Home జాతీయ national telgu బొమ్మ విమానాల నుంచి యుద్ధతంత్రాల వరకు: ఇరాన్ డ్రోన్ శక్తిగా ఎలా ఎదిగింది?

బొమ్మ విమానాల నుంచి యుద్ధతంత్రాల వరకు: ఇరాన్ డ్రోన్ శక్తిగా ఎలా ఎదిగింది?

17
0

SOURCE :- BBC NEWS

డ్రోన్ల తయారీ, ఇరాన్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ, సైనిక నిపుణుడు అక్రమ్ ఖరీఫ్ రాసిన ‘ఇన్ ద షాడో ఆఫ్ ద షాహెద్’ అనే పుస్తకం విడుదలైంది.

ఇరాన్‌లో డ్రోన్ ఇండస్ట్రీ ఆవిర్భావం, దాని అభివృద్ధిని ఆయన ఈ పుస్తకంలో విశ్లేషించారు. అమెరికా ఆంక్షలను తట్టుకుంటూనే గ్లోబల్ మిలిటరీ ఇండస్ట్రీలో ఇరాన్ ఎలా కీలక శక్తిగా ఎదిగిందనే వ్యూహాలను ఇందులో చర్చించారు.

ఇరాన్ డ్రోన్ల ప్రస్తావన మొదటిసారిగా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హిజ్బొల్లా కార్యకలాపాలకు సంబంధించిన సైనిక రిపోర్టుల్లో వచ్చింది. ఆ తర్వాత యెమెన్‌లో హూతీలు వాడిన డ్రోన్ల శిథిలాలను పరిశీలించగా, వాటి తయారీకి ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది.

అయితే, సెప్టెంబర్ 2022లో ఇరాన్ రష్యాకు డ్రోన్ పరిజ్ఞానాన్ని అందిస్తోందనే వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత, యుక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలో ఎగురుతున్న గెరానియం-2 (షాహెద్-136) డ్రోన్ల ఫోటోలు బయటకు వచ్చాయి.

దాదాపు 40 ఏళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఒక దేశం, యుద్ధ తంత్రాలనే మార్చేసే స్థాయికి ఎలా చేరుకుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

1979 తర్వాత ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ఆ దేశ నాయకులను ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపించాయి.

తమకు అవసరమైన వస్తువులను పొందడానికి విదేశాలలో సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కోసారి పౌర అవసరాల కోసం వాడే పరిజ్ఞానాన్ని సైనిక అవసరాలకు మళ్లించారు.

అన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే.. తమ వద్ద వనరులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఇరానియన్లు సరికొత్త వ్యూహాలను రచించి వాటిని ఓపికతో అమలు చేశారు.

శక్తివంతమైన ఇరాన్ సైన్యం..

జనవరి 1979లో షా మొహమ్మద్ రెజా పహ్లావి దేశం విడిచి వెళ్లే సమయానికి, ఇరాన్ సైన్యం ఆ ప్రాంతంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా ఉండేది. అప్పట్లో ఇరాన్ వాయుసేన వద్ద ఎఫ్-14 టామ్‌క్యాట్, ఎఫ్-4 ఫాంటమ్, ఎఫ్-5 టైగర్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఉండేవి.

సైనిక సామగ్రి విషయంలో అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్ తర్వాత ఇరాన్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.

ఇరాన్ వాయుసేన జర్మనీ, చైనా, ఇజ్రాయెల్ కంటే ఎంతో ముందుండేది. అయితే, ఈ యుద్ధ విమానాల నిర్వహణ మొత్తం ఇరాన్‌లో ఉన్న అమెరికా సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లపైనే ఆధారపడి ఉండేది. వీటికి అవసరమైన విడిభాగాలను నేరుగా అమెరికా సంస్థ ‘గ్రమ్మన్’ సరఫరా చేసేది.

షా పాలన పతనమైన తర్వాత, సైనిక నాయకులు దేశం విడిచి పారిపోయారు లేదా జైలుపాలయ్యారు. అమెరికన్ ఇంజినీర్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అమెరికా కంపెనీలు కొత్త ప్రభుత్వంతో సంబంధాలను తెంచుకున్నాయి. దీనివల్ల ఇరాన్ వేల కోట్ల డాలర్లు పెట్టి కొన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ నిరుపయోగంగా మారిపోయాయి.

డ్రోన్ల తయారీ, ఇరాన్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Dans l’ombre du Shahed

అవసరమే ఆవిష్కరణకు మూలం

సెప్టెంబర్ 1980లో ఇరాక్ దళాలు ఇరాన్ మీద దాడి చేశాయి. రెండు దేశాల మధ్య ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ భీకర యుద్ధం ఎంతో విధ్వంసానికి, సుమారు 10 లక్షల మంది మరణానికి కారణమైంది.

యుద్ధం మొదట్లో ఇరాక్ తన వాయుసేన శక్తితో పైచేయి సాధించింది. సోవియట్ యూనియన్ నుంచి నిఘా విమానాలను కొనుగోలు చేసిన ఇరాక్, శత్రువుల కదలికలను గమనిస్తూ యుద్ధంలో ఆధిపత్యం సాధించింది.

మరోవైపు ఇరాన్ వద్ద అమెరికా వదిలివెళ్లిన అత్యాధునిక విమానాలు ఉన్నా, వాటిని నడపడానికి అవసరమైన సాంకేతికత లేక అవి నేలకే పరిమితమయ్యాయి. ఆర్థిక ఆంక్షల వల్ల బయటి దేశాల నుంచి ఆయుధాలు కొనే అవకాశం లేకపోవడంతో, తమ మనుగడ కోసం ఆ సాంకేతికతను సొంతంగానే అభివృద్ధి చేసుకోవాలని ఇరాన్ నిర్ణయించుకుంది.

శత్రు సరిహద్దుల్లో భారీ నిఘా విమానాలను ఎగరవేయలేనప్పుడు, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే చౌకైన, చిన్న పరికరాలను పంపవచ్చనే ఆలోచన ఇరానీయులకు వచ్చింది. వాటిలో కెమెరాలను అమర్చాలని వారు భావించారు.

1981లో ఇస్ఫహాన్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇంజినీర్లు ఈ పరికరాలపై పరిశోధనలు మొదలుపెట్టారు. ప్లాస్టిక్ ముక్కలు, సాధారణ బోర్డులతో వారు నమూనాలను తయారు చేశారు. వీటిని రివల్యూషనరీ గార్డ్స్ ముందు ప్రదర్శించారు.

అది చాలా సాదాసీదాగా ఉన్న ప్రాథమిక పరికరం. కేవలం ప్లాస్టిక్ ముక్కలు, బోర్డులు, గట్టి పట్టుదల కలిగిన మేధస్సుల కలయిక అది.

యూనివర్సిటీలోని ఒక సాధారణ వర్క్‌షాప్‌లో పని చేసే ఆ విద్యార్థులు “కన్‌స్ట్రక్షన్ జిహాద్”, “యూనివర్సిటీ జిహాద్” వంటి పదాలను బలంగా నమ్మేవారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశ ప్రభుత్వం ఈ పదాలను స్వీకరించింది.

ఏళ్ల తరబడి ప్రయత్నాలు, వైఫల్యాలు, నిరంతర శ్రమ మధ్య ముగ్గురు యువకులు ఇస్ఫహాన్ యూనివర్సిటీ వర్క్‌షాప్‌లో డిజైన్లు రూపొందిస్తూ, ఖుజెస్తాన్ మైదానాల్లో వాటిని పరీక్షించేవారు.

వారిలో ఒకరు ఫర్షీద్ అనే సివిల్ పైలట్, రెండో వ్యక్తి ఫిజిక్స్ విద్యార్థి సయీద్, మూడో వ్యక్తి మసూద్ జాహెదీ అనే స్వర్ణకారుడు.

వారు మొదటిసారి ఈ నమూనాను (ప్రోటోటైప్) సైనిక అధికారులకు చూపించినప్పుడు, కొందరు దాన్ని ఎగతాళి చేశారు. రకరకాల వస్తువులతో పేర్చిన ఆ పరికరం ఒక చిన్నపిల్లాడి బొమ్మలా ఉంది. దాని ఇంధన ట్యాంకుగా ఆసుపత్రుల్లో వాడే ఐవీ బ్యాగును ఉపయోగించారు.

డ్రోన్ల తయారీ, ఇరాన్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Dans l’ombre du Shahed

తొలి పోరాట డ్రోన్

1983లో యుద్ధ భూమికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ‘బొమ్మ’ విమానం మొదటిసారిగా ఇరాక్ దళాల స్థావరాల పైకి ఎగిరింది. అది సైనిక స్థావరాల స్పష్టమైన చిత్రాలతో తిరిగి వచ్చింది.

దీని తర్వాత థండర్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని, డ్రోన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమం ఇస్ఫహాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల వర్క్‌షాప్‌ల నుంచి మొదలై, రివల్యూషనరీ గార్డ్ సైనిక కమాండర్ల వరకు విస్తరించింది.

అవసరమైన భాగాలను పొందడానికి, వారు దేశంపై ఉన్న ఆంక్షలను తప్పించుకుని, అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రివల్యూషనరీ గార్డ్స్ దుబయ్‌లో కంపెనీల నెట్‌వర్క్‌ను స్థాపించి, సింగపూర్‌లోని మధ్యవర్తుల ద్వారా డజన్ల కొద్దీ దేశాల నుంచి విడి భాగాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాటిని ఇస్ఫహాన్‌కు రవాణా చేసి, అక్కడ అమర్చారు.

అందుకే నేడు యుక్రెయిన్‌లో కూలిపోయిన షాహెద్-136 డ్రోన్లలో అమెరికా చిప్‌లు కనిపిస్తున్నాయి.

ఇరాన్ రాద్ బెటాలియన్‌కు చెందిన ఇంజినీర్లు, సైనిక అధికారులు 1987లోనే వార్ డ్రోన్ల అభివృద్ధి గురించి ఆలోచించడం ప్రారంభించారు.

శత్రువు కదలికలను చిత్రీకరిస్తూనే, అవసరమైతే దాడి చేసి ధ్వంసం చేసే సామర్థ్యాన్ని వీటికి కల్పించారు. ఈ క్రమంలోనే ‘ముహాజిర్’ అనే డ్రోన్లను అభివృద్ధి చేశారు.

డ్రోన్ల తయారీ, ఇరాన్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

1988 నాటికి ఆయుధాలు కలిగిన డ్రోన్లను వాడిన తొలి దేశాలలో ఇరాన్ ఒకటిగా నిలిచింది. అప్పట్లో కేవలం 50 కిలోమీటర్ల పరిధి కలిగిన ఇరాన్ డ్రోన్లు, నేడు (2026 నాటికి) ఇరాన్ భూభాగం నుంచి ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించి ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను ఛేదించే స్థాయికి చేరుకున్నాయి.

నిజానికి, 1973 యుద్ధంలో ఇజ్రాయెల్ వాడిన డ్రోన్ యుద్ధతంత్రాన్నే ఇరాన్ కూడా స్వీకరించింది. ఆ నాడు ఇజ్రాయెల్ తన డ్రోన్ల ద్వారా క్షిపణి స్థావరాలను ఎలా లక్ష్యం చేసుకుందో, అదే సూత్రాన్ని ఇరాన్ తన డ్రోన్ల ప్రోగ్రాంలో అమలు చేసి ఈ రంగంలో కీలక శక్తిగా ఎదిగింది.

1982లో లెబనాన్‌పై దాడి సమయంలో ఇజ్రాయెల్ తన స్కౌట్ , మాస్టిఫ్ డ్రోన్లను సిరియా క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించింది. సాయుధ పోరాటంలో పోరాట డ్రోన్లను వాడటం ఇదే మొదటిసారి.

డ్రోన్ల తయారీ, ఇరాన్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Dans l’ombre du Shahed

మారుతున్న దృక్పథం

ఇరాన్ నిపుణులు లెబనాన్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించారు. హిజ్బొల్లాలోని వారి సహచరులు ఇజ్రాయెల్ డ్రోన్ల గురించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించడంలో వారికి సహాయపడ్డారు.

ఈ డ్రోన్లు అంత క్లిష్టమైనవేమీ కావని, తమ నిపుణులు కూడా ఇటువంటి పరికరాలను తయారు చేయగలరని వారు గుర్తించారు.

అనేకమంది సైనిక విశ్లేషకులు తమ రిపోర్టులలో పేర్కొన్న ప్రకారం.. తొలితరం ఇరాన్ డ్రోన్ నమూనాల్లో ఇజ్రాయెల్ ‘స్కౌట్’, ‘మాస్టిఫ్’ డ్రోన్ల పోలికలు చాలా ఉన్నాయి. ఇరాన్ ఇంజినీర్లు ఈ నమూనాల నుంచి ప్రేరణ పొందారని వారు భావిస్తున్నారు.

1970వ దశకం నుంచి, అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన ఆయుధమే అత్యంత ప్రభావవంతమైనదని నమ్మేవారు. లక్ష్యం తప్పే వందలాది ఫిరంగి గుండ్ల కంటే వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే ఒకే ఒక్క ‘గైడెడ్ మిస్సైల్’ మెరుగైనదని అప్పట్లో భావించేవారు.

కానీ, ఇరానీయులు ఈ సైనిక సమీకరణంలో ఒక కొత్త ఆలోచనను జోడించారు. తమ దేశం సాంకేతిక అభివృద్ధిలో ప్రత్యర్థులతో పోటీ పడలేనప్పుడు, సంఖ్యాపరంగా, ఆర్థిక వ్యయం పరంగా వారితో తలపడాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇరాన్ డ్రోన్ ప్రోగ్రామ్‌కు పునాదిగా నిలిచింది.

ఇరాన్, డ్రెన్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఒక ఇరాన్ డ్రోన్ తయారీకి 20,000 డాలర్లు ఖర్చవుతుంది. ఇది 2 మిలియన్ డాలర్ల క్రూయిజ్ మిస్సైల్‌తో నేరుగా పోటీ పడలేకపోవచ్చు. కానీ, ఒకేసారి 100 డ్రోన్లను పంపితే, శత్రువు వాటిని అడ్డుకోవడానికి 100 క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించాల్సి ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువే కావాలి.

డ్రోన్ల ప్రధాన ఉద్దేశం కచ్చితమైన, శక్తిమంతమైన దాడి చేయడం మాత్రమే కాదు, శత్రువు రక్షణ వ్యవస్థను అలసటకు గురిచేయడం, వారి బడ్జెట్‌పై ఒత్తిడి పెంచడం. ఇరాన్ దాడులు సుదీర్ఘకాలం కొనసాగగలవు, ఎందుకంటే ఇవి శత్రువు క్షిపణి రక్షణ వ్యవస్థ కంటే 10 నుంచి 20 రెట్లు చౌకైనవి.

ఒక సాధారణ లెక్క ప్రకారం.. 100 డ్రోన్లను ప్రయోగించడానికి దాడి చేసే దేశానికి 2 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయి. అదే సమయంలో తనను తాను రక్షించుకునే దేశం వాటిని అడ్డుకోవడానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి రావచ్చు. నష్టం ఎంత జరిగినా, రక్షించుకునే దేశానికే ఆర్థికంగా భారం పెరుగుతుంది.

డ్రోన్లకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి తక్కువ ఎత్తులో, నెమ్మదిగా ఎగురుతాయి. కాబట్టి, వీటిని రాడార్ల ద్వారా గుర్తించడం కష్టం. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో వీటిని ఒకేసారి పంపడం వల్ల రక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, కొన్నిసార్లు అన్నింటినీ అడ్డుకోవడం సాధ్యపడదు.

2019లో సౌదీ అరామ్కో చమురు ప్లాంట్‌పై జరిగిన దాడి ఈ వ్యూహం ఎంత సమర్థవంతమైనదో నిరూపించింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడంలో విఫలమైంది. ఈ దాడికి హూతీలు బాధ్యత వహించినప్పటికీ, డ్రోన్లు ఇరాన్ లేదా ఇరాక్ నుంచి ప్రయోగించారని భావిస్తారు.

అరామ్కో ప్లాంట్‌పై దాడి వల్ల బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లింది, కానీ ఆ దాడికి వాడిన డ్రోన్ల ఖరీదు కేవలం కొన్ని మిలియన్ డాలర్లు మాత్రమే. డ్రోన్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారో ఈ ఆర్థిక వ్యత్యాసమే నిర్ణయిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)