SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, EPA/Reuters
ఒక గంట క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమని, దానిని దిగ్బంధించడం సరైన నిర్ణయం కాదని చైనా అభిప్రాయపడింది.
అమెరికా చేపట్టిన ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధం “ప్రమాదకరమైనది, బాధ్యతారహితమైనది” అంటూ చైనా విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.
ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని చైనా హెచ్చరించింది.
అయితే, అమెరికా నౌకాదళ దిగ్బంధం ప్రారంభమైనప్పటికీ, ఇరాన్‌తో సంబంధం ఉన్న నాలుగు నౌకలు మంగళవారం హార్ముజ్ జలసంధిని దాటినట్లు బీబీసీ వెరిఫై విశ్లేషించిన షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. మెరైన్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం, వీటిలో రెండు నౌకలు ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లి వచ్చాయి.
అయితే, నౌకాదళ దిగ్బంధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో ఒక్క నౌక కూడా దాన్ని దాటి వెళ్లలేదని అమెరికా తెలిపింది.

ఫొటో సోర్స్, MarineTraffic
మెరైన్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం, ఇరాన్‌లోని బందర్ ఇమామ్ ఖొమేనీ నౌకాశ్రయానికి వెళ్లిన క్రిస్టియానా అనే బల్క్ క్యారియర్, సోమవారం అమెరికా దిగ్బంధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దాటింది.
అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న రిచ్ స్టార్రీ అనే నౌక యూఏఈలోని షార్జా నుంచి బయలుదేరి రాత్రికి రాత్రే జలసంధి గుండా ప్రయాణించింది. ఈ నౌక, ప్రస్తుతం చైనావైపు వెళ్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
అలాగే చైనాలోని లాన్షాన్ నుంచి బయలుదేరిన ముర్లీకిషన్ అనే ట్యాంకర్ పశ్చిమ దిశగా జలసంధిని దాటింది. ఇది చివరగా ఇరాన్‌లోని ఖెష్మ్ ద్వీపం తూర్పున ఉన్నట్లు గుర్తించారు.
మరో ట్యాంకర్ ఎల్పిస్, ఇరాన్ పోర్టు బుషెహర్ నుంచి బయలుదేరి తూర్పు వైపుగా జలసంధిని దాటింది. దీని గమ్యం ఎక్కడికో తెలియదు.
ఈ ఎల్పిస్ నౌక కొమొరోస్ జెండాతో సముద్రంలో ప్రయాణిస్తోంది. ఈ నౌక మలేషియాకు చెందిన ‘చార్ట్‌కెమికల్’ అనే సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అయితే, షిప్పింగ్ డేటాబేస్ ‘ఈక్వాసిస్’ రిపోర్టు ప్రకారం, ఈ నౌక తప్పుడు జెండా వాడుతోంది. అంటే కొమొరోస్ దేశం నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆ దేశ జెండాతో ప్రయాణిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
కాగా, ఈ జలసంధిని దాటుతున్నవన్నీ ఇరాన్ సంబంధిత నౌకలు కావని బీబీసీ ప్రతినిధి జాషువా చీతాం తెలిపారు. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. సోమవారం దిగ్బంధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌తో ఎటువంటి స్పష్టమైన సంబంధం లేని కనీసం మూడు నౌకలు కూడా ఈ మార్గాన్ని దాటాయి.
అయితే, ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల వివరాలను కచ్చితంగా అంచనా వేయడం సవాలుగా మారిందని జాషువా తెలిపారు.
ఎందుకంటే కొన్ని నౌకలు తమ అసలు లొకేషన్‌ను దాచిపెట్టడానికి ‘స్పూఫింగ్’ (తప్పుడు సిగ్నల్స్ పంపడం) చేస్తున్నాయని చెప్పారు. దీనివల్ల ఆ నౌకలు ఏ దేశ పోర్టులకు వెళ్లాయి, ఎక్కడ సరుకును లోడ్ లేదా అన్లోడ్ చేశాయనే విషయాలను గుర్తించడం కష్టమవుతోందన్నారు.
కాగా, దిగ్బంధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో ఒక్క నౌక కూడా దాన్ని దాటి వెళ్లలేదని అమెరికా అంటోంది. ఈ దిగ్బంధంలో డజన్ల కొద్దీ యుద్ధనౌకలు, విమానాలతో పాటు 10,000 మందికి పైగా సైనిక సిబ్బంది పాల్గొంటున్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆరు వాణిజ్య నౌకలు అమెరికా దళాల ఆదేశాలను పాటించి, వెనక్కి మళ్లి తిరిగి ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించాయని సెంటకామ్ పేర్కొంది.
ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock
హార్ముజ్ దిగ్బంధం ప్రమాదకరం: చైనా
ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, చమురు సరఫరాకు హార్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన జలమార్గమని చైనా అభిప్రాయపడింది.
జలసంధి దిగ్బంధంపై మీడియా అడిగిన ప్రశ్నలకు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గ్వా జాకున్ బదులిస్తూ.. ఈ చర్య ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
“హార్ముజ్ జలమార్గాన్ని సురక్షితంగా ఉంచడం, నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడటం అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలకు అవసరం” అన్నారు.
అమెరికా, ఇరాన్ దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఈ వివాదాన్ని పరిష్కరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేసే చైనా, ఈ ఘర్షణ ముగిసి అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరత్వం ఏర్పడాలని కోరుకుంటోందని బీబీసీ దౌత్య ప్రతినిధి జేమ్స్ లాండాలే అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, MarineTraffic
ఇరాన్‌కు రక్షణ సాయంపై..
ఇరాన్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థలను చైనా సరఫరా చేస్తోందన్న వార్తలను గ్వా జాకున్ పూర్తిగా తిరస్కరించారు.
“అవి కేవలం కల్పిత కథనాలు” అని స్పష్టం చేశారు.
అయితే, ఇరాన్‌కు చైనా సైనిక సహాయం అందించినట్లు తేలితే, ఆ దేశంపై 50 శాతం అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికపై మీడియా ప్రశ్నించగా “సుంకాలు విధించడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఒకవేళ అదనపు సుంకాలు విధిస్తే చైనా కచ్చితంగా దీటైన ప్రతిఘటన చర్యలు తీసుకుంటుంది” అని గ్వా జాకున్ చెప్పారు.
అమెరికా లేదా వెనెజ్వెలా నుంచి చమురు కొనాలని చైనాకు ట్రంప్ సూచించడంపై మీడియా ప్రశ్నించగా, “చమురు కొనుగోలు విషయంలో గ్లోబల్ సప్లై చైన్‌కు ఇబ్బంది కలగకుండా ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే వెనెజ్వెలా ఒక స్వతంత్ర దేశం. తన వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే పూర్తి హక్కు దానికి ఉంది” అని బదులిచ్చారు.
ఫొటో సోర్స్, Al Drago/Bloomberg via Getty Images
‘ఈ ఆట ఎలా ఆడాలో ట్రంప్ చూపిస్తారు’
చైనా విదేశీ వ్యవహారాల శాఖ సమావేశానికి కొన్నిగంటల ముందే, డోనల్డ్ ట్రంప్ తన రాబోయే చైనా పర్యటన గురించి మీడియాతో మాట్లాడారు.
“చైనాతో మాకు చాలా మంచి సంబంధాలున్నాయి. ఇరాన్ యుద్ధం త్వరగా ముగియాలని జిన్‌పింగ్ కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను” అన్నారు.
“కానీ, గత 47 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని సృష్టించడం తప్ప మరేమీ చేయని వారి చేతుల్లోకి అణ్వాయుధాలు వెళ్లడం నాకు ఇష్టం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ప్రస్తుత పరిస్థితిపై స్పందించారు.
హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ ప్రభుత్వం ‘ఆర్థిక ఉగ్రవాదానికి’ పాల్పడుతోందని వాన్స్ ఆరోపించారు.
ఫాక్స్ న్యూస్ ప్రతినిధి బ్రెట్ బేయర్‌తో మాట్లాడిన వాన్స్.. “ఈ ఆటను ఎలా ఆడాలో” అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చూపిస్తున్నారని పేర్కొన్నారు.
వీకెండ్‌లో ఇరాన్‌తో జరిగిన చర్చలపై కూడా వాన్స్ మాట్లాడారు. ఈ చర్చల్లో పురోగతి లభించిందని, ప్రస్తుతం ‘బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని’ ఆయన అభివర్ణించారు.
అమెరికా డిమాండ్ చేస్తున్న కీలక అంశాలపై ఇరాన్ సానుకూలంగా స్పందించాలని ఆయన సూచించారు.
ఇరాన్ ఏమంటోంది?
ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం తమ సార్వభౌమాధికారాన్ని “తీవ్రంగా ఉల్లంఘించడమే”నని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని అన్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు రాసిన లేఖలో అమీర్ సయీద్ ఇరవాని ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ “చట్టవిరుద్ధమైన” దిగ్బంధం అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రాథమిక సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని లేఖలో విమర్శించారు.
అంతర్జాతీయ రవాణాకు ఉపయోగించే జలసంధులను అడ్డుకునే చట్టపరమైన హక్కు ఏ దేశానికీ లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్రయాన సంస్థ(ఐఎంఓ) స్పష్టం చేసింది.
ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగ్యూజ్ బీబీసీ రేడియో 4 టుడేతో మాట్లాడుతూ, ఇది ఒక ప్రమాదకరమైన సంప్రదాయమని పేర్కొన్నారు.
మరోవైపు, వాషింగ్టన్‌లో మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమో ప్రకారం.. ఈ చర్చలు ఉదయం 11:00 గంటలకు (ET) ప్రారంభం కానున్నాయి. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లైటర్, లెబనాన్ రాయబారి నాదా హమదే మౌవాద్‌లు పాల్గొననున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



