Home జాతీయ national telgu చైనాపై ట్రంప్ మెతక వైఖరి: రిపబ్లికన్లు ఎలా చూస్తున్నారు? తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయిస్తుందా?

చైనాపై ట్రంప్ మెతక వైఖరి: రిపబ్లికన్లు ఎలా చూస్తున్నారు? తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయిస్తుందా?

22
0

SOURCE :- BBC NEWS

అమెరికా, చైనా, ట్రంప్, తైవాన్

ఫొటో సోర్స్, Getty Images

డోనల్డ్ ట్రంప్ ఇండియానాలో 2016లో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆత్మవిశ్వాసంతో స్టేజీపైకి ఎక్కి మాట్లాడారు. ”అమెరికాకు ప్రధాన ఆర్థిక ప్రత్యర్థి చైనా’’ అని ఆయన అప్పట్లో స్పష్టంగా చెప్పారు.

ఫోర్ట్‌వేన్‌లో అక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి ట్రంప్, ”చైనా మన దేశాన్ని దోచుకోవడాన్ని ఇక మేం అనుమతించలేం. కానీ మనదే పైచేయి. ఈ విషయాన్ని మర్చిపోకండి” అన్నారు.

చైనా వ్యతిరేక వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు. దాదాపు దశాబ్దం పాటు జరిగిన సభలలో, 2024 ఎన్నికల ప్రచారంలో, అలాగే ఆయన రెండో అధ్యక్ష పదవీ కాలంలోనూ కొనసాగాయి.

ట్రంప్ శ్వేత సౌధానికి తిరిగి చేరుకున్నప్పుడు, చైనాపై తీవ్ర విమర్శలు చేసిన కీలక మిత్రులు కూడా ఆయనతోపాటు ఉన్నారు. వీరిలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సీనియర్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో వంటి వారు ఉన్నారు.

అమెరికాను చైనా దోచుకుంటోందని, టెక్నాలజీని దొంగిలిస్తోందని, అమెరికా వీధుల్లో ఫెంటానిల్‌ను విచ్చలవిడిగా నింపేస్తోందని వీరంతా ముక్త కంఠంతో ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆ తర్వాత వరుసపెట్టి టారిఫ్‌లు పెరిగిన వ్యవహారం తెరపైకి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో 10 శాతంతో ప్రారంభమై, ఏప్రిల్ మధ్యనాటికి ట్రంప్ ‘లిబరేషన్ డే’గా పేర్కొన్న సమయానికి ఏకంగా 145 శాతానికి పెరిగాయి.

చైనాపై, అమెరికా తన ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దిగుమతి సుంకాలు విధించడం ప్రారంభించిన రోజుకు ట్రంప్ ‘లిబరేషన్ డే’ అని పేరు పెట్టారు.

దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికాపై 125 శాతం టారిఫ్ విధించడమే కాకుండా, అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసింది. దీనితో వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా బీజింగ్‌లో పర్యటించారు.

అమెరికా, చైనా, ట్రంప్, తైవాన్

ఫొటో సోర్స్, VGC via Getty Images

ట్రంప్ పర్యటనతో సాధించిందేమిటి?

ట్రంప్ ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో ఎర్రతివాచీపైకి చేరుకున్నారు. అక్కడ వందలాది మంది పిల్లలు జెండాలు ఊపుతుండగా, మిలిటరీ బ్యాండ్ అమెరికా జాతీయగీతం ‘స్టార్-స్పేంగిల్డ్ బ్యానర్’‌ను ఉత్సాహంగా వాయిస్తోంది.

ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడుతూ, “మీతో ఇక్కడ ఉండటం గౌరవంగా భావిస్తున్నా. మీ స్నేహితుడిగా ఉండటం నాకు దక్కిన గౌరవం. చైనా, అమెరికా మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత మెరుగ్గా మారనున్నాయి” అన్నారు.

ట్రంప్ త్వరలోనే జరగబోయే అద్భుతమైన వాణిజ్య ఒప్పందాల ను ప్రశంసించారు. అయితే ఎలాంటి భారీ ఒప్పందం గురించి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.

చిప్‌ల తయారీ సంస్థ ‘ఎన్విడియా’ 10 చైనా కంపెనీలకు సెమీకండక్టర్లను విక్రయించడానికి అనుమతి పొందింది. ‘బోయింగ్’ కంపెనీకి 200 విమానాల ఆర్డర్ లభించింది. అలాగే ‘సిటీ’ బ్యాంక్‌కు చైనాలో సెక్యూరిటీల వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి లభించింది.

కానీ,మృదువైన వ్యాఖ్యలు, సామరస్యపూర్వక వాతావరణం ఉన్నప్పటికీ, చైనా పట్ల కఠినంగా వ్యవహరించే విషయంలో రిపబ్లికన్ పార్టీ వైఖరి సంప్రదాయక దూకుడునే ప్రతిబింబిస్తోంది.

ఈ శిఖరాగ్ర సమావేశానికి సుమారు వారం రోజుల ముందు అమెరికా విదేశాంగ శాఖ మూడు చైనా కంపెనీలపై ఆంక్షలు విధించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలపై దాడులు చేయడానికి వీలుగా ఇరాన్‌కు ఉపగ్రహ చిత్రాలను అందించాయనేది ఆ కంపెనీలపై ఉన్న ఆరోపణ.

అయితే, ఇంకా కీలకమైన అంశాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది తైవాన్ అంశం. స్వయంపాలనలో ఉన్న ఈ ద్వీపాన్ని తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రాంతంగా బీజింగ్ చూస్తోంది.

డెమొక్రాట్లు, చైనాపై కఠిన వైఖరి కలిగిన రిపబ్లికన్ నాయకులు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయం ఆలస్యంపై ట్రంప్ పెద్దగా వివరాలు ఇవ్వలేదు.

ఈ పర్యటనకు ముందు, రెండు పార్టీలకు చెందిన సెనేటర్ల బృందం ట్రంప్‌కు లేఖ రాస్తూ.. ఆయుధాల విక్రయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ విషయాన్ని చైనా అధ్యక్షుడికి అధికారికంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.

ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ, “తైవాన్ అంశంపై షీ జిన్‌పింగ్ ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. నేను ఏ పక్షానికి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు” అని చెప్పారు. ఆయుధాల విక్రయానికి సంబంధించి తాను ‘చాలా తక్కువ సమయంలోనే నిర్ణయం’ తీసుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు.

గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ సమావేశానికి సంబంధించి చైనా విడుదల చేసిన వివరాలలో తైవాన్‌ను అత్యంత కీలకమైన అంశంగా పేర్కొంది.

ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకపోతే, “పరస్పర ఘర్షణలు, యుద్ధ వాతావరణం కూడా తలెత్తవచ్చు, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడవచ్చు” అని అందులో హెచ్చరించింది.

మరోవైపు వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తైవాన్ ప్రస్తావనే లేదు.

అమెరికా, చైనా, ట్రంప్, తైవాన్

ఫొటో సోర్స్, Evan Vucci / POOL / AFP via Getty Images

‘చైనా ప్రకటన ఒక బెదిరింపు’

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) ఉద్యమానికి చెందిన కొందరు వ్యక్తులు చైనా ప్రకటనను ఒక బెదిరింపుగా భావించారు.

ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ ‘పొలిటికో’ పత్రికతో మాట్లాడుతూ, “నేను ఆశ్చర్యపోయాను. జనాలు దీన్ని ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా చూస్తున్నారు, కానీ ఆయన (షీ జిన్‌పింగ్) హెచ్చరికతో ప్రారంభించారు. వారు ఈ అంశాన్ని అందరికంటే పైన ఉంచడం ద్వారా తమ ఉద్దేశాన్ని చాలా బహిరంగంగా, స్పష్టంగా తెలియజేశారు” అని అన్నారు.

అయితే, క్యాపిటల్ హిల్‌లో చైనా పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించే నాయకులు, ట్రంప్ సహచరులలో చాలామంది ఈ పర్యటన ముగిసిన తర్వాత చాలావరకు మౌనంగానే ఉండిపోయారు.

ట్రంప్ ప్రదర్శించిన స్నేహపూర్వక ధోరణి, తైవాన్ అంశంపై ఆయన ఇచ్చిన అస్పష్టమైన ప్రకటనలపై వారు పెద్దగా స్పందించలేదు.

అమెరికాలోని చైనా వ్యవహారాల నిపుణులకు ఈ మౌనం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు.

జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ఫౌండేషన్ ఫర్ యూఎస్-చైనా రిలేషన్స్ ప్రెసిడెంట్, సీఈఓ డేవిడ్ ఫైర్‌స్టోన్ బీబీసీతో మాట్లాడుతూ, “ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో అధ్యక్ష స్థాయి శిఖరాగ్ర సమావేశాలు 50 జరిగినప్పటికీ.. కొన్ని అంశాలలో అమెరికా, చైనాలు ఎప్పటికీ ఏకీభవించలేవు అనే నిజం మారదు” అన్నారు.

అలాగని “దీనర్థం ఈ శిఖరాగ్ర సమావేశం విఫలమైందని కాదు” అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ మాట్లాడే తీరు, ఆయన వైఖరి మెత్తబడటం అనేది.. 2017లో ఆయన చేసిన గత పర్యటన తర్వాత అవలంబించిన వ్యూహాలు పెద్దగా పని చేయలేదనడానికి ఒక సంకేతం కావచ్చని ఫైర్‌స్టోన్ అభిప్రాయపడ్డారు.

”మార్కెట్ యాక్సెస్, మేధో సంపత్తి హక్కులు, సబ్సిడీల వంటి సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ జాబితా చాలా పెద్దది. గత ఎనిమిదేళ్లుగా ఈ టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) అమలులో ఉన్నప్పటికీ, వీటిలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు” అన్నారు

కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో ఆసియా స్టడీస్ ఫెలో అయిన డేవిడ్ షాక్స్ మాట్లాడుతూ, ట్రంప్ అనుసరిస్తున్న ఈ మృదువైఖరి ప్రభావం ఇతర అధికారులు, రిపబ్లికన్ ఎంపీలు, ఆయన మద్దతుదారులపై కూడా పడే అవకాశం ఉందన్నారు.

‘‘ట్రంప్ తొలివిడత పాలన కానీ, లేదా ఇతర అమెరికా ప్రభుత్వాలు గానీ ఇలా పనిచేయలేదు. ఇది పూర్తిగా పై స్థాయి నాయకత్వం నుంచి కిందకు ఆదేశాలు వచ్చే విధానంలా ఉంది. ప్రభుత్వంలోని చాలామంది అధికారులు ఎక్కువగా విధానాల అమలు చేసే పాత్రకు మాత్రమే పరిమితమవుతున్నారని భావిస్తున్నా’’ అన్నారు.

షాక్స్ వ్యక్తంచేసిన అభిప్రాయాలతో ‘నేషనల్ కమిటీ ఆన్ యూఎస్-చైనా రిలేషన్స్’ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఆర్లిన్స్ కూడా ఏకీభవించారు. “ట్రంప్ ఏదైనా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, జనాలు దాన్ని అనుసరిస్తారు. ఆయన మద్దతుదారులు కూడా అదే చేస్తారు. ” అన్నారు.

అయినప్పటికీ, తైవాన్ విషయంలో ట్రంప్ ఇప్పటికీ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

సెప్టెంబరులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైట్ హౌస్ పర్యటనకు రాకముందే.. పెండింగ్‌లో ఉన్న 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయానికి అధికారిక ఆమోదం తెలపాలని ఇరుపక్షాల (డెమొక్రాట్లు, రిపబ్లికన్లు) నుండి ఆయనపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది.

షాక్స్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) నిరంతరం లేఖలు రాస్తూ, తైవాన్‌కు ఆయుధాల విక్రయాన్ని ఆమోదించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుందని భావిస్తున్నా” అన్నారు.

అప్పటివరకు, “ప్రభుత్వ సీనియర్ అధికారులు కాంగ్రెస్ ముందుకు ఎప్పుడు వచ్చినా.. తైవాన్‌కు ఆయుధాల విక్రయం తాలూకా ప్రస్తుత స్థితిగతులపై వారిని ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు.

అయితే, చివరకు వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయం నుంచి వచ్చే తుది నిర్ణయం ఇదే అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం.

షాక్స్ మాట్లాడుతూ, “సెప్టెంబర్‌కు ముందే తైవాన్‌కు భారీ స్థాయిలో అమెరికా ఆయుధాలను విక్రయం జరిగితే, షీ జిన్‌పింగ్ పర్యటన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ 14 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇప్పుడు నిజంగానే ఒక పెద్ద ప్రశ్నగా మారింది” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)