Home జాతీయ national telgu గాజాలో అనాథలవుతున్న చిన్నారులు: గాయాలు, ఆకలి, ఒంటరితనంతో ఎంత కష్టంగా బతుకుతున్నారంటే?

గాజాలో అనాథలవుతున్న చిన్నారులు: గాయాలు, ఆకలి, ఒంటరితనంతో ఎంత కష్టంగా బతుకుతున్నారంటే?

1
0

SOURCE :- BBC NEWS

గాజా

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

గాజాలో జరుగుతున్న భీకర యుద్ధ సమయంలో పుట్టి, ఇంక్యుబేటర్‌లో ఉన్న ఈ పాపకు ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు.

ఈ పాప తల్లి పేరు హన్నా. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హన్నా తీవ్రంగా గాయపడిన తర్వాత సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. తన కూతురికి పేరు పెట్టడానికి ఇప్పుడు హన్నా ప్రాణాలతో లేరు.

‘‘మేం ఈ పాపను ‘హన్నా అబు అంశా’ అనే పేరుతో పిలుస్తున్నాం’’ అని సెంట్రల్ గాజాలోని అల్-అక్సా ఆసుపత్రిలో ఉన్న ఈ చిన్నారి బాగోగులు చూస్తోన్న నర్సు వార్దా అల్-అవావ్దా చెప్పారు.

ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో చాలా వరకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి.

‘‘పాప కుటుంబీకులు ఎవరో మాకు తెలియదు. వారి బంధువులు ఎవరూ రాలేదు. ఆమె తండ్రికి ఏమైందో మాకు తెలియదు’’ అని అన్నారు.

23 లక్షల గాజా జనాభాలో సుమారు సగం మంది పిల్లలుంటారు. ఈ భీకర యుద్ధంతో వారి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి.

పౌరులకు హాని కలిగించకుండా హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా తాము ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

అయితే, పాలస్తీనా వైద్య అధికారులు చెప్పినదాని ప్రకారం 18 ఏళ్లలోపు వారు 11,500 మందికి పైగా చనిపోయారు.

కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. చాలామంది జీవితాలు తలకిందులయ్యాయి.

బాధితుల సంఖ్యకు సంబంధించి కచ్చితమైన గణాంకాలను చెప్పడం కష్టమే. కానీ, యూరో-మెడిటేరనియన్ హ్యుమన్ రైట్స్ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 24 వేలకు పైగా చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయినట్లు పేర్కొంది.

ఇబ్రహీం

ఇంటి మీద జరిగిన క్షిపణి దాడిలో పదేళ్ల ఇబ్రహీం అబు మౌస్ కాళ్లు, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో చనిపోయిన తన తల్లి, తాత, సోదరిని తలుచుకుని ఇబ్రహీం గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.

‘‘ఆసుపత్రిలోని పై అంతస్థులో వారికి చికిత్స చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. నాన్న ఫోన్‌లో ఫోటోలు చూశాక నాకు అంతా అర్థమైంది. బాగా ఏడ్వడంతో నాకు ఒళ్లంతా బాగా నొప్పిగా మారింది’’ అని ఇబ్రహీం చెప్పాడు.

హుస్సేన్ కుటుంబానికి చెందిన కజిన్లందరూ కలిసి ఆడుకునే వారు. కానీ, ఇప్పుడు తమ బంధువుల్ని పూడ్చి పెట్టిన సమాధుల వద్ద వారు కూర్చుని ఉన్నారు. సెంట్రల్ గాజాలో ప్రజలకు ఆశ్రయంగా మారిన స్కూల్ వద్ద వారిని ఖననం చేశారు. వారిలో కొందరు తమ తల్లిదండ్రుల్లో ఒకర్ని లేదా ఇద్దర్నీ కోల్పోయారు.

‘‘మా అమ్మ ఒడిలో క్షిపణి పేలడంతో ఆమె శరీరం ముక్కలుముక్కలైంది. ఇంటి శిథిలాల నుంచి ఆమె శరీర భాగాలను వెలికితీసేందుకు మాకు కొన్ని రోజులు పట్టింది’’ అని అల్-బురీజ్ శరణార్థి శిబిరంలో నివసిస్తున్న అబేద్ హుస్సేన్ చెప్పారు.

‘‘నా సోదరుడు, అంకుల్‌ సహా మొత్తం కుటుంబం మరణించినట్లు తెలియగానే నా గుండె తరుక్కుపోయింది’’ అని అబేద్ అన్నారు.

ఇజ్రాయెల్ దాడుల శబ్దాలతో రాత్రంతా అబేద్ మేల్కొనే ఉంటున్నారు. ఆయన కళ్లు చుట్టూ నల్లగా మారింది.

‘‘అమ్మ, నాన్న బతికున్నప్పుడు నేను వాళ్ల దగ్గర పడుకునేవాడిని. ఇప్పుడు వారు చనిపోయారు. నేనెప్పుడూ మా నాన్న పక్కన పడుకునేవాడిని. చాలా ఒంటరిగా అనిపిస్తోంది’’ అని అబేద్ వివరించారు.

కింజా హుస్సేన్

అబేద్‌తో పాటు ప్రాణాలతో బతికి బయటపడ్డ ఆయన ఇద్దరు తోబుట్టువులను ప్రస్తుతం వారి అమ్మమ్మ చూసుకుంటున్నారు. కానీ, రోజులు వారికి చాలా భారంగా గడుస్తున్నాయి.

‘‘ఇక్కడ తిండి లేదు, మంచి నీళ్లు లేవు. సముద్రపు నీటిని తాగడం వల్ల కడుపునొప్పిగా ఉంటోంది’’ అని అబేద్ చెప్పారు.

రొట్టెల కోసం పిండిని తీసుకొస్తుండగా క్షిపణి దాడిలో కింజా హుస్సేన్ తండ్రి చనిపోయారు. శవంగా తండ్రిని చూడటం ఆమెను ఇంకా వెంటాడుతోంది.

‘‘నాన్నకు కళ్లు లేవు. నాలుక తెగిపోయి ఉంది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఈ యుద్ధం ముగియడమే తమకు కావాలని ఆమె కోరుకుంటున్నారు.

గాజాలో దాదాపు అందరూ మానవతా సాయంపైనే ఆధారపడుతున్నారు. ఐరాస గణాంకాల ప్రకారం, 17 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భద్రత కోసం చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

19 వేల మంది చిన్నారులు అనాథలయ్యారని, వారిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం చాలా ఆందోళనకర విషయమని యూనిసెఫ్ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘చాలా మంది పిల్లల్ని శిథిలాల కింద గుర్తించాం. ఇళ్లపై బాంబులు పడటంతో తల్లిదండ్రుల్ని వారు కోల్పోయారు’’ అని యూనిసెఫ్ పాలస్తీనా కమ్యూనికేషన్స్ చీఫ్ జోనాథన్ క్రిక్స్ చెప్పారు. దక్షిణ గాజాలోని రాఫా నుంచి బీబీసీతో మాట్లాడారు.

‘‘చిన్న పిల్లలు వారి పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు. వీరి బంధువులను గుర్తించి వారికి అప్పగించడం కూడా కష్టమే’’ అని చెప్పారు.

అబేద్

బంధువులు ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న చిన్నారులకు వారు సాయం చేయగలిగే పరిస్థితిలో వారు ఉండరు.

“ వాళ్లు కూడా కష్టాల్లో ఉన్నారనే విషయం మర్చిపోకూడదు. వారికి కూడా పిల్లలు ఉంటారు. వారి పిల్లల బాగోగులు కూడా చూసుకోవాలి. అది చాలా కష్టం కావచ్చు. అసాధ్యం కాకపోయినా తల్లిదండ్రుల నుంచి విడిపోయిన, తోడు లేని పిల్లల్ని చూసుకోవడం వారికి కష్టం’’ అని క్రిక్స్ అన్నారు.

ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజస్ అనే స్వచ్ఛంద సంస్థ యుద్దం మొదలైనప్పటి నుంచి యునిసెఫ్‌తో కలిసి పని చేస్తోంది. 10 ఏళ్ల లోపు ఉన్న 55 మంది చిన్నారులను తమ సంస్థలోకి తీసుకుంటామని ఈ సంస్థ తెలిపింది. పిల్లలకు మానసిక సాయం అందించేందుకు రఫాలో అదనంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది.

ఓ చెక్ పాయింట్ దగ్గర తాను నాలుగేళ్ల చిన్నారిని గుర్తించానని ఎస్ఓఎస్ సీనియర్ సభ్యురాలొకరు చెప్పారు.

ఆ చిన్నారి మ్యూటిజంతో బాధ పడుతోంది. తనకు తన కుటుంబానికి ఏం జరిగిందో చెప్పలేకపోతోంది. అయితే ఇతర చిన్నారులతో ఆడుకోవడం, కొన్ని బహుమతులు ఇచ్చిన తర్వాత ఆమె పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.

గాజాలో చిన్నారులందరికీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సాయం అవసరమని యునిసెఫ్ నమ్ముతోంది. వారి జీవితాలు చెల్లాచెదురయ్యాయి. యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా అనేక మంది చిన్నారులు తాము ఎదుర్కొన్న భయంకరమైన నష్టాల నుంచి బయటపడటం అంత తేలికైన వ్యవహారం కాదు.

ఇవి కూడా చదవండి: