Home జాతీయ national telgu 40 లక్షల ఇన్సూరెన్స్ కోసం చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం… శ్మశానంలోని శవం తెచ్చి అల్లిన కట్టు...

40 లక్షల ఇన్సూరెన్స్ కోసం చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం… శ్మశానంలోని శవం తెచ్చి అల్లిన కట్టు కథ భార్య ఏడుపుతో బయటపడిందిలా

1
0

SOURCE :- BBC NEWS

కాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

దశాబ్దాలుగా ధాన్యం వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి అప్పుల పాలయ్యారు. అప్పుల నుంచి గట్టెక్కేందుకు ఓ ప్రణాళిక రచించారు. తాను చనిపోయినట్లుగా చిత్రీకరించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే, ఆ అప్పుల భారం నుంచి తప్పించుకోవచ్చని భావించారు.

అందుకోసం ఖననం చేసిన ఓ మృతదేహాన్ని ఉపయోగించుకున్నారు. చివరకు ఈ వ్యవహారం బయటపడటంతో అరెస్టయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత వీరంపాలెం వాసి కేతమల్లు వెంకటేశ్వర రావు నడిపిన ఈ వ్యవహారం చర్చనీయమైంది.

అసలేం జరిగింది? ఆ కేసు ఛేదించారనేది రంగంపేట పోలీసులు మీడియాకు వివరించారు.

రంగంపేట పోలీసులు

ఫొటో సోర్స్, RAMESH

ట్రాన్స్‌ఫార్మర్ పక్కన సగం కాలిన శవం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26న తెల్లవారుజాము సమయంలో వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమల్లు గంగారావు అనే రైతు పొలం దగ్గర ఓ శవం కనిపించింది.

ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే సగం కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ శవం సమీపంలో ఉన్న చెప్పులు, ఇతర వస్తువులు ఆధారంగా చనిపోయింది కేతమల్లు వెంకటేశ్వర రావు అలియాస్ పూసయ్య అని, ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంతా భావించారు.

దానిపై స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు సీఆర్పీసీ174 కింద క్రైమ్ నెం 36/2024గా కేసు కూడా నమోదు చేశారు.

మరోవైపు పూసయ్య మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన భార్య, బిడ్డలు విలపించారు. ఆ సమయంలోనే, భార్యకు పూసయ్య నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆశ్చర్యపోయారు.

‘తాను చనిపోలేదని, అక్కడ ఎవరినో చంపుతుంటే తాను అడ్డుకున్నానని, వారు తనపై దాడి చేసి, రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి సమీపంలో పడేసి వెళ్లిపోయారని’ పూసయ్య ఆ ఫోన్ కాల్‌లో చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.

మృతదేహం దొరికిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, RAMESH

కిడ్నాప్ కథ

తమ గ్రామంలో ధాన్యం వ్యాపారంలో అందరికీ సుపరిచితుడైన వ్యక్తి చనిపోయాడని ఊరంతా తొలుత భావించగా, చివరకు పూసయ్యే కాల్ చేసి బతికే ఉన్నానని చెప్పడంతో, కుటుంబ సభ్యులతో పాటుగా ఊరంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

ఎవరినో హత్య చేసి, కాల్చుతుండగా తాను అడ్డుకున్నానని, వారు తనపై దాడికి దిగి, కిడ్నాప్‌కు ప్రయత్నం చేశారని పూసయ్య చెప్పారు కానీ, ఆయన ఒంటి మీద దెబ్బలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

అదే సమయంలో అక్కడ గుర్తుపెట్టలేని స్థితిలో సగం కాలిపోయి ఉన్న మృతదేహం ఎవరిదనే అంశం కూడా కీలకంగా మారింది.

పోలీసులు పూసయ్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.

ఈ కేసు వివరాలను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

రెండు నెలల క్రితం ఇన్సూరెన్స్ చేయించుకున్న పూసయ్య దానికోసమే ఈ తంతు నడిపినట్టు తెలిపారు.

సాధారణ మరణమయితే రూ.20 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.40 లక్షలు వచ్చేందుకు అనుగుణంగా ఆయన ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారని వివరించారు.

కొన్నాళ్లపాటు అజ్ఞాతంలో ఉంటే తన అప్పులు తీరేందుకు ఆ బీమా సొమ్ము ఉపయోగపడుతుందని పూసయ్య ఆలోచన చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న DSP కిషోర్ కుమార్

ఫొటో సోర్స్, RAMESH

ఆ శవం ఎవరిది?

తను చనిపోయినట్టు చిత్రీకరించడం కోసం పూసయ్య ఓ మృతదేహాన్ని ఉపయోగించినట్టు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మృతదేహం పూసయ్యదే అని నమ్మించేందుకు, ఎవరూ గుర్తుపట్టలేని రీతిలో ఆ మృతదేహాన్ని కాల్చేసి, పొలంలో పడేసేందుకు జనవరి 23న బొమ్మూరుకు చెందిన వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు పూసయ్య.

ఇటీవల పాత బొమ్మూరుకి చెందిన ఓఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు (53) మరణించడంతో ఆయన కుటుంబీకులు పాత బొమ్మూరులోని శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న వందే శ్రీను, చీర చిన్ని అనే యువకులు పూడ్చిపెట్టిన ఆ శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు.

పూసయ్యతో చేసుకున్న ప్రకారం ఆ మృతదేహాన్ని 26వ తేదీ తెల్లవారుజామున వీరంపాలెం తీసుకెళ్లి, అక్కడి పొలాల మధ్య పెట్రోలు పోసి తగలబెట్టారు.

పూసయ్య పాదరక్షలు, సెల్‌ఫోన్ సైతం అక్కడే వదిలేసి పరాయ్యారు.

అక్కడ లభించిన ఆధారాలను బట్టి, తొలుత ఆ శవం పూసయ్యదేనని గ్రామస్తులు భావించి స్థానిక అధికారులకు తెలిపారు.

మరోవైపు, వీరంపాలెంలోని పూసయ్య ఇంటి దగ్గర జరుగుతున్న పరిణామాలను ఆయనకు సహకరించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు పూసయ్యకు చేరవేశారు.

తన భార్య కన్నీరు మున్నీరవుతోందన్న విషయాన్ని వారి ద్వారా తెలుసుకున్న పూసయ్య, ఆమెను ఓదార్చడం కోసం, పిడింగొయ్య గ్రామనికి చెందిన తలారి సుబ్బారావు అనే వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు కాల్ చేశాడు.

తాను బతికే ఉన్నాని, గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నట్లు భార్యకు చెప్పారు పూసయ్య. ఆ వ్యక్తులు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి పిడింగొయ్య దగ్గరలో తుప్పల్లో పడేసినట్టు కాల్‌లో చెప్పారు.

వీరపాలెం

ఫొటో సోర్స్, RAMESH

చివరకు ఇలా..

బీమా డబ్బుల కోసం తాను చనిపోయినట్లు చిత్రీకరించడమే కాకుండా, ఖననం చేసిన శవాన్ని దొంగిలించి, పథకాన్ని అమలు చేయాలనుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అపహరించారని పూసయ్య చెప్పిన వివరాలు, ఆయనకు గాయాలు కాకపోవడాన్ని గమనించిన పోలీసులు అనుమానంతో పూసయ్యను విచారించారు.

అప్పుడే అసలు విషయం బయటకొచ్చింది. ఆయనతోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను జనవరి 30న అరెస్ట్ చేసి, రెండు సెల్‌ఫోన్లు, వారు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

నాలుగురోజుల పాటు స్థానికంగా చర్చకు దారి తీసిన ఈ ఘటనలో, నిందితులను అనపర్తి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్టు బీబీసీకి తెలిపారు సీఐ శివగణేష్.

ఇవి కూడా చదవండి: