోదా, సియోల్ ప్రతినిధి
  • 6 మే 2024, 21:59 IST

    అప్‌డేట్ అయ్యింది 56 నిమిషాలు క్రితం

యుక్రెయిన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ క్రిస్టినా కిమాచుక్‌ ఆయుధాలను పర్యవేక్షిస్తుంటారు, పరిశీలిస్తుంటారు. జనవరి 2న ఆమెకు ఒక విషయం తెలిసింది.

ఖార్కియెవ్ నగరంలోని భవనంపై అనుమానాస్పదంగా కనిపిస్తున్న క్షిపణి ఒకటి పడిందని సమాచారం అందింది.

ఈ విషయం తెలిసిన వెంటనే యుక్రెయిన్ సైన్యంలో ఉన్న తన కాంటాక్ట్‌లందరికీ ఫోన్ చేయడం ప్రారంభించారు క్రిస్టినా. ఈ క్షిపణి దాడిపై దర్యాప్తు తానే చేపట్టాలనుకున్నారు.

దాని శకలాలను యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు తీసుకెళ్లి ఆమె నిషితంగా పరిశీలిస్తూ, ప్రతి దాన్ని ఫోటో తీస్తున్నారు. వాటిల్లో ఆమె చేతి గోర్ల కంటే తక్కువ సైజులో ఉన్న కంప్యూటర్ చిప్స్, స్క్రూలు ఉన్నాయి.

వీటిని పరిశీలించిన వెంటనే, ఇది రష్యా క్షిపణి కాదన్నారు క్రిస్టినా. కానీ, ఈ విషయాన్ని నిరూపించడం క్రిస్టినా ముందున్న అసలైన సవాలు.

ఉత్తర కొరియాలో ఈ క్షిపణిని ఎప్పుడు తయారు చేశారు?

లోహపు వస్తువులు, వైర్ల మధ్య, కొరియా అక్షరాలు ఉన్న ఒక చిన్న వస్తువు క్రిస్టినా కంటికి కనిపించింది. మరిన్ని వివరాలను ఇది తెలియజేస్తుందని ఆమెకు అర్థమైంది.

ముక్కలు ముక్కలైన షెల్‌పై 112 అనే నెంబర్ ముద్రించి ఉంది. అంటే, ఉత్తర కొరియా క్యాలెండర్‌ ప్రకారం ఇది 2023 ఏడాదికి చెందినది.

యుక్రెయిన్ మీద దాడి చేసేందుకు రష్యా ఉత్తర కొరియా ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు నిరూపించేందుకు ఆమెకు దొరికిన బలమైన ఆధారం ఇది.

‘‘రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తోందని మేం విన్నాం. కానీ, వీటిని చూస్తున్నాం, పట్టుకున్నాం, వీటిని మరింత పరిశీలించాల్సి ఉంది. ఇంతకుముందు ఎవరూ ఇలా చేయలేదు’’ అని కీయెవ్ నుంచి ఫోన్‌లో మాట్లాడిన క్రిస్టినా చెప్పారు.

ఇప్పటి వరకు రష్యా నుంచి తమ భూభాగంలోకి డజన్ల కొద్దీ ఉత్తర కొరియా క్షిపణులు దాడి చేసినట్లు యుక్రెయిన్ సైన్యం చెప్పింది. వాటి వల్ల 24 మంది చనిపోయారని, 70 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది.

ప్రస్తుత యుద్ధాలకు ఉత్తర కొరియా ఆయుధాలు మరింత ముప్పుగా, ప్రపంచ అస్థిరతకు ఆజ్యం పోస్తున్నాయి.

కాన్‌ఫ్లిట్ ఆర్మమెంట్ రీసెర్చ్(సీఏఆర్) సంస్థలో క్రిస్టినా కిమాచుక్ పనిచేస్తున్నారు.

యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలను సేకరించి, వాటిని ఎలా తయారు చేశారో ఈ సంస్థ కనుక్కుంటుంది.

క్షిపణి అవశేషాలను ఫోటోలను తీసి, వందలాది పరికరాలను ఆమె బృందం పరిశీలించాక గానీ, ఈ అత్యంత కీలక విషయం బయటపడలేదు.

క్షిపణిపై ఉన్న ఉత్తర కొరియా ఆధారాలు

ఏ సమాచారం వెలుగులోకి వచ్చింది?

అత్యాధునిక విదేశీ సాంకేతికతతో ఈ క్షిపణిని తయారు చేశారు.

ఈ క్షిపణిలో దొరికిన చిప్‌ అమెరికాలో 2023లో తయారైంది.

అంటే, ఉత్తర కొరియా అక్రమంగా ఆయుధ భాగాలను సేకరించి, క్షిపణికి అమర్చి రహస్యంగా రష్యాకు తరలించిదన్నమాట.

‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఆంక్షలున్నప్పటికీ, ఉత్తర కొరియా ఆయుధాల తయారీకి అవసరమైన అన్ని పరికరాలను పొందుతూ, శరవేగంతో వీటిని ఉత్పత్తి చేస్తోంది’’ అని సీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ డామియన్ స్ప్లిటర్స్ అన్నారు.

‘‘యూరప్ భూభాగంపై ప్రజలను చంపేందుకు ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను వాడతారని నేనసలు ఊహించలేదు’’ అని రక్షణ రంగానికి చెందిన రాయల్ యూనిటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌యూఎస్‌ఐ)లో నిపుణులు జోసెఫ్ బైర్న్ చెప్పారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను, కిమ్ కలిసినప్పటి నుంచి రష్యాకు వెళ్తున్న ఉత్తర కొరియా ఆయుధ సరఫరాలపై ఆర్‌యూఎస్‌ఐలో పనిచేసే ఆయన, తన బృందం నిఘా పెట్టింది.

అనుమానిత ఆయుధ ఒప్పందాలు జరగకుండా చూసేందుకు వీరు ఈ పనిచేస్తున్నారు.

ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషిస్తూ, ఉత్తర కొరియా, రష్యా మిలటరీ పోర్టు మధ్యలో ఒకేసారి వందలాది కంటైనర్లతో కూడిన నాలుగు రష్యా కార్గో నౌకలు ప్రయాణించినట్లు వారు గుర్తించారు.

మొత్తంగా 7 వేల కంటైనర్లను ఈ నౌకలో పంపించి ఉండొచ్చని ఆర్‌యూఎస్ఐ అంచనా.

వీటిలో లక్షల కొద్ది మందుగుండు సామాగ్రితో కూడిన షెల్స్, గ్రాడ్ రాకెట్లు ఉన్నట్లు భావిస్తున్నారు.

అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా వీటిని కనుగొన్నాయి.

క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

క్షిపణులను కొనడం, పేల్చడం

1980ల నుంచి ఉత్తర కొరియా తన ఆయుధాలను విదేశాలకు విక్రయిస్తోంది. ఎక్కువగా లిబియా, సిరియా, ఇరాన్‌ వంటి ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు సరఫరా చేస్తోంది.

కానీ, ఇవి చాలా పాతవి, సోవియట్ కాలంనాటి క్షిపణులివి. అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో కూడా ఉత్తర కొరియా పాత రాకెట్లతో ప్రయోగించే గ్రెనేడ్లు ఉన్నట్లు కొన్ని ఆధారాలున్నాయి.

కానీ, జనవరి 2న జరిగిన దాడిలో, క్రిస్టినా కిమాచుక్ పరిశీలించిన క్షిపణి అవశేషాలు, ఉత్తర కొరియా తయారు చేసిన అత్యాధునిక షార్ట్ రేంజ్ క్షిపణి హ్వాసాంగ్ 11కు చెందినవి. 700 కి.మీ దూరం వరకు ఇవి ప్రయాణించే సామర్థ్యం గలవి.

యుక్రెనియన్లు వీటి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నప్పటికీ, రష్యా క్షిపణుల కంటే ఇవి తక్కువేమీ కాదని ఆయుధాల నిపుణులు డాక్టరీ జెఫ్రీ లూయిస్ అన్నారు.

అయితే, ఈ క్షిపణుల వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇవి చాలా చౌకగా దొరుకుతాయని డాక్టర్ జెఫ్రీ వివరించారు. అంటే, ఎక్కువగా కొనుగోలు చేసి, ఎక్కువగా దాడి చేయొచ్చు. ఇప్పుడు, రష్యన్లు చేస్తున్నది ఇదే.

వీటిలో ఎన్ని క్షిపణులను ఉత్తర కొరియా తయారు చేసిందన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న.

ఉత్తర కొరియా 6,700 కంటైనర్ల యుద్ధ సామాగ్రిని రష్యాకు పంపిందని ఇటీవల దక్షిణ కొరియా ప్రభుత్వం గుర్తించింది.

ఉత్తర కొరియాలో ఆయుధాల ఫ్యాక్టరీలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని డాక్టర్ జెఫ్రీ లూయిస్ చెప్పారు. ఉపగ్రహాల ద్వారా ఆయన ఈ ఫ్యాక్టరీలపై అధ్యయనం చేస్తున్నారు. ఏడాదికి వందలాది క్షిపణులను ఉత్తర కొరియా తయారు చేస్తోందని డాక్టర్ జెఫ్రీ లూయిస్ తెలిపారు.

మరోవైపు, ఉత్తర కొరియాలో విడి భాగాలను అమ్మేందుకు చాలా కంపెనీలపై నిషేధం విధించిన సమయంలో, స్ప్లిటర్స్, ఆయన టీమ్ ఇదెలా సాధ్యమవుతుందని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆధునిక ఆయుధాలలో భాగమైన చాలా కంప్యూటర్ చిప్‌లు, ఆకాశంలో నుంచి నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేసేందుకు మార్గనిర్దేశనం చేయగలవు. ఇవే చిప్‌లను మనం ఫోన్లలో, వాషింగ్ మెషిన్లలో, కార్లలో వాడుతుంటామని స్ప్లిటర్స్ చెప్పారు.

ఈ క్షిపణి ఎన్ని కాంపోనెంట్లు పశ్చిమ దేశాల నుంచి వచ్చాయో తెలుసుకుని బైర్న్ చాలా ఆందోళనకు గురయ్యారు. తాను, తన నెట్‌వర్క్‌లు అంచనావేస్తున్న దాని కంటే అత్యంత సమర్థవంతమైన, బలమైన ప్రొక్యూర్‌మెంట్ నెట్‌వర్క్‌లు ఉత్తర కొరియాకు ఉన్నాయని ఇది నిరూపిస్తుందన్నారు.

విదేశాలలో నివసించే ఉత్తర కొరియన్లు హాంకాంగ్, ఇతర మధ్య ఆసియా దేశాలలో నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి, అక్రమ సొమ్ముతో వీటిని కొనేవారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈ ఉత్పత్తులను ఉత్తర కొరియాకు పంపుతారు.

చైనాతో ఉన్న సరిహద్దుల నుంచే ఇవి దేశం దాటుతాయి. ఒకవేళ నకిలీ కంపెనీని గుర్తిస్తే, వెంటనే దాని స్థానంలో ఇంకోటి వెలుస్తుందని బెర్న్ తన అనుభవాల నుంచి వివరించారు.

అయితే, ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించేందుకు 2017 నుంచి రష్యా, చైనాలు నిరాకరిస్తూ వస్తున్నాయి.

క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి ఆయుధాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి, మరిన్ని దేశాలకు అమ్మాలనుకుంటోంది ఉత్తర కొరియా.

ఒకవేళ ఈ క్షిపణులు రష్యాకు సరిపోతే, ఇతరులకు కూడా సరితూగుతాయని డాక్టర్ లూయిస్ చెప్పారు.

మున్ముందు చైనా-రష్యా-ఇరాన్ తదితర దేశాలకు అతిపెద్ద క్షిపణి సరఫరాదారుగా ఉత్తర కొరియా మారనుందని డాక్టర్ లూయిస్ అంచనావేస్తున్నారు.

ఈ నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన క్రమంలో, ఇరాన్‌తో కలిసి అణ్వస్త్ర, బాలిస్టిక్ క్షిపణి ప్రొగ్రామ్‌లపై ఉత్తర కొరియా పనిచేస్తుందని అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ముఖాల్లో దిగులు కనిపించిందని స్ప్లిటర్స్ చెప్పారు.

‘‘కానీ, శుభవార్త ఏంటంటే.. విదేశీ టెక్నాలజీపై వారెంత ఆధారపడ్డారో మనకు తెలుసు. దానిపై మనమేదైనా చేయాలి’’ అని అన్నారు.

తయారీదారులతో కలిసి పనిచేయడం ద్వారా ఉత్తర కొరియా సరఫరా వ్యవస్థతో ఉన్న సంబంధాలను తెంచేసే అవకాశం ఉందని స్ప్లిటర్స్ అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన బృందం విజయం సాధించింది.

కీలకమైన ఆయుధాల విక్రయం పూర్తి చేయడానికి ముందే, ఒక అక్రమ నెట్‌వర్క్‌ను గుర్తించి, మూయించివేశారు.

ప్రస్తుతం క్షిపణులు కేవలం గొప్పలకు పోయే, రాజకీయ సత్తాను చాటే వనరులు మాత్రమే కావని, ఇవి పెద్ద మొత్తంలో డబ్బులను కూడా సమకూర్చగలవని డాక్టర్ లూయిస్ అన్నారు.

ఇవి కూడా చదవండి: