Home జాతీయ national telgu కేవలం 18 వేలతో శ్రీలంక టూర్, అక్కడ ఏయే ప్రదేశాలు చూడొచ్చు, ఈ-వీసా పొందడం ఎలా?

కేవలం 18 వేలతో శ్రీలంక టూర్, అక్కడ ఏయే ప్రదేశాలు చూడొచ్చు, ఈ-వీసా పొందడం ఎలా?

1
0

SOURCE :- BBC NEWS

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

భౌగోళికంగా, సాంస్కృతికపరంగా భారత్‌కు అత్యంత సమీప దేశాల్లో శ్రీలంక ఒకటి. అందువల్ల శ్రీలంకను సందర్శించేందుకు, అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారతీయులు ఆసక్తి చూపుతారు.

ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, పర్వతాలు, బీచ్‌లు, వన్యప్రాణుల అభయారణ్యాలు, నోరూరించే ప్రత్యేకమైన వంటకాలు శ్రీలంకను మీరు పర్యటించాలనుకునే ప్రాంతాల జాబితాలో కచ్చితంగా చేరుస్తాయి.

2019లో శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం 2022 ప్రారంభం నాటికి తీవ్రస్థాయికి చేరింది. 2023 చివరి నుంచి ఆ దేశం క్రమంగా సంక్షోభం నుంచి కోలుకుంటోంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక ఆర్థికాభివృద్ధి ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది. 2023లో తొలి రెండు నెలల్లోనే 2 లక్షల 10 వేల మంది పర్యాటకులు శ్రీలంకను సందర్శించారు.

2023 సంవత్సరంలో శ్రీలంకలో పర్యటించిన వారిలో రష్యన్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానం భారతీయులదే. ఈ వివరాలను శ్రీలంక టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ ధ్రువీకరించింది.

శ్రీలంకలో పర్యటించేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం, ఈ-వీసా సౌకర్యం వంటి సౌకర్యాలు కూడా శ్రీలంకను ఎంచుకునేందుకు ప్రధాన కారణం.

తక్కువ ఖర్చుతో శ్రీలంక ఎలా వెళ్లాలి? భారతీయులకు శ్రీలంకలో ఎలాంటి సౌకర్యాలున్నాయి? అక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఈ-వీసా సౌకర్యం

శ్రీలంక సందర్శనకు వెళ్లాలనుకునే భారత పర్యాటకులు తమ ప్రయాణ వివరాలను, అందుకు సంబంధించిన పత్రాలను https://www.srilankaevisa.lk/లో అప్‌లోడ్ చేసి, ఈ – వీసా పొంది, శ్రీలంక వెళ్లొచ్చు.

పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో భారత్, చైనా, రష్యా సహా ఏడు దేశాల ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని శ్రీలంక వెళ్లేముందు ఈ-వీసా వెబ్‌సైట్‌లో వివరాలను సమర్పించి వీసా పొందవచ్చు. ఈ-వీసాతో నెల రోజులపాటు శ్రీలంకలో పర్యటించవచ్చు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ప్రయాణ ఖర్చులూ తక్కువ

తమిళనాడు నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే శ్రీలంకలో పర్యటించవచ్చు.

చెన్నైకి చెందిన ‘వాండర్‌లస్ట్’ ట్రావెల్ కంపెనీ వ్యవస్థాపకుడు బాలాజీ కన్నన్ బీబీసీ తమిళ్‌తో మాట్లాడుతూ, “తమిళనాడుకు దగ్గరగా ఉండడం, విమాన చార్జీలు కూడా తక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రజలు శ్రీలంకలో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

శ్రీలంక వెళ్లడం కూడా సులభమే. వీసా అవసరం లేదు, ఆన్‌లైన్‌లో ఈ-వీసా పొందవచ్చు. శ్రీలంక పర్యటనకు ఒక వ్యక్తికి రూ.15,000 నుంచి రూ.18,000 సరిపోతాయి” అన్నారు.

విమాన సర్వీసులతో పాటు నాగపట్టిణం పోర్టు నుంచి ప్రభుత్వం క్రూయిజ్ షిప్‌ కూడా నడుపుతోందని చెప్పారు. జూన్‌లో ప్రైవేట్ షిప్‌లో చెన్నై నుంచి శ్రీలంక వెళ్లవచ్చని బాలాజీ కన్నన్ చెప్పారు. సముద్ర ప్రయాణం అన్నివేళలా అందుబాటులో ఉండదు కాబట్టి ఆయన విమాన ప్రయాణాన్ని సిఫార్సు చేస్తున్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఇండియన్ కరెన్సీ చెల్లుతుందా?

విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు భారతీయ కరెన్సీని అక్కడి స్థానిక కరెన్సీగా, లేదా అమెరికన్ డాలర్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, భారత్ నుంచి వచ్చే పర్యాటకులకు శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించింది.

మనం యూపీఐ ద్వారా శ్రీలంకలో భారత కరెన్సీ ఉపయోగించుకునే వీలుంది. అందుకోసం చాలాచోట్ల క్యూఆర్ లైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ క్యూఆర్‌‌ను స్కాన్ చేయడం ద్వారా భారతీయ కరెన్సీని శ్రీలంక రూపాయల్లోకి మార్చుకుని చెల్లింపులు చేయవచ్చు.

బీబీసీ తమిళ్‌ కోసం శ్రీలంక జర్నలిస్ట్ రంజన్ అరుణ్ ప్రసాద్ అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖతో మాట్లాడినప్పుడు, ”ఇది భారత్ నుంచి వచ్చే పర్యాటకుల కోసం శ్రీలంక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. అందుకోసం పలుచోట్ల క్యూఆర్ లైన్‌ ఏర్పాటు చేశాం.

ఇది చెల్లింపులను సులభతరం చేస్తుంది. అందువల్ల పర్యాటకులు తమ నగదును శ్రీలంక కరెన్సీ లేదా అమెరికన్ డాలర్లుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు” అని వారు చెప్పారు.

అయితే, నేరుగా భారతీయ కరెన్సీని అక్కడ వినియోగించలేరు. ఒకవేళ ఏదైనా ప్రదేశంలో యూపీఐ సదుపాయం లేనప్పుడు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొంత శ్రీలంక కరెన్సీ లేదా అమెరికన్ డాలర్లను దగ్గర ఉంచుకోవడం మంచిదని బాలాజీ కన్నన్ చెబుతున్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఇతర ఖర్చుల సంగతేంటి?

వసతి కోసం రోజుకు రూ.3,000 నుంచి రూ.3,500లకు మంచి హోటళ్లు దొరుకుతాయని బాలాజీ కన్నన్ తెలిపారు.

”ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున కొన్ని ప్రదేశాల్లో వస్తువులు, సేవల ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. శ్రీలంక కరెన్సీ కంటే భారత కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి అదనపు ఖర్చు ఉండదు” అని బాలాజీ అన్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, SAIKO3P/GETTY IMAGES

తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు

కొలంబో నుంచి బాదుల్లాకు రైలు ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రైలు మార్గం పొడవునా సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. నెమ్మదిగా, దాదాపు 10 గంటల పాటు సాగే ఈ ప్రయాణం కొందరికి అసౌకర్యంగా అనిపించినప్పటికీ, ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరంగా సాగుతుంది.

శ్రీలంక అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. సముద్ర జలాల్లో సాహస క్రీడలపై ఆసక్తి ఉన్నవారు మిరిస్సా, బెంటోటై వంటి బీచ్‌లను సందర్శించవచ్చు.

వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్నవారు యాలా, ఉదవలావ వంటి జాతీయ వన్యప్రాణి పార్కులను సందర్శించవచ్చు. ఇక్కడ ఏనుగులు, చిరుతలు, అనేక రకాల పక్షులను వీక్షించవచ్చు.

శ్రీలంకలో తప్పకుండా చూడాల్సిన వాటిలో పర్వత ప్రాంతాలు కూడా ఒకటి. తేయాకు తోటలతో కనిపించే ఎల్లా, నువారా ఎలియా పర్వత ప్రాంతాల అందాలు ఆకట్టుకుంటాయి.

శ్రీలంక కళా సంపదను ఆస్వాదించాలనుకుంటే ఆ దేశ వారసత్వ చిహ్నమైన సిగిరియా కోట, తంబుల్లై గుహ దేవాలయం, అనురాధపురంను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి: