Home జాతీయ national telgu ద్రవిడ కోటలో విజయ్ ‘ఎంట్రీ’.. ఈ పోరులో గెలుపెవరిది?

ద్రవిడ కోటలో విజయ్ ‘ఎంట్రీ’.. ఈ పోరులో గెలుపెవరిది?

22
0

SOURCE :- BBC NEWS

తమిళనాడు ఎన్నికలు

ఫొటో సోర్స్, X/TVK/FB

  • 5 గంటలు క్రితం

  • చదివే సమయం: 7 నిమిషాలు

ఈసారి తమిళనాడు ఎన్నికలు తెలుగువారికి కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయాలు గమనిస్తుండే వారికి ఎలానూ ఆసక్తే. కానీ ఈసారి సినిమా కూడా కలిసింది. అదే విజయ్. అందుకే చాలామంది తెలుగువారు కూడా ఈ ఎన్నికలను గమనిస్తున్నారు. ఈసారి అక్కడ ప్రధానంగా త్రిముఖ పోరు జరుగుతోంది.

నేను దాదాపు పది రోజుల పాటు తమిళనాడులో బీబీసీ ప్రతినిధిగా ప్రయాణించా.

పలువురు రాజకీయ నాయకులు, విలేఖర్లు, విశ్లేషకులు, అనేకమంది సామాన్యులతో మాట్లాడాను. ఈసారి తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

5 కోట్ల 67 లక్షల మందికి పైగా ఓటర్లున్న రాష్ట్రంలో 234 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.

2021 ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కళగం- డీఎంకే 133 సీట్లు, ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం – ఏఐఏడీఎంకే 66, కాంగ్రెస్ 18, బీజేపీ 4, పీఎంకే 5, వీసీకే 4 స్థానాలు గెలుచుకోగా, ఇతర చిన్న పార్టీలకూ 4 స్థానాలున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
 శ్రీరంగం రాజగోపురం, తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

గత లోక్‌సభ ఎన్నికల్లో విడిపోయిన ఏఐఏడీఎంకే, బీజేపీ కూడా ఈసారి కలిశాయి. డీఎంకే కూటమిలో 14, ఏఐఏడీఎంకే కూటమిలో 12 పార్టీలున్నాయి.

డీఎంకే తనతో కాంగ్రెస్ సహా 13 పార్టీలను కలుపుకెళ్తోంది. తాను సొంతంగా 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 28, నటుడు విజయకాంత్ స్థాపించిన డీఎండీకే 10, వీసీకే 8, సీపీఐ, సీపీఎం చెరో 5, ఇతరత్రా చిన్న పార్టీలు మిగిలిన చోట్ల పోటీ చేస్తున్నాయి.

ఇక ఏఐఏడీఎంకే, తనతో బీజేపీ సహా 11 పార్టీలను కలుపుకెళ్తోంది. సొంతంగా 166 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 26 చోట్ల, అన్బుమణి రాందాస్ పార్టీ పీఎంకే 18, టీటీవీ దినకరన్‌కి చెందిన ఏఎంఎంకే 11, తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) 5 చోట్ల, ఇతరత్రా చిన్న పార్టీలు మిగిలిన చోట్ల పోటీ చేస్తున్నాయి.

ఇదికాక తమిళగ వెట్రి కళగం- టీవీకే పేరుతో పార్టీ పెట్టిన విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అలాగే తమిళనాట ఉనికి చాటుతున్న నామ్ తమిళర్ కచ్చి పార్టీ నాయకుడు సీమాన్ కూడా సొంతంగా వెళ్తున్నారు. బీఎస్పీ కూడా సొంతంగా పోటీ చేస్తోంది. ఇక ఒకప్పటి జయలలిత సన్నిహితురాలు, ఏఐపీటీఎంఎంకే పార్టీ నాయకురాలు శశికళ రెండు చిన్న పార్టీలు, ఇతరులతో జతకట్టి పోటీలో దిగారు.

తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన పార్టీ మార్పులు – పొత్తులు

ఈ ఎన్నికల ముందు ప్రధానంగా పార్టీ మారిన వారిలో చెప్పాల్సిన పేరు పన్నీర్ సెల్వం. జయలలిత తాను కుర్చీ దిగాల్సి వచ్చినప్పుడు స్వయంగా పన్నీర్ సెల్వాన్ని సీఎం చేశారు.

ఆయన అప్పటి నుంచీ ఏఐఏడీఎంకేలోనే ఉంటూ వచ్చారు. మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినా, పళనిస్వామితో కలసిపోయారు.

అయితే 2022లో ఆయన్ను పళనిస్వామి పార్టీ నుంచి పంపేశారు. దీంతో ఎన్నికల ముందు 2026 ఫిబ్రవరిలో ఆయన డీఎంకేలో చేరారు.

ఇక దివంగత తమిళ నటుడు విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం-డీఎండీకే… డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఇక ఈ ఎన్నికల ముందు పాట్టాలి మక్కల్ కట్చి పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య చీలిక వచ్చింది. అన్బుమణి రామదాస్, ఎస్. రామదాస్ వర్గాలుగా పార్టీ విడిపోయింది.

తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

ఫొటో సోర్స్, FB/AIADMKOFFICIAL

ఎవరి బలమెంత?

ఏఐఏడీఎంకే:

జయలలిత మరణం తర్వాత సంక్షోభాలు ఎదుర్కొన్న ఏఐఏడీఎంకే ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో సాగుతోంది. ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన శశికళ వేరే కూటమి ఏర్పాటు చేశారు.

టీటీవీ దినకరన్ మాత్రం తిరిగి ఏఐఏడీఎంకే కూటమితో కలిశారు. ప్రస్తుతం పార్టీకి క్షేత్ర స్థాయిలోని కేడరే బలం. పటిష్టమైన నిర్మాణం ఈ పార్టీ సొంతం. గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు ఏఐఏడీఎంకే తరపున చురుగ్గా పనిచేస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఏడీఎంకే వేరువేరుగా పోటీ చేసినా, మళ్ళీ ఈ ఎన్నికల్లో కలిశాయి. అది కూడా తమకు బలం అవుతుందని ఈ కూటమినమ్ముతోంది.

డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్రను జనంలోకి తీసుకెళ్లడానికి ఈ కూటమి ప్రయత్నం చేస్తోందిగానీ, అది ఎంత వరకు రాజకీయంగా వారికి ఉపయోగపడుతుందన్నది ప్రశ్నార్థకం.

చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయం

విజయ్ ఎఫెక్ట్

ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకపక్షంగా ఏఐఏడీఎంకే పొందే అవకాశానికి విజయ్ గండి కొట్టారు. డీఎంకే వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీల మధ్య ఎలా చీలుతుంది అనేది తమిళనాడు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు.

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మహిళల ఓటు ఏఐఏడీఎంకే నుంచి టీవీకే ఎంత చీల్చగలదు అనేది కీలకం. ప్రతిపక్షంలో ఉన్న ఏఐఏడీఎంకే ఓట్లను విజయ్ ఎక్కువగా చీల్చితే ఆ ప్రభావం ఏఐఏడీఎంకే మీద పడుతుంది.

అన్నామలై బీజేపీ తరపున క్రౌడ్ పుల్లర్ ట్యాగ్ సంపాదించుకున్నారు కానీ, ప్రస్తుతం ఆయన పోటీ చేయడం లేదు. ఈ ఇద్దరు నాయకులూ ఒకే కులం, ఒకే ప్రాంతానికి చెందిన వారు. పశ్చిమ తమిళనాడులో ఏఐఏడీఎంకేకి బలం ఉన్న ప్రాంతం అది.

అన్నామలై పోటీలో లేకపోవడంతో పళనిస్వామి ఆ కూటమికి ఏకైక నాయకుడిగా కనిపిస్తున్నారు. ఏఐఏడీఎంకే ఆర్గనైజర్‌గా, పార్టీ బిల్డర్‌గా ఎడప్పాడి పళనిస్వామి గుర్తింపు పొందారు.

కానీ, కూటమి నాయకుడిగా, పార్టీ నాయకుడిగా ఓకే కానీ, జనంలో స్టాలిన్, విజయ్‌తో సమానంగా చరిష్మా కలిగి ఉన్నారా అన్న ప్రశ్న కేడర్‌ను వేధిస్తోంది.

తూర్పు త్రిచ్చి, తమిళనాడు ఎన్నికలు 2026

ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే రెండు విషయాల్లో ప్రధానంగా విఫలమైందని ఏఐఏడీఎంకే బలంగా ప్రచారం చేస్తోంది.

మొదటిది మహిళల భద్రతకు సంబంధించినది.

ఆ విషయంలో డీఎంకే విఫలమైందంటూ ప్రచారం చేసింది పళనిస్వామి పార్టీ.

అలాగే డ్రగ్స్ పెరిగిపోతున్నాయనేది ఏఐఏడీఎంకే మరో ఆరోపణ. వీటిని ముందు పెట్టి మహిళల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ.

మరోవైపు మహిళల్లో విజయ్‌కి బలం పెరుగుతోందని తమిళనాడు విశ్లేషకులు పలువురు చెబుతున్నారు. మరి ఆ ఓటు అటు వెళ్తుందా? అంటే, మొత్తంగా ఏఐఏడీఎంకేకి సంబంధించిన ఏ అంశమైనా, అది విజయ్ తో కూడా ముడిపెట్టి చూడాల్సిన స్థితి.

ఇక జయలలిత సమయం నుంచీ పార్టీకి అనుకూలంగా ఉన్న థేవర్ కులం, ఈ మధ్య ఏఐఏడీఎంకేకి దూరం జరుగుతోందని స్థానిక పాత్రికేయులు చెబుతున్నారు. అది కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చు.

తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

ఫొటో సోర్స్, FB/Arivalayam

డీఎంకే

డీఎంకే ఈసారి డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, తిరిగి అధికారంలోకి రావడానికి ఏకంగా 14 పార్టీలతో కలవడం చూస్తే ఆ పార్టీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో డీఎంకేపై ప్రజల్లో పెద్దగా ఆగ్రహం ఉన్నట్లు కనిపించలేదు.

చాలామంది పథకాలు వారికి లాభిస్తాయనే చెబుతున్నారు. కానీ శాంతిభద్రతలు, మహిళలపై నేరాల విషయంగా మాత్రం ఈ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ ఆరోపణల విషయంలో ప్రతిపక్షాలు దుందుడుకుగా వెళ్తున్నాయి. ఆ ఆరోపణలకు డీఎంకే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇక భారత్ లో చాలా పార్టీలపై వినిపించే కుటుంబ-వంశపారంపర్య పాలన ఆరోపణలు ఇక్కడ కూడా డీఎంకేపై వినిపిస్తున్నాయి కానీ, భారతీయ ఓటర్లు ఎన్నికల్లో ఈ అంశాన్ని పట్టించుకున్నట్టు పెద్దగా సాక్ష్యాలు లేవు.

ముందు నుంచీ పటిష్టమైన కేడర్‌తో ఉన్న డీఎంకేని, మరింత బలంగా మార్చారని స్టాలిన్ పేరుంది. పార్టీ గతంలో బలహీనంగా ఉన్న పశ్చిమ తమిళనాడు వైపు కానీ, గతంలో పార్టీకి దూరంగా ఉన్న కొన్ని కులాలను దగ్గర చేసుకోవడంలో కానీ స్టాలిన్ చొరవ చూపినట్లు తెలుస్తోంది.

బలమైన నిర్మాణం వారికి స్థానిక ఎన్నికల్లో కూడా కలిసొచ్చిందని స్థానిక విశ్లేషకులు చెప్తున్నారు.

సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండే ఈ పార్టీ చాలా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇచ్చేసిన తరువాత, కాస్త ఆలస్యంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకం మహిళలను ఆకర్షిస్తుందని, ఓట్లు రాలుస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.

ఇక చదవుకున్న వాళ్లలో ఉండే తమిళ జాతీయవాదానికి తామే కేరాఫ్ అని డీఎంకే తరచూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వర్గం ఓటర్లు తక్కువ శాతమే అయినా కీలకం.

మరో అంశం… విజయ్ కొత్త పార్టీ రావడం డీఎంకేకి అంతర్గతంగా సంతోషం కలిగించిందని ఆ పార్టీ సీనియర్ ఒకరు నాతో అన్నారు.

”ప్రతిపక్షం ఓటు వారు చీలుస్తారు. మా గెలుపు సులువు అవుతుంది” అన్నారాయన.

ఇప్పుడు తమిళనాడులో చాలామంది ఈ లెక్క చుట్టూనే చర్చిస్తున్నారు. అదే సమయంలో డీఎంకేకి సంస్థాగత ఓటర్ల బలం చాలా ఎక్కువ. మైనార్టీ ఓట్ల బలం కూడా ఎక్కువే. కాంగ్రెస్ పొత్తులో ఉండడం కూడా మైనార్టీ ఓట్లు చీలకుండా చేస్తుందని విశ్లేషణలున్నాయి.

క్రైస్తవ మత్స్యకార ఓట్లను తమ నుంచి విజయ్ కూడా చీల్చలేరని డీఎంకే ధీమాగా ఉంది. అయితే స్థూలంగా మైనార్టీ ఓట్లను విజయ్ చీల్చగలరా అన్నదానిపైనే డీఎంకేకి వచ్చే మైనార్టీ ఓట్ల శాతం ఆధారపడి ఉంటుంది.

తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

ఫొటో సోర్స్, YT/TVK

టీవీకే:

విజయ్ ప్రస్తావన రాగానే అభిమానులు ఊగిపోతున్నారు. వ్యతిరేకులు పెదవి విరుస్తున్నారు. విజయ్ ప్రభావం ప్రధానంగా ప్రతిపక్షం మీద ఉంటుందని ఎక్కువ మంది విశ్లేషకులు, పాత్రికేయులు నాతో చెప్పారు.

ఎందుకంటే ప్రభుత్వ అనుకూల ఓటర్… అంటే ఎవరైతే డీఎంకేకి ఓటు వేయాలనుకుంటారో వాళ్లు అలాగే ఫిక్స్డ్‌గా ఉంటారు, డీఎంకేకి ఓటు వేస్తారు. ఎవరైతే ప్రతిపక్షానికి ఓటు వేయాలనుకుంటారో.. వారిలో, ఏఐడీఎంకే సంస్థాగత ఓట్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద కోపంతో పాలన మార్పు కోరుకునే వాళ్లు చాలా మంది విజయ్ కు ఓటు వేసే అవకాశం ఉందనేది ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. కానీ అలానే జరగాలని లేదు.

నేను మాట్లాడిన వారిలో యువత, మహిళలు ఎక్కువగా విజయ్ పేరు చెప్పడం కనిపించింది. నేను తిరిగిన నాలుగు నగరాల్లోనూ అంటే తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, హోసూరు, చెన్నైలలో ఇదే పరిస్థితి. తమిళనాట చాలామంది పాత్రికేయులు కూడా అదే మాట చెప్తున్నారు.

అయితే విజయ్‌ను వ్యతిరేకించే వారంతా చెప్పేది రెండే వాదనలు.

  • ఆయన నటుడు కాబట్టి చూడ్డానికి వస్తారు కానీ ఓటేయరు.
  • ఆయన కోసం తిరిగే యువతలో చాలా మందికి ఓటుండదు, ఇతరులతో ఓటేయించలేరు.

అవి ఎంత నిజమో ఇప్పుడే మనం చెప్పలేం. విజయ్ సభలకు భారీగా జనం వస్తున్నది నిజం. కరూర్ తొక్కిసలాట సంగతి చెప్పక్కర్లేదు.

కానీ, పెద్ద సమస్య ఏంటంటే, విజయ్ ప్రచార సరళి సక్రమంగా లేదు. ముఖ్యంగా ఆయన పర్యటనలు, సభలు, ర్యాలీలు తరచూ రద్దు అవుతున్నాయి. నింద ఎవరిపై వేసినా, అవి పార్టీకి లాభదాయకం కాదని తెలుస్తోంది. విజయ్ పార్టీ పోలీసులను కారణంగా చెబుతోంది. ఇతర పార్టీల వారేమో విజయ్ ప్రచారం చేయలేక తప్పించుకుంటున్నారంటున్నారు. నిజం మనకు తెలియదు. అలాగని విజయ్ ఇంట్లో కూర్చుంటే ఓట్లు వచ్చి పడతాయా అంటే ఆ పరిస్థితీ లేదు.

తమిళనాడులో ఉండే పదులకొద్దీ చిన్న పార్టీలతో సంబంధం లేకుండా ఏ పొత్తూ లేకుండా సొంతంగా వెళ్తున్నారు విజయ్. ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నదానిపై ఎన్ని ఊహగానాలు వచ్చినా, సొంతంగా వెళ్లాలనే ఆయన నిర్ణయించారు.

తమిళ ప్రజలకు తాను పరిచయం చేసుకోనక్కర్లేదుగానీ, తానేం చేస్తానో చెప్పి తమిళ ప్రజల నమ్మకం పొందాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆ మేరకు సఫలం అవుతారా అన్నది ప్రశ్న.

తమిళనాడు ఎన్నికలు 2026, త్రిముఖ పోరు

విజయ్‌కి ఓటు వేయాలనుకుంటున్నాం అని నాతో చెప్పిన వారంతా కొన్ని ఉమ్మడి అంశాలు ప్రస్తావించారు. 70 ఏళ్ళు వీళ్లే పాలించారు, మార్పు కావాలి, విజయ్ డబ్బు కోసం రాలేదు, మహిళలకు రక్షణ ఇస్తాడు.. ఈ నాలుగు మాటలే విజయ్ గురించి బలంగా వినిపించాయి. మరి ఆ నాలుగు ఆయన చేస్తారని నమ్మి ఓటేసే వారు ఎందరు అనేది ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

విజయ్ ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తూర్పు తిరుచిరాపల్లి. మరి రెండుచోట్ల పోటీ ఆయనకు ఏ మాత్రం కలసి వస్తుందో చూడాలి.

అంతేకాదు, బలమైన సైద్ధాంతిక పార్టీలు ఉన్న చోట, మధ్యే మార్గాన్ని ఎంచుకున్నారు విజయ్. తనకు ఆర్ఎస్ఎస్ శత్రువు అంటూనే, డీఎంకే కూడా ప్రత్యర్థే అన్నారు.

నిజమైన కాంగ్రెస్ వారు తనతోనే ఉన్నారంటూ పెరియార్, అంబేడ్కర్ ల పక్కన కామరాజ్ ఫోటో పెట్టారు. మార్పు చూపించాలనుకుంటున్న విజయ్, తన పార్టీలో ఎక్కువ మంది డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి వచ్చిన జంపింగ్ వ్యక్తులకే టికెట్లు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఆయన బలంగా ఎదుర్కొంటున్నారు.

విజయ్ స్వతహాగా క్రైస్తవుడు అయినప్పటికీ, ఆ వర్గం ఓట్ల కోసం ఆయన ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. అలాగే, క్రైస్తవుల్లో కూడా ప్రత్యేకంగా విజయ్ కి అదనపు బలం ఉన్నట్టూ ప్రస్తుతానికి కనపడలేదు. వారు సంస్థాగతంగా ఎక్కువగా డీఎంకే వైపు ఉన్నారని తెలుస్తోంది.

అయితే విజయ్ ఈ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా మరో ఐదేళ్లు పార్టీని నిలబెట్టుకుంటే అప్పుడు కచ్చితంగా జనంలో ఆదరణ ఉండవచ్చని చెబుతున్నారు.

సీమాన్, తమిళనాడు ఎన్నికలు

ఫొటో సోర్స్, X/Seeman4TN

సీమాన్

తమిళనాడు ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన నాలుగో ‘శక్తి’ సీమాన్. నామ్ తమిళర్ కట్చి పేరుతో సొంత పార్టీ పెట్టిన ఈయన 2010 నుంచీ ఈ పార్టీని నడిపిస్తున్నారు.

తమిళనాడు శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ఈ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. తాము పోటీ చేస్తున్న ఒక్కో ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ, 2024 లోక్ సభ ఎన్నికల్లో 8.19 శాతం ఓట్లు సాధించి సంచలనం సృష్టించారు.

బలమైన తమిళ జాతీయ వాదం ఈ పార్టీ లక్ష్యం. ఇప్పుడు ఎక్కడైనా వీరు గెలుస్తారా అని చెప్పలేంగానీ, ఓట్లను పెద్ద ఎత్తున కొన్ని నియోజకవర్గాల్లో అయినా చీల్చగలరనీ, అది టఫ్ ఫైట్ ఉన్న చోట్ల ప్రభావం చూపగలరనీ కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)