Home జాతీయ national telgu హైదరాబాద్: మూడు ముక్కలుగా మహానగరం

హైదరాబాద్: మూడు ముక్కలుగా మహానగరం

7
0

SOURCE :- BBC NEWS

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ మహానగరాన్ని మూడు నగరాలుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 11న జీవో నం.55 విడుదల చేసింది.

దీని ప్రకారం కొత్తగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇక నుంచి మూడు కార్పొరేషన్లుగా మారనుంది.

  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)
  • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

హైదరాబాద్ కార్పొరేషన్‌కే గ్రేటర్ హోదా

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ హోదా కొనసాగిస్తుండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరిలకు మాత్రం కార్పొరేషన్ హోదా మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం.

వార్డుల (డివిజన్ల) సంఖ్య, పరిధి, జనాభా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న జీహెచ్ఎంసీ పాలకవర్గం (2021-26) గడువు ఫిబ్రవరి 10తో ముగిసింది. ఆ వెంటనే జీహెచ్ఎంసీని మూడుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో విడుదల చేశారు.

అయితే, ప్రభుత్వం కార్పొరేషన్ల విభజనతోపాటు అందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల అభివృద్ధికి సమాన స్థాయిలో నిధులు విడుదల చేయాలని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి బీబీసీతో చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, IPR_TG

ఏ కార్పొరేషన్ పరిధిలో ఏయే ప్రాంతాలంటే..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు కార్పొరేషన్ల సరిహద్దులు ఈ విధంగా ఉన్నాయి.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోకి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు వస్తాయి.

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలోకి మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు వస్తాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు వస్తాయి.

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, GOVERN M ENT OF TELANGANA

డివిజన్ల వారీగా చూస్తే..

గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం 2025 డిసెంబరులోనే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల హైదరాబాద్ మహా నగర పరిధి అవుటర్ రింగు రోడ్డు వరకు పెరిగింది. దీనికి అనుగుణంగా డివిజన్ల సంఖ్యను 300కు పెంచింది ప్రభుత్వం.

వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోకి 150 డివిజన్లు వస్తాయి. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి 76 డివిజన్లు, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోకి 74 డివిజన్లు వస్తాయి.

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, IPR_TG

కొత్త కార్పొరేషన్ల కమిషనర్లు

కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది.

కొత్తగా ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ (ఇప్పటివరకు ఈయన జీహెచ్ఎంసీ కమిషనర్‌)ను నియమించారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి.సృజన (ఇప్పటివరకు ఈమె జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డి (ఇప్పటివరకు ఈయన జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌)ను నియమించారు.

ఇప్పటి వరకు ఉన్న జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియడంతో జయేశ్ రంజన్‌ను మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది.

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, IPR_TG

జీహెచ్ఎంసీ ప్రస్థానం ఇదీ..

2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటు తర్వాత 2009, 2016, 2021.. మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.

2025 డిసెంబరు 3న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత వార్డుల (డివిజన్ల) సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది.

అభ్యంతరాల స్వీకరణ తర్వాత, వార్డుల సంఖ్యను 300గా నిర్ణయిస్తూ 2025 డిసెంబరు 25న తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని గతంలో ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. అలాగే 12 జోన్లు, 60 సర్కిళ్లకు పెంచింది.

2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ మహా నగర జనాభా 67.31 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య కోటి దాటినట్టు అంచనా. త్వరలో జరిగే జనగణన తర్వాత అధికారిక డేటా వెల్లడికానుంది.

గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

‘పరిపాలన వికేంద్రీకరణ’

హైదరాబాద్ మహానగరాన్ని మూడుగా విభజించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని నిపుణులు చెబుతున్నారు.

”కేవలం విభజన కాదు, సౌకర్యాల కల్పన చేయాలి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి” అని పద్మనాభ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ మహానగరం విభజనతో పరిపాలన వికేంద్రీకరణ సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ రీసెర్చ్ అసోసియేట్ సిలివేరు హరినాథ్.

”ఈ పరిణామంతో హైదరాబాద్ మైలేజీ ఏమీ కోల్పోదు. పరిపాలన వికేంద్రీకరణ కోసం చిన్నగా చేయడం అవసరమే. దీంతో ప్రజలకు అందుబాటులో పాలన ఉంటుంది” అని బీబీసీతో చెప్పారు.

గతంలో కోర్ సిటీలో అభివృద్ధిపై ఫోకస్ ఉండేదని, ఇప్పుడు కార్పొరేషన్లు వేరు కావడంతో ఆయా కార్పొరేషన్ల పరిధిలోనూ పురోగతి సాధ్యపడతుందని సిలివేరు హరినాథ్ వివరించారు.

”ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు సమకూరితే, విస్తరణ జరిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తంగా హైదరాబాద్ మహానగరం మరింత విస్తరిస్తుంది” అని ఆయన అన్నారు.

అయితే, అభివృద్ధికి కొంత సమయం పట్టొచ్చు కానీ కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగమయ్యేలా చూడాలని హరినాథ్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)