Home జాతీయ national telgu ‘పదేళ్లలో 33 మంది మైనర్లపై లైంగిక దాడి’ కేసులో భార్యాభర్తలకు ఉరి శిక్ష.. ఇది...

‘పదేళ్లలో 33 మంది మైనర్లపై లైంగిక దాడి’ కేసులో భార్యాభర్తలకు ఉరి శిక్ష.. ఇది ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ కేసు అని కోర్టు ఎందుకన్నది?

19
0

SOURCE :- BBC NEWS

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

ఉత్తరప్రదేశ్‌లో బాండా జిల్లాలోని ప్రత్యేక పోక్సో కోర్టు 2026 ఫిబ్రవరి 20న కీలక తీర్పు ఇచ్చింది. సుమారు దశాబ్దకాలంగా 33 మంది మైనర్లపై లైంగిక హింసకు పాల్పడిన కేసులో నిందితుడు రామ్ భవన్, ఆయన భార్య దుర్గావతికి ఉరిశిక్ష విధించింది.

ఈ నేరాన్ని కోర్టు ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన’ (రేరెస్ట్ ఆఫ్ ది రేర్) కేటగిరీగా పరిగణించింది.

బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. 2020లో కేసు నమోదు చేసింది.

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

సీబీఐకి సమాచారం ఎలా అందింది?

చిత్రకూట్, పరిసర జిల్లాల్లో కొంతమంది మైనర్ పిల్లలపై వ్యవస్థీకృత లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు 2020 అక్టోబర్ 31న సీబీఐకి రహస్య సమాచారం అందింది.

సమాచారం ఇచ్చిన వ్యక్తి 34 వీడియోలు, 679 ఫోటోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా అందించారు. ఆ వీడియోలు, ఫోటోల్లో రామ్ భవన్, ఇతర అపరిచితులు మైనర్లపై లైంగిక హింసకు పాల్పడడం దర్యాప్తు సంస్థ గుర్తించింది.

దీని ఆధారంగా, 2020 అక్టోబర్ 31న దిల్లీలో రామ్ భవన్‌పై ఐపీసీ సెక్షన్ 377, పోక్సో చట్టం సెక్షన్ 14, ఐటీ చట్టం సెక్షన్ 67బీ కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

2020 నవంబర్ 2న సీబీఐ చిత్రకూట్ జిల్లాకు చేరుకుని రామ్ భవన్ గురించి విచారణ ప్రారంభించింది.

కర్వి చిత్రకూట్‌లో, ఇరిగేషన్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రామ్ భవన్‌కు చిత్రకూట్, బాండా, హమీర్‌పూర్, మహోబా జిల్లాల వరకూ అధికార పరిధి ఉందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

దర్యాప్తు సంస్థ చెప్పినదాని ప్రకారం.. రామ్ భవన్ చదువు చెప్పిస్తానని, కంప్యూటర్ నేర్పిస్తానని, మొబైల్ ఫోన్ ఇస్తానని లేదా ఇతర ఆశ చూపి పిల్లలను ఇంటికి పిలిచేవారు.

అక్కడ వారిపై లైంగిక నేరాలకు పాల్పడి, వాటిని వీడియో తీసేవారు. ఆ కంటెంట్‌ను డార్క్ వెబ్, స్కైప్, మెయిల్ ద్వారా భారత దేశంతో పాటు విదేశాల్లోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసేవారు.

“2020 అక్టోబర్ 31న మాకు తొలిసారి సమాచారం అందింది. నవంబర్ 2న రామ్ భవన్ ఇంటిపై దాడి చేశాం. విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేశాం. అరెస్టు విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు” అని సీబీఐ మాజీ ఎస్పీ, ఈ కేసులో ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన అమిత్ కుమార్ బీబీసీకి తెలిపారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

వీడియోలు ఎందుకు తీశారు?

రామ్ భవన్ మైనర్ పిల్లలను లైంగికంగా వేధించి, ఆ ఫోటోలు, వీడియోలను ఈమెయిల్ లేదా ఇతర సైట్ల ద్వారా దేశ, విదేశాలకు పంపేవారని సీబీఐ పేర్కొంది.

అయితే, ఆ అసభ్యకర వీడియోలను రామ్ భవన్ అమ్ముకునేవారన్న వార్తలను సీబీఐ మాజీ అధికారి అమిత్ కుమార్ తోసిపుచ్చారు.

“రామ్ భవన్ వీడియోలను అమ్ముతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు. విచారణలో అలాంటి ఆధారాలు లభించలేదు. ఆయన తన వికృత కోరిక కోసం వీడియోలు తీసి ఇతరులతో పంచుకునేవారు” అని అమిత్ కుమార్ బీబీసీ హిందీతో చెప్పారు.

“రామ్ భవన్ ఒక్కరే వీడియోలు పంపడం లేదు, అవతలి వైపు నుంచి కూడా ఆయనకు వీడియోలు వచ్చేవి. ఇది రెండువైపులా జరిగే ప్రక్రియ. యూరప్‌లోని దాదాపు అన్ని దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు మైనర్ల వీడియోలను ఆయన పంపేవారు” అని అమిత్ కుమార్ తెలిపారు.

సోదాల సమయంలో రామ్ భవన్ ఇంటి నుంచి సెక్స్ టాయ్స్, పోర్నోగ్రఫిక్ మెటీరియల్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

దోషులుగా తేలిన ఈ జంట ఎవరు?

లైంగిక హింస కేసులో దోషిగా తేలిన 45 ఏళ్ల రామ్ భవన్ ఒక పేద కుటుంబంలో పుట్టారు. ప్రభుత్వ ఉద్యోగం రాకముందు చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఖర్చులకు డబ్బులు సంపాదించేవారు. 2009లో ఇరిగేషన్ శాఖలో రామ్ భవన్‌కు ఉద్యోగం వచ్చింది.

2009 మే నుంచి 2020నవంబర్‌‌లో అరెస్టు అయ్యే వరకు ఆయన విధుల్లో ఉన్నారు. ఆయన భార్య దుర్గావతి గృహిణి.

వీరిద్దరూ కాలనీలో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని పొరుగువారు చెప్పారు.

రామ్ భవన్ ఇంటికి సమీపంలో నివసించే శివమ్ త్రిపాఠి బీబీసీ హిందీతో మాట్లాడుతూ, “రామ్ భవన్ చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రవర్తన బాగానే ఉండేది. ఆఫీసు నుంచి కారులో వచ్చి నేరుగా తన ఇంట్లోకి వెళ్లేవారు, మళ్లీ ఇంటి నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లేవారు. భార్య, ఒక బిడ్డతో కలిసి ఉండేవారు. ఒకట్రెండు సార్లు కారులో పిల్లలు రావడం చూశాను కానీ, వారు బయటివారు” అని చెప్పారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

చిన్నారులపై లైంగిక వేధింపులు

ప్రభుత్వ ఉద్యోగి కావడంతో స్థానికుల్లో రామ్ భవన్‌కు మంచి పేరు ఉండేది. అందుకే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకోవడానికి, కంప్యూటర్ నేర్చుకోవడానికి ఆయన వద్దకు పంపేవారు.

2009 నుంచి 2012 వరకు గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో రామ్ భవన్ అద్దెకున్నారు. ఆ సమయంలో గౌతమ్ ఛత్తీస్‌గఢ్‌లో ఉండేవారు.

” నీటిపారుదల శాఖలోని ఒక క్లర్క్ ద్వారా ఆయనకు ఇల్లు ఇచ్చాను. ఆయన ఇక్కడ ఉంటున్నప్పుడు, మేం ఛత్తీస్‌గఢ్‌లో ఉండేవాళ్లం. మాకు ఆయనతో పెద్దగా కమ్యూనికేషన్ ఉండేది కాదు. మేం వచ్చినప్పుడు, ఆయన గది ఎప్పుడూ మూసే ఉండేది” అని గౌతమ్ అన్నారు.

ఆ తర్వాత డాక్టర్ సుదామా ప్రసాద్ వర్మ ఇంట్లో అద్దెకు దిగారు రామ్ భవన్. అక్కడ కూడా ఇంటి యజమానులు పగలు ఇంట్లో ఉండేవారు కాదు. ప్రసాద్ ఆసుపత్రికి, ఆయన భార్య గీతా వర్మ టీచర్ కావడంతో పాఠశాలకు వెళ్తుండేవారు.

“మేం ఇంట్లో ఎక్కువసేపు ఉండేవాళ్లం కాదు. ఆయన వస్తూ పోతూ ఉండేవారు. ఆయన భార్యతో మాకు సాధారణ సంబంధమే ఉండేది. చుట్టుపక్కల పిల్లలు ఆయన ఇంటికి వచ్చేవారు. ఆయనకు మాతో ఎప్పుడూ ఎలాంటి గొడవలూ లేవు” అని గీతా వర్మ బీబీసీతో చెప్పారు.

సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధారా సింగ్ మీనా బీబీసీతో మాట్లాడుతూ, “బాధితుల్లో ఎక్కువ మంది దళిత కుటుంబాలకు చెందిన పిల్లలే ఉన్నారు. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే రామ్ భవన్ అద్దెకు ఇళ్లు తీసుకునేవారు. తన బైక్ లేదా కారులో పిల్లలను ఇంటికి తీసుకువచ్చేవారు” అని వివరించారు.

రామ్ భవన్ గురించి తెలిసిన వారు ఏం చెబుతున్నారు?

రామ్ భవన్ సొంత గ్రామంలోని ఇంటి వద్ద నిశ్శబ్దం అలుముకుంది. కుటుంబ సభ్యులు ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరించగా, గ్రామస్తులు మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“రామ్ భవన్ ఇక్కడ ఉండరు, అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. ఆయన పిల్లలను వేధిస్తారని మాకు ఎప్పుడూ అనుమానం రాలేదు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని పక్కింటివారు బీబీసీతో చెప్పారు.

గ్రామంలో జనరల్ స్టోర్ నడిపే కమల్ మాట్లాడుతూ, “నాకు 55 ఏళ్లు పైనే ఉంటాయి. ఈ రోజు వరకు రామ్ భవన్ కానీ, ఆయన కుటుంబం కానీ ఇక్కడికి రాలేదు. మేం ఆయన్ను చూడలేదు. మరణశిక్ష పడిన వ్యక్తి మా ఊరి వాడేనని పేపర్లో చూసి షాక్ అయ్యాం” అని అన్నారు.

రామ్ భవన్ నేర చరిత్రను పరిశీలించగా, పోలీస్ స్టేషన్లో ఎలాంటి రికార్డులూ లభించలేదు.

“రామ్ భవన్ మా సోదరులందరిలో చిన్నవాడు. బాండాలో పాలిటెక్నిక్ చదివారు. పెళ్లికి ముందే ఉద్యోగం వచ్చింది, అంతకుముందు ట్యూషన్లు చెప్పేవారు. చుట్టుపక్కల వారితోనూ బాగుండేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు, ఎవరితోనూ గొడవ పడేవారు కాదు. ఆయనకు స్నేహితులు చాలా తక్కువ, ఎవరూ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు” అని రామ్ భవన్ అన్నయ్య రాజా భయ్యా బీబీసీ హిందీతో చెప్పారు.

రామ్ భవన్‌తో పదేళ్లు కలిసి పనిచేసిన దీపక్ మౌర్య మాట్లాడుతూ, “రామ్ భవన్ ప్రవర్తన మామూలుగా ఉండేది. తన పని తాను చూసుకునేవారు. ఎవరితోనూ కలిసేవారు కాదు, యాక్టివ్‌గా ఉండేవారు కాదు. అస్సలు ఫ్రెండ్లీగా ఉండేవారు కాదు. ఆయన నవ్వడం కానీ, కోప్పడటం కానీ చూడలేదు. ఆయన ఇలాంటి అసహ్యకరమైన పని చేస్తారని ఆయన ప్రవర్తన చూస్తే అనిపించలేదు. అది ఆయన జీవితంలోని మరో కోణం” అని చెప్పారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఆఫీసులోని మరొక ఉద్యోగి మాట్లాడుతూ, “ఆయన అసలు నవ్వేవాడు కాదు. ఎవరితోనూ జోకులు వేసేవారు కాదు, గొడవలు పడేవారు కాదు. వచ్చి పని చేసుకుని వెళ్లిపోయేవారు. చాలా సాదాసీదాగా ఉండే వ్యక్తి. ఎవరి ఫంక్షన్లకూ వెళ్లేవారు కాదు, ఎవరినీ ఇంటికి పిలిచేవారు కాదు” అని వివరించారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

భార్యకు మరణశిక్ష ఎందుకు విధించారు?

రామ్ భవన్ భార్య దుర్గావతి గృహిణి. అయితే, రామ్ భవన్ వీడియోలు తీస్తూ లైంగిక హింసకు పాల్పడే సమయంలో దుర్గావతి అక్కడే ఉండేవారని బాధితులు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా తెలిసింది.

సీబీఐ, కోర్టు ముందు కొందరు బాధితులు తమ స్టేట్‌మెంట్లలో దుర్గావతి కూడా తమతో సంబంధం పెట్టుకున్నారని వెల్లడించారు.

ఒక బాధిత వ్యక్తి తన వాంగ్మూలంలో “నేను రామ్ భవన్ ఇంటికి పాలు పోయడానికి వెళ్లాను. లాప్‌టాప్ నేర్చుకోవడానికి మా నాన్న నన్ను అక్కడికి పంపేవారు. రామ్ భవన్ పిల్లలతో తప్పుడు పనులు చేసేవారు. నా మిగతా నలుగురు అన్నదమ్ములతో కూడా ఇలాగే తప్పుడు పనులు చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసేవారు” చెప్పారు.

ఆ బాధిత వ్యక్తి తన స్టేట్‌మెంట్‌లో మరిన్ని వివరాలు చెబుతూ, “రామ్ భవన్ నాతో తప్పుడు పనులు చేసేటప్పుడు దుర్గావతి అక్కడే ఉండేవారు. రామ్ భవన్ చేసే తప్పుడు పనులన్నీ ఆమెకు తెలుసు. రామ్ భవన్ అంకుల్ తప్పుడు పనులు చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చేవారు, దుర్గావతి ఆంటీ తినడానికి ఏమైనా పెట్టేది. వారి దగ్గర వీడియో గేమ్ ప్లేయర్, మూడు నాలుగు వీడియో గేమ్స్ ఉండేవి. ఆడుకోవడానికి ఆమె మాకు వాటిని ఇచ్చేవారు. సిగ్గు, భయం వల్ల ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు” అని వివరించారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

బాధితులు సీబీఐకి ఏం చెప్పారు?

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కరవు ప్రాంతమైన బుందేల్‌ఖండ్ పరిధిలోని బాండా, చిత్రకూట్, హమీర్‌పూర్ జిల్లాల్లో జరిగినది. రామ్ భవన్ పిల్లలకు ఆశచూపి, వారిపై లైంగిక హింసకు పాల్పడేవారని బాధితుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒక బాధిత వ్యక్తి కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో “నాకు రామ్ భవన్ అంకుల్ తెలుసు. ఒక ఫంక్షన్ జరిగిన రాత్రి నాతో ఆయన మొదటిసారి లైంగిక సంబంధం పెట్టుకున్నారు. రామ్ భవన్ అంకుల్ చెప్పడంతో దుర్గావతి ఆంటీ నన్ను లైంగికంగా వేధించారు. ఆ సమయంలో అంకుల్, ఆంటీ, నేనే ఉన్నాం” అని చెప్పారు.

మరో బాధిత వ్యక్తి కోర్టుకు వివరిస్తూ, “మా నాన్న ఏ పనీ చేయరు. మా అమ్మ వ్యవసాయం చేస్తుంది. రామ్ భవన్ అంకుల్‌తో పరిచయమైనప్పుడు ఆయన ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. రామ్ భవన్ అంకుల్ మొదటిసారి తప్పుడు పని చేసినప్పుడు నాకు చాలా గాయాలయ్యాయి” అని చెప్పారు.

లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, భారత దేశంలో దాదాపు మూడో వంతు మహిళలు, పది మందిలో ఒకరికి పైగా పురుషులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే లైంగిక హింసకు గురవుతున్నారు.

‘పిల్లలు రోజూ వస్తుండేవారు’

మేం ఒక మైనర్ బాధితురాలి తల్లిని కలిశాం. ఆమె రామ్ భవన్ ఇంట్లో శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేసేవారు.

ఆమె బీబీసీ హిందీతో మాట్లాడుతూ, “నేను ఆయన (రామ్ భవన్) ఇంట్లో వంట చేసేదాన్ని, అందుకు నాకు నెలకు 2 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆయన మూడు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ముందు భాగంలో ఇంటి యజమాని, వెనుక వైపు దీదీ (దుర్గావతి), రామ్ భవన్, ఒక బాబు ఉండేవారు. రామ్ భవన్ చదువు చెప్పిస్తానని ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని తెచ్చుకున్నారు. ఆ ఇంట్లోకి రోజూ కొత్త పిల్లలు వస్తూ ఉండేవారు. ఆయన తన సైట్ నుంచి పిల్లలను తీసుకొచ్చేవారు. రోజుకు నలుగురు పిల్లలు ఇంట్లోనే ఉండేవారు. వారికి ఖరీదైన మొబైల్ ఫోన్లు ఇచ్చి తన దగ్గరే ఉంచుకునేవారు” అని వివరించారు.

అయితే, ఎంత ప్రయత్నించినప్పటికీ ఇతర బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడటానికి ముందుకు రాలేదు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

రామ్ భవన్ ఏమంటున్నారు?

రామ్ భవన్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ.. తన సోదరి, బావ రామ్ నిరంజన్ మధ్య ఉన్న వివాదాన్ని కారణంగా చూపారు.

వారి మధ్య గొడవలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించినప్పుడు బావ రామ్ నిరంజన్‌ తనపై కోపం పెంచుకున్నారని, ఆయనతో చేతులు కలిపి సీబీఐ తనను ఇరికించిందని ఆరోపించారు.

రామ్ భవన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో “నేను ఏ బిడ్డతోనూ తప్పుడు పని చేయలేదు, ఎలాంటి అసభ్యకర ఫోటోలు లేదా వీడియోలు తీయలేదు, వాటిని ఇంటర్నెట్‌లో ప్రసారం చేయలేదు. నా బంధువు రామ్ నిరంజన్ మరికొందరితో కలిసి నన్ను తప్పుడు కేసులో ఇరికించారు. పిల్లలను భయపెట్టి నాపై బలవంతంగా సాక్ష్యాలు చెప్పించారు” అని తెలిపారు.

దుర్గావతి కూడా కోర్టులో ఇవే వాదనలు వినిపించారు.

“మా వదిన రామ్‌కుమారికి, రామ్ నిరంజన్‌తో వివాహం జరిగింది. నా వదిన, ఆయన ఇద్దరూ ఉపాధ్యాయులే. వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వారి మధ్య గొడవ పరిష్కరించడానికి నేను, రామ్ భవన్ వారి ఇంటికి వెళ్లేవాళ్లం. కానీ, ఆ క్రమంలో మాపై పగ పెంచుకున్నారు. దాని కారణంగా, ‘నేను చదువు చెప్పిన ఇద్దరు పిల్లలు దిల్లీలోని సీబీఐలో పనిచేస్తున్నారు. వారితో కలిసి మీ ఇద్దరినీ జైలుకు పంపిస్తాను’ అని రామ్ నిరంజన్ బెదిరించారు” అని దుర్గావతి చెప్పారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

తీర్పులో ఏముంది?

భారత దేశంలో పిల్లలతో ఎలాంటి లైంగిక కార్యకలాపాలకు పాల్పడినా అది ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012’ (పోక్సో) ప్రకారం శిక్షార్హమైన నేరం.

ఇందులో కఠిన కారాగార శిక్ష నుంచి మరణశిక్ష వరకు నిబంధనలు ఉన్నాయి. ఈ కేసులో భార్యాభర్తలిద్దరినీ దోషులుగా జడ్జి ప్రదీప్ కుమార్ మిశ్రా నిర్ధరించారు.

న్యాయస్థానం తన తీర్పులో, “రామ్ భవన్, దుర్గావతి అద్దె ఇళ్లలో ఉంటూ దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి పొక్కకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని స్పష్టమవుతోంది. వీరి నేరం ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన’ కేటగిరీలోకి వస్తుంది. ఇలాంటి నేరాలకు మరణశిక్ష విధిస్తేనే భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది” అని పేర్కొంది.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

డిఫెన్స్ లాయర్ వాదనలేంటి?

నిందితుల తరపు న్యాయవాది భూరా ప్రసాద్ నిషాద్ ఈ కేసును సీబీఐ కుట్రగా ఆరోపించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు, ఫోటోలు ‘డీప్‌ఫేక్’ అని, పిల్లల స్టేట్‌మెంట్లను బెదిరించి తీసుకున్నారని వాదించారు.

లాయర్ భూరా ప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ, “సీబీఐ నేరుగా దిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కానీ, అలా చేసే అధికారం వారికి లేదు. ముందుగా కేంద్రానికి దరఖాస్తు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. 2020 అక్టోబర్ 31న కేసు నమోదు చేసి, నవంబర్ 2న అరెస్ట్ చేసేశారు. సీబీఐ ఇంత త్వరగా ఎందుకు చర్యలు తీసుకుంది?” అని ప్రశ్నించారు.

హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“మాకు అందిన వీడియోలను మేం ఫోరెన్సిక్ పరీక్ష చేశాం. అవన్నీ నిజమైనవిగా తేలాయి. వాటిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. నిందితుడి బంధువైన రామ్ నిరంజన్ వద్ద విద్యనభ్యసిస్తున్న పిల్లలు సీబీఐలో ఉన్నారనే విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. నిందితులే ఈ కథను అల్లారు” అని సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధారా సింగ్ మీనా బీబీసీతో చెప్పారు.

నేరాలు, మైనర్లు, లైంగిక హింస, మరణ శిక్ష

ఫొటో సోర్స్, Gaurav Gulmohar

పోలీసులు ఏం చెప్పారు?

ఇంతకాలం పిల్లలపై లైంగిక హింస ఎలా కొనసాగిందని చిత్రకూట్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్‌ను బీబీసీ ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ “ఇది 2020 కంటే ముందు జరిగిన ఘటన. నిందితుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవారు. ఆయన వీడియోలను డార్క్ వెబ్‌లో పెట్టేవారని మాకు సమాచారం ఉంది. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలను బట్టి దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణించి మరణశిక్ష విధించారు” అని చెప్పారు.

“ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. సాక్ష్యాధారాలు సేకరిస్తుండగా, మరికొంతమంది మైనర్ బాధితులు బయటపడ్డారు. పోలీసు చర్యల విషయానికొస్తే, ఫిర్యాదు చేసి ఉంటే మేం దర్యాప్తు చేసి ఉండేవాళ్లం. ఫిర్యాదు లేకుండా మేం ఎలాంటి చర్య తీసుకోలేం” అని బాండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పలాష్ బన్సల్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)