SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, TruthSocial/Donald J.Trump
10 నిమిషాలు క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
‘వాషింగ్టన్ హిల్టన్’ వేదికగా జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల అలజడి అనంతరం వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్ నుంచి విలేఖరులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.
అనేక ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి, సెక్యూరిటీ చెక్ పాయింట్ వైపు దూసుకురావడంతో సీక్రెట్ సర్వీస్ అతన్ని పట్టుకుందని ట్రంప్ వెల్లడించారు.
ఈ మేరకు కస్టడీలో ఉన్న అనుమానితుడి ఫోటోను, కాల్పులు మొదలైనప్పడు రికార్డయిన ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ట్రంప్ తెలిపారు.
పారదర్శకత కోసమే దీన్ని షేర్ చేసినట్లు చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు..
ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారిపై చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిగాయని ట్రంప్ తెలిపారు.
‘బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నేను ఇప్పుడే ఆ అధికారితో మాట్లాడాను. ఆయన బాగున్నారు. చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన చాలా గర్వించదగిన వ్యక్తి’ అని అన్నారు.
‘బాల్ రూమ్’ అవసరం అర్థమయ్యేలా…
నిర్మాణంలో ఉన్న వైట్ హౌస్ బాల్ రూమ్ గురించి ట్రంప్ ప్రస్తావించారు.
ఒక బాల్ రూమ్ కోసం ‘150 ఏళ్లుగా’ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదురుచూస్తోందని అన్నారు.
‘వైట్ హౌస్‌లో మేం ప్లాన్ చేస్తున్న అన్ని వసతులు ఎందుకు అవసరమో నేటి కాల్పుల ఘటన అర్థమయ్యేలా చేసింది. గతంలో ఎన్నడూ లేనంత భద్రత ఇప్పుడు అవసరం. గత రెండేళ్లలో ఒక రిపబ్లికన్ నాయకుడిపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు’ అని వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘నిందితుడిది వికృత మనస్తత్వం’
కస్టడీలో ఉన్న అనుమానితుడు చాలా వికృత మనస్తత్వం కలవాడని ట్రంప్ అభివర్ణించాడు.
ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని అన్నారు.
అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నాం: ఎఫ్‌బీఐ
విందు జరుగుతున్న వేదిక వద్ద కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో వెంటనే స్పందించిన నేషనల్ క్యాపిటల్ రెస్పాన్స్ స్క్వాడ్ నిందితుడిని అదుపులోకి తీసుకుందని ఎఫ్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



