Home జాతీయ national telgu ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకలేంటి?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకలేంటి?

1
0

SOURCE :- BBC NEWS

bandaru sravani, vemireddy prashanthi reddy, piriya vijaya, roja selvamani

ఫొటో సోర్స్, facebook

ఒక గంట క్రితం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీల నుంచి 54 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. పాలక వైసీపీ 23 మంది మహిళా అభ్యర్థులను పోటీలో నిలపగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి 23 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

వీరిలో కొందరు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచినావారు.. మంత్రి పదవులు చేపట్టినవారు కాగా మరికొందరు మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలు రెండిటి నుంచీ మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు.

Bandaru Sravani Sree

ఫొటో సోర్స్, Bandaru Sravani Sree

వడదెబ్బతో ప్రచారానికి దూరమైన బండారు శ్రావణి

ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం శింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న 34 ఏళ్ల బండారు శ్రావణిశ్రీకి పార్టీ శ్రేణులలో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

2019 ఎన్నికలలో తొలిసారి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరోసారి బండారు శ్రావణికే టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పోటీ చేస్తుండడంతో ఇక్కడ పోటీ తీవ్రంగానే ఉంది.

మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చదువుకున్న శ్రావణికి ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారన్న పేరుంది.

కాగా… పెద్దఎత్తున ప్రచారం చేస్తున్న ఆమె ఇటీవల వడదెబ్బకు గురవడంతో ప్రచారానికి విరామమిచ్చారు. దీంతో ఆమె సోదరి కిన్నెర ఆమె తరఫున ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.

Paritala sunitha

ఫొటో సోర్స్, Paritala sunitha/facebook

రాప్తాడులో మళ్లీ పోటీ చేస్తున్న పరిటాల సునీత

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన పరిటాల సునీత ఒక విడత విరామం తరువాత మళ్లీ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

2009, 2014 ఎన్నికలలో రాప్తాడు నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమె 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమెకు బదులు కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాప్తాడు స్థానాన్ని టీడీపీ చేజార్చుకుంది.

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు.

అయితే, ప్రస్తుత 2024 ఎన్నికలలో టీడీపీ నాయకత్వం మరోసారి పరిటాల సునీతనే పోటీలో నిలిపింది.

2009 నుంచి వరుసగా మూడు ఎన్నికలలోనూ తనపై, తన కుమారుడిపై పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే ఈసారి అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు.

Roja Selvamani

ఫొటో సోర్స్, Roja Selvamani

నగరిలో రోజా

ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడడంలో ముందుండే మంత్రి ఆర్‌కే రోజా మరోసారి తన సిటింగ్ స్థానం నగరి నుంచి మరోసారి బరిలో ఉన్నారు.

2014, 2019 ఎన్నికలలో తక్కువ ఆధిక్యాలతో బయటపడిన ఆమె ఈసారి కూడా పాత ప్రత్యర్థి గాలి భానుప్రకాశ్‌తో పోటీ పడుతున్నారు.

గతంలో మూడుసార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసిన రోజా రెండు సార్లు విజయం అందుకోగా 2004లో ఓటమి పాలయ్యారు.

గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జగన్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు.

Murugudu Lavanya

ఫొటో సోర్స్, Murugudu Lavanya/facebook

మంగళగిరిలో మురుగుడు లావణ్య

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్య. గత ఎన్నికలలో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా 38 ఏళ్ల మురుగుడు లావణ్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది.

మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్య ఎంఏ ఇంగ్లిష్ చదువుకున్నారు. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజికవర్గానికి చెందిన లావణ్యను వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీలో నిలిపింది. మురుగుడు లావణ్యకు ఇవే తొలి ఎన్నికలు.

Vemireddy Prashanthi Reddy

ఫొటో సోర్స్, Vemireddy Prashanthi Reddy/facebook

కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీడీపీలో చేరి టికెట్ దక్కించకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ వైసీపీని వీడి మార్చ్ నెలలో టీడీపీ చేరారు.

ప్రశాంతి రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు మహిళలు ఎవరూ గెలవలేదు.

ప్రశాంతి రెడ్డి విజయం సాధిస్తే ఆ నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యే అవుతారు. వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు.

TN Deepika

ఫొటో సోర్స్, TN Deepika/facebook

బాలకృష్ణపై పోటీ చేస్తున్న దీపిక

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి.

నందమూరి బాలకృష్ణపై ప్రతిసారీ అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ ఈసారి కూడా కొత్త అభ్యర్థినే బరిలో నిలిపింది.

Vanga Geetha

ఫొటో సోర్స్, Vanga Geetha/facebook

పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వంగా గీత

పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో వైసీపీ నుంచి తలపడుతున్న నేత వంగా గీత. గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమెను వైసీపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయిస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె 2000లో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఇదే పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్న ఆమె ఆ ఎన్నికలలో విజయం సాధించారు.

madhavi lokam

ఫొటో సోర్స్, madhavi lokam/facebook

జనసేన నుంచి ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి

జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆమె నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం బరిలో ఉన్నారు.

అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుకున్న ఆమె భర్తతో కలిసి మిరకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు.

సుమారు రూ. 900 కోట్ల ఆస్తులతో ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంపన్న అభ్యర్థులలో ఒకరిగా వార్తలకెక్కారు.

ఈ ఎన్నికలలో వైసీపీ నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుతో ఆమె పోటీ పడుతున్నారు.

Yanamala Divya

ఫొటో సోర్స్, Yanamala Divya /facebook

తునిలో యనమల రామకృష్ణుడి కూతురు

మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వరుసగా ఆరుసార్లు గెలిచిన తుని నియోజకవర్గంలో ఈసారి ఆయన కుమార్తె దివ్య పోటీ చేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తునిలో గత మూడు ఎన్నికలుగా ఆ పార్టీ ఓటమి పాలవుతోంది.

2009లో యనమల రామకృష్ణుడు ఇక్కడ ఓడిపోయిన తరువాత 2014, 2019లో ఆయన సోదరుడు కృష్ణుడు ఇక్కడ పోటీ చేశారు.

రెండుసార్లూ ఆయన వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓటమిపాలయ్యరు.

దీంతో తెలుగుదేశం పార్టీ ఈసారి యనమల దివ్యకు టికెట్ కేటాయించింది. దివ్యకు టికెట్ ఇవ్వడంతో యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు.

తొలిసారి ఎన్నికలలో పోటీ చేస్తున్న దివ్య విజయం సాధిస్తే 1978 తరవాత ఈ నియోజక వర్గంలో గెలిచిన మహిళా అభ్యర్థి అవుతారు. అంతకుముందు 1972, 78లో రెండు సార్లు ఎన్.విజయలక్ష్మి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.

Usha sri charan, savitha

ఫొటో సోర్స్, facebook

ఆ నాలుగు చోట్ల మహిళల మధ్యే ప్రధాన పోటీ

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాలలో నాలుగు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ మహిళలే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి ఈసారి మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో ఉన్నారు.

ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కురుపాంలో వైసీపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ తోయక జగదీశ్వరి బరిలో ఉన్నారు.

రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి బరిలో ఉండగా టీడీపీ నుంచి మిరియాల శిరీష పోటీ చేస్తున్నారు.

పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అక్కడ సవిత పోటీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: