Home జాతీయ national telgu ఇరాన్ – అమెరికా : తదుపరి అడుగు ఎటువైపు? భవిష్యత్తును తేల్చే 4 కీలక పరిణామాలు...

ఇరాన్ – అమెరికా : తదుపరి అడుగు ఎటువైపు? భవిష్యత్తును తేల్చే 4 కీలక పరిణామాలు ఏమిటి?

25
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు వెళ్లడంతో, కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో అమెరికా రెండో విడత చర్చలు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు.

పాకిస్తాన్‌ ఆతిథ్యంలో, ఇస్లామాబాద్‌లో 20 గంటలకు పైగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసినా, రెండు వారాల కాల్పుల విరమణ ఇంకా అమల్లోనే ఉంది.

చర్చలు విఫలమైన తర్వాత, ఇరాన్‌పై తమ కొత్త వ్యూహంగా అభివర్ణిస్తూ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో, అంతర్జాతీయ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి దిగ్భంధం గురించి వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు.

అయితే, ఎలాంటి ఒప్పందం కుదరకుండానే మొదటి దశ చర్చలు విఫలం కావడం, మరోసారి చర్చలు జరిగే అవకాశముందా అనే విషయాలను ఎలా చూడాలి? ఇరాన్, అమెరికా పరిమిత ఉద్రిక్తతల దిశగా పయనిస్తున్నాయా? లేదంటే, విస్తృత స్థాయి యుద్ధానికి దిగబోతున్నాయా?

ఏం జరగవచ్చనే నాలుగు పరిణామాల గురించి ఇక్కడ తెలుసుకుందాం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఇరాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

1.కాల్పుల విరమణ ‘వ్యూహాత్మకమా’?

కొద్దివారాల పాటు కొనసాగిన ఘర్షణల తర్వాత అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. పరిస్థితిని అదుపులోకి తేవడానికి, ఇరుపక్షాల సుముఖతకు సంకేతంగా కనిపించింది. కానీ, మొదటి నుంచి ఇందులో స్పష్టత లేని అంశాలు చాలానే ఉన్నాయి.

దాని భౌగోళిక పరిధి, లక్ష్యాల తీరుతెన్నులు, “కాల్పుల విరమణ ఉల్లంఘన” నిర్వచనం వంటి నిబంధనల్లో భేదాభిప్రాయాలు ఈ ఒప్పందాన్ని ఒక పరిష్కార మార్గాన్ని చూపే స్థిరమైన వ్యవస్థగా కంటే, దీనిని ఒక వ్యూహాత్మక విరామంగానే పరిశీలకులు భావించేందుకు కారణమయ్యాయి.

“ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచీ, ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యంగానే కనిపించాయి” అని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్ ‘ఫౌండేషన్ ఫర్ డెమొక్రసీస్’ సీనియర్ ఫెలో బెహ్నామ్ బెన్ టలేబ్లు పేర్కొన్నారు.

“ఇవి అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఏళ్లుగా విభేదిస్తున్న సూత్రాలు, వైఖరులు, విధానాలు. స్వల్పకాలం పాటు జరిగిన ఈ యుద్ధం, విభేదాలను తగ్గించడంలో విఫలం కావడమే కాకుండా మరింత తీవ్రతరం చేసింది” అని ఆయన బీబీసీ న్యూస్ పర్షియన్‌‌తో అన్నారు.

ఇదిలా ఉంటే, ఇరుపక్షాల అధికారవర్గాల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి.

ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారులు పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనల గురించి ప్రస్తావిస్తుంటే.. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం తమ హామీల పరిమితుల గురించి మాట్లాడుతున్నాయి.

ఈ భిన్నవాదనలు అపనమ్మకాన్ని మరింత పెంచడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా లేదా అనే సందేహాలనూ లేవనెత్తాయి.

మరోసారి చర్చల కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు కనుక ఫలించకపోతే.. ఈ కాల్పుల విరమణ కేవలం కాలయాపన కోసం, ఇరుపక్షాలు కాస్త విరామం తీసుకుని, తమను తాము పునరుద్ధరించుకుని, తిరిగి శక్తులను సమీకరించుకుని, తమ ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుని, ఘర్షణలో తదుపరి దశకు సిద్ధమయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది.

ప్రస్తుత పరిస్థితి వల్ల తమకు పెద్దగా ప్రయోజనం లేదని, ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి తేవాలని ఒక పక్షం నిర్ధరించుకుంటే మాత్రం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుంది.

ఉదాహరణకు, విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, లేదా ఇంధన ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చు.

ఇలాంటి దాడులు ప్రత్యర్థిపై తక్షణమే తీవ్రమైన ఒత్తిడిని కలిగించినప్పటికీ మానవతాపరమైన, ఆర్థికపరమైన తీవ్ర పరిణామాలకు దారితీయచ్చు.

ఇరాన్ నుంచి కూడా ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉండచ్చు.

అలాగే, చర్చల విషయంలో ఎన్నో సందేహాలతో ఉన్న ఇజ్రాయెల్ ప్రభావవంతమైన శక్తిగా మారే అవకాశముంది.

“చర్చల్లో పాల్గొన్న వారితో సహా ఇరానీ ప్రముఖుల హత్యల వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడవచ్చు” అని అంతర్జాతీయ సంబంధాల పరిశోధకులు హమీద్‌ రెజా అజీజి అన్నారు.

“డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన హార్ముజ్ దిగ్భంధనం వంటి విధానాలు, ఇతర పక్షాలకు అలాంటి ఉద్దేశాలు లేకపోయినప్పటికీ ఘర్షణల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి” అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, AFP via Getty Images

2. ‘షాడో వార్’

మరో పరిణామం ఏంటంటే.. ‘పరిమిత ఉద్రిక్తత’గా అభివర్ణించే ఒక రకమైన ఘర్షణ మళ్లీ జరగడం.

అంటే, ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారదు, అలాగని రెండుపక్షాలూ సైనిక చర్యలకు దూరంగానూ ఉండవు. మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలు, సరఫరా వ్యవస్థలపై పరిమిత స్థాయిలో దాడులు కొనసాగవచ్చు.

అలాంటప్పుడు, పరోక్ష శక్తుల ప్రమేయం మరింత కీలకంగా మారుతుంది. ఇరాక్ లేదా ఎర్ర సముద్రంలో ఇరాన్ అనుకూల గ్రూపుల కార్యకలాపాలు పెరగడం, అదే సమయంలో ఈ నెట్‌వర్క్‌‌లపై అమెరికా ఒత్తిడి పెరగడంతో ఘర్షణ తీవ్రతరం కాకుండానే భౌగోళిక పరిధి విస్తరించవచ్చు. అలాంటి పరిస్థితిని కొందరు విశ్లేషకులు షాడో వార్‌గా అభివర్ణిస్తారు.

“పూర్తిస్థాయి యుద్ధానికి దిగకుండానే, ఒకరిపై మరొకరు తీవ్ర ప్రభావం చూపగలిగే అవకాశాలను, మార్గాలను వినియోగించుకోవాలని ఇరుపక్షాలూ భావిస్తున్నాయి” అని హమీద్ రెజా అజీజి బీబీసీ న్యూస్ పర్షియన్‌తో అన్నారు.

“ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరిగితే, ఇరాన్ తన అనుకూల గ్రూపుల ద్వారా, మరీముఖ్యంగా యెమెన్‌లో కొత్త చర్యలకు దిగే అవకాశముందని అంచనాలున్నాయి” అని ఆయన చెప్పారు.

అయితే, ఇందులో ప్రమాదాలూ లేకపోలేదు. ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ, తప్పుడు అంచనాల ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో, ఒక్క తప్పుడు అంచనా కూడా ఈ ఘర్షణను అదుపు చేయలేని స్థాయికి తీసుకెళ్లవచ్చు.

ఇరాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Pool/Getty Images

3.నిశ్శబ్ద దౌత్యం

పాకిస్తాన్‌లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ.. దౌత్య ప్రయత్నాలు ముగిసిపోయాయనీ, ఇక చర్చలకు ఆస్కారం లేదని నిర్ధరణకు రావాల్సిన అవసరం లేదు.

ఈ చర్చలకు మధ్యవర్తిత్తం వహిస్తున్న దేశంగా పాకిస్తాన్.. రానున్న రోజుల్లో తెహ్రాన్, వాషింగ్టన్ మధ్య సందేశాలను చేరవేస్తూ.. ఇరుపక్షాలూ ఒక ఒప్పందానికి వచ్చేలా తన ప్రయత్నాలను కొనసాగించే అవకాశముంది.

అలాగే, ఈ ఘర్షణ అదుపుతప్పిపోయే ప్రమదముందన్న ఆందోళన నేపథ్యంలో ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి సంప్రదాయ మధ్యవర్తులు కూడా ముందుకు రావచ్చు. రాయబారులుగా వ్యవహరిస్తూ, ఈ సంక్షోభం తీవ్రతరం కాకుండా నివారించేందుకు ప్రయత్నించవచ్చు.

అయితే ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే.. ఇందులో ఏదైనా పురోగతి సాధించాలంటే ఇరుపక్షాల మధ్య నెలకొన్న తీవ్రమైన ప్రాథమిక అంతరాలను తగ్గించాల్సి ఉంటుంది.

అమెరికా 15 అంశాల ప్రతిపాదన, ఇరాన్ 10 అంశాల ప్రతిపాదనల ఆధారంగా చూస్తే.. ఇరుపక్షాలు మధ్యేమార్గానికి రావడం కంటే, తమ విధానాలను బలంగా రుద్దాలనే వైఖరులతోనే ఇప్పటికీ ఉన్నట్లు అవగతమవుతోంది.

అందువల్ల మరోవిడత చర్చలు జరిగినప్పటికీ, తాత్కాలికంగానైనా వేగవంతమైన, సమగ్రమైన ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.

ఇరాన్, అమెరికా, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

4.నౌకల దిగ్బంధం

హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలు, చమురు ట్యాంకర్లు రాకపోకలు సాగించకుండా అడ్డుకునేందుకు ఇరాన్‌ చుట్టూ సముద్ర దిగ్బంధనం చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఈ జలసంధి మీదుగా వెళ్లడం కోసం ఇరాన్‌కు టోల్ చెల్లించే ఓడలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. దీనిద్వారా ఇరాన్‌కు చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని దూరం చేయడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, అలాగే ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాను దెబ్బతీయడమే ఈ వ్యూహం లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇరాన్ సుదీర్థ తీరప్రాంతం గురించి బెహ్నామ్ బెన్ టలేబ్లు ప్రస్తావిస్తూ, “నిఘా సమాచార సేకరణ, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యర్థి ప్రాంతాల పరిశీలనకు తగినన్ని వనరులను కేటాయిస్తే, ఇస్లామిక్ రిపబ్లిక్ పోర్టులపై సముద్ర దిగ్బంధనం తీవ్ర ప్రభావం చూపుతుంది” అని అన్నారు.

“అలా చేయడం వల్ల వచ్చే ఫలితమేంటంటే, ప్రభుత్వం తన సరుకులను ఎగుమతి చేసుకునే సామర్థ్యం కోల్పోయేలా చేయడం.”

అయితే, ఇలాంటి విధానాలతో అమెరికాకు భారీ నష్టం కలగవచ్చని, అమెరికన్ బలగాలు ఇరాన్‌కు దగ్గరవడంతో దాడులకు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుందని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్లాన్ ప్రభావవంతంగా పనిచేయాలంటే అమెరికన్ నావికా దళాలు భారీ ఖర్చును భరిస్తూ, సుదీర్ఘకాలం పాటు ఇరాన్ సరిహద్దుల్లో మోహరించాల్సి ఉంటుందంటున్నారు.

ఇలాంటి విధానాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయి. అలాగే బాబ్ అల్ మండేబ్ జలసంధికి హూతీలు అంతరాయం కలిగించే అవకాశాలు కూడా పెరుగుతాయి. అదే జరిగితే చమురు ధరలు మరింతగా పెరిగిపోయే అవకాశముంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)