Home జాతీయ national telgu ఆంధ్ర యూనివర్సిటీకి వందేళ్లు: బెజవాడలో మొదలైన ఈ వర్సిటీ విశాఖ తీరానికి ఎలా చేరింది? –...

ఆంధ్ర యూనివర్సిటీకి వందేళ్లు: బెజవాడలో మొదలైన ఈ వర్సిటీ విశాఖ తీరానికి ఎలా చేరింది? – 100 ఏళ్ల ప్రయాణం

20
0

SOURCE :- BBC NEWS

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

వైజాగపటం (విశాఖ) సాగరతీరానికి ఆనుకుని జీడిమామిడి తోటలు, ఎర్రమట్టి దిబ్బల మధ్య ఆవిర్భవించిన ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇప్పుడు వందేళ్ల మైలురాయిని చేరుకుంది.

ఒక చిన్న మ్యూజియంలో, రెండే కోర్సులతో ప్రారంభమైన ప్రయాణం.. నేడు 425 ఎకరాల్లో విస్తరించి 6 కళాశాలలు, 58కి పైగా విభాగాలతో విస్తరించింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూనివర్సిటీ మొత్తం రైలులో గుంటూరుకి తరలిపోయి, మళ్లీ మూడేళ్లకు విశాఖ వచ్చింది.

ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఏయూ వేదికైంది. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ స్వయంగా ఒక అరుదైన రాయిని వెతుక్కుంటూ ఏయూకి వచ్చిన ఘనత కూడా ఈ వర్సిటీ సొంతం.

వైభవమైన గతం, కొన్ని ఒడిదుడుకులు, అనేక విజయాలతో నిండిన ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల కథలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి మద్రాస్‌లో మొదలైన కథ

ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రను ఏయూ చరిత్ర, పురావస్తు శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ వివరించారు.

ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో ఆంధ్రోద్యమం ప్రభావంతో తెలుగువారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమనే డిమాండ్ బలపడింది. దీంతో 1920లో భాషా ప్రాతిపదికన కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మద్రాస్ ప్రావిన్స్ ఆమోదం తెలిపింది. మొదట వాల్తేరు (విశాఖ)లో ఏర్పాటు చేయాలనుకున్నా, చివరకు బెజవాడ (విజయవాడ)లో “ఆంధ్ర విశ్వకళాపరిషత్” పేరుతో ప్రారంభించారు. 1926లో ఏప్రిల్ 26న బెజవాడలో వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

వసతి, పరిపాలనా సమస్యల కారణంగా 1929లో చట్ట సవరణ జరిగి…1930 సెప్టెంబర్‌లో యూనివర్సిటీని విశాఖపట్నానికి తరలించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942లో విశాఖపై బాంబు దాడి తర్వాత ఏయూ ప్రాంగణం సైనిక స్థావరంగా మారడంతో.. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, మద్రాసుకు తరలించారు. పుస్తకాలు, పరికరాలు రైళ్లలో తరలించి అక్కడే తరగతులు కొనసాగించారు.

యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఏయూ మళ్లీ విశాఖకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి విశాఖనే దాని శాశ్వత చిరునామాగా మారింది.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

తొలి రోజుల్లోనే మహిళా ఉద్యమాలు

ఏయూ కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదు, సామాజిక మార్పులకు వేదిక కూడా. ఏయూలో మహిళల హక్కుల గురించి 1930 దశకంలోనే పోరాటం చేశారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్.

“1930లో ఇక్కడ రాజకీయ శాస్త్రం చదువుతున్నప్పుడు భద్రత, నిర్వహణ వంటి కారణాలతో విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం లేదు. ఈ పరిస్థితుల్లో మహిళలకు కూడా పురుషుల్లాగే సమాన హక్కులు ఉండాలని దుర్గాబాయి దేశ్‌ముఖ్, లేడీస్ హాస్టల్ కోసం ఆందోళనలు చేశారు. దాంతో ఏయూలో మహిళలకు హాస్టల్స్ నిర్మించారు” అని కొల్లూరు సూర్యనారాయణ బీబీసీకి చెప్పారు.

“ఏయూ లేడీస్ హాస్టల్‌, మహిళా అధ్యయన కేంద్రానికి దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరునే పెట్టారు” అని ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి.మంజులత తెలిపారు.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

ఏయూలో అసెంబ్లీ సమావేశాలు

ఏయూ రాజకీయ చరిత్రకూ వేదికైంది.

“1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాశ్వత రాజధాని, అసెంబ్లీ వసతులు లేని సమయంలో ఏయూలోని టీఎల్ఎన్ సభ హాల్‌లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. విద్యార్థుల హాల్, రాష్ట్ర అసెంబ్లీగా మారింది” అని కొల్లూరు సూర్యనారాయణ బీబీసీకి తెలిపారు.

“తాజాగా 2014 ఏపీ విభజన తర్వాత కూడా విభజిత ఏపీలో పరిపాలనకు శాశ్వత వేదికలు సిద్ధంగా లేని సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయూ క్యాంపస్‌లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఇలా ఒకే వేదికపై విద్య, పాలన కలిసిన అరుదైన సందర్భాలు ఏయూ చరిత్రలో చోటుచేసుకున్నాయి.”

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

వైభవం, విజ్ఞానం కలిసిన ఏయూ

అలాగే ఏయూలోని పరిపాలన, సమావేశ, బోధన భవనాలను రాతితోనే నిర్మించారు. వాటిలో క్లాసికల్ ఆర్కిటెక్చర్‌తో, విశాలమైన కారిడార్లు, ఎత్తైన సీలింగ్స్‌తో నిర్మించిన ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ఆకర్షణ.

“ఆ రోజుల్లో ఏయూ ఫిజిక్స్ విభాగ కట్టడం, బోధన విషయాలు దేశమంతా గొప్పగా చెప్పుకునేవారు. ఇక్కడి న్యూక్లియర్ ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్ విభాగాలతో బలమైన పరిశోధన సంస్కృతి ఏర్పడింది” అని 98 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో అన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి కుటుంబంతో సంబంధాలున్న విశాఖ నివాసి, 98 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ ఏయూ ఫిజిక్స్ విభాగంలో 1951 నుంచి సేవలందించారు.

ఫిజిక్స్ భవన నిర్మాణం అనేక భాషల సినిమా పరిశ్రమలను ఆకర్షించింది. విశాఖలో షూటింగ్ అంటే ఏయూ ఫిజిక్స్ విభాగంలో కెమెరాల సందడి కనిపిస్తుంది.

ఇలా నిర్మాణ వైభవం, సినిమా ఆకర్షణ, శాస్త్రీయ ప్రతిభ మూడింటినీ కలిపి ఈ ఫిజిక్స్ విభాగం ఏయూకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

“నేను యూనివర్సిటీకి రాగానే ఫస్ట్ ఫోటో తీసుకుంది ఏయూ ఫిజిక్స్ బిల్డింగ్ వద్దే” అని ఏయూ బోటనీ విద్యార్థి రిత్విక్ బీబీసీతో అన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

‘రాయి కోసం దేశ ప్రధాని ఏయూ వచ్చారు’

“ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎందరో ప్రముఖులకు అనుబంధముంది. 1930లలో రవీంద్రనాథ్ ఠాగూర్, ఏయూకి వచ్చి సాహిత్యం, సంస్కృతి అంశాలపై ప్రసంగాలు చేశారు. అదే కాలంలో (1930-1940) సీవీ రామన్ ఫిజిక్స్ విభాగంలో బోధన చేస్తూ ఏయూలో సైన్స్ రీసెర్చ్ కల్చర్‌కు పునాది వేశారు. ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్ 1930లలో ఏయూ వైస్-చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టి విశ్వవిద్యాలయానికి స్పష్టమైన అకడమిక్ దిశను నిర్దేశించారు. అలా ఈ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంది” అని కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఏయూ జియాలజీ విభాగంలో ఉన్న ఒక రాయిని చూసేందుకు ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చారని జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు బీబీసీతో అన్నారు.

“జియాలజీ మ్యూజియంలో బేరిల్ అనే రాయిని చూసేందుకు ప్రధాని హోదాలో నెహ్రూ 1955లో ఏయూ సందర్శించారు. అరుదైన బేరిల్ క్రిస్టల్ చూసి జియాలజీ చదువుకున్న పండిట్ నెహ్రూ ఆశ్చర్యపోయారు” అని యుగంధరరావు తెలిపారు.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

కొత్త కోర్సులు, పరిశోధనల్లోనూ…

ఏయూ తన వందేళ్ల ప్రయాణంలో కాలానికి తగ్గ కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందిందని ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వజీర్ మహమ్మూద్ బీబీసీకి తెలిపారు.

“1932లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫార్మసీ వంటి కోర్సులతో పాటు తర్వాత కాలంలో మెరైన్ సైన్సెస్, డేటా సైన్స్, క్వాంటమ్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టింది” అని ఆయన తెలిపారు.

‘నాసా’ చేపట్టిన లూనార్ ప్రయోగాల కోసం తూర్పు కనుమల నుంచి రాళ్లు సేకరించి, చంద్రుడి పదార్థాలతో పోల్చే పరిశోధనల్లో ఏయూ జియాలజీ విభాగం సహకరించిందని ప్రొఫెసర్ ఏ.యుగంధరరావు చెప్పారు

సంప్రదాయ కోర్సుల నుంచి విదేశీ విద్యార్థుల వరకు..

సంప్రదాయ కోర్సులతో ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నత విద్య కోసం ఏటా వందల సంఖ్యలో ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతున్నారు.

“ఏయూలో చదివే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. మా దేశస్థులకి ఏయూలో చదవమని చెబుతాను” అని ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన జియాలజీ విద్యార్థిని షఫియా మహ్మద్ బీబీసీతో అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారని ఏయూ ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగం తెలిపింది.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

లోగోలో ఆ రెండు పాములకి అర్థమేంటంటే…

ఏయూ లోగో చిహ్నాలకు అర్థాల్ని ఏయూ వెబ్‌సైట్ ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం… ఈ లోగోను చిత్రకారుడు కౌతా రామమోహన శాస్త్రి రూపొందించారు. ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు.

సూర్యుడు: విశ్వవిద్యాలయం, అధ్యాపక వర్గం.

కిరణాలు: విద్యా విభాగాల విస్తరణ

తామర పుష్పం: సంపద, జ్ఞానం

64 రేకులు: పురాతన భారత కళలు.

రెండు సర్పాలు: జ్ఞాన అన్వేషణ, సంరక్షణ .

అర్ధ చంద్రం: కళ, వెలుగు, ఆకర్షణ.

స్వస్తిక్ చుట్టూ ఉన్న కాంతి కిరణాలు “తేజస్వినవధీతమస్తు” అనే ఉపనిషత్తు నినాదాన్ని సూచిస్తాయి. అంటే “మా విద్య దివ్యకాంతితో ప్రకాశించాలి” అని అర్థం.

వీరంతా ఏయూ పూర్వ విద్యార్థులే…

ప్రపంచ ప్రసిద్ధ మేధావులు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలైన ఆచార్యులు హిరెన్ ముఖర్జీ, సూరి భగవంతం, టీఆర్ శేషాద్రి, హుమయూన్ కబీర్, వీఈఆర్‌వీ రావు, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి వారు ఇక్కడ బోధించారు.

అలాగే, ఏయూలో చదివినవారు దేశ, విదేశాల్లో రాజకీయ, బ్యాంకింగ్, శాస్త్ర, సినీ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరారు. నాసా శాస్త్రవేత్తలు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల్లో పనిచేసిన వారు కూడా ఇందులో ఉన్నారు.

వెంకయ్య నాయుడు (మాజీ ఉపరాష్ట్రపతి), జీఎం రావు (జీఎంఆర్ గ్రూప్), దువ్వూరి సుబ్బారావు (ఆర్బీఐ మాజీ గవర్నర్), జస్టిస్ చలమేశ్వర్, జీఎంసీ బాలయోగి, పల్లం రాజు, ఎర్రంనాయుడు వంటి ప్రముఖులు ఏయూ పూర్వ విద్యార్థులే.

“ఏయూ నన్ను తీర్చిదిద్దింది” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచూ చెప్తుంటారు.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రదేశ్

వందేళ్ల తర్వాత లక్ష్యం…

ఏయూ శతాబ్ది సందర్భంగా, “ఇన్‌స్టిట్యూట్ – ఇండస్ట్రీ – ఇన్వెస్టర్స్” మోడల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. ఇస్రోతో ఒప్పందాలు కుదుర్చుకుని, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కోసం స్టార్టప్ ఇంక్యూబేటర్ ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహిస్తున్నట్లు ఏయూ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ బీబీసీతో అన్నారు.

ఇప్పటికే ఏయూ నాక్ (NAAC) నుంచి A++ గ్రేడ్ సాధించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. శతాబ్ది సందర్భంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సాధించి టాప్-100లో నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.

ఒక చిన్న మ్యూజియంలో మొదలైన ఏయూ ప్రయాణం బెజవాడ నుంచి విశాఖకు మారి, యుద్ధాన్ని దాటి నిలిచింది. ఉద్యమాలు, శాస్త్రం, రాజకీయాలను చూసింది. ఇప్పుడు వందేళ్ల వయసులో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది.

వందేళ్ల పండుగ సరే.. పరిశోధనలేవీ?

వందేళ్ల క్రితం ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీ ఒడిదుడుకుల మధ్య అనేక విజయాలు సాధించింది.

అయితే, ఇటీవల పరిశోధనల స్థాయి తగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఫ్యాకల్టీ లోటు, నిధుల కొరత, నియామకాల ఆలస్యం కారణంగా పరిశోధనలపై ప్రభావం పడుతోందని జువాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.మంజులత అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వజీర్ మహమ్మూద్, రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“వందేళ్ల సంబరాలు ఎక్కువగా ఈవెంట్లకే పరిమితమయ్యాయి. పరిశోధన, మౌలిక వసతులపై స్పష్టమైన ప్రణాళిక అవసరం” అని విద్యార్థి విశ్వనాథ్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)