SOURCE :- BBC NEWS

3 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో సహోద్యోగులు తమను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎనిమిది మంది మహిళలు ఆరోపించారు.
నిందితులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితుల్లో టీసీఎస్‌లో పనిచేసే హెచ్‌ఆర్ ఉద్యోగులు, డెలివరీ పార్ట్‌నర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నారు.
బలవంతం చేయడం, లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో మోసం చేయడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి అనేక ఆరోపణలను బాధితులు చేశారు.
ఈ కేసులో ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు, మరో నిందితురాలు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసింది. తనిఖీల్లో సహకరిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ కేసులో నమోదైన మొదటి ఎఫ్ఐఆర్‌లో బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. డెలివరీ పార్ట్‌నర్‌గా ఉన్న నిందితురాలిపై వచ్చిన ఆరోపణలను ఆమె తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. నిందితుల తరపు న్యాయవాదుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. వారు స్పందించగానే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.


ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, 2023 నుంచి నాసిక్‌లోని టీసీఎస్ కంపెనీలో అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.
ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం: బాధితురాలికి 2022లో నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె స్నేహితుడే. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, తరచుగా కలుస్తుండేవారు. తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుడు హామీ ఇచ్చారు.
2022 జులైలో శారీరక సంబంధం కోరుతూ ఆ మహిళపై నిందితుడు ఒత్తిడి తెచ్చారు. అభ్యంతరం తెలపడంతో పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. ఆలోచించి తన నిర్ణయం చెబుతానని ఆమె బదులిచ్చారు.
అయితే, కాలేజీ అయిపోయిన తర్వాత తరచూ ఆమెను కలవడానికి పిలిచేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తను పనిచేసే టీసీఎస్ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిందితుడు సూచించారు. ఆపై ఆమె కంపెనీలో అసోసియేట్ పోస్టుకు ఎంపికయ్యారు.
ఒకే కంపెనీ కావడంతో అక్కడ కూడా వారు తరచుగా కలుస్తూ ఉండేవారు.
ఈ కంపెనీలోనే నిందితుడికి పరిచయమున్న ఒక పురుష, ఒక మహిళా ఉద్యోగితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది.
వీరు నలుగురు తరచూ కలిసి ఉండేవారు. క్యాంటీన్‌కు లేదా బయట తిరగడానికి కలిసి వెళ్లేవారు. ఈ సమయంలో నిందితుడు, మిగిలిన ఇద్దరు కలిసి బాధితురాలితో ‘నీ మతం చెడ్డది, మా మతం మంచిది’ అని చెబుతుండేవారు. ఆమె మతం గురించి చెడుగా మాట్లాడేవారు.
2024 ఆగస్టులో నిందితుడు ఈ బాధితురాలిని ఒక రిసార్ట్‌కు తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నారు.
ఆ తర్వాత వారిద్దరి సంబంధం గురించి కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరిస్తూ ఆయన కంపెనీ స్నేహితుడు కూడా బాధితురాలిని నుంచి శారీరక సంబంధం కోరారు.
ఇద్దరు పురుష స్నేహితులు కలిసి, బాధితురాలి మతం చెడ్డదని, వారి మతాన్ని స్వీకరించాలని చెబుతుండేవారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడానికి ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే ఆమెతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తుండేవారు.
తర్వాత 2026 ఫిబ్రవరిలో ఒక మహిళ నుంచి బాధితురాలికి ఫోన్ వచ్చింది. ఆ మహిళ నిందితుడి భార్య అని, వారికి ఇద్దరు పిల్లలున్నారని తెలిసింది.
దీంతో, “మొదటి భార్య ఉండగా నన్ను ఎందుకు మోసం చేశావు?” అని నిందితుడిని బాధితురాలు ప్రశ్నించారు. దానికి నిందితుడు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. “నీతో పెళ్లికి నాకెప్పుడూ ఆసక్తి లేదు” అన్నారాయన.
ఇలా నిందితుడు, ఆయన స్నేహితుడు, మరో మహిళా ఉద్యోగి కలిసి బాధితురాలి మతపరమైన మనోభావాలను కూడా దెబ్బతీశారు.
నిందితుడు మొదటి పెళ్లిని దాచిపెట్టి, అబద్ధం చెప్పి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి బాధితురాలితో శారీరక సంబంధం పెట్టుకున్నారు. పదేపదే లైంగిక వేధింపులకు గురిచేశారు.

తొమ్మిది ఎఫ్ఐఆర్‌లలో అనేక ఆరోపణలు
ఈ కేసులో నమోదైన 9 ఎఫ్ఐఆర్‌లలో రకరకాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి:
- ఎఫ్ఐఆర్ 1: మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, బెదిరింపులు, శారీరక సంబంధం, ఆఫీస్ లాబీలో వేధింపులు.
- ఎఫ్ఐఆర్ 2: ఇద్దరు నిందితులపై వేధింపుల ఆరోపణ, ఫిర్యాదును తొక్కి పెట్టినట్లు హెచ్ఆర్‌పై ఆరోపణ.
- ఎఫ్ఐఆర్ 3: వ్యక్తిగత, వైవాహిక జీవితంపై అవమానకరమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా సంతానం లేకపోవడంపై విమర్శలు.
- ఎఫ్ఐఆర్ 4: వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర ప్రశ్నలు. శరీరం, ప్రైవేట్ భాగాల వైపు సైగలు చేయడం.
- ఎఫ్ఐఆర్ 5: ఒక నిర్దిష్ట మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రత్యేక మతపరమైన ఆచారాలను పాటించాలని బలవంతం చేయడం, మాంసాహారం తినిపించడం, మత మార్పిడి కోసం ఒత్తిడి తేవడం.
- ఎఫ్ఐఆర్ 6: మహిళా శరీరంపై అసభ్యకర వ్యాఖ్యలు, కావాలని తాకడం, వేధించడం.
- ఎఫ్ఐఆర్ 7: వెంబడించడం, అసభ్యకర వ్యాఖ్యలు, పని ప్రదేశంలో అనుచిత రీతిలో తాకడం.
- ఎఫ్ఐఆర్ 8: వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడం, ప్రేమ, శారీరక సంబంధం కోసం ఒత్తిడి.
- ఎఫ్ఐఆర్ 9: పని ప్రదేశంలో బూతులు తిట్టడం, దురుసుగా ప్రవర్తించడం, శరీరంపై అభ్యంతరకర వ్యాఖ్యలు.
డెలివరీ పార్ట్‌నర్, 78 ఈమెయిల్స్
ఈ కేసులో కంపెనీ డెలివరీ పార్ట్‌నర్ (ప్రొడక్ట్ గ్రోత్)గా ఉన్న మహిళ కూడా నిందితురాలే. నాసిక్ కోర్టు ఈమె పోలీస్ కస్టడీని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేస్తుండగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కంపెనీ సర్వర్ నుంచి ఈమెకు 78 ఈమెయిల్స్ వచ్చాయి. వాటిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పూర్తి వ్యవహారంతో ఆ ఈమెయిల్స్‌కు సంబంధం ఉందా? అని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
డెలివరీ పార్ట్‌నర్‌గా ఉన్న ఈ మహిళ నిందితులతో సంబంధాలు కొనసాగించారనే ఆరోపణ ఉంది. బాధితురాలి ఫిర్యాదును పరిష్కరించడానికి బదులుగా, ఆమె గొంతు నొక్కేందుకు డెలివరీ పార్ట్‌నర్ ప్రయత్నించారని ప్రభుత్వ న్యాయవాదులు ఆరోపించారు.

కాగా, డెలివరీ పార్ట్‌నర్‌గా ఉన్న ఈ మహిళ తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలను తిరస్కరించారు.
“మా కక్షిదారు హెచ్ఆర్ కాదు, ఆమె పరారీలో కూడా లేరు” అని న్యాయవాదులు చెప్పారు.
ఆమె హెచ్ఆర్ కాదు కానీ, 2026లో కంపెనీలో POSH (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్) కమిటీలో చేరారు. పని చేసేచోట మహిళలపై వేధింపులు జరగకుండా చూడటం ఈ కమిటీ పని.
“ఆమె 31వ తేదీన నాసిక్ వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో కంపెనీ హెచ్ఆర్, నాసిక్ కంపెనీ మేనేజర్ కూడా ఉన్నారు. మా కక్షిదారు పరారీలో లేకపోయినా ఆమెను అరెస్టు చేశారు. దర్యాప్తులో మేం సహకరిస్తున్నాం, ఈమెయిల్ యాక్సెస్ ఇచ్చాం, అంతకుముందే 78 ఈమెయిల్స్ పోలీసులు గుర్తించారు” అని నిందితురాలి తరఫు న్యాయవాదులు తెలిపారు.

టీసీఎస్ ఏమన్నది?
ఈ ఘటన తర్వాత టీసీఎస్ కంపెనీ ప్రతినిధి తరఫున ఒక ప్రకటన విడుదలైంది.
ఆ ప్రకటనలో, “మా కంపెనీలో వేధింపులు, దౌర్జన్యాలను అడ్డుకునేందుకు చాలాకాలంగా ‘జీరో టోలరెన్స్’ (సహించేది లేదనే) విధానం ఉంది. మేం ఎప్పుడూ మా ఉద్యోగుల పని ప్రదేశంలో భద్రత, గౌరవం, సంక్షేమం కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశిస్తాం”
“నాసిక్‌లోని ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే మేం తక్షణమే చర్యలు తీసుకున్నాం. అంతర్గత విచారణ ప్రక్రియను ప్రారంభించాం. విచారణలో ఉన్న ఉద్యోగులపై దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ విధించాం. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నాం. ఈ దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి” అని ఆ ప్రకటనలో ఉంది.
ఈ కేసుపై నిందితుల తరపు న్యాయవాది బాబా సయ్యద్ ఏప్రిల్ 10న స్పందిస్తూ, ఈ వ్యవహారం అపార్ధాల వల్ల జరిగిందని చెప్పారు. అంతకుమించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



