Home LATEST NEWS telugu తాజా వార్తలు ఎవరెస్ట్: పర్వతారోహకులు ఇకపై తమ మలాన్ని ‘పూ బ్యాగ్’లో పెట్టుకుని బేస్ క్యాంప్‌కు తీసుకురావాల్సిందే…

ఎవరెస్ట్: పర్వతారోహకులు ఇకపై తమ మలాన్ని ‘పూ బ్యాగ్’లో పెట్టుకుని బేస్ క్యాంప్‌కు తీసుకురావాల్సిందే…

1
0

SOURCE :- BBC NEWS

ఎవరెస్ట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించే పర్వతారోహకులు ఇకపై తమ మలాన్ని తిరిగి బేస్‌ క్యాంప్‌కి తీసుకొచ్చి, పారవేయాలని అధికారులు చెబుతున్నారు.

”మన పర్వతాలు కంపు కొట్టడం మొదలైంది” అని పసాంగ్ లాము రూరల్ మునిసిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా బీబీసీతో చెప్పారు.

ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో ఎక్కువ భాగం ఈ మునిసిపాలిటీ పరిధిలోనే ఉంటుంది. కొత్తగా అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా మునిసిపాలిటీ ఈ నిబంధన ప్రవేశపెట్టింది.

ఎవరెస్ట్ శిఖరంపై ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో ఉండడం వల్ల విసర్జితాలు పూర్తిగా ప్రకృతిలో కలిసిపోవు.

”రాళ్లపై మానవ మలం కనిపిస్తోందని, దాని వల్ల కొందరు పర్వతారోహకులు అనారోగ్యం బారిన పడుతున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది మా ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది” అని మింగ్మా చెప్పారు.

ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంతోపాటు సమీపంలోని మౌంట్ లోట్సే పర్వతాలను అధిరోహించాలనుకునే వారు బేస్ క్యాంపులో మలం భద్రపరిచేందుకు ‘పూ బ్యాగ్’ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత ఆ బ్యాగులను తనిఖీ చేస్తారు.

ఎవరెస్ట్

ఫొటో సోర్స్, BABU SHERPA

పర్వతంపై విసర్జన ఎక్కడ చేయాలి?

పర్వతారోహణ సీజన్‌లో పర్వతాలు అధిరోహించేందుకు వచ్చే వారు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు బేస్ క్యాంపులో ఎక్కువ సమయం గడుపుతారు. అక్కడ ప్రత్యేక టెంట్లలో మరుగుదొడ్లు, విసర్జితాల కోసం టెంట్ల కింద బారెల్స్ ఉంటాయి.

అయితే, వారి ప్రమాదకర ప్రయాణం మొదలైన తర్వాత పరిస్థితులు మరింత కష్టతరమవుతాయి.

చాలా మంది పర్వతారోహకులు, వారి సహాయక సిబ్బంది గుంతతీసి విసర్జన చేసేందుకు మొగ్గుచూపుతారు. పర్వతం పైకి వెళ్లే క్రమంలో కొన్నిప్రదేశాల్లో మంచు తక్కువగా ఉంటుంది. అలాంటి చోట బహిరంగ ప్రదేశంలో టాయిలెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లే వారిలో చాలా తక్కువ మంది బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్‌లో తమ మలాన్ని వెనక్కి తీసుకొస్తారు. ఈ యాత్రకు వారాల సమయం పడుతుంది.

ఎవరెస్ట్, దాని చుట్టుపక్కల ప్రాంతంలోని ఇతర పర్వతాలపై చెత్త పెద్ద సమస్యగా మారింది. ఏడాదికొకసారి నేపాలీ సైన్యంతో పాటు ఇతర పరిశుభ్రతా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎవరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

‘ఓపెన్ టాయిలెట్’

”మానవ వ్యర్థాలు ప్రధాన సమస్యగా మారాయి. ప్రత్యేకించి మనం చేరుకోలేని ఎత్తులో ఉన్న క్యాంపుల వద్ద” అని ప్రభుత్వేతర సంస్థ అయిన సాగర్‌మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(ఎస్పీసీసీ) సీఈవో చిరింగ్ షెర్పా చెప్పారు.

అధికారిక గణాంకాలు లేకపోయినప్పటికీ ఆ సంస్థ అంచనాల ప్రకారం, ఎవరెస్ట్ పర్వతం కింద ఉన్న క్యాంప్ వన్‌(మొదటి క్యాంప్)కి, పర్వత శిఖరానికి వెళ్లే దారిలో ఉన్న క్యాంప్ ఫోర్(నాలుగో క్యాంప్)కి మధ్య దాదాపు 3 టన్నుల మానవ వ్యర్థాలు ఉన్నాయి.

అందులో దాదాపు సగం మానవ వ్యర్థాలు ‘సౌత్ కొల్’ ప్రాంతం వద్దే ఉన్నాయి. దీనినే ‘క్యాంప్ ఫోర్’‌గా పిలుస్తారు.

సౌత్ కొల్‌కి ”ఓపెన్ టాయిలెట్” అని పేరు పడిందని ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలు నిర్వహించే ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్ (అంతర్జాతీయ పర్వతారోహణ మార్గదర్శి) స్టీఫెన్ కెక్ అన్నారు.

పర్వతారోహకులు ఎవరెస్ట్, లోట్సే పర్వత శిఖరాలను అధిరోహించే మార్గంలో, 7,906 మీటర్ల (25,938 అడుగులు) ఎత్తులో ఉండే ఈ సౌత్ కొల్ ప్రాంతం పర్వతారోహకుల బేస్‌గా ఉంటుంది. ఈ ప్రాంతంలో గాలులు బాగా వీస్తాయి.

”అక్కడ గడ్డకట్టిన మంచు, హిమపాతం వంటివి లేకపోవడంతో ఆ ప్రాంతమంతా మానవ వ్యర్థాలు కనిపిస్తాయి” అని కెక్ చెప్పారు.

పసాంగ్ లాము రూరల్ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో, ఎస్పీసీసీ సంస్థ అమెరికా నుంచి దాదాపు 8000 పూ బ్యాగ్‌లను సమీకరిస్తోంది. పర్వతారోహణ సీజన్ మార్చిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సుమారు 400 మంది విదేశీ పర్వతారోహకులు, 800 మంది సహాయక సిబ్బంది అవసరాల మేరకు పూ బ్యాగులను తెప్పిస్తోంది.

ఈ బ్యాగ్స్‌లో ఉండే రసాయనాలు, పౌడర్లు మానవ విసర్జితాలను గట్టిగా మారుస్తాయి. దాదాపు వాసన రాకుండా చేస్తాయి.

సగటున ఒక్కో పర్వతారోహకులు రోజుకు 250 గ్రాముల మానవ వ్యర్థాలను విసర్జిస్తారు. పర్వతారోహణకు వెళ్లిన వారు మార్గంలో ఎత్తైన ప్రాంతంలో ఉండే క్యాంపులలో దాదాపు రెండువారాలు గడుపుతారు.

”దీని ఆధారంగా మేము ఒక్కొక్కరికి రెండు బ్యాగ్‌లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక్కో బ్యాగ్‌ను ఐదు నుంచి ఆరుసార్లు ఉపయోగించవచ్చు” అని చిరింగ్ చెప్పారు.

”ఇది ప్రయోజనకరమే. దీనిని విజయవంతంగా అమలు చేసేందుకు మా వంతు పాత్ర పోషించేందుకు మేం సంతోషిస్తాం” అని నేపాల్‌కు చెందిన ఎక్స్‌పెడిషన్ (పర్వతారోహణ) ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాంబర్ పరాజులి అన్నారు.

ఈ విధానాన్ని ముందుగా ఎవరెస్ట్ పర్వతంపై పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, ఆ తర్వాత ఇతర పర్వతాలపై కూడా అమలు చేయాలని తమ సంస్థ సూచించినట్లు ఆయన చెప్పారు.

ఎవరెస్ట్

ఫొటో సోర్స్, BABU SHERPA

మానవ వ్యర్థాల నిర్వహణకు ఇలాంటి బ్యాగ్స్ వినియోగాన్ని ఇతర పర్వతాలపై ప్రయత్నించి, పరీక్షించినట్లు మింగ్మా షెర్పా చెప్పారు. ఈయన 8000 మీటర్ల పైగా ఎత్తున్న 14 పర్వతాలను అధిరోహించిన మొదటి నేపాలీ.

”ఉత్తర అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ డెనాలి, అంటార్కిటికాలో కూడా పర్వతారోహకులు ఇలాంటి బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. అందుకే అలాంటి వాటిని ఇక్కడ కూడా వాడాలని అంటున్నాం” అని నేపాలీ మౌంటెనీరింగ్ అసోసియేషన్‌కి సలహాదారుడిగానూ ఉన్న మింగ్మా చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్ కెక్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. ఇది పర్వతాలను శుభ్రంగా ఉంచేందుకు సాయపడుతుందని అన్నారు.

నేపాల్ ప్రభుత్వం గతంలో పర్వతారోహణకు సంబంధించి అనేక నిబంధనలను ప్రకటించినప్పటికీ, అవి సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

అవి అమలు కాకపోవడానికి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకునే అధికారులు లేకపోవడం ప్రధాన కారణాలలో ఒకటి. బేస్ క్యాంపుల వద్ద పర్వతారోహకుల బృందాలతో ప్రభుత్వ అధికారులు ఉండాలి. కానీ, చాలా వరకూ వారు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.

”బేస్ క్యాంపుల వద్ద ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అనుమతులు లేకుండా పర్వతారోహణకు వెళ్లడం వంటి వాటితో పాటు అనేక అక్రమాలు జరుగుతున్నాయి” అని మింగ్మా చెప్పారు.

”ఇకపై ఇవన్నీ మారతాయి. సంప్రదింపుల కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. పర్వతారోహకులు తమ మలాన్ని తిరిగి తీసుకురావడంతో పాటు, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు అన్నీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం” అన్నారు.

ఇవి కూడా చదవండి:

SOURCE : BBC NEWS