Home జాతీయ national telgu హైదరాబాద్: సోషల్ మీడియా రీల్స్ సమాచారంతో మాజీ భార్యను హతమార్చిన మాజీ భర్త.. అసలేం జరిగింది?

హైదరాబాద్: సోషల్ మీడియా రీల్స్ సమాచారంతో మాజీ భార్యను హతమార్చిన మాజీ భర్త.. అసలేం జరిగింది?

16
0

SOURCE :- BBC NEWS

మహిళలు, నేరాలు, వివాహం, విడాకులు, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

సోషల్ మీడియా రీల్స్ ద్వారా తన మాజీ భార్య ఎక్కడుందో కనిపెట్టి మరీ హత్య చేశాడో వ్యక్తి.

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో, ఫిబ్రవరి 18 మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని వనస్థలిపురం పోలీసులు బీబీసీతో చెప్పారు.

వనస్థలిపురం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ కేసులో నిందితుడైన పెద్దపల్లి జిల్లా మంథనికి సమీపంలోని విలోచవరం గ్రామానికి చెందిన దేవరకొండ మహేశ్.. ప్రస్తుతం తుర్కయాంజాల్ ప్రాంతంలో ఒక హాస్టల్లో ఉంటున్నారు.

మృతురాలు సునీతది తెలంగాణ సరిహద్దుకు సమీప ప్రాంతమైన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
మహిళలు, నేరాలు, వివాహం, విడాకులు, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రతీకార హత్య’

సునీత అమ్మమ్మ వాళ్లది కూడా విలోచవరం గ్రామం కావడంతో వారిద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి, 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగ నిమిత్తం మహేశ్ విదేశాలకు వెళ్లారు.

సునీత వీసా ఆలస్యమైంది. ఈ క్రమంలో వీరికి గొడవలు జరిగాయి. ఆ తర్వాత, సునీత కూడా విదేశాలకు వెళ్లి వెనక్కు వచ్చేశారు. ఈ గొడవలు కేసులకు, విడాకులకూ దారితీశాయి.

మహేశ్‌, ఆయన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ సునీత చంద్రపూర్‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తన ఉద్యోగం పోవడంతో పాటు, తన కుటుంబం మానసిక క్షోభకు గురైందని మహేశ్ కక్ష పెంచుకున్నారని పోలీసులు చెప్పారు.

“కెనడా, ఆస్ట్రేలియాల్లో మహేశ్ ఉద్యోగం చేశారు. ఈ కేసుల కారణంగా ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ కేసులు, వేధింపులతో విసిగిపోయానని ఆయన చెప్పారు” అని పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఆ మానసిక క్షోభతోనే తన తల్లి చనిపోయారని, అందుకు సునీతే కారణమని, ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మహేశ్ భావించారని వనస్థలిపురం పోలీసులు చెప్పారు.

వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ మహేశ్ బీబీసీతో మాట్లాడుతూ, ”ఇది ప్రతీకారంతో జరిగిన హత్య” అని అన్నారు.

మహిళలు, నేరాలు, వివాహం, విడాకులు, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో అడ్రస్ కనుగొన్న నిందితుడు

మహేశ్, సునీతకు 2024లో విడాకులు అయ్యాయి. సునీత 2025లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

తల్లి మరణంతో పగ పెంచుకున్న మహేశ్.. సునీత ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ వచ్చి ఒక హాస్టల్లో దిగారు. అయితే, సునీత తన భర్తతో ఎక్కడుంటున్నారో మహేశ్‌కు తెలియలేదు.

కానీ, సునీత సోషల్ మీడియా అకౌంట్లు మహేశ్‌కు ఉపయోగపడ్డాయి. సునీత తన వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

“ఆమె గుడికి వెళ్లిన రీల్ పెడితే, అది చూసి మహేశ్ ఆ ప్రాంతంలో వెతికారు” అని పోలీసులు చెప్పారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోల ద్వారానే సునీత అడ్రస్‌ను కనుగొన్నారని బీబీసీకి చెప్పారు ఇన్‌స్పెక్టర్ మహేశ్.

ఆ తర్వాత ఇంటి వద్ద మాటు వేసి, కొద్దిరోజుల పాటు ఆమె రాకపోకలు, అక్కడి పరిస్థితులు గమనించి, అదనుచూసి ఫిబ్రవరి 18న హత్య చేశారని పోలీసులు తెలిపారు.

“ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు మా అమ్మ ఫోన్ చేసింది. ఇంటికి వెళ్లి చూస్తే నా భార్య తీవ్రగాయాలతో బాత్రూంలో, రక్తపు మడుగులో పడి ఉంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి, డోర్‌కు లోపలి నుంచి గడియ పెట్టి, నా భార్యను హత్య చేశారు” అని పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీత భర్త.

మహిళలు, నేరాలు, వివాహం, విడాకులు, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులు..

పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్న మహేశ్.. ఎవరైనా దగ్గరికొస్తే తగలబెట్టుకుంటానంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారని ఇన్‌స్పెక్టర్ మహేశ్ తెలిపారు. ఆయనతో మాట్లాడి, సర్దిచెప్పి అదుపులోకి తీసుకున్నామన్నారు.

“నిందితుడి వద్ద కత్తులతో పాటు ఒక సంచిలో ఎలక్ట్రిక్ రంపాలు కూడా దొరికాయి. ఒకవేళ సునీత తలుపులు వేసేసినా, వాటిని కోసేసేందుకు రంపం తెచ్చారు.”

రక్తం ఎక్కువగా పోవడం వల్ల సునీత మరణించారని, నిందితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, స్విఫ్ట్ డిజైర్ కారు, ఆయుధాలు ఉన్న సంచిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ కుటుంబ సభ్యులు లేదా ఆయన తరపు న్యాయవాదిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారు అందుబాటులోకి రాలేదు. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్డేట్ అవుతుంది.

సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎంత ప్రమాదకరం కావొచ్చనేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, రోజువారీ కార్యక్రమాల వంటి వివరాలు షేర్ చేయవద్దని తరచూ సైబర్ నేర నిపుణులు చెబుతూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో ఫొటో, వీడియో పోస్టుల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవీ…

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి

Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)