Home జాతీయ national telgu ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

22
0

SOURCE :- BBC NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, AP Government/UGC

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న కె. వెంకటరామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది.

సాధారణ పరిపాలన శాఖ (సేవలు – మానవ వనరుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఏప్రిల్ 20న దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ రూల్ 19(1), (5), రూల్ 3(1)తో పాటు ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ (2)ను ఉల్లంఘించినందుకు ఆయన్ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 43లో పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ 2024 ఎన్నికల్లో సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా నాటి అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.

అయితే తన పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ డిస్మిస్‌ చేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని వెంకటరామిరెడ్డి బీబీసీతో అన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారమే ఆయన్ను డిస్మిస్ చేశారని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించగా, హక్కుల కోసం పోరాడినందుకే ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ‌మోహన్ రెడ్డి ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, UGC

వివాదం ఏమిటి? ఆయనపై ఆరోపణలేంటి?

2024 ఎన్నికల సమయానికి రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డి.. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు.

  • 2024 మార్చి 7న నాటి ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి నిర్వహించిన ఓ సమావేశానికి వెంకటరామిరెడ్డి హాజరై వైసీపీ అనుకూల వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపించింది.
  • మార్చి 8న అనంతపురంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారని, మార్చి 10న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ర్యాలీలో పాల్గొని ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ విమర్శించింది.
  • మార్చి 21న బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వెంకటరామిరెడ్డిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్‌ 18న నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

2024 ఏప్రిల్‌ నుంచి సస్పెన్షన్‌లోనే ఉన్న వెంకటరామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని, వాటిపై ఆయన ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సర్వీస్‌ నుంచి తొలగించినట్టు తాజాగా ప్రభుత్వం పేర్కొంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో కడప జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలను వెంకటరామిరెడ్డి ఉల్లంఘించారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే కడప జిల్లా అధికారులు సిఫార్సు చేశారు. ఆ అభియోగాలను నమోదు చేసిన ప్రభుత్వం ఆయన వివరణ కోరింది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సర్వీస్‌ నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగి, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, UGC

‘ఉల్లంఘన ఎక్కడ?’

రెండేళ్లుగా తన సస్పెన్షన్, తాజాగా డిస్మిస్‌ ఆర్డర్‌పై వెంకటరామిరెడ్డి బీబీసీతో మాట్లాడారు. ఇది కేవలం తనపై కక్షతోనే కూటమి ప్రభుత్వం చేసిందని, ఇది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

“నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో ఎంతో మంచి చేశారు. ఉద్యోగుల సంఘం నేతగా నేను ఆ విషయాలే చెప్పాను. అందులో రాజకీయం లేదు. నేను వైసీపీకి ఎక్కడా ప్రచారం చేయలేదు. నాటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వల్ల అందరికీ ప్రయోజనం చేకూరిందని చెప్పాను. ఇందులో నేను సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించింది ఎక్కడ?” అని వెంకటరామిరెడ్డి బీబీసీతో అన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

2024 నవంబర్‌లో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌ డైరెక్టర్‌ పదవుల ఎన్నికల సమయంలో కూడా తాను తాడేపల్లిలో వ్యక్తిగతంగా మిత్రులతో కలిసి కూర్చుంటే మద్యం సేవిస్తున్నారంటూ ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేసి, అర్థరాత్రి తనను అరెస్టు చేశారని వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను అప్పట్లోనే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా భారీ ఎత్తున మద్యం పార్టీ చేసుకున్నందునే కేసులు పెట్టామని చెప్పారు.

తాజాగా వచ్చిన డిస్మిస్‌ ఉత్తర్వులపై కోర్టుకు వెళ్తానని, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వెంకటరామిరెడ్డి చెప్పారు. తనకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి వివరిస్తానని,ఈ పోరాటంలో ఆయన సాయం తీసుకుంటానని వెంకటరామిరెడ్డి బీబీసీతో అన్నారు.

‘నాది తప్పైతై, అశోక్‌బాబు చేసిందేంటి?’

“ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నాపై ప్రభుత్వం ఎన్నో అభియోగాలు మోపింది. మరి ఇదే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతగా గతంలో పనిచేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు.. అప్పట్లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్వయంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి. మరి అశోక్‌ బాబుపై ఏం చర్యలు తీసుకున్నారు? తర్వాత పిలిచి ఎమ్మెల్సీ చేశారు కదా, టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓ విధానం… వ్యతిరేకంగా ఉంటే కక్షపూరితం. ఇదే టీడీపీ రాజకీయం” అని వెంకటరామిరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, UGC

నాది వ్యక్తిగతం: అశోక్‌బాబు

వెంకటరామిరెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో బీబీసీ మాట్లాడింది.

“కర్ణాటక ఎన్నికల ప్రచారం సమయంలో నేను అక్కడికి వెళ్లింది నిజమే. వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలతో నేను సమావేశమయ్యాను. మిత్రులు, శ్రేయోభిలాషులతో అక్కడ నేను వ్యక్తిగతంగా సమావేశమైతే అది రహస్యంగా వీడియోలు తీసి బయటకు వదిలి తప్పుగా ప్రచారం చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై చర్యలు తీసుకుంది. కానీ, అవి తప్పని న్యాయస్థానాలు కూడా చెప్పాయి” అని అశోక్‌బాబు అన్నారు.

తన వ్యవహారం వేరు అని, వెంకటరామిరెడ్డి పూర్తిగా సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అశోక్‌ బాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, UGC

అన్యాయమే: గోపాల్‌ రెడ్డి

“వెంకటరామిరెడ్డిపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే చర్యలు తీసుకున్నట్టు అర్ధమవుతోంది. ఆయనపై వచ్చినవి కేవలం రాజకీయ ఆరోపణలే. ఇందుకు సర్వీస్‌ నుంచి తొలగించాల్సిన పని లేదు. ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణలూ లేవు. అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలూ లేవు. కేవలం ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలే. షోకాజ్‌ నోటీసు ఇచ్చి హెచ్చరిస్తే సరిపోయే దానికి సర్వీస్‌ నుంచి తొలగించడం అన్యాయమే” అని ఎన్జీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి బీబీసీతో అన్నారు.

అయితే, ప్రభుత్వం నిర్ణయంపై కోర్టుకు వెళితే న్యాయం జరగొచ్చని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి బీబీసీతో అన్నారు.

“సర్వీస్‌ కమిషన్‌ నిబంధనలకు లోబడి వెంకటరామిరెడ్డిని అలా డిస్మిస్‌ చేయొచ్చా అనే విషయంపై ఇప్పుడుమాట్లాడలేను. కానీ, ఆయన కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా” అన్నారాయన.

వర్ల రామయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కె. వెంకటరామిరెడ్డి, డిస్మిస్

ఫొటో సోర్స్, UGC

వెంకటరామిరెడ్డి చేసినవన్నీ తప్పులే: వర్ల రామయ్య

“వెంకటరామిరెడ్డి మొదటి నుంచీ అన్నీ తప్పులే చేశారు, చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పట్లో నేనే స్వయంగా ఎన్నికల సంఘానికి వెళ్లి ఫిర్యాదు చేశాను” అని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య బీబీసీతో చెప్పారు.

“ఆయనకి వ్యక్తిగతంగా వైసీపీ ఇష్టమైతే సర్వీస్‌ వదిలేసి ఆ పార్టీలో చేరొచ్చు. కానీ సర్వీసులో ఉండి అలా చేయకూడదు. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా. ఇక ఆయన ఇష్టం” అన్నారాయన.

కాగా, కె.వెంకటరామిరెడ్డి తొలగింపుపై ప్రస్తుత ఏపీపీఎస్సీ అధికారుల వివరణ కోసం బీబీసీ యత్నిస్తోంది. రాగానే అప్‌డేట్‌ చేస్తాం.

దీనిపై స్పందించిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన వదిలి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

కాగా, వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

“కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే ఆయనపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి అత‌న్ని డిస్మిస్ చేశారంటే మీరు భ‌య‌ప‌డిపోతున్నార‌నే క‌దా” అని ఎక్స్ పోస్టులో రాశారు వై.ఎస్. జగన్.

సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 ( ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1964) ప్రకారం ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలతో, నిజాయతీగా విధులు నిర్వర్తించాలి. రాజ్యాంగంలోని 309వ అధికరణం ద్వారా రూపొందించిన ఈ నియమాలు ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రవర్తనను, రాజకీయాల్లో జోక్యాన్ని, ఆస్తుల కొనుగోలును నియంత్రిస్తాయి.

ముఖ్యమైన ప్రవర్తనా నియమాలు (కండక్ట్ రూల్స్)

  • నియమం 3 – సాధారణ ప్రవర్తన: ప్రతి ఉద్యోగి నిరంతరం అత్యున్నత నిజాయతీ, క్రమశిక్షణ, నిష్పాక్షికతను పాటించాలి. ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు.
  • నియమం 10 & 11 – ప్రైవేట్ వ్యాపారం/ఉద్యోగం: ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి ప్రైవేట్ వ్యాపారాలు, కంపెనీల నిర్వహణ లేదా ఇతర ఉద్యోగాలు చేయకూడదు.
  • నియమం 17 – ప్రభుత్వ విధానాలు, చర్యలను బహిరంగంగా విమర్శించకూడదు.
  • నియమం 19 – రాజకీయాలు: ఉద్యోగులు రాజకీయ పార్టీలలో సభ్యులుగా ఉండకూడదు లేదా ఎన్నికలలో ప్రచారం చేయకూడదు.

ఆస్తుల నివేదిక: స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినా లేదా అమ్మినా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించాలి.

బహుమతులు (నియమం 6): ఉద్యోగులు తమ పదవిని ఉపయోగించి బహుమతులు స్వీకరించకూడదు.

క్రమశిక్షణా చర్యలు (ఏపీ సీఏ రూల్స్ 1991):

ఈ నియమాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) రూల్స్ 1991 ప్రకారం చర్యలు తీసుకుంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)