Home జాతీయ national telgu ఒమన్ తీరంలో దాడి.. సముద్రంలో మునిగిపోయిన భారత వాణిజ్య నౌక.. అసలేం జరిగింది?

ఒమన్ తీరంలో దాడి.. సముద్రంలో మునిగిపోయిన భారత వాణిజ్య నౌక.. అసలేం జరిగింది?

11
0

SOURCE :- BBC NEWS

నౌక

ఫొటో సోర్స్, Amirhossein KHORGOOEI/ISNA/AFP via Getty Images

ప్రచురణ 2 గంటలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై జరిగిన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. ఈ దాడిని “అంగీకరించలేనిదిగా” పేర్కొంది.

దాడి వల్ల ఆ సరుకు రవాణా నౌక మునిగిపోయిందని సముద్ర భద్రతా పర్యవేక్షణ సంస్థలు, భారత ప్రభుత్వం తెలిపాయి.

బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి గురించి భారత్ ఎక్కువ సమాచారాన్ని వెల్లడించలేదు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ నౌక పేరును వెల్లడించలేదు. అలాగే, ఆ నౌకపై జరిగిన దాడికి ఎవరు బాధ్యులై ఉంటారో కూడా స్పష్టం చేయలేదు.

అయితే, ఆ నౌక పేరు ‘హాజీ అలీ’ అని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రణ్‌ధీర్ జైస్వాల్

ఫొటో సోర్స్, ANI

బుధవారం ఉదయం ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై జరిగిన దాడి ఆమోదయోగ్యం కాదని మాత్రమే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

”వాణిజ్య నౌకలు, నావికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని మేం ఖండిస్తున్నాం” అని తన ప్రకటనలో పేర్కొంది.

”నౌకలోని భారతీయ నౌకా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. వారిని రక్షించినందుకు ఒమన్ అధికారులకు ధన్యవాదాలు” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంతకుమించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముకేష్ మంగళ్

ఫొటో సోర్స్, ANI

నౌకాయాన మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముకేష్ మంగళ్ కూడా ఈ ఘటనకు సంబంధించి వివరాలను పంచుకున్నారు.

”ఈ విషాద ఘటన గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. ‘హాజీ అలీ’ అనే నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు ప్రయాణిస్తోంది. 2026 మే 13వ తేదీ (బుధవారం) తెల్లవారుజామున, ఒమన్ జలాల్లో దానిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల నౌకకు నిప్పంటుకుంది. ఆ తర్వాత నౌక సముద్రంలో మునిగిపోయింది” అని తెలిపారు.

”నౌకలోని 14 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించి, దిబ్బా పోర్టుకు సురక్షితంగా తరలించింది. సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది” అని ముకేష్ మంగళ్ తెలిపారు.

ఈ ఘటన మినహా, గత 72 గంటల్లో ఏ భారతీయ నౌకపై గానీ, భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై గానీ మరే ఇతర దాడి జరగలేదన్నారు.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఏంటి?

14 మంది సిబ్బంది ఉన్న ఈ సరుకు రవాణా నౌక పేరు ఎంఎల్నీ హాజీ అలీ అని సముద్ర భద్రతా కంపెనీ వాన్‌గార్డ్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.

కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. హార్ముజ్ జలసంధికి దక్షిణాన ఉన్న ఒమన్‌లోని లిమా తీరానికి సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత ఈ నౌక మునిగిపోయింది.

సోమాలియాలోని వేర్పాటువాద ప్రాంతమైన సోమాలీలాండ్‌లోని బెర్బెరా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు ఆ నౌక పశువులను తీసుకువెళుతోందని వాన్‌గార్డ్ తెలిపింది.

హాజీ అలీ అనే నౌకలో పేలుడు “డ్రోన్ లేదా క్షిపణి దాడి కారణంగా సంభవించి” ఉంటుందని భావిస్తున్నారు.

”నౌకకు నిప్పంటుకోవడంతో.. సిబ్బంది నౌకను విడిచిపెట్టాల్సి వచ్చిందని, ఆ తర్వాత అది మునిగిపోయింది” అని వాన్‌గార్డ్ పేర్కొంది.

”హాజీ అలీ నౌకను గుజరాత్‌లోని ‘దేవభూమి ద్వారకా” జిల్లాలో సలాయ పోర్టులో రిజిస్టర్ చేశారు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒమన్ ఉత్తర తీరంలోని లిమా సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ నౌకను ఒక పేలుడు పరికరం ఢీకొట్టింది. ఈ పేలుడు కారణంగా నౌకకు మంటలు అంటుకుని, బ్యాలెన్స్ తప్పింది. ఆ తర్వాత.. నౌక మునిగిపోయింది” అని ఇండియా టుడే తన కథనంలో రిపోర్టు చేసింది.

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ దాడిపై స్పందించలేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images

గతంలోనూ దాడులు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతీయ జెండా ఉన్న రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ ఘటనలపై కిందటి నెల న్యూదిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసి, తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.

ఇరాన్ యుద్దం గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ముప్పు పెంచింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అనేక నౌకలపై దాడులు జరిగాయి.

ఏప్రిల్ 8నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ అమెరికా ఇరాన్ పోర్టులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది.

ఈ ఉద్రిక్తతల వల్ల చమురు,గ్యాస్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఇది భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలపై ఒత్తిడి పెంచుతోంది.

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ దాడిపై స్పందించలేదు. కానీ ఇరాన్ నౌకాదళంతో సహకరించే అన్ని వాణిజ్య నౌకలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)