SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Donald Trump
3 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితుడిని కోల్ థామస్ అలెన్‌గా గుర్తించినట్లు అమెరికన్ మీడియా రిపోర్ట్ చేసింది. ఈ ఘటన తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిందితుడిపై సోమవారం అధికారికంగా అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే, ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉంది.
31 ఏళ్ల అలెన్, కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ నగర శివారు ప్రాంతమైన టోరెన్స్‌కు చెందిన వ్యక్తిగా రిపోర్టులు వస్తున్నాయి.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అనుమానితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు.
విందు జరుగుతున్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఆయన గెస్ట్‌గా ఉన్నారని, ఆయన వద్ద తుపాకులు, కత్తులతో సహా అనేక ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

అమెరికాలో బీబీసీ భాగస్వామ్య సంస్థ అయిన సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, అలెన్ ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. టోరెన్స్‌లో ట్యూటర్‌గా పని చేశారు.
ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక కథనం ప్రకారం, అలెన్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, వాషింగ్టన్ పోలీసు రికార్డుల్లోనూ ఎక్కడా ఆయన పేరు లేదని అధికారులు భావిస్తున్నారు.
రాయిటర్స్ కథనం ప్రకారం, డిసెంబర్ 2024లో అలెన్ ‘టీచర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెలుచుకున్నట్లు ఆయన ఫేస్‌బుక్ పోస్ట్‌లు వెల్లడిస్తున్నాయి.
అనుమానితుడి పేరుతో ఉన్న లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో “డిగ్రీ పట్టా ప్రకారం ఒక మెకానికల్ ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్, ఇండిపెండెంట్ గేమ్ డెవలపర్‌గా అనుభవం, పుట్టుకతోనే టీచర్” అని ఆయన రాసుకున్నారు.
లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అలెన్ 2017లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2025లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ డొమింగ్యూజ్ హిల్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఆయన పార్ట్ టైమ్ టీచర్‌గా, సొంతంగా గేమ్ డెవలపర్‌గా పనిచేస్తున్నట్లు ఆ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. హింసాత్మక నేరానికి పాల్పడటం, తుపాకీ వినియోగించడం వంటి పలు అభియోగాలను అలెన్‌పై నమోదు చేసే అవకాశం ఉంది.
ఫొటో సోర్స్, Reuters
శనివారం సాయంత్రం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడి హోదాలో హాజరుకావడం ఇదే మొదటిసారి.
2021లో వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత, తిరిగి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో 2024లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి.
వీటిలో అత్యంత తీవ్రమైనది 2024 జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో, బహిరంగ సభలో జరిగింది. ఆ సమయంలో 20 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవిపైన గాయమైంది. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చిచంపారు.
ఈ విందు జరిగిన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వద్దే 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా హత్యాయత్నం జరిగింది.
ఫొటో సోర్స్, Reuters
ఘటనా స్థలంలోనే పట్టుబడిన అలెన్.. కాలిఫోర్నియా నివాసి అని, దర్యాప్తు సంస్థలు ఆయన ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయని ట్రంప్ మీడియాకు తెలిపారు.
అనుమానితుడిపై తుపాకీ వినియోగం, దాడికి సంబంధించిన అభియోగాల కింద సోమవారం కోర్టులో విచారణ ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.
ఆయన వద్ద ఒక షాట్‌గన్, ఒక హ్యాండ్‌గన్, కత్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



