Home జాతీయ national telgu దివ్య దేశ్‌ముఖ్: చెస్‌ క్రీడాకారిణులకు ఎదురయ్యే వేధింపులు ఏమిటి? ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై చర్చ ఎందుకు?

దివ్య దేశ్‌ముఖ్: చెస్‌ క్రీడాకారిణులకు ఎదురయ్యే వేధింపులు ఏమిటి? ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై చర్చ ఎందుకు?

1
0

SOURCE :- BBC NEWS

దివ్య దేశ్‌ముఖ్

ఫొటో సోర్స్, TATA STEEL CHESS

భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ తన అనుభవాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్టు, క్రీడల్లో మహిళల పట్ల జనాల వైఖరిని ప్రశ్నించింది, చర్చకు దారితీసింది.

తన చెస్ వీడియోకు తరచుగా కామెంట్లు వస్తుంటాయని అయితే, వాటిలో ఎక్కువగా ఆటకంటే రూపంపైనే ఉంటున్నాయని ఇంటర్నేషనల్ మాస్టర్ (చెస్‌లో రెండో అత్యుత్తమ టైటిల్) అయిన దివ్య దేశ్‌ముఖ్(18) ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు.

“మహిళలు చదరంగం ఆడుతున్నప్పుడు, ఆమె ఎంత మంచి ప్లేయర్ అనేది మర్చిపోతున్నారు. అసంబద్ధమైన విషయంపై దృష్టి కేంద్రీకరిస్తారనేది విచారకరమైన నిజం” అని ఆమె తెలిపారు.

కొంత కాలంగా ఈ విషయంపై మాట్లాడాలనుకున్నట్లు దివ్య చెప్పారు.

నెదర్లాండ్స్‌లో ఇటీవల జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ముగింపు తర్వాత దివ్య ఈ పోస్ట్‌ పెట్టారు. టోర్నీ సమయంలో ప్రేక్షకుల ప్రవర్తన కోపం తెప్పించిందన్నారు.

ఈ ఘటనలో టోర్నమెంట్ నిర్వాహకులు ఆమెకు మద్దతుగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

“చదరంగంలో మహిళలను ప్రోత్సహించడానికి, సురక్షితమైన, సమానమైన క్రీడా వాతావరణాన్ని కల్పించడానికి కట్టుబడి ఉన్నాం” అని ప్రకటనలో తెలిపారు.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

చిన్నప్పటి నుంచీ ఇదే తీరు: దివ్య

సెక్సిజం అనేది ఇప్పటికీ చెస్‌లో చర్చనీయాంశంగా ఉంది. పురుషులు, మహిళలు ఒకరితో ఒకరు పోటీపడే ప్రధాన, ఏకైక క్రీడ చెస్.

దివ్య పోస్టు చెస్‌లో మహిళల పట్ల అభిమానులు, మగ ఆటగాళ్ల ప్రవర్తనపై కీలకమైన చర్చకు దారితీసింది.

ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా గ్రాండ్‌మాస్టర్ సుసాన్ పోల్గర్ కూడా దీనిపై స్పందించారు.

14 ఏళ్ల వయస్సు నుంచి దుస్తులు, కనిపించే తీరు లేదా మాట్లాడే విధానంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని దివ్య బీబీసీతో చెప్పారు.

“నా చెస్ స్కిల్స్‌పై జనం శ్రద్ధ చూపకపోవడం బాధ కలిగించింది” అని ఆమె అన్నారు.

వేల మంది ఆమె పోస్ట్‌ను లైక్ చేశారు. చాలా మంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేశారు. హానికరం కాని జోకులు, కామెంట్లు కూడా సెక్సిస్ట్ వైఖరితో ఉంటాయని రెడిఫ్ యూజర్ ఒకరు స్పందించారు.

మహిళా ప్లేయర్ వీడియోల కింద లైంగిక వ్యాఖ్యలను చేయడం సాధారణమని మరొకరు అభిప్రాయం వ్యక్తంచేశారు.

చెస్

ఫొటో సోర్స్, JORDAN GIBBONS

కారణమేంటి?

ఆన్‌లైన్ టోర్నమెంట్‌లు, గేమ్‌లు లైవ్‌స్ట్రీమ్ చేయడంతో ప్రధానంగా పురుష ప్రేక్షకుల నుంచి ఆన్‌లైన్‌లో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలొస్తున్నాయని చెస్ గురించి విస్తృతంగా రాసిన క్రీడా రచయిత సుసాన్ నినాన్ చెప్పారు.

ఇటువంటి ట్రోలింగ్ సెక్సిస్ట్ వైఖరిని మరింతగా పెంచుతుందని, మహిళా ప్లేయర్ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

చదరంగంలో ఇప్పటికీ అసమానతలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన క్రీడాకారుల్లో మహిళలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నారు.

ఇక దేశంలోని 84 మంది గ్రాండ్ మాస్టర్లలో ముగ్గురు మాత్రమే మహిళలు.

చెస్ చుట్టూ మూస పద్ధతులు, బాలికలకు అవకాశాలు, మద్దతు లేకపోవడం దీనికి కారణాలుగా చెస్ నిపుణులు, క్రీడాకారిణులు అభిప్రాయపడుతున్నారు.

పురుషులు మాత్రమే చెస్‌లో మెరుగ్గా ఉంటారని జనం భావిస్తారని, ఈ ఆలోచన ఇంటర్నెట్‌లో బలంగా ఉందని నినాన్ అంటున్నారు.

వారి పక్షపాత వైఖరి కారణంగా, మహిళలకు ఆటలో వారి నైపుణ్యాలకు తగ్గ గుర్తింపు రావడం కష్టతరం అవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 300 మంది తల్లిదండ్రులు, మెంటార్స్‌‌ పాల్గొన్నారు. వీరిలో 90 శాతం మంది పురుషులు ఉన్నారు.

క్రీడలో అబ్బాయిలతో పోల్చితే ఆడపిల్లల సామర్థ్యం తక్కువుందని వారు విశ్వసిస్తున్నారు. మగవారి కంటే తక్కువ సామర్థ్యం ఉంటోందని అమ్మాయిలు చెస్ మానేస్తున్నారని అధ్యయనంలో తేలింది.

నందిని సారిపల్లి

ఫొటో సోర్స్, NANDHINI SARIPALLI

అందుకే నా కెరీర్ దెబ్బతింది: చెస్ కోచ్ నందిని

ఆటలో పక్షపాత వైఖరిని ప్రత్యక్షంగా అనుభవించినట్లు చెస్ క్రీడాకారిణి, కోచ్ అయిన నందిని సారిపల్లి అంటున్నారు.

మగవారికి దక్కిన మద్దతు తనకు లభించకపోవడంతో తన చెస్ కెరీర్ దెబ్బతిందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు కోచ్‌గా తన కెరీర్‌ కూడా ఆశించినంతగా లేదని, ఒక మహిళ చెస్ సామర్థ్యంపై సమాజానికి పెద్దగా నమ్మకం లేదని నందిని తెలిపారు.

“తల్లిదండ్రులు తమ పిల్లలకు మగ కోచ్ కావాలనుకుంటారు, ఎందుకంటే వాళ్లే మరింత ప్రతిభావంతులనుకుంటారు” అని ఆమె చెప్పారు.

క్రీడాకారిణులకు టోర్నమెంట్లలో మగవారితో సమానమైన గౌరవం ఇవ్వని సంస్కృతికి ఆన్‌లైన్ ట్రోలింగ్ దోహదం చేస్తుందని పరిశీలకుల అభిప్రాయం.

మగ ప్రత్యర్థి ఆన్‌లైన్‌లో తనను సులువుగా ఓడించగలరని పురుషులు చెప్పేవారని నందిని అన్నారు.

ఇక ఆఫ్‌లైన్‌లో ప్రత్యర్థి మహిళ అయితే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదని మగ ఆటగాళ్లు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

ఎందుకంటే వాళ్లు మహిళా క్రీడాకారులను నిజమైన పోటీగా పరిగణించరని తెలిపారు.

“మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి రెండింతలు కష్టపడాలి, అప్పుడు కూడా సెక్సిస్ట్ కామెంట్ల నుంచి తప్పించుకోలేరు” అని నందిని చెప్పారు.

చాలా మంది మహిళా చెస్ క్రీడాకారిణుల మాదిరే నందిని కూడా ప్రేక్షకుల అవాంఛిత దృష్టి నుంచి తప్పించుకోవడానికి దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ ప్లేయర్లలో ఒకరైన పోల్గార్ కూడా దశాబ్దాల క్రితం యువ చెస్ క్రీడాకారిణిగా ఉన్నప్పుడు ఇలాంటివి అనుభవించానని చెప్పారు.

దివ్య దేశ్‌ముఖ్ పోస్ట్‌కు పోల్గార్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు.

“నేను 20 ఏళ్ల వరకు మేకప్‌ను ముట్టుకోలేదు. ఎందుకంటే మగ చెస్ ప్లేయర్ల లైంగిక దాడి, వేధింపులతో అలసిపోయాను” అని ఆమె తెలిపారు.

చెస్ ఆటలో ప్రత్యర్థుల మధ్య బోర్డు దూరం, ఎదురెదురుగా కూర్చునే స్థలం కూడా ఈ ప్రవర్తనకు అవకాశం కల్పిస్తుందని నినాస్ అభిప్రాయపడ్డారు.

కోనేరు హంపీ

ఫొటో సోర్స్, ARMAN KARAKHANYAN

ఎక్కువ మంది ఆడాలి: కోనేరు హంపి

తను చెస్ ఆడటం మొదలుపెట్టిన రోజులతో పోలిస్తే ప్రస్తుతం ‘ఎక్కువ సమానత్వం’ ఉందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అంటున్నారు.

ఆమె 1990లలో చెస్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువున్న సమయంలో కెరీర్‌ ప్రారంభించారు.

అంతేకాదు, 15 ఏళ్ల వయస్సులో అప్పటి అతి పిన్న వయస్కురాలైన మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచారు హంపి.

అప్పట్లోనే ఓపెన్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నారు హంపి. ఆ టోర్నమెంట్లలో గెలవడం కష్టంగా ఉండేదని, ఎందుకంటే వాళ్లంతా ఎక్కువ నైపుణ్యంతో ఉండేవారని తెలిపారు.

“నేను మహిళ కాబట్టి పురుషులు నాతో ఓడిపోవడాన్ని ఇష్టపడరు” అని ఆమె చెప్పారు.

‘‘నేటి మగ ఆటగాళ్ల ఆటతీరు భిన్నం, ఎందుకంటే వారు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ, తోటి ఆడవారితో ఆడుతున్నారు’’ అని చెప్పారు.

కానీ పురుష ప్రత్యర్థుల మాదిరిగా చదరంగం బోర్డుపై, వెలుపల ప్రభావం చూపడానికి క్రీడాకారిణులకు ఎక్కువ సమయం పడుతోంది.

దీన్ని మార్చాలంటే మహిళలకు సామాజిక-సాంస్కృతిక అడ్డంకులను తొలగించి చెస్ ఆటలో ఎక్కువగా పాల్గొనేలా చేయాలి.

“ఎక్కువ మంది మహిళా క్రీడాకారులుంటే, వారిలో ఎక్కువ మంది ఉన్నత స్థాయుల్లో ఉంటారు” అని హంపి అభిప్రాయపడ్డారు.

మహిళల టోర్నమెంట్ల సంఖ్యను పెంచి, మరింత మందిని చెస్ ఆడేలా ప్రోత్సహించడం మరో మార్గం.

“ఎంత ఎక్కువ మంది మహిళలు చెస్ ఆడితే దానిపై అంత ఎక్కువ ప్రభావం చూపిస్తారు” అని హంపి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: