Home జాతీయ national telgu హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

16
0

SOURCE :- BBC NEWS

భారత నౌకాదళం

ఫొటో సోర్స్, Getty Images

హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరగడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది.

భారత విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, ఇరాన్ రాయబారితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ అయ్యారు. భారత్‌కు వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించేలా చూడాలని ఇరాన్‌ను కోరారు.

అంతేకాదు, భారత్‌కు వచ్చే నౌకల రక్షణ కోసం ఇరాన్‌తోపాటు ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

“ఇరాన్-భారత్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం లేదు. త్వరలోనే అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాను” అని ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్‌లో ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.

వైట్‌హౌస్‌లో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఈ కాల్పుల గురించి బీబీసీ అనుబంధ సంస్థ సీబీఎస్ న్యూస్ ప్రశ్నించింది. అయితే, ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, ANI

హార్ముజ్ జలసంధిలో ఏం జరిగింది?

ట్యాంకర్ల కదలికలను పర్యవేక్షించే ‘ట్యాంకర్ ట్రాకర్స్’ వెబ్‌సైట్ ప్రకారం.. ఇరాన్ నౌకాదళం రెండు భారతీయ నౌకలను హార్ముజ్ జలసంధి నుంచి వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ‘కాల్పులు’ కూడా జరిగాయి. అయితే, కేవలం భారతీయ నౌకలనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

బీబీసీ వెరిఫై ప్రకారం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్న సమయంలో, భారత జెండా ఉన్న ‘జగ్ అర్నవ్’ (కార్గో షిప్), ‘సన్మార్ హెరాల్డ్’ (ఆయిల్ ట్యాంకర్) నౌకలను తమ నిర్దేశిత మార్గం నుంచి తప్పుకోవాలని ఇరాన్ బలగాలు ఆదేశించాయి. ‘యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ సమాచారం మేరకు, ఒక నౌకపై కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటన తర్వాత భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లాయి.

ముఖ్యంగా ‘సన్మార్ హెరాల్డ్’ నౌక భారత్‌కు ముడి చమురును తీసుకువస్తోంది. జలసంధిని రాకపోకల కోసం తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించిన ఒక రోజు తర్వాతే ఈ ఘటన జరిగింది.

హార్ముజ్ తెరవడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్వాగతించినప్పటికీ, అమెరికా దిగ్బంధం కొనసాగడంతో ఇరాన్ మళ్లీ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

సంక్షోభం మధ్య హార్ముజ్ దాటిన భారత నౌకలు

హార్ముజ్ జలసంధి సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం పది భారతీయ నౌకలు ఈ మార్గాన్ని విజయవంతంగా దాటగలిగాయి.

భారత మీడియా కథనాల ప్రకారం, శుక్రవారం కూడా భారత జెండా ఉన్న ఒక చమురు ట్యాంకర్ హార్ముజ్ గుండా వెళ్లగలిగింది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, 31 మంది సిబ్బందితో ఉన్న ‘దేశ్ గరిమ’ అనే ఆయిల్ ట్యాంకర్ హార్ముజ్ దాటి ముంబయి వైపు ప్రయాణిస్తోంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం, ఈ సంక్షోభ సమయంలో ఈ మార్గం గుండా వెళ్లిన పదో భారతీయ నౌక ఇది. అయితే, ఇరాన్ కఠినమైన దిగ్బంధం కారణంగా ఈ నౌకలు అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణిస్తున్నాయి.

భారత్ ప్రస్తుతం తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 55-60 శాతం ముడి చమురు గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది, దీనికి హార్ముజ్ జలసంధి ప్రధాన మార్గం.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, Shady Alassar/Anadolu via Getty Images

భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి?

ఇటువంటి స్థితిలో భారత్ ముందున్న ఇతర మార్గాలపై చర్చ జరుగుతోంది. ఇరాన్ చర్య పట్ల భారత్ ఆచితూచి, సమతుల్యంగా స్పందిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ప్రాధాన్యత ఇంధన భద్రతేనని, ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

“హార్ముజ్ జలసంధి ప్రస్తుత స్థితిలో భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశానికైనా అవకాశాలు చాలా తక్కువ. అమెరికా, ఇరాన్ తప్ప ఇతర దేశాలు ఇక్కడ పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు” అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు హర్ష్ వి. పంత్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యమే భారత్ ముందున్న ఉత్తమ మార్గమని రక్షణ నిపుణుడు ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

“సైనిక పరంగా ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో చర్చలు జరపడం ఒక్కటే భారత్ అనుసరించాల్సిన ఏకైక మార్గంగా కనిపిస్తోంది” అన్నారాయన.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, Reuters

హార్ముజ్‌పై అడ్డంకులు ఉండకూడదని డిమాండ్

హార్ముజ్ సంక్షోభం మధ్య భారత్ నిరంతరం ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది. సముద్రయాన స్వేచ్ఛ సూత్రాన్ని ప్రస్తావిస్తూ, హార్ముజ్ మార్గం వినియోగానికి అనుమతించాలని ఇరాన్‌ను కోరుతోంది. సముద్రయాన స్వేచ్ఛ అనేది సముద్ర చట్టాల ప్రాథమిక సూత్రం. దీని ప్రకారం, ఒక స్వతంత్ర దేశ నౌక ఇతర దేశాల జోక్యం లేకుండా సముద్రంలో ప్రయాణించవచ్చు.

‘యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’ (యూఎన్‌సీఎల్‌ఓఎస్-1982) నిబంధనలు ఈ కింది విధంగా ఉంటాయి.

అయితే, హార్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయ మార్గాలకు నియమాలు భిన్నంగా ఉంటాయి. రెండు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లను కలిపే ఇటువంటి మార్గాల్లో ‘ట్రాన్సిట్ ప్యాసేజ్’ వర్తిస్తుంది. అంటే నౌకలు ఇక్కడ వేగంగా, నిరంతరంగా ప్రయాణించే హక్కు ఉంటుంది.

ఈ చట్టం ప్రకారం, హార్ముజ్ విషయంలో ఇరాన్ లేదా ఒమన్‌లకు నౌకలను ఆపే లేదా రాకపోకలను అడ్డుకునే హక్కు లేదు.

ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. దీని ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడింది.

అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలని భారత్ కోరినప్పటికీ, వాటిని ఎవరు అమలు చేస్తారనేది ప్రశ్నగా మిగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయి. అటువంటప్పుడు ఇరాన్ ఆ చట్టాలను పాటిస్తుందని ఎలా ఆశించగలం? ప్రస్తుతం వాటిని అమలు చేసేది ఎవరు?” అని ఉదయ్ భాస్కర్ ప్రశ్నించారు.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఇతర దేశాల పాత్ర పరిమితమైందని హర్ష్ వి. పంత్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకునే వరకు పరిస్థితులు క్లిష్టంగానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, భారత్ ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలను పెంచి ఫలితాలు సాధించవచ్చని ఉదయ్ భాస్కర్ భావిస్తున్నారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక చర్చలు జరపాలని, ‘బ్రిక్స్’ వంటి వేదికలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ తన నౌకలకు రక్షణగా ఎస్కార్ట్ చేయగలదా?

హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో భారత్ ఈ ఏడాది మార్చిలో ‘ఆపరేషన్ ఉర్జా సురక్ష’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఐదుకు పైగా యుద్ధనౌకలు ప్రస్తుతం ఒమన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్నాయి.

గతంలో ఇరాన్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఎల్‌పీజీ లోడుతో ఉన్న నౌకలను భారత నౌకాదళ భద్రత మధ్య హార్ముజ్ నుంచి బయటకు తీసుకువచ్చారు.

అయితే, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత యుద్ధనౌకలను నేరుగా హార్ముజ్‌లోకి పంపగలదా అంటే.. విశ్లేషకుల సమాధానం ‘లేదు’ అనే వస్తుంది.

ఉదయ్ భాస్కర్ అభిప్రాయం ప్రకారం, “సైనిక పద్ధతిలో హార్ముజ్ నుంచి నౌకలను బయటకు తీసుకురావడం సాధ్యం కాదు. కేవలం నౌకలు హార్ముజ్ దాటి బయటకు వచ్చిన తర్వాతే భారత నౌకాదళం తన రక్షణ కవచంలో వాటిని భారత్‌కు తీసుకురాగలదు”.

“మిలటరీ ఆపరేషన్స్ పరిమితం మాత్రమే కాకుండా, అత్యంత ప్రమాదకరమైనవి కూడా. అటువంటి అడుగు వేస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి” అని ఉదయ్ భాస్కర్ అన్నారు.

“అక్కడ మైన్స్ కూడా అమర్చి ఉన్నాయి. దీనివల్ల ఆ ప్రాంతం కేవలం సరుకు రవాణా నౌకలకే కాకుండా యుద్ధనౌకలకు కూడా చాలా ప్రమాదకరం” అన్నారాయన.

ఇరాన్, హార్ముజ్ జలసంధి, భారత నౌకలపై కాల్పులు

ఫొటో సోర్స్, Reuters

మరోవైపు, ప్రస్తుతం హార్ముజ్ పై ఇరాన్ పట్టు ఎంత బలంగా ఉందంటే, ప్రపంచంలోని ఏ దేశ నౌకాదళం కూడా దానిని దాటుకుని బయటకు రావడం కష్టమని హర్ష్ వి. పంత్ అభిప్రాయపడ్డారు.

“మీ సామర్థ్యాలు ఎంత ఉన్నా, అక్కడ వారి భౌగోళిక సరిహద్దుల వల్ల పరిమితులు ఎదురవుతాయి. ఏ దేశం కూడా అక్కడ స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించలేకపోతోంది” అన్నారాయన.

దీనికి ఒక కారణం హార్ముజ్ భౌగోళిక స్థితి. అక్కడి మ్యాపింగ్, భౌగోళిక నిర్మాణం కారణంగా బయటి వ్యక్తుల జోక్యం అంత సులభం కాదని హర్ష్ వి. పంత్ అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఏదో ఒక ఒప్పందం కుదిరే వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

“అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకు, ఇరాన్ తన పట్టును సడలించినా, ఏ దేశానికి ఎటువంటి లాభం ఉండదు” అని హర్ష్ వి. పంత్ అన్నారు.

ప్రస్తుత పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇరాన్‌ను గనుక ఒంటరిని చేయాలని చూస్తే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని ఉదయ్ భాస్కర్ హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)