SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే.. ఇంధన ధరలు పెరిగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది.
ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా చమురు, గ్యాస్, ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే ఉంటే, ప్రపంచ వృద్ధి రెండు శాతం కంటే తక్కువకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది.
“దీనివల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చాలా దగ్గరవుతాం, 1980 తర్వాత నాలుగు సార్లు ఇలా జరిగింది” అని నివేదికలో పేర్కొన్నారు.
ఇటీవల కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఈ పరిస్థితి కనిపించింది.
ఇరాన్ అణ్వాయుధాలతో పాశ్చాత్య రాజధానులపై దాడి చేసే ప్రమాదాన్ని తొలగించడానికి కొద్దిపాటి ఆర్థిక నష్టం అనేది ఆమోదయోగ్యమైన మూల్యమేనని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగవచ్చు
హార్ముజ్ జలసంధిలో రాకపోకలపై యుద్ధ ప్రభావం పడడంతో ఇంధన ధరలు పెరిగాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో యుద్ధం ముగియడంపై అనిశ్చితి నెలకొంది.
“2026 ఫిబ్రవరి చివరిలో మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి గాడి తప్పే ప్రమాదం ఉంది” అని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయగల అత్యంత తీవ్రమైన పరిస్థితులలో ఈ ఏడాది సగటు చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరడం కూడా ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఈ అంచనాల ఆధారంగా.. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనివల్ల ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చు.
దీర్ఘకాలం కొనసాగుతున్న యుద్ధం ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని పెంచుతుందని, అలాగే కొన్ని దేశాల్లో ఆహార భద్రత సమస్యలు కూడా తలెత్తుతాయని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త పియరీ-ఒలివియర్ గురించా బీబీసీకి తెలిపారు.
“ఈ యుద్ధం ఇప్పుడే ముగిసినా, చమురు సరఫరాపై ప్రభావం 1970ల నాటి చమురు సంక్షోభం స్థాయిలోనే ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.
1970వ దశకంలో.. యోమ్ కిప్పూర్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన అమెరికా, ఇతర దేశాలపై అరబ్ చమురు ఉత్పత్తిదారులు ఆంక్షలు విధించారు.
అయితే ప్రపంచం ఇప్పుడు చమురు, శిలాజ ఇంధనాలపై తక్కువగా ఆధారపడి ఉందని, అందువల్ల వినియోగదారులపై ప్రభావం అంత తీవ్రంగా ఉండదని గురించా అన్నారు.
ఇరాన్ యుద్ధ సమయంలో చమురు ధరలు సుమారు 120 డాలర్లకు చేరుకున్నాయి, కానీ తరువాత తగ్గి మంగళవారం ఒక బ్యారెల్ ముడి చమురు ధర 98.85 డాలర్లుగా ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
అంతేకాకుండా తీవ్రమైన పరిస్థితులు మరో రెండేళ్లపాటు కొనసాగితేనే మాంద్యం ప్రమాదం పెరుగుతుందని ఐఎంఎఫ్ తెలిపింది.
రాబోయే కొద్ది వారాల్లో ఘర్షణ పరిష్కారమై, ఈ ఏడాది మధ్య నాటికి మధ్యప్రాచ్యం నుంచి ఇంధన ఉత్పత్తి, ఎగుమతులు సాధారణ స్థితికి వస్తే, 2026లోకి ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఇది గతంలో అంచనా వేసిన 3.3% కన్నా తక్కువ. వచ్చే ఏడాదికి ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్ అంచనా 3.2%గా ఉంది.
ఇక అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వస్తే, ఇరాన్ యుద్ధం వల్ల కలిగే ఇంధన సంక్షోభంతో బ్రిటన్ అత్యధికంగా ప్రభావితమవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ఐఎంఎఫ్ ఈ ఏడాదికి యూకే వృద్ధి అంచనాను 1.3% నుంచి 0.8%కి తగ్గించింది. అయితే ఈ ఏడాది చివర్లో యూకే ఆర్థిక వ్యవస్థ 1.3% వృద్ధికి పుంజుకుంటుందని అది ఆశిస్తోంది.
అలాగే గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఎగుమతి దేశాల్లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధిలో గణనీయమైన తగ్గుదల కనిపించవచ్చని ఐఎంఎఫ్ తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్, మధ్యప్రాచ్యానికి ఏం జరగబోతోంది?
ఈ ఏడాది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1% మేర తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అయితే రాబోయే కొన్ని వారాల్లో యుద్ధం ముగిస్తే, 2027లో 3.2% వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ సరఫరాదారు అయిన ఖతార్ వంటి దేశాలపైనా ఇరాన్ దాడులు చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఖతార్‌లోని రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జీ రిఫైనరీపై కూడా దాడి జరిగింది. ఇది మరికొంత కాలం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం లేదని అంచనా.
మరోవైపు ‘ఆర్థిక నష్టం కంటే ప్రపంచ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బీబీసీతో అన్నారు.
“ఒకవేళ లండన్‌పై అణ్వాయుధంతో దాడి జరిగితే ప్రపంచ జీడీపీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? నేను స్వల్పకాలిక అంచనాల కంటే దీర్ఘకాలిక భద్రత గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నా” అని ఆయన అన్నారు.
లండన్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి ప్రమాదం చాలా తక్కువగా ఉందని బీబీసీ గతంలో చెప్పింది.
అయితే “మీకు తెలియని ప్రమాదమే అత్యంత పెద్ద ప్రమాదం” అని బెసెంట్ అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పాశ్చాత్య దేశాలపై ఇరాన్ అణుదాడి చేసే అదనపు ప్రమాదాన్ని తొలగించాయని ఆయన అన్నారు.
2026లో ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% మేర తగ్గుతుందని, అయితే ఆ తర్వాతి ఏడాది 8.6% వృద్ధితో తిరిగి కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
యుద్ధం కారణంగా ఇరాన్ పొరుగు దేశమైన ఇరాక్ ఈ ఏడాది 6.8% క్షీణతతో ఆర్థికంగా దెబ్బతింటుందని ఇది అంచనా వేసింది. మళ్లీ 2027లో 11.3% వృద్ధితో ఇది పుంజుకుంటుందని అంచనా.
ఫొటో సోర్స్, Getty Images
కొన్ని దేశాలపై ప్రభావం పడదు
ఇంధన మౌలిక సదుపాయాలకు జరిగే నష్టం, హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం, ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాల లభ్యతతో సహా అనేక అంశాలు ఒక దేశ ఆర్థిక బలాన్ని నిర్ణయిస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఉదాహరణకు సౌదీ అరేబియాకు ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్ ఉంది. ఇది ఫార్సీ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం వరకు వెళ్తుంది. రోజుకు 70 లక్షల బ్యారెల్స్ వరకు చమురు పంపగలదు.
2026లో సౌదీ అరేబియా వృద్ధి మందగించినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ 3.1% వృద్ధి చెందుతుందని అంచనా వేయగా, వచ్చే ఏడాది 4.5% మేర విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే ఏడాది మధ్యప్రాచ్యంలోని చాలా చమురు ఎగుమతిదారులు కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.
“రాబోయే నెలల్లో ఇంధన ఉత్పత్తి, రవాణా సాధారణ స్థితికి వస్తాయనే అంచనాతో చూస్తే, వచ్చే ఏడాది పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది” అని ఐఎంఎఫ్ పేర్కొంది.
“సంఘర్షణ కొనసాగుతున్న కొద్దీ, నష్టాల స్థాయిని పునఃసమీక్షించిన కొద్దీ ఈ అభిప్రాయం మారవచ్చు” అని కూడా అది హెచ్చరించింది.
ఐఎంఎఫ్ ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి అంచనాను కూడా తగ్గించింది. 2026లో చైనా వృద్ధి 4.4%గా ఉంటుందని తెలిపింది, ఇది జనవరిలో చెప్పిన 4.5% అంచనాతో పోలిస్తే తక్కువ.
2027 నాటికి చైనా 4% వృద్ధి సాధిస్తుందనే దాని అంచనా మారలేదు.
చమురు ధరల పెరుగుదల వల్ల లబ్ధి పొందే దేశాలలో రష్యా ఒకటని ఐఎంఎఫ్ తెలిపింది.
ఈ ఏడాది, వచ్చే ఏడాది రష్యా ఆర్థిక వ్యవస్థ 1.1% వృద్ధి చెందుతుందని అంచనా వేయగా, ఇది గతంలో చెప్పిన 0.8%, 1% అంచనాల కంటే ఎక్కువ.
నాలుగేళ్ల క్రితం యుక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాపై అనేక ఆంక్షలు విధించారు. ప్రపంచ ధరలు పెరుగుతున్ననేపథ్యంలో.. మార్చిలో రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలను ట్రంప్ ఎత్తివేశారు.
రష్యా ఈ యుద్ధంలో విజయం సాధిస్తోందని పేర్కొంటూ, ఆ దేశంపై ఆంక్షలను సడలించవద్దని యూరోపియన్ కమిషన్ ఫైనాన్స్ కమిషనర్ ఇతర దేశాలను హెచ్చరించారు.
“ఇంధన ధరలు పెరిగాయి, ఇది రష్యా యుద్ధ యంత్రాంగానికి అదనపు ఆదాయాన్ని అందిస్తోంది” అని వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్ సదస్సు సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్ అన్నారు.
“ఇది రష్యాపై ఒత్తిడిని తగ్గించే సమయం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



