Home జాతీయ national telgu ఇరాన్‌ యుద్ధం ముగిసినా ప్రపంచ ఇంధన సంక్షోభం ముగియదనడానికి 6 కారణాలు

ఇరాన్‌ యుద్ధం ముగిసినా ప్రపంచ ఇంధన సంక్షోభం ముగియదనడానికి 6 కారణాలు

11
0

SOURCE :- BBC NEWS

ఇంధన సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న జరిపిన దాడుల తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఇంధన సంక్షోభం నిజంగా ఇప్పుడే మొదలైంది.

తాత్కాలిక కాల్పుల విరమణ గానీ, ఇరాన్ యుద్ధం ముగియడం గానీ ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించి, యుద్ధానికి పూర్వం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆ స్థాయికి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు.

యుద్ధానికి ముందు కాలం అంటే చమురు, గ్యాస్ చౌకగా, పుష్కలంగా లభించిన సమయం. ఆ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. ప్రజల ఆదాయం పెరుగుతూనే ఉంది.

కానీ, ఇప్పుడు యుద్ధానికి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించడం అంత తేలిక కాదు. ఈ ప్రక్రియ ఎంత క్లిష్టమైనదో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

1. చమురు కొరత ఇప్పుడే మొదలైంది

పర్షియన్ గల్ఫ్ నుంచి ఒక ట్యాంకర్ తన కొనుగోలుదారులు, అంటే దిగుమతి చేసుకునే దేశాలను చేరుకోవడానికి సుమారు నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది.

యుద్ధం సరిగ్గా నెలన్నర క్రితం మొదలైంది. తరువాత హార్ముజ్ జలసంధి మూసివేసినందున, ప్రపంచం నిజమైన చమురు కొరతను ఎదుర్కోవలసింది ఇప్పటి నుంచే.

“మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నష్టాలు రెట్టింపు అవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది అధిక ద్రవ్యోల్బణానికి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది” అని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెడ్ ఫాతిహ్ బిరోల్ అన్నారు.

“పరిస్థితి మరింత దిగజారచ్చు. ఫలితంగా, త్వరలోనే అనేక దేశాల్లో రేషన్ పద్ధతిలో ఇంధన పంపిణీ మొదలు కావచ్చు ” అంటారు బిరోల్.

యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన ట్యాంకర్లు యుద్ధానికి ముందు లోడ్ చేసిన చమురునే తీసుకొచ్చాయి.

ఇప్పుడు చమురు లభ్యత తక్కువగా ఉన్నందున, ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధిని తెరిచినా కూడా ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి తిరిగి రావు.

చమురు సంక్షోభంలో కొత్త దశ ఇప్పుడే మొదలవుతోంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, సరఫరా పునరుద్ధరణకు నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది.

వాస్తవానికి ఈ కొరత చాలా నెలల పాటు, బహుశా 2026 చివరి వరకు కూడా కొనసాగుతుందని అమెరికా ఇంధన శాఖ గణాంకాల విభాగం యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజా నివేదిక పేర్కొంది.

అయితే చమురు విషయంలో పరిస్థితి కొంత తేలిగ్గా ఉండొచ్చు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి నెలకొంటే, సౌదీ అరేబియా, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలు ఉత్పత్తిని వేగంగా పెంచగలవు.

కానీ గ్యాస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

2. గ్యాస్ సంక్షోభమే ఎక్కువ

ఇరాన్ యుద్ధానికి ముందు, పైప్‌లైన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రపంచం ఎక్కువగా ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) వైపు మళ్లింది.

ఐరోపాపై ఒత్తిడి తెచ్చేందుకు రష్యా ఈ పైప్‌లైన్‌లను ఒక ఆయుధంగా ఉపయోగించింది. దాంతో 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం తలెత్తింది.

బొగ్గుతో పోలిస్తే గ్యాస్ చౌకగా, స్వచ్ఛంగా మారుతూ వచ్చింది. ఇంధన వినియోగంలో దాని వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఈ ఎంపిక ఎంత ప్రమాదకరమో ఇరాన్ యుద్ధం చూపించింది.

యుద్ధానికి ముందు ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఖతార్ 21 శాతం, లేదా మొత్తం గ్యాస్ మార్కెట్‌లో సుమారు 17 శాతం వాటా కలిగి ఉండేది. ఇది ఎంత పెద్ద వాటా అంటే, దానికి దాదాపుగా ప్రత్యామ్నాయం లేదు.

“యుద్ధం కారణంగా మొత్తం గ్యాస్ పరిశ్రమ విశ్వసనీయతే దెబ్బతింది. ఎల్‌ఎన్‌జీని నమ్మదగిన, సులభంగా లభించే ప్రత్యామ్నాయంగా చూపించారు. కానీ ప్రపంచం ముందుగా 2022లో రష్యా గ్యాస్ సంక్షోభంలో చిక్కుకుంది, ఇప్పుడు ఖతార్ గ్యాస్ సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది” అని ఫాతిహ్ బిరోల్ అన్నారు.

ఎల్‌ఎన్‌జీ సరఫరా త్వరగా మెరుగుపడటం సాధ్యం కాదు. ఖతార్ నుంచి ఎగుమతులకు ప్రత్యామ్నాయ సముద్ర మార్గం లేదు, అయితే చమురు మాత్రం హార్ముజ్ జలసంధిని తప్పించుకుని కొంతవరకు భూమార్గ పైప్‌లైన్‌ల ద్వారా ఎగుమతి చేయవచ్చు.

ప్రస్తుతం భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున, గ్యాస్ ధరలు చాలా నెలల పాటు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

ఖతార్ తన కొత్త ఉత్పత్తి సామర్థ్య అభివృద్ధిని నిలిపేసింది.

ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

ఫొటో సోర్స్, Reuters

3. కోలుకోవడానికి ఎంత సమయం?

హార్ముజ్ జలసంధిని చమురు ట్యాంకర్లు, గ్యాస్ రవాణా నౌకల కోసం తెరవడం ఒక సమస్య అయితే, నెలన్నర పాటు జరిగిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఆ ప్రాంతంలోని కర్మాగారాలలో ఉత్పత్తిని పునరుద్ధరించడం మరో సమస్య.

యుద్ధ సమయంలో జరిగిన దాడుల వల్ల మధ్యప్రాచ్యంలోని 40కి పైగా చమురు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిక్విఫైడ్ గ్యాస్ ప్లాంట్‌లో 17 శాతాన్ని ఇరాన్ క్షిపణులు ధ్వంసం చేశాయి.

ఈ రకమైన పరికరాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటికి విడి భాగాలు ఉండవు. అందువల్ల మరమ్మతులకు నెలలు కాదు, మూడు నుంచి ఐదేళ్లు పడుతుందని ఖతార్ అధికారుల అంటున్నారు.

ఇతర దేశాలలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఇరాన్ డ్రోన్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌లలోని రిఫైనరీలు, చమురు క్షేత్రాలు, ఇతర ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటి మరమ్మతులకు కొన్ని నెలల సమయం పట్టడమే కాకుండా బిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది.

యుద్ధానికి ముందు ఈ నిధులను ప్రపంచ ఇంధన సరఫరా పెంచడానికి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు.

ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

ఫొటో సోర్స్, EPA

4. ఆర్థిక సంక్షోభం

పెరుగుతున్న జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి గల్ఫ్ దేశాలు తమ ఉత్పత్తిని పెంచుకోవాలని యుద్ధానికి ముందు ప్రణాళిక వేసుకున్నాయి.

దిగుమతిచేసుకునే దేశాలు కూడా చమురు తగినంత పరిమాణంలో లభిస్తుందని, గ్యాస్ సరఫరా కూడా పెరుగుతుందని ఆశించాయి.

కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, ఖతార్, ఇతర దేశాలు తమ వనరులను అభివృద్ధిపై కాకుండా, పాత ఉత్పత్తి స్థాయిలను పునరుద్ధరించడానికి, భవిష్యత్ దాడుల నుంచి రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఖర్చు చేయవలసి వస్తుంది.

ఖరీదైన ఇంధనం కోసమే కాకుండా అణు, సౌర, పవన, బ్యాటరీలు, బొగ్గు వంటి ప్రత్యామ్నాయాలలో పెట్టుబడుల కోసం, పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీల కోసం కూడా దిగుమతి చేసుకునే దేశాలు ఎక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

కోవిడ్, రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో ఏర్పడిన రెండు సంక్షోభాలకంటే ఈసారి ప్రభావిత దేశాలకు అప్పు తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంది.

ఇక ప్రభుత్వాలు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం ఎక్కువవడం. రెండు ప్రభుత్వ రుణం, బడ్జెట్ లోటు కూడా ఎక్కువగా ఉండడం.

ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీంతో ఆర్థిక సహాయానికి ఉన్న అవకాశాలు పరిమితమవుతాయి. అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం లేకుండా చేస్తుంది.

ఇక వ్యూహాత్మక చమురు నిల్వల వినియోగం వల్ల భవిష్యత్తు వనరులు ముందుగానే ఖాళీ అయ్యాయి.

ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

5. ధరలపై ‘వ్యూహాత్మక’ ప్రభావం

చమురు కొరతను అధిగమించడానికి, పాశ్చాత్య దేశాలు తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి.

యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుంచి ప్రతిరోజూ 10–12 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్‌కు చేరడం నిలిచిపోయింది. దీన్ని భర్తీ చేయడానికి వ్యూహాత్మక నిల్వల నుంచి ప్రతిరోజూ 3–4 కోట్ల బ్యారెళ్లు విడుదల చేస్తున్నారు.

అయినా ఇవి కేవలం 4, 5 నెలల అవసరాలనే తీర్చగలుగుతాయి. ఆ తర్వాత నిల్వలను తిరిగి సమకూర్చుకోవలసి ఉంటుంది.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికాకు చెందిన కొన్ని నిల్వలను అమ్మినందుకు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ను డోనల్డ్ ట్రంప్ నిందించారు. ఆయన దీన్ని తిరిగి నింపుతానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు.

ఇప్పుడు, నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరతాయి. దీనర్థం ఏంటంటే చట్టపరమైన, భద్రతా కారణాల దృష్ట్యా, చమురు ధరలతో సంబంధం లేకుండా దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను క్రమంగా తిరిగి నింపుకోవలసి వస్తుంది.

వ్యూహాత్మక నిల్వలను తిరిగి సిద్ధం చేయడం చమురు ధరలను మరింత పెంచుతుంది, సంక్షోభాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తుంది.

ఇరాన్, యుద్ధం, ఖతార్, లఫాన్ గ్యాస్ క్షేత్రం, చమురు, గ్యాస్ కొరత, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

6. అతిపెద్ద ఇంధన సంక్షోభం ముంగిట..

విశ్వసనీయమైన ఇంధన వనరుగా మధ్యప్రాచ్యానికి ఉన్న ప్రతిష్ఠ ఏళ్లుగా దెబ్బతింటోంది. యుద్ధం ముగియడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఈ ఘర్షణ వల్ల ప్రమాదాలు పెరిగి, బీమా, రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ అదనపు ఖర్చులు ఇంధన ధరలను చాలా కాలం పాటు, బహుశా శాశ్వతంగా కూడా ఎక్కువ స్థాయిలో ఉంచే అవకాశం ఉంది.

చమురు ధరలలో శాశ్వత రిస్క్ ప్రీమియం ఉంటుందని అమెరికా ఇంధన శాఖ ప్రకటించింది.

ఈ సమస్య హార్ముజ్ జలసంధికి మాత్రమే పరిమితం కాదు. ఎర్ర సముద్రం కూడా ప్రమాదంలో ఉంది. ఇక్కడ డ్రోన్లను ఉపయోగించే, ఇరాన్‌కు మద్దతు ఇచ్చే గుంపులు ఇతర కీలక సముద్ర మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు.

ఈ పరిస్థితికి ప్రపంచం చాలా శాంతంగా స్పందించిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అధిపతి అంటున్నారు.

1970ల నాటి చమురు సంక్షోభం ద్రవ్యోల్బణానికి, జీవన ప్రమాణాల క్షీణతకు, రాజకీయ అశాంతికి దారితీసింది. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు.

“ఇప్పటివరకు ఆసియా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. కానీ ఈ సంక్షోభం యూరప్, ఇతర ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది” అని ఫాతీహ్ బిరోల్ అన్నారు.

“మనం చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి ప్రవేశిస్తున్నాం” అని ఆయన హెచ్చరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)