Home జాతీయ national telgu నందిగ్రామ్‌లో ‘తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అంటూ ఆరోపణలు

నందిగ్రామ్‌లో ‘తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అంటూ ఆరోపణలు

25
0

SOURCE :- BBC NEWS

పేరు, ఓటర్ల జాబితా,ఎలక్షన్ కమిషన్, ఓట్లు గల్లంతు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశీయులు, ముస్లింలు, భారత్, ఎన్నికలు

నందిగ్రామ్‌లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. కానీ మామోని ఖాతూన్ ఈసారి ఓటు వేయలేరు.

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మొహమ్మద్‌పూర్ గ్రామానికి చెందిన మామోని, తన తల్లిదండ్రులకు, తనకు మధ్య వయస్సు అంతరం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉందన్న కారణంతో ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు.

తన పేరును తొలగించడానికి గల కారణాలు ఏంటో మామోనికి అంతుపట్టలేదు. మొహమ్మద్‌పూర్‌లో మామోనిలాగే చాలామంది స్త్రీ పురుషులు ఎన్నికల సంఘం నోటీసులు పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

“మా నాన్నగారు రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు పదిమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆరుగురి కంటే ఎక్కువమంది మా నాన్నగారిని తమ తండ్రిగా చెప్పుకుంటున్నారని ఎన్నికల సంఘం తన నోటీసులో చెబుతోంది. అందుకే నాపై విచారణ జరుగుతోంది. నా తండ్రి అజీజ్ ఖాన్‌కు ఉన్న మిగతా 9మంది పిల్లలు ఇంకెవరినైనా తమ తండ్రిగా చెప్పాలా?” అని ఎన్నికల సంఘం నోటీసును చూపిస్తూ, 30 ఏళ్ల జియారుల్ ఖాన్ అడుగుతున్నారు.

“నాకు ఐదుగురు పిల్లలే ఉన్నారు. కానీ చూడండి…ఎన్నికల సంఘం నోటీసులో నాకు ఆరుగురు పిల్లలు ఉన్నారని రాసి, ముగ్గురి పేర్లను తొలగించారు. మేం సాక్ష్యాలు చూపించి చూపించి అలసిపోయాం. ప్రభుత్వం చెబుతున్నదానికి అసలు అర్థమేలేదు” అని జియారుల్ పక్కనున్న 60 ఏళ్ల మోతీ ఖాన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

చాలామంది ఓటర్లకు ఆరుగురి కంటే తక్కువ తోబుట్టువులు ఉన్నప్పటికీ, వారి పేర్లను ఎందుకు తొలగించారని తూర్పు మేదినీపూర్ జిల్లా ఎన్నికల అధికారి నిరంజన్ కుమార్‌ను బీబీసీ ప్రశ్నించింది.

మరోవైపు, ఓటర్లకు పంపిస్తున్న నోటీసుల్లో చూపిస్తున్న కొన్ని కారణాలపై ప్రజల్లో అసహనం వ్యక్తమైంది.

దీనిపై నిరంజన్ కుమార్ మాట్లాడుతూ, “ఈ విషయం సుప్రీంకోర్టులో ఉంది. ప్రస్తుతం మేం దాని గురించి ఎక్కువగా చెప్పలేం. దర్యాప్తు కొనసాగుతోంది, పత్రాలు సరైనవని తేలితే, పేర్లను తిరిగి జాబితాలో చేరుస్తాం” అని అన్నారు.

నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీకి చెందిన సువెందు అధికారి పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో మమతా బెనర్జీపై సువెందు పోటీ చేయగా, ఆమె 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి నందిగ్రామ్‌లో ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ (తార్కికంగా సరిపోని లేదా అసాధారణంగా కనిపించే వివరాలు) అనే కారణం కింద 3,461 మంది ఓటర్లను తొలగించారు.

తొలగించిన వారి జాబితాలో సుమారు 95 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని కోల్‌కతాలోని సబర్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) డేటాను విశ్లేషిస్తుంది.

దీని అర్థం ఏంటంటే నందిగ్రామ్‌లో పేర్లు గల్లంతైన 3,461 మంది ఓటర్లలో ఎక్కువమంది అంటే 3,270 మంది ముస్లిం ఓటర్లు కాగా, 191 మంది మాత్రమే ముస్లిమేతర ఓటర్లు. 2011 జనగణన ప్రకారం నందిగ్రామ్ జనాభాలో 70 శాతానికి పైగా ముస్లిమేతరులు ఉన్నారన్న గణాంకాలకు ఇది విరుద్ధంగా కనిపిస్తోంది.

పేరు, ఓటర్ల జాబితా,ఎలక్షన్ కమిషన్, ఓట్లు గల్లంతు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశీయులు, ముస్లింలు, భారత్, ఎన్నికలు

లాజికల్ డిస్క్రిపెన్సీ

నందిగ్రామ్‌లో ఓటరుకు వారి తల్లిదండ్రులకు మధ్య వయసులో తేడా తక్కువగా ఉండటాన్ని ఓటరు పేరు తొలగించడానికి ఒక కారణంగా చూపిస్తుండగా, మరోవైపు ఒక ఓటరు తండ్రి ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మందికి తండ్రి అని ఆరోపణలొచ్చినా కూడా ఆ విషయాన్ని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు.

రెండు పత్రాలలో పేరు స్పెల్లింగ్ సరిపోలకపోయినా, లేదా ఇంటిపేరులో ఒక అక్షరం లోపించినా, ఆ పేర్లను కొట్టివేస్తారు. తల్లిదండ్రుల వయస్సుతో పోల్చినప్పుడు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు అంతరం ఉన్న ఓటర్ల పేర్లను కూడా తొలగిస్తారు.

వాస్తవానికి, సర్ రెండో దశలో, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో లాజికల్ డిస్క్రిపెన్సీ కారణంగా ఎన్నికల సంఘం వేలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.

ఇలా ఆరోపించిన వాటిలో అక్షరదోషాలు, ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం, వయస్సు తేడా వంటివి ఉంటాయి.

ఈ ఏడాది జనవరిలో ఎన్నికల సంఘం లాజికల్ డిస్క్రిపెన్సీ ‌కి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో లాజికల్ డిస్క్రిపెన్సీకి కమిషన్ కొన్ని ఉదాహరణలిచ్చింది.

అవి ఒకే వ్యక్తిని 200 మందికి పైగా తమ తండ్రిగా పేర్కొనడం, మరొకరిని 100 మందికి పైగా తండ్రిగా చూపించడం, అలాగే 10 మంది పేర్లపై 50 మందికి పైగా పిల్లలుగా నమోదు కావడం వంటి విషయాలు.

కొంతమంది ఓటర్లను అసాధారణంగా అధిక సంఖ్యలో ప్రజలు తండ్రులుగా పేర్కొన్నారని కమిషన్ పేర్కొంది. ఈ తరహా అసాధారణ నమోదు ఉన్నప్పుడు వాటిని శాస్త్రీయంగా సరైన మ్యాపింగ్‌గా పరిగణించలేమని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఒకే వ్యక్తిని తండ్రిగా పేర్కొంటే, ఆ వ్యక్తి లేదా వ్యక్తులను ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంచింది.

ఎన్నికల సంఘం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను ఎందుకు ప్రమాణంగా పెట్టింది?

సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు రాకేశ్ ద్వివేది, ఏకలవ్య ద్వివేది, ఎన్నికల సంఘానికి అనుకూలంగా వాదిస్తూ, “2019-2021 మధ్య నిర్వహించిన ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5 సర్వే ప్రకారం భారతదేశంలో సగటు కుటుంబ పరిమాణం 4.4. అంటే సగటున ప్రతి కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒంటరి తల్లి/తండ్రితో సంబంధం ఉన్న ఓటర్లు 50మందికి పైగా ఉన్నట్లు తేలింది” అని అన్నారు.

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య 50 ఏళ్ల వయసు తేడా ఉండటాన్ని కూడా ఒక లాజికల్ డిస్క్రిపెన్సీగా గుర్తించారు. 45 ఏళ్ల తర్వాత మహిళల సంతానోత్పత్తి రేటు సున్నాకు పడిపోతుందని ఎన్నికల సంఘం వాదించింది.

అయితే సబర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అయిన సబర్ అహ్మద్, ఎన్నికల సంఘం వాదనలతో విభేదించారు.

“200 మందికి పైగా ప్రజలు ఒకే వ్యక్తిని తమ తండ్రిగా పేర్కొన్నారని ఎన్నికల సంఘం నివేదించింది. దీనికి రెండు మూడు కారణాలు ఉండవచ్చు. అనాథాశ్రమాలలో పిల్లలకు తండ్రి ఉండరు. ఉదాహరణకు, రామకృష్ణ మిషన్ అనాథాశ్రమాన్ని తీసుకోండి. ఆ అనాథాశ్రమంలో ఒకే ఒక్క తండ్రి ఉంటారు. పిల్లలందరూ ఆయన పేరు మీదే పుడతారు. ఇక్కడ, ఓటు హక్కు పొందడం కోసం ఒకే వ్యక్తిని తండ్రిగా పరిగణిస్తారు. ఎన్నికల సంఘం కూడా దీనిని అంగీకరిస్తుంది” అని ఆయన బీబీసీతో అన్నారు.

దీనికి మరో కారణం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అని సబర్ అహ్మద్ అంటున్నారు.

“నా పేరు సబర్ అహ్మద్. ఇదే పేరు వందలమందికి ఉండొచ్చు. ఏఐ ఒకే పేరుగల వ్యక్తులను ఒకే వ్యక్తికి అనుసంధానం చేస్తుంది. నేను దీన్ని చెక్ చేశాను. ఇది ఓటరు తప్పు కాదు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో తప్పుడు ఉదాహరణ చూపించింది” అని ఆయన అన్నారు.

“కుటుంబ పరిమాణాన్ని నిర్ధరించడానికి ఎన్నికల సంఘం 2019-2021 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5ను ఉటంకిస్తోంది, ఇది తార్కికం/హేతుబద్ధం కాదు. ఈ సర్వే కొన్నేళ్ల కిందటే నిర్వహించారు. గతంలో దళితులు, ముస్లింలలో ఆరుగురికి పైగా పిల్లలు ఉండటం సాధారణం. రవీంద్రనాథ్ ఠాగోర్‌కు 10 మంది తోబుట్టువులు ఉన్నారు. అలా అయితే ఆయన పేరు కూడా తొలగిస్తారా? ఓటర్ల వయస్సును చూడండి. వారి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరు పుట్టిన కాలంలో ఒక తండ్రికి ఐదుగురికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం అసాధారణమేమీ కాదు” అని సబర్ అహ్మద్ అన్నారు.

ఓటర్లకు, వారి తల్లిదండ్రులకు మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ వయసు తేడా ఉండడం గురించి సబీర్ అహ్మద్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో బాల్య వివాహాల రేటు చాలా ఎక్కువగా ఉందని అన్నారు.

“అమర్త్య సేన్‌కు, ఆయన తల్లిదండ్రులకు మధ్య వయసు15 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నందున, ఆయన పేరును కూడా ఈ వర్గంలో చేర్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఈనాటికీ బాల్య వివాహాలు ఆగలేదు” అని సబర్ అన్నారు.

పేరు, ఓటర్ల జాబితా,ఎలక్షన్ కమిషన్, ఓట్లు గల్లంతు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశీయులు, ముస్లింలు, భారత్, ఎన్నికలు

95 శాతం ముస్లింలే ఎందుకు?

లాజికల్ డిస్క్రిపెన్సీపరంగా చూస్తే, నందిగ్రామ్‌లో ఎక్కువ ముస్లిం పేర్లను ఎందుకు తొలగించారు? దీనిపై పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించారు.

“బంగ్లాదేశ్ నుంచి ముస్లింలే పశ్చిమ బెంగాల్‌లోకి ఎక్కువగా చొరబడుతున్నారు. వారు సరైన పత్రాలు సమర్పించలేక ఎస్ఐఆర్‌లో పట్టుబడ్డారు” అని ఘోష్ బీబీసీతో అన్నారు.

దీనికి మరో కారణం కూడా ఉందంటున్నారు సబర్ అహ్మద్.

“ఓటర్ల జాబితాను పరిశీలించడానికి ఎన్నికల సంఘం ఏఐని ఉపయోగించింది. తాము ఏఐని ఉపయోగిస్తున్నామన్న విషయాన్ని కూడా ఎన్నికల సంఘం వెల్లడించలేదు. ఉదాహరణకు నా పేరునే తీసుకోండి. నా పేరు సబర్ అహ్మద్. అహ్మద్‌లో ‘H’ తర్వాత ‘AHA’ అని ఉంటుంది, దాన్ని మా ప్రధానోపాధ్యాయుడు చేర్చారు. కానీ ఏఐ, అహ్మద్‌ను ‘AHMED’ అని రాస్తోంది. అందువల్ల నా పేరు కూడా పరిశీలనకు గురైంది. కోల్‌కతా మినహా, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం ఓటర్ల జాబితా బెంగాలీలోనే ఉంది. దాన్ని ఏఐ ఉపయోగించి ఆంగ్లంలోకి అనువదిస్తే అనేక తప్పులు జరుగుతాయి” అని అన్నారాయన.

“ఏఎస్‌డీడీ (గైర్హాజరు, స్థానభ్రంశం, మరణం, నకిలీ/ Absent, Shifted, Dead, Duplicate) ప్రమాణాల ఆధారంగా సర్ నిర్వహించినప్పుడు, అన్ని మతాల ఓటర్ల జనాభా నిష్పత్తిలోనే పేర్లు తొలగించారు. ఉదాహరణకు నందిగ్రామ్‌లో ముస్లిం జనాభా 25 శాతం ఉంటే, ఏఎస్‌డీడీలో పేర్లు తొలగించిన వారిలో ముస్లింలు 30 శాతం మాత్రమే ఉన్నారు. కానీ లాజికల్ డిస్క్రిపెన్సీ కారణంగా ఈ సంఖ్య 95 శాతానికి పెరిగింది” అని సబర్ అహ్మద్ అన్నారు.

లాజికల్ డిస్క్రిపెన్సీ వైరుధ్యంలో అధిక సంఖ్యలో ముస్లిం పేర్లు తొలగించడానికి గల ఒక కారణాన్ని వివరిస్తూ, “ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయలేదు. మాకు ఎలాంటి సర్క్యులర్ గురించి తెలియదు. అంతేకాకుండా హిందువులతో పోలిస్తే ముస్లింలు అధిక స్థాయిలో నిరక్షరాస్యత, పేదరికంతో బాధపడుతున్నారు. ఫలితంగా ముస్లింలలో డాక్యుమెంటేషన్ పేలవంగా ఉంది” అని సబర్ అహ్మద్ అన్నారు.

పేరు, ఓటర్ల జాబితా,ఎలక్షన్ కమిషన్, ఓట్లు గల్లంతు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశీయులు, ముస్లింలు, భారత్, ఎన్నికలు

ఎన్నికలపై ప్రభావం

పశ్చిమ బెంగాల్‌లో, 90 లక్షలమందికి పైగా ఓటర్ల పేర్లను సర్ నుంచి తొలగించారు. 60 లక్షలమంది మంది హిందువులు, 30 లక్షలమంది ముస్లింల పేర్లను సర్ నుంచి తొలగించారని మమతా బెనర్జీ పలు ఎన్నికల ర్యాలీల్లో పేర్కొన్నారు.

నందిగ్రామ్‌లో లాజికల్ డిస్క్రిపెన్సీ పేరుతో చాలామంది ముస్లింల పేర్లను ఎందుకు తొలగించారని నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిని అడిగింది బీబీసీ. దానికి ఆయన, “వెళ్లి వారినే అడగండి” అని బదులిచ్చారు.

ఏఎస్‌డీడీ హయాంలో అంతా బాగానే ఉందని, కానీ లాజికల్ డిస్క్రిపెన్సీ పేరుతో ముస్లింలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారని కోల్‌కతా మేయర్, సీనియర్ టీఎంసీ నాయకుడు ఫిర్హాద్ హకీం అన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా ఉండదని కలకత్తా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ అయిన హిమాద్రి ఛటర్జీ భావిస్తున్నారు.

“మమతా బెనర్జీ హయాంలో అనేక నిరసనలు జరిగాయి. మమత వైఫల్యాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ ఆ సమస్యలను దూకుడుగా లేవనెత్తుతూ ఉండేది. కానీ ఎస్ఐఆర్ వచ్చినప్పుడు, మొత్తం చర్చ దాని చుట్టూనే కేంద్రీకృతమైంది. ఇతర సమస్యలు కనుమరుగయ్యాయి” అని ఆయన అన్నారు.

నందిగ్రామ్‌లో లాజికల్ డిస్క్రిపెన్సీలో పేర్లు పోగొట్టుకున్న ముస్లిం ఓటర్లు, భవిష్యత్తులో తమ పౌరసత్వం గురించి కూడా అధికారులు అనుమానించవచ్చని భయపడుతున్నారు.

“ఈరోజు మా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. భవిష్యత్తులో వారు మమ్మల్ని బంగ్లాదేశీయులు అని కూడా పిలవచ్చు. ఇందుకు మొదటి కారణం, మేం బెంగాలీ మాట్లాడతాం, రెండవది, మేం ముస్లింలం. కాబట్టి మమ్మల్ని బంగ్లాదేశీయులు అని పిలవడం వారికి మరింత సులభం అవుతుంది” అని జియారుల్ ఖాన్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)