Home జాతీయ national telgu ‘ఆ రోజు సూర్యుడు అగ్నిచక్రంలా గిర్రున తిరిగాడు’’ అని చెప్పే ఆ ఘటనలు ఏంటి?

‘ఆ రోజు సూర్యుడు అగ్నిచక్రంలా గిర్రున తిరిగాడు’’ అని చెప్పే ఆ ఘటనలు ఏంటి?

14
0

SOURCE :- BBC NEWS

సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

1917 మే నెలలో ముగ్గురు పోర్చుగీస్ పిల్లలు తాము మదర్ మేరీని (మేరీమాత)ను చూసినట్లు చెప్పారు. మేరీమాత తమకు చెప్పినట్లుగా ఆ ముగ్గురు వెల్లడించిన ‘భవిష్యవాణి’ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కమ్యూనిస్ట్ వ్యతిరేక భావాలను తీవ్రం చేసింది. 1992లో కూడా ఓ వ్యక్తి తాను ఈ ‘అద్భుతాల’ను స్వయంగా చూశానని బీబీసీతో చెప్పారు.

1917 మే 13న పోర్చుగల్‌లోని ఫాతిమా అనే ఊళ్లో 10 ఏళ్ల లూసియా డోస్ శాంటోస్, ఆమె కజిన్స్ ఫ్రాన్సిస్కో, జాసింటా మార్టో‌లు ఒక పొలంలో గొర్రెలను మేపుతుండగా ఓ చెట్టు మీద మెరుస్తున్న ఆకారం కనిపించిందని, ఆమె మేరీమాత అని వాళ్లు చెప్పారు.

రాబోయే ఐదు నెలలపాటు ప్రతి నెలా 13వ తేదీన ఇదే సమయానికి ఇక్కడికి రావాలని మేరీమాత తనకు చెప్పిందని ఆ ముగ్గురూ వెల్లడించారు.

మూడు దివ్య సందేశాల(భవిష్యవాణి)ను కూడా తాము అందుకున్నామని ఆ పిల్లలు చెప్పారు. వాటిలో రెండింటిని బయటకు చెప్పారుగానీ ” థర్డ్ సీక్రెట్ ఆఫ్ ఫాతిమా’’ అని ప్రసిద్ధి చెందిన ఆ మూడో రహస్యాన్ని సహస్రాబ్ది ముగిసే వరకు వాటికన్‌లో రహస్యంగా ఉంచారు.

ఈ రహస్యానికి సంబంధించిన ఊహాగానాలు అనూహ్యంగా ఒక గ్రామీణ ధార్మిక క్షేత్రాన్ని ప్రచ్ఛన్న యుద్ధానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన చిహ్నంగా మార్చాయి. ఫాతిమా సంఘటనలపై చర్చను మరింత తీవ్రం చేశాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

చివరి దర్శనంలో ఏం జరిగింది?

అక్టోబర్ 13న జరిగిన చివరి దర్శనానికి వేలాది మంది యాత్రికులు హాజరయ్యారని చెబుతారు. వారు చూసిన దృశ్యం మిరకిల్ ఆఫ్ సన్‌గా ప్రసిద్ధి చెందింది.

”నేను ఆకాశంలో అనేక రంగుల గ్రహాలను చూశాను. అది ఒక అద్భుతం. ఆ తర్వాత ఆకాశం నుంచి పువ్వులు వర్షంలా కురుస్తున్నట్టు అనిపించింది. అది ఒక మంచు తుపానులా ఉంది. అప్పుడు సూర్యుడు అగ్నివలయంలా మరింత వేగంగా తిరగడం ప్రారంభించాడు. ఇది సుమారు అర నిమిషంపాటు కొనసాగింది. చివర్లో అది చాలా వేగంగా తిరిగింది” అని అక్కడకు వెళ్లినవారిలో ఒకరైన ఫ్రాన్సిస్కో ఫెరీరా రోసా 1992లో బీబీసీ న్యూస్‌నైట్‌తో చెప్పారు.

ఆ రోజు అనేక తీవ్రమైన అనారోగ్యాలు నయమయ్యాయని, అంధులు కూడా చూపును తిరిగి పొందారని అక్కడకు వెళ్లినవారు చెప్పారు.

ఫ్రాన్సిస్ జాన్‌స్టన్ రాసిన 1980 నాటి ‘ఫాతిమా: ది గ్రేట్ సైన్’ అనే పుస్తకంలో ఇలా ఉంది.

‘‘మతాన్ని వ్యతిరేకించే పోర్చుగీస్ వార్తాపత్రిక ‘ఓ సెక్యులో’ “ఒక భయంకరమైన ఘటన, మధ్యాహ్నం ఫాతిమా ఆకాశంలో సూర్యుడు ఎలా నాట్యం చేశాడు?” అనే శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. అక్కడ కనీసం 50వేల మంది ప్రజలు గుమిగూడారని కూడా తెలిపింది.

అది ఒక అద్భుతమా, సామూహిక భ్రాంతా లేక వాతావరణానికి సంబంధించిన విషయమా అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అక్కడ ఉన్న వారిలో కొందరిపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపినట్టు అనిపించింది.

“నాకు అప్పటికే బలమైన విశ్వాసం ఉందని అందరికీ తెలుసు. కానీ ఈ సంఘటన తర్వాత నా విశ్వాసం మరింత బలపడింది. నాకు ఎలాంటి భయం అనిపించలేదుగానీ సూర్యుడు ఇలా తిరగడం చూసి చాలా మంది భయపడ్డారు. ఇలాంటిది జరిగినప్పుడు మీరు నమ్మాలి. మీకు విశ్వాసం ఉండాలి” అని 1992లో రోసా బీబీసీతో అన్నారు.

సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

మొదటి, రెండు ప్రవచనాలు ఏంటి?

ఈ దర్శనాలు పొందిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు కొన్నేళ్ల తర్వాత సంభవించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి సమయంలో మరణించారు. దాంతో ఆ సందేశాలను, ప్రవచనాలను విన్నామని చెప్పేవారిలో లూసియా ఒక్కరే మిగిలారు.

మొదటి ‘రహస్యం’ నరకం ఎంలా ఉంటుందో వర్ణించింది. అది రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రవచనం అని చెప్పారు. అక్టోబర్ విప్లవానికి ముందు పిల్లలకు చెప్పిన రెండో రహస్యం ప్రకారం ప్రజలు మేరీమాతను ప్రార్థిస్తే కమ్యూనిజం నుంచి రష్యాకు రక్షణ లభిస్తుందని తెలిపింది.

ఫాతిమాకు ప్రజాదరణ బాగా పెరగడాన్ని మొదట్లో అసౌకర్యంగా భావించిన వాటికన్, ఆ తర్వాత 1930నాటికి ఫాతిమా ప్రవచనాలను అధికారికంగా ఆమోదించింది.

పోర్చుగల్‌లో అతివాద సంప్రదాయవాది ఆంటోనియో డి ఒలివెరా సలాజర్ నియంతృత్వ పాలన నడుస్తున్న కాలంలో ఈ గ్రామం 20వ శతాబ్దపు క్యాథలిక్ మతంలో మేరీమాతకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా మారింది.

ఇప్పటికీ వేలాది యాత్రికులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఆరు దర్శనాలలో ఐదింటిలో మేరీమాత ప్రత్యక్షమయ్యారని భావించే ‘చాపెల్ ఆఫ్ అప్పారిషన్స్’కు భక్తులు ‘వియా పెనిటెన్షియల్’ అనే పాలరాతి మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్తుంటారు.

కానీ ఈ పిల్లల దర్శనాలు తర్వాతి సంవత్సరాల్లో ఫాతిమాను చూసే కోణంలో మార్పు తెచ్చింది. ఈ ప్రవచనాలు రాజకీయ కోణాన్ని సంతరించుకున్నాయి. వాటిలో రష్యాలో కమ్యూనిజం ఉత్థాన పతనాల అంచనాలు కూడా ఉన్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఫాతిమా గ్రామం కమ్యూనిస్ట్ వ్యతిరేకులకు ఒక భావజాల క్షేత్రంగా మారింది.

“ఫాతిమా విషయంలో అసలు సమస్య మేరీమాతతో ముడిపడి ఉన్న సందేశమే. ఇది 1920లలో అభివృద్ధి చెందింది. కమ్యూనిస్ట్ వ్యతిరేక వైఖరిగా ఈ సందేశం చర్చిలోనే విభేదాలు సృష్టించే అంశంగా మారింది” అని సోవియట్ యూనియన్ పతనం జరిగిన ఒక సంవత్సరం తర్వాత 1992లో బీబీసీతో మాట్లాడుతూ క్రైస్తవ మత సిద్ధాంతి మైఖేల్ వాల్ష్ అన్నారు.

సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

‘పోప్ జాన్ పాల్ 2పై కాల్పులు’

పోలండ్‌లో జన్మించిన పోప్ జాన్ పాల్-2కు తొలి దర్శనానికి వార్షికోత్సమైన 1981 మే13న జరిగిన ఒక ఘటన ఆయన ఫాతిమాకు గట్టి మద్దతుదారుగా మారడానికి కారణమైంది. దీంతో ఫాతిమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలానికి మరింత బలం చేకూరింది. ఆ రోజున వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తన వాహనంలో ఉండగా అతి సమీపం నుంచి ఆయనపై రెండుసార్లు కాల్పులు జరిగాయి.

కాల్పులు జరిపిన వ్యక్తి దొరికినప్పటికీ ఈ హత్యాయత్నం వెనక ఎవరో ఉన్నారంటూ అనేక కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి. పోప్ 2005లో తన జ్ఞాపకాలను రాస్తూ “దీని వెనుక ఎవరో ఉన్నారు” అని ఆరోపించారు.

అది సోవియట్ యూనియన్‌కు చెందిన వారేనా?

సోవియట్ నాయకత్వం పోప్‌ను ఒక ముప్పుగా భావించింది. 1979లో కమ్యూనిస్ట్ పార్టీ జారీ చేసిన ఒక ఆదేశంలో పోప్‌ను శత్రువుగా పేర్కొంది. పోలండ్‌లో ఐక్యతా ఉద్యమానికి మద్దతు ఇచ్చినందున ఆయన తమ శత్రువు అని హెచ్చరించింది.

2005లో తూర్పు జర్మన్ గూఢచార సంస్థల నుంచి లభించిన డాక్యుమెంట్లు సోవియట్ సైనిక గూఢచార సంస్థలు ఆయన్ను చంపడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సూచిస్తున్నాయి. అయితే రష్యా దానిని ఖండించింది.

సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

మూడో రహస్యం ప్రకటనపై నిరాశ

ఆ రోజు తనను కాపాడింది ఫాతిమా మాతేనని పోప్ గట్టిగా నమ్మడానికి కారణం కాల్పులు జరిగిన తేదీ. ఆయన ఈ నమ్మకం వల్ల ఆ దర్శనాలను విశ్వసించే వారిలో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది.

పోప్ ఆ క్షేత్రాన్ని రెండుసార్లు సందర్శించారు. ఆయన శరీరం నుంచి తీసిన ఒక తూటాను మేరీమాత విగ్రహానికి ఉన్న బంగారు కిరీటంలోని వజ్రం పక్కన ఉంచారు.

ఫాతిమా ‘మూడో రహస్యం’ దాని కమ్యూనిస్ట్ వ్యతిరేక వ్యాఖ్యానం, పోప్ మద్దతుతో భక్తులను ఆకర్షించడమే కాకుండా ప్రజలలో ఉత్సాహాన్ని, ఊహాగానాలను రేకెత్తించింది.

లూసియా 1944లో ఈ రహస్యాన్ని రాసిపెట్టి 1960 వరకు దానిని బయటపెట్టవద్దని కోరారు. ఆ తర్వాత వచ్చిన అనేకమంది పోప్‌లు కూడా దానిని బయటపెట్టడానికి నిరాకరించారు.

వాటికన్‌లో ఒక మూసివున్న కవరులోని ఆ రహస్యం ప్రతి పోప్‌కు ఆయన సన్నిహిత సలహాదారుల బృందానికి మాత్రమే తెలుసు. ఫలితంగా ఫాతిమా చుట్టూ అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారమయ్యాయి.

”ప్రపంచం అంతమైపోతుంది” అని నమ్మే గ్రూపులు చేరాయి. ఆ రహస్యాన్ని వెల్లడించేలా వాటికన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఫాతిమా భక్తులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఒకరు ఏకంగా విమానాన్ని హైజాక్ చేశారు.

2000లో వాటికన్ ఈ ప్రవచనాన్ని ప్రకటించినప్పుడు సుమారు ఐదులక్షల మంది భక్తులు ఫాతిమా క్షేత్రం దగ్గరికి చేరుకున్నారు. అయితే కొందరికి ఈ ప్రకటన నిరాశ కలిగించింది.

న్యూయార్క్ టైమ్స్ వ్యంగ్యంగా “గతవారం ఫాతిమా మూడో రహస్యం ఆలస్యంగా వెల్లడి కావడం, ఎల్విస్ (ప్రముఖ అమెరికా గాయకుడు) మరణాన్ని ఎఫ్‌బీఐ ప్రకటించినట్టుగా అనిపించింది” అని రాసింది. కొంతమంది సాక్షులు ఈ ప్రకటనను “కల్పిత ప్రకటన” అంటూ ఎగతాళి చేశారు.

కుట్ర సిద్ధాంతాలు నమ్మే కొందరు ఈ ప్రవచనం మూడో ప్రపంచ యుద్ధం గురించి లేదా మానవాళికి ముప్పు తెచ్చే మరేదైనా ప్రమాదం గురించి హెచ్చరిస్తోందని భావించారు. అయితే వాటికన్ మాత్రం ఈ రహస్యాన్ని 1981లో పోప్ జాన్ పాల్ 2పై జరిగిన హత్యాయత్నాన్ని సూచించే ఒక సంకేతమని అభివర్ణించింది. “తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి… చనిపోయినట్టుగా నేలమీద పడిపోతారు” అని హెచ్చరించినట్టు తెలిపింది.

సోవియట్ యూనియన్, పోర్చుగల్, మేరీమాత, మతపరమైన విశ్వాసం

ఫొటో సోర్స్, Getty Images

సోవియట్ యూనియన్ పతనంలో పాత్ర ఉందా?

‘మూడో రహస్యం’ వెల్లడైన తర్వాత కూడా ఫాతిమా సంఘటనలకు, ప్రచ్ఛన్న యుద్ధ సంఘటనలకు మధ్య ఉన్న సంబంధాల గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మేరీమాత కోరినట్టుగా 1984లో పోప్ జాన్‌పాల్-2 తూర్పు యూరప్‌ను ఆమె నిర్మల హృదయానికి అంకితం చేయడం, మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ యూనియన్ నాయకునిగా బాధ్యతలు స్వీకరించడం, పెరిస్త్రోయికా (సంస్కరణలు) ప్రారంభంకావడం యాదృచ్ఛికం కాదని కొందరి వాదన.

అయితే కొంతమంది విమర్శకులు ఈ ప్రవచనాల సంచలనాత్మక వ్యాఖ్యానాన్ని, అధికారంలో ఉన్నవారు వాటిని అంగీకరించడాన్ని ప్రశ్నిస్తున్నారు. కార్డినల్‌గా ‘మూడో రహస్యాన్ని’ వెల్లడిస్తూ (2005లో పోప్ బెనెడిక్ట్ 16 అయిన) జోసెఫ్ రాట్జింగర్ “ఏ గొప్ప రహస్యం బయటపడలేదు, భవిష్యత్తులోనూ బయటపడదు” అని అన్నారు. ఇది ప్రపంచం అంతం వంటి వాటి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేసింది.

‘ది కల్ట్ ఆఫ్ ది వర్జిన్ మేరీ: సైకలాజికల్ ఆరిజిన్స్’ గ్రంథ రచయిత మైఖేల్ కారోల్ ఇలా అన్నారు. ‘ప్రపంచ మార్పు’ కోసం ప్రార్థించమని మేరీమాత ప్రజలను కోరారని మాత్రమే “తొలి నివేదికలు పేర్కొన్నాయి”. కానీ ఆ తర్వాత 1920ల చివరలో (అప్పుడు ఒక కాన్వెంట్‌లో ఉన్న) లూసియా దీన్ని మార్చి ‘రష్యా మార్పు’ కోసం ప్రార్థించమని మేరీమాత ప్రజలను కోరినట్టు సూచించారు”

రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఫాతిమా ప్రవచనాన్ని చర్చి ఉపయోగించుకుందనడంలో సందేహం లేదు. అది సోవియట్ యూనియన్ పతనానికి దోహదపడిందా? ఫాతిమాను పక్కన పెడితే చర్చి అవలంబించిన కమ్యూనిస్ట్ వ్యతిరేక వైఖరి కమ్యూనిజం పతనంలో బహుశా ఒక పాత్ర పోషించి ఉండవచ్చుగానీ ఇతర కారకాలు కూడా ఉన్నాయి.

ఈ దర్శనం ప్రజలపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిందనడంలో సందేహం లేదు. 2005లో లూసియా 97 ఏళ్ల వయసులో మరణించినప్పుడు పోర్చుగల్ ఆ రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది.

2025 మే 13న ఆ పిల్లలకు తొలి దైవ దర్శనం కలిగిన రోజును స్మరించుకోవడానికి సుమారు 2 లక్షల 70 వేలమంది భక్తులు ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)