Home జాతీయ national telgu కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు...

కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?

1
0

SOURCE :- BBC NEWS

కుమారీ ఫుడ్ కోర్టు

ఫొటో సోర్స్, Congress for Telangana

కుమారీ ఫుడ్ కోర్టు.. ఈ పదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఒక మామూలు ఫుడ్ బిజినెస్ చేసే మహిళ విషయంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకునే వరకూ వెళ్లింది.

అంతేకాదు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీల అభిమానులు ఆవిడ విషయంపై సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు. చివరగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విషయం ఒక చోట ఆగింది.

హైదరాబాద్ రాయదుర్గం – మాదాపూర్ మధ్యలో ఉండే ఒక రోడ్డును ఆనుకుని ఉన్న టీఎస్ఐఐసీ స్థలంలో ఫుట్ పాత్‌పై అనేక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఆ చుట్టు పక్కల పనిచేసే కార్పొరేట్ ఉద్యోగుల నుంచి అటుగా వెళ్లే సామాన్యుల వరకూ అక్కడ ఆగి భోజనం చేయడం అలవాటు.

తక్కువ ధరకే మాంసాహారంతో కూడిన భోజనం దొరకడంతో ఆ ప్రాంతానికి బాగా పేరు వచ్చింది. జనం వస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడ ఫుడ్ స్టాల్ నడిపే సాయి కుమారిని పలువురు యూట్యూబ్ ఫుడ్ చానెల్స్ వారు ఇంటర్వ్యూలు చేశారు.

ఆంధ్రాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన సాయి కుమారి, ఆమె భర్త కలసి అక్కడ ఫుడ్ స్టాల్ దాదాపు పదేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే పలు రకాల రైస్ ఐటెమ్స్ కొంచెం కొంచెం వడ్డిస్తూ, అందరినీ నాన్నా, అమ్మా అంటూ పిలిచి వడ్డించే ఆవిడ శైలితో కొన్ని వీడియోలు రెండు మూడేళ్ల నుంచి తిరుగుతున్నాయి.

ఆ క్రమంలో ఒక్కో యూట్యూబ్ చానెల్ వారు, ఫుడ్ చానెల్ వారూ ఆమెను ఇంటర్వ్యూ చేయడం, ఆమె ఇంటికి వెళ్లి వంట వీడియోలు తీయడం, ఆమె ఆదాయం గురించి వివరాలు చెప్పడం ఇలా మీడియాలో ఆమె వీడియోలు పెరిగాయి.

కుమారి ఫుడ్ కోర్ట్

ఫొటో సోర్స్, Street food Hawa/YT SCREEN GRAB

ఈ మధ్య రెండు నెలలుగా ఆమె ఆదాయం మీద, వ్యాపారంలో వచ్చే లాభాల మీద చర్చ జరిగింది. అంతేకాదు.. రెండు లివర్ కర్రీలు వెయ్యి రూపాయలు అనే వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. అంత ధరా అనే చర్చ ఒకటి.

తరువాత ఇంకొందరు యూట్యూబ్ వారు వెళ్లినప్పుడు దానికి ఆవిడ ఇచ్చిన వివరణ, ఆరుగురు నాన్ వెజ్‌లో భిన్న వెరైటీలతో భోజనం చేయడం వల్ల వెయ్యి రూపాయలు అనడం.. ఇలా ప్రతీదీ వైరల్ అవుతూనే వచ్చింది.

ఆమె వ్యాపారం, ఆమె మాటతీరు, అందులో వచ్చే లాభాలపై చర్చ.. ఇలా అన్నింటికీ బాగా స్పందన వస్తూండడంతో డిజిటల్ మీడియా సంస్థలు ఆమె వెంట పడ్డాయి.

ఈ క్రమంలో నెల రోజులుగా ఆమె చుట్టూ నిరంతరం కెమెరాలే, ఫోన్లే కనిపించేవి. రోజూ 5 నుంచి 10 చానెళ్ల వారు ఆమె ఇంటర్వ్యూల కోసం వస్తున్నట్టు అక్కడే వ్యాపారం చేస్తోన్న ఇతరులు బీబీసీకి చెప్పారు.

ఒక దశలో ట్రక్ ఆటోలో ఆవిడ వంట పాత్రలు తెస్తూ ఆటో దిగుతుంటే ఆమెను నలుగురైదుగురు వీడియోలు తీసేవారు. ఆమెను అలా కొందరు వీడియో తీసే దృశ్యాన్ని మరొకరు వీడియో తీసి దానికి రజినీకాంత్ సినిమాల్లో ఎలివేషన్ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రీల్స్ వదిలారు.

ఫుడ్ కోర్టులు

ఇక ఆమె ఒక ఇంటర్వ్యూలో తన సంపాదన గురించి చెప్తూ, తనకేమీ ఆస్తులు లేవనీ, జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందనీ చెప్పింది. దీంతో ఆ వాక్యం చుట్టూ వైయస్సార్సీపీ – తెలుగుదేశం వారు సోషల్ మీడియా వేదికగా వాదించుకోవడం మొదలుపెట్టారు.

ఆమెకు ఇల్లు ఇవ్వడాన్ని వైయస్సార్సీపీ వారు బాగా ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె వాహనాన్ని పోలీసులు ఆపడం టీడీపీ-కాంగ్రెస్ కుట్ర అంటూ ప్రచారం జరిగింది. దానికి మళ్లీ కౌంటర్ ప్రచారాలు.. ఇలా ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది.

ఇక సినిమా నటులు సందీప్ కిషన్ ఒకసారి అక్కడకు వచ్చి భోంచేశారు. ‘‘ఏకంగా ఒంగోలు నుంచి వచ్చి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో భోజనం చేశారు’’ అన్న వీడియో కూడా వైరల్ అయింది.

వారు పనిగట్టుకుని ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి భోజనం చేశారా లేక హైదరాబాద్ పని మీద వచ్చి పనిలో పనిగా అక్కడకు వెళ్లారా తెలియదు..

ఇలా వీడియోల కోసం ఆమె దగ్గరకు చాలా మంది వస్తుంటే పక్క షాపుల వారు కూడా అసహనం వ్యక్తం చేసేవారు.

సాధారణంగానే ఆ రోడ్డుపై మధ్యాహ్న సమయంలో బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. భోజనం కోసం వచ్చిన వారు కార్లు, బైకులు అక్కడ రోడ్డు పొడవునా పార్క్ చేయడమే అందుకు కారణం.

ఇక చానెళ్లు పెరగడంతో అక్కడ చిన్న సైజు తిరునాళ్ల వాతావరణం మొదలైంది. దీంతో జనవరి 30వ తేదీ మంగళవారం స్థానిక రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసే పని పెట్టుకున్నారు.

ముఖ్యంగా కుమారికి చెందిన ఫుడ్ ఉండే వాహనాన్ని ఆపి కేసు పెట్టారు. దీంతో తాజా గొడవ స్టార్ట్ అయింది.

భోజనం చేస్తున్న వ్యక్తి

‘‘అందరి వ్యాపారాలనూ కొనసాగిస్తూ తమ వాహనాన్ని మాత్రమే పోలీసులు ఆపేశారంటూ కుమారీ, ఆమె భర్త మీడియా ముందు ఆరోపించారు. తమ బండిని పోలీసులు అడ్డకున్నారు ఏదో ఒకటి చేయండి మీరే’’ అంటూ మీడియాతో చెప్పారు. మీడియా వాళ్ల వల్లే ఇదంతా జరుగుతోందని బాధపడ్డారు.

కొన్ని యూట్యూబ్ చానెళ్ల ఈ వార్తకు విస్తృతమైన కవరేజీ ఇచ్చాయి. దీంతో కుమారి ఆంటీ షాపును మూయించేసిన పోలీసులు, షాపు తీసేసిన పోలీసులు అంటూ నానా రకాల వార్తలు వచ్చాయి.

దీనిపై రాయదుర్గం పోలీసులు బీబీసీతో మాట్లాడారు.

‘‘మేము ఏ షాపూ తీయలేదు. షాపు మూయించడం మా పని కాదు. మేం చేయలేదు. కానీ ట్రాఫిక్ క్లియర్ చేయడం మా పని. ఆ రోడ్డులో విపరీతంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. అందుకే రోడ్డుపై అడ్డుగా ఉండే వాహనాలన్నింటినీ క్లియర్ చేశాం. ఆవిడ వాహనం కూడా రోడ్డుపై పెట్టారు కాబట్టి కేసు పెట్టాం. ట్రాఫిక్ విషయంలో మేం కచ్చితంగా ఉంటాం’’ అని బీబీసీతో చెప్పారు రాయదుర్గం ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి.

కుమారి ఉపయోగించే వాహనాన్ని మార్పులు చేర్పులు చేశారని మోటారు వాహనాల చట్టం ప్రకారం అది కూడా తప్పే కాబట్టి ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు రాయదుర్గం ట్రాఫిక్ అదనపు ఇనస్పెక్టర్ విజయానంద్ బీబీసీతో చెప్పారు.

మంగళవారం జరిగిన ఈ పరిణామాలతో బుధవారం ఉదయం నుంచీ ఆ రోడ్డులో హడావుడి పెరిగింది. మీడియా పెద్ద సంఖ్యలో వచ్చింది. అయితే, కుమారి మాత్రం బుధవారం షాపు తెరవలేదు. ఆమె షాపులో ఉండే టేబుళ్లు అలానే ఉన్నాయి. కానీ ఆమె రాలేదు.

కుమారి ఫుడ్ కోర్ట్

ఫొటో సోర్స్, T FOOD/YT SCREEN GRAB

అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులను మాత్రం ఆమె పక్క షాపులకు చెందిన వారు తీవ్రంగా విమర్శించారు. మీడియా వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

‘‘మేమంతా చిన్న వాళ్లం. బతుకుదెరువు కోసం వచ్చాం. అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.’’ అంటూ చేతులెత్తి దండం పెట్టారు. అక్కడి మిగిలిన షాపుల మహిళలు..కొందరు మహిళలు మీడియా ప్రతినిధులపై విసుక్కుంటూ కోప్పడ్డారు.

ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం మరోసారి ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అక్కడ ఏ షాపు వారినీ ఏమీ అనలేదు. కానీ అక్కడ రోడ్డుపై బండ్లు నిలపవద్దని చెప్పారు. రోడ్డుపై ఉన్న బండ్లన్నిటినీ ఫోటోలు తీసి జరిమానా వేశారు.

చట్ట ప్రకారం అక్కడ పార్కింగ్ చేయకూడదంటూ అక్కడ రెండు నో పార్కింగ్ బోర్డులు కూడా ఉన్నాయి. వచ్చిన వారికి ఆ బోర్డులు చూపిస్తున్నారు పోలీసులు.

ట్రాఫిక్ ఏసీపీ నుంచి కానిస్టేబుళ్ల వరకూ అక్కడే ఉన్నారు. మధ్యలో ముఖ్యమంత్రి వస్తారని వార్తలు వచ్చినప్పుడు స్థానిక సీఐ వచ్చి వెళ్లిపోయారు. కొందరు కస్టమర్లతో మీడియా వాళ్లు ఇంటర్వూలు తీసుకున్నారు.

పోలీసులు

కొన్ని స్వతంత్య్ర యూట్యూబ్ చానెళ్ల వారు స్థానిక ట్రాఫిక్ ఏసీపీతో ఇంటర్వ్యూ తీసుకునే క్రమంలో వారి మాటల ధోరణిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులదే తప్పన్నట్టు కొన్ని చానెళ్ల ప్రసారం చేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఇది రోడ్డు. ఇక్కడ బండ్లు పెట్టకూడదు. ఎవరైనా బండ్లు ఎక్కడైనా పెట్టుకుని నడచి వచ్చి వెళ్లి భోజనం చేయవచ్చు. దానికి మాకేమీ అభ్యంతరం లేదు.’’ అంటూ పోలీసులు వివరణలు ఇచ్చారు.

పోలీసులు పార్కింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో అక్కడ వ్యాపారం కాస్త తగ్గింది. మీడియా వాళ్లను వెళ్లిపోవాలంటూ షాపుల వారు బతిమలాడారు. కానీ దాదాపు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పరిస్థితి మారింది.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి బి.అయోధ్య రెడ్డి ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు.

‘‘కుమారి షాపును కొనసాగనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, పోలీసు శాఖలను ఆదేశించారు. అదే సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. తమది ప్రజా ప్రభుత్వమనీ వ్యాపారులకు అండగా ఉంటుందనీ ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో సీఎం ఆ ఫుడ్ స్టాల్‌ని విజిట్ చేస్తామన్నారంటూ’’ అయోధ్య రెడ్డి ప్రకటన చేశారు.

దీంతో ఫుడ్ కోర్టు దగ్గర వాతావరణం మెల్లిగా మారుతూ వచ్చింది. మీడియాలో ప్రకటన వచ్చిన తరువాత కూడా అక్కడే కొనసాగిన ట్రాఫిక్ పోలీసులు క్రమంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా ఆ ప్రాంతంలో లేకుండా పోయారు. కొద్ది నిమిషాల్లోనే మళ్లీ ఫుడ్ కోర్టు కిటకిటలాడింది.

రోడ్డుకు రెండు వైపులా కార్లు, బైకులు పార్కింగులు వచ్చాయి. అక్కస్మాత్తుగా టెంట్ లేకుండా ఫుట్ పాత్ మీద మాత్రమే పెట్టే షాపులు కూడా వెలిశాయి. అంతా సందడిగా మారింది.

ఎండలో కష్టపడి డ్యూటీ చేసిన ట్రాఫిక్ పోలీసుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. కానీ, ఎవరూ పెదవి విప్పలేదు.

కుమారీ తన ఇంటి నుంచి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌కి కృతజ్ఞతలు చెప్పారు. రేవంత్ తన స్టాల్‌కి వస్తే పూర్వజన్మ పుణ్యం అన్నారు.

కుమారీ ఫుడ్ కోర్టు

ఇంతకీ స్థలం ఎవరిది?

ఇప్పుడు ఈ స్టాళ్లన్నీ ఉన్న స్థలం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కి చెందుతుంది. తెలంగాణలో పరిశ్రమలకు భూములు, రోడ్లు కల్పించడం ఆ సంస్థ లక్ష్యం.

అక్కడ ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే వారికి భూములు ఇవ్వడానికి ఉద్దేశించిన స్థలం అది. అయితే ఆ స్థలంలో ఉన్న ఈ షాపులను ఖాళీ చేయించాలని టీఎస్ఐఐసీ ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇక్కడ షాపులు ఉన్న 13 మంది టీఎస్ఐఐసీకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో ఆ కేసు నడుస్తోంది.

‘‘2016లో ఈ షాపుల వారు కోర్టుకు వెళ్లారు. అప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టకుండా షాపులు నడుపుకోనివ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

మధ్యలో ఒక సందర్భంలో మేము ఇదే రోడ్డులో వేరే స్థలాన్ని ఫుడ్ కోర్టు కోసం ఇచ్చి వారిని తరలించి కొంత మేర ఫెన్సింగ్ వేశాం. కానీ కొందరు వెళ్లకుండా మా మీద ఒత్తిడి చేయించి అక్కడే ఉండిపోయారు. వారిని ఖాళీ చేయించడానికి కోర్టు నుంచి స్టే ఉంది.’’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి బీబీసీకి చెప్పారు.

ఈ స్థలం నుంచి ఎలాగైనా మొత్తం అందర్నీ ఖాళీ చేయించి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలన్న టీఎస్ఐఐసీ కల మాత్రం ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.

ఇవి కూడా చదవండి: