Home జాతీయ national telgu ఉత్తరాఖండ్‌: హల్ద్వానీలోని మదర్సా తొలగింపు సమయంలో ఏం జరిగింది?

ఉత్తరాఖండ్‌: హల్ద్వానీలోని మదర్సా తొలగింపు సమయంలో ఏం జరిగింది?

1
0

SOURCE :- BBC NEWS

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, ANI

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలోని బంభుల్‌పురాలో గురువారం సాయంత్రం హింస చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఆక్రమణల తొలగింపు జరుగుతుండగా రాళ్ల దాడి ప్రారంభమైందని నైనిటాల్ పోలీసులు చెప్పారు.

ఓ వర్గం వాళ్లు రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పంటించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు.

ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అల్లరిమూకలను కాల్చిపడేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపల్ ఉద్యోగులు, పోలీసులు మదర్సాను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. హింసాకాండలో ఇద్దరు మరణించారని నైనిటాల్ జిల్లా కలెక్టర్ వందనా సింగ్ తెలిపారు.

హల్ద్వానీలో కర్ఫ్యూ విధించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. హింసాత్మక మూక చాలా వాహనాలను తగులబెట్టిందన్నారు. నిరసనకారులెంతమంది అనేది ప్రస్తుతం చెప్పలేమని తెలిపారు.

ఈ హింసాకాండలో డజను మంది జర్నలిస్టులు, పలువురు పోలీసులు, ఇతర అధికారులు గాయపడ్డారు.

భద్రతా కారణాలతో కేంద్ర బలగాలకు చెందిన నాలుగు బెటాలియన్లను, సమీప జిల్లాల నుంచి పోలీసులను గురువారం సాయంత్రం హల్ద్వానీకి రప్పించారు.

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మదర్సా నిర్మించారని, గతంలోనే కూల్చివేత నోటీసు ఇచ్చామని ఏరియా ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ మీనా తెలిపారు.

సీఎం పుష్కర్ సింగ్ ధామి

ఫొటో సోర్స్, Getty Images

సీఎం ఏం చెప్పారు?

అధికారులపై దాడి చేసి, ఆ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితి సృష్టించడాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్‌గా తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరూ విఘాతం కలిగించకుండా చూడాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారని తెలిపింది.

“బంభుల్‌పురాలో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫోన్‌లో తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అల్లరిమూకలను కాల్చివేయాలని ఆదేశాలిచ్చారు” అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

అసలేం జరిగింది?

హల్ద్వానీలోని బంభుల్‌పురా ప్రాంతంలో రైల్వే భూమిపై ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం చేపట్టింది. ఇది జనసాంద్రత కలిగిన ప్రాంతం, అంతేకాదు, ఇక్కడ మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

గురువారం సాయంత్రం మదర్సా కూల్చివేత పనులు ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు. దీంతో తోపులాట జరిగింది.

అనంతరం రాళ్ల దాడి ప్రారంభమైంది. దీంతో పోలీసులు కూడా ప్రతిస్పందించారు.

అల్లరిమూక బన్‌ఫూల్‌పురా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడి వాహనాలకు నిప్పంటించిందని అధికారులు చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ఒక ప్రాపర్టీ లక్ష్యంగా చేయడం లేదని కలెక్టర్ వందనా సింగ్ తెలిపారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఆస్తుల ఆక్రమణలను తొలగించాలని హల్ద్వానీలో గత 15-20 రోజులుగా ప్రచారం జరుగుతోందన్నారు.

హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వందనా సింగ్ చెప్పారు.

ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణల తొలగింపునకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆస్తులను మ్యాపింగ్‌ చేశామని, మార్గదర్శకాలు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.

”నగర కూడలి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి, ఇందుకోసం చట్ట ప్రకారం నోటీసులిచ్చి, అందరి వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాం. కమిటీ ప్రతి ఒక్కరి వాదనలు విని, కేసులను పరిష్కరించింది, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు” అని కలెక్టర్ తెలిపారు.

బంభుల్‌పురా నిర్మాణాల గురించి వందనా సింగ్ మాట్లాడుతూ- ”ఆ ప్రాంతంలో రెండు నిర్మాణాలున్నాయి. ఎక్కడా రిజిస్టర్ కాలేదు, ఏ మతపరమైన నిర్మాణంగానూ గుర్తించలేదు. వీటిని మద్రాసాలు అని పిలుస్తారు, కొందరు నమాజ్ పూర్వ స్థలాలంటారు” అన్నారు.

“ఈ ప్రాంతాన్ని మాలిక్ గార్డెన్ అని పిలుస్తారు, కానీ పత్రాలలో మాలిక్ గార్డెన్‌గా నమోదు కాలేదు, మున్సిపల్ కార్పొరేషన్ నాజుల్ భూమిగా నమోదైంది” అని కలెక్టర్ తెలిపారు.

“ఈ నిర్మాణాలపై ఆక్రమణలు తొలగించాలని నోటీసులిచ్చాం. సరైన పత్రాలు సమర్పించాలని కోరాం, లేని పక్షంలో కార్పొరేషన్ నిర్మాణాన్ని తొలగిస్తుందని సూచించాం” అని చెప్పారు.

మృతులపై గందరగోళం ఎందుకు?

హింసాకాండలో ఇద్దరు మరణించినట్లు వందనా సింగ్ ధృవీకరించారు, గతంలో నలుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి.

”కృష్ణా ఆసుపత్రిలో ఇద్దరు, ఎస్‌టీహెచ్‌ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోయారని సమాచారం వచ్చింది. ఆ తర్వాత కృష్ణా ఆసుపత్రికి చనిపోయిన వారిని తీసుకొచ్చారని, వారు చేర్చుకోకపోవడంతో ఎస్‌టీహెచ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారని, దీని కారణంగా మరణాల సంఖ్యలో కొంత గందరగోళం ఏర్పడింది” అని ఆమె అన్నారు.

ఇక ఆ ప్రాంతంలో చెలరేగిన హింస గురించి వందనా సింగ్ మాట్లాడుతూ- “పోలీసులు, అధికారులు ఎవరినీ రెచ్చగొట్టలేదు, ఎవరినీ చంపలేదు, ఎవరికీ హాని కలిగించడానికి ప్రయత్నించలేదు. పెట్రోల్ బాంబులు విసిరి, వాహనాలు తగులబెట్టిన అల్లరి మూకలు బంభుల్‌పురా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు” అని తెలిపారు.

ఆ సమయంలో స్టేషన్‌లో పోలీసులు ఉన్నారని, అక్కడ పొగలు వ్యాపించాయని, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని వందనా సింగ్ తెలిపారు.

“అక్కడి నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు, వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసులు వాటర్ ఫిరంగి ప్రయోగించారు, కానీ జనం కదల్లేదు. ఇంతలో గుంపులో నుంచి బుల్లెట్లు వచ్చాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మనుషుల ప్రాణాలు తీసిన బుల్లెట్లు అల్లరి మూకల గుంపులో నుంచి వచ్చాయా, లేదా పోలీసులు కాల్చారా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది” అన్నారు వందన.

సెక్యూరిటీ గురించి వందనా సింగ్ స్పందిస్తూ ”ఈ ప్రాంతంలో కేంద్ర బలగాలు మోహరించాయి. సమీప జిల్లాల నుంచి పోలీసులను మోహరించాం” అన్నారు.

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, ANI

స్థానికులు ఏమంటున్నారు?

నాజూల్ ల్యాండ్‌లోనే మదర్సా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే, నాజుల్ భూమి ప్రభుత్వానిది అయినప్పటికీ అధికారికంగా రెవెన్యూ పత్రాల్లో నమోదుకాలేదు.

ఈ మసీదును అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి నిర్మించారని బంభుల్‌పురా నివాసి జాఫర్ సిద్ధిఖీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికతో చెప్పారు. ఈ భూమిని అబ్దుల్ మాలిక్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

“గత నాలుగైదు రోజులుగా పోలీసులు ఈ ప్రాంతానికి వస్తున్నారు, మదర్సా, మసీదును కూల్చేస్తామని చెప్పారు. గురువారం ఉదయం అధికారులు జేసీబీతో ఇక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో నేను చేరుకున్నాను. ఇక్కడ రాళ్లు రువ్వారని, వాహనాలకు నిప్పు పెట్టారని తెలిసింది” అని తెలిపారు.

“కొందరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ కూడా విధ్వంసం చేశారు. ఇదంతా 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగింది. ప్రస్తుతానికి, ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. మేం మా ఇళ్లకు తాళాలు వేసుకున్నాం” అని జాఫర్ తెలిపారు.

సిరాజ్ ఖాన్ అనే వ్యక్తి మసీదుకు 500 మీటర్ల దూరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. చాలా పోలీసు వాహనాలు రావడంతో ఇక్కడ హింస జరిగినట్లు తెలిసిందని సిరాజ్ తెలిపారు.

దీంతో త్వరగా తన దుకాణాన్ని మూసివేసి, ఇంటికి వెళ్లి తాళం వేసుకుని కుటుంబంతో పాటు ఇంట్లోనే ఉన్నామని చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.