Home జాతీయ national telgu హార్ముజ్ జలసంధి: భారత్ దీనిపై ఎంతగా ఆధారపడింది, వంటింటి గ్యాస్‌కు కష్టాలు వస్తాయా?

హార్ముజ్ జలసంధి: భారత్ దీనిపై ఎంతగా ఆధారపడింది, వంటింటి గ్యాస్‌కు కష్టాలు వస్తాయా?

6
0

SOURCE :- BBC NEWS

ఎల్‌పీజీ

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఇరాన్‌తో అమెరికా,ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నయుద్దం ప్రభావం భారత్‌పైనా పడుతోంది.

భారీ మొత్తంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ), లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)సహా తన మొత్తం ముడిచమురులో సగభాగాన్ని హార్ముజ్ జలసంధి ద్వారానే భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ ఇరుకైన జలసంధిని ఇరాన్ మూసివేసింది.

ఈ ప్రాంతంతో భారత్ సంబంధాలు ఇంధనానికి మించినవి. గల్ఫ్ వ్యాప్తంగా సుమారు కోటిమంది భారతీయులు నివసిస్తున్నారు. వీరు ఇక్కడ నుంచి భారత్‌లోని తమ కుటుంబాలకు పెద్దమొత్తంలో డబ్బు పంపుతున్నారు. ఇది భారత్ విదేశీ ద్రవ్య వ్యవహారాలలో పెద్దమొత్తాన్ని ఆక్రమిస్తోంది.

మరింత విస్తృతంగా చెప్పాలంటే మధ్య ప్రాచ్యంతో భారత్ ఆర్థిక సంబంధాలు చాలా గాఢంగా ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో 17 శాతం ఈ ప్రాంతానికే వెళతాయి. అలాగే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 55 శాతం ఇక్కడ నుంచే వస్తోంది. ఇక్కడ నివసించే భారతీయులు పంపే డబ్బు, విదేశాల నుంచి భారతీయులు ఇండియాకు పంపే డబ్బులో 38 శాతంగా ఉందని జెఫెరీస్ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

యుద్ధం గల్ఫ్‌కు విస్తరించడం ముడి చమురు సరఫరా, ప్రవాసుల నుంచి వచ్చే డబ్బు, వాషింగ్టన్, తెహ్రాన్, అరబ్ గల్ఫ్ దేశాలతో దిల్లీకి ఉన్న సున్నితమైన దౌత్య సంబంధాలపై ప్రభావం చూపొచ్చు.

ప్రస్తుతం దిల్లీ ఈ విషయంలో చాలా అప్రమత్తతో వ్యవహరిస్తోంది.

పెరుగుతున్న ఈ అనిశ్చిత పరిణామాల నేపత్యంలో భారత్ ”వేచిచూసే ధోరణి”తో వ్యవహరిస్తుందని థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ హర్ష్ వీ పంత్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అరబ్ గల్ఫ్ ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం భారత్‌ ఆందోళనలను పెంచుతోంది.

ప్రవాస భారతీయులు, రెమిటెన్స్‌లు, ఇంధనం, వాణిజ్యం, సంస్థాగత సంబంధాలు వంటి విషయాల్లో అరబ్ ప్రపంచంతో భారత సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయని పంత్ చెప్పారు.

అక్కడ జరిగే ”విధ్వంసం, నష్టం”పై భారత్ ఎందుకు అంతగా ఆందోళన వ్యక్తం చేస్తుందో ఇది వివరిస్తుందన్నారు.

ఈ సంక్షోభం మరింత కాలం కొనసాగితే.. ”ఆ ప్రాంతంతో భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక సంబంధాల విషయంలో మరింత నష్టం చేకూరవచ్చు” అని పంత్ హెచ్చరించారు.

భారత్-ఇరాన్ సంబంధాల విషయంలో ఎన్ని వాదనలు వినిపిస్తున్నా.. ప్రత్యేకించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇరాన్ ఏకాకి కావడం వల్ల భారత్, ఇరాన్ సంబంధాలు పరిమిత స్థాయిలోనే ఉన్నాయని పంత్ చెబుతున్నారు.

దీనివల్లే కీలకమైన గల్ఫ్ దేశాలతో భారత్ తన భాగస్వామ్యాలను పెంచుకుంది. అంటే, అక్కడ నెలకొనే అస్థిరతను దిల్లీ అత్యవసర పరిస్థితిగా చూస్తుంది.

అయితే, భారత్ దౌత్యపరంగా కూడా ఓడిపోయే అవకాశం ఉందని ఇరాన్‌కు భారత రాయబారిగా పనిచేసిన కేసీ సింగ్ అన్నారు.

”దాడులకు కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ను విమర్శించలేకపోవడం భారత్ తన తటస్థ వైఖరిని కోల్పోయేలా చేసింది. ఇరాన్ దీన్ని మర్చిపోకపోవచ్చు” అని ది ట్రిబ్యూన్‌లో సింగ్ రాశారు.

ఇంధనం,రెమిటెన్స్‌లు, గల్ఫ్‌లోని భారతీయులు, ఇరాన్‌లోని వ్యూహాత్మక ఓడరేవుపై దీని ప్రభావం కనిపించవచ్చు.

భారత క్రూడాయిల్ దిగుమతులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

చమురు, గ్యాస్

భారత్ ఇంధన కొరత దిశగా వెళ్తోందా? అంటే ఇంకా లేదు.

కానీ, హార్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధం నెలకొనడం, ఒక ఇరుకైన జల మార్గంతో దేశ ఇంధన భద్రత ఎంత గట్టిగా ముడిపడి ఉందో తెలియజేస్తుంది.

హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచంలోని చమురు, గ్యాస్‌లో సుమారు ఐదో వంతు సరఫరా అవుతోంది. ఇటీవల కాలంలో ఓడలపై దాడులు జరగడం, ఈ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలపై దాడులు జరుపుతామని ఇరాన్ హెచ్చరించడం. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయేలా చేసింది.

ఇక భారత విషయానికొస్తే తన మొత్తం చమురులో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.

తన క్రూడాయిల్ దిగుమతుల్లో సుమారు సగం అంటే రోజుకు 2.5 మిలియన్ బ్యారళ్ల నుంచి 2.7 మిలియన్ బ్యారళ్ల వరకు ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఎక్కువగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ నుంచి సరఫరా అవుతుంది.

చమురు ధరల్లో ప్రతి బ్యారల్‌పై 10 డాలర్ల పెరుగుదలను వినియోగదారులకు కనుక బదలాయిస్తే ద్రవ్యోల్బణం 0.2 శాతం నుంచి 0.25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని జెఫెరీస్ తెలిపింది.

ఈ పెరుగుదలను తగ్గించేందుకు ప్రభుత్వం ఒకవేళ ఫ్యూయల్ ట్యాక్సులను తగ్గిస్తే… ప్రభుత్వ ఆర్థిక లోటు (ప్రభుత్వ మొత్తం ఖర్చులకు, ఆదాయానికి మధ్యనుండే అంతరం) అదే స్థాయిలో ప్రభావితం కానుంది.

అయితే, ముడిచమురుపై వెంటనే ఆందోళన చెందాల్సిన పనిలేదు.

”హార్ముజ్ చుట్టూ నెలకొన్న ముప్పు ఆందోళనకరమైనదే” అని మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా అన్నారు. ”నేను క్రూడాయిల్‌ గురించి ఆందోళన చెందడం లేదు. కానీ, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ గురించి ఆందోళన ఉంది” అని చెప్పారు.

ఇది భారత ఇంధన వినియోగంలో నిర్మాణాత్మక మార్పును ప్రతిబింబిస్తోంది. సంప్రదాయ ఇంధనవనరుల స్థానంలో ఎల్‌పీజీ వినియోగం పెరిగేలా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోత్సహించాయి. తద్వారా ఎల్‌పీజీ డిమాండ్ అమాంతం పెరిగింది.

ప్రస్తుతం భారత్ తన మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో 80 నుంచి 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్‌పీజీ దిగుమతిదారు ఇండియానే.

ఈ షిప్‌మెంట్లన్నీ గల్ఫ్ ఉత్పత్తిదారులు ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ నుంచే వస్తున్నాయి. ఇవ్వన్నీ హార్ముజ్ మీదుగానే ప్రయాణం సాగిస్తాయి.

ఎల్‌ఎన్‌జీ కథ కూడా ఇదే.

దేశీయ అవసరాలలో కేవలం ఓ చిన్న భాగాన్ని మాత్రమే భారత్ తన సొంత గ్యాస్ ఉత్పత్తి ద్వారా తీర్చుకోగలుగుతోంది. కానీ విద్యుత్ ఉత్పత్తి, ఎరువులు, నగరాల్లో గ్యాస్ సరఫరా, రవాణా, పరిశ్రమల కోసం గ్యాస్‌పై పెద్ద ఎత్తున ఆధారపడుతోంది.

భారత్ గతేడాది 25 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంది. దానిలో సుమారు 14 మిలియన్ టన్నులు హార్ముజ్ ద్వారనే వచ్చింది. ఇది చైనా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలో అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కొనుగోలుదారిగా భారత్‌ను నిలిపింది.

ఆయిల్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

క్రూడాయిల్ మాదిరి కాకుండా.. భారత్ వద్ద అర్థవంతమైన వ్యూహాత్మక ఎల్‌పీజీ రిజర్వులు లేవు. నిల్వ సామర్థ్యం కూడా చాలా పరిమితం. ఒకవేళ దిగుమతులు పడిపోతే, రిఫైనరీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దనున్న నిల్వలు కేవలం రెండు నుంచి మూడు వారాల డిమాండ్‌కే సరిపోతాయి.

దీనికి భిన్నంగా ముడిచమురు నిల్వలు ఆశాజనకంగానే ఉన్నాయి.

”భారత్ వద్ద రిఫైనరీలు, కమర్షియల్ ఇన్వెంటరీల్లో సుమారు 100 మిలియన్ బ్యారళ్లు ఉన్నాయి. దానిలో 80 శాతం ఉపయోగించదగినవి. అంటే ఈ నిల్వలు సమారు 30 నుంచి 35 రోజుల పాటు సరిపోతాయి.”

డీజిల్, జెట్ ఫ్యూయల్ వంటి శుద్ధి చేసిన ఇంధనాలకు అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్న భారత్ అవసరమైతే తమ సరఫరాలను నిల్వ చేసుకునేందుకు ఎగుమతులపై ఆంక్షలు తీసుకు రావొచ్చు.

ప్రత్యామ్నాయ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి. రష్యా నుంచి లేదా అమెరికా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందిన అట్లాంటిక్ బేసిన్ నుంచి కొనుగోళ్లను భారత్ వేగవంతం చేయొచ్చు.

కానీ, ఆ బ్యారళ్లు భారత్‌కు చేరుకోవడానికి 25 నుంచి 45 రోజులు పడుతుంది. అదే గల్ఫ్ దేశాల నుంచి అయితే, ఐదు నుంచి ఏడు రోజుల్లోనే భారత్‌కు వస్తాయి. ఇది సప్లయి చెయిన్లను, రవాణా ఖర్చులను పెంచుతుందని కెప్లర్ పేర్కొంది.

ఒకవేళ ఒత్తిడి పెరిగితే, రష్యా క్రూడ్ వైపుకు భారత్ తిరిగి మొగ్గు చూపుతుందని నిపుణులు చెప్పారు.

”హిందూ మహా సముద్రంలో సుమారు 25 నుంచి 30 మిలియన్ బ్యారళ్ల రష్యా ఆయిల్ నౌకల్లో ఉన్నాయి. భారత్, చైనాలు మాత్రమే అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నందున్న, ఈ బ్యారళ్లు ప్రత్యామ్నాయ ప్రణాళికగా సిద్ధంగా ఉన్నాయి” అని రిటోలియా తెలిపింది.

బ్రెంట్ క్రూడ్ ధరలు, షిప్పింగ్ రేట్లు, యుద్ధ ముప్పు బీమా ప్రీమియాలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల స్వల్ప కాలంలో సరఫరాల్లో అలాగే ఉన్నప్పటికీ, భారత దిగుమతి బిల్లు పెరగనుంది.

ఎక్కువ కాలం, పూర్తిగా హార్ముజ్ మూయకపోవచ్చని కెప్లర్ అంచనా వేస్తోంది.

స్వల్పకాలంలో ఆయిల్, ఎల్‌ఎన్‌జీ ధరలు వేగంగా పెరుగుతాయని జెఫెరీస్ అనలిస్టులు అంచనావేస్తున్నారు. కానీ, ఏదేమైనా ఈ దిగ్బంధనం తాత్కాలికమేనని అభిప్రాయపడుతున్నారు.

అయితే హార్ముజ్ జలసంధి మూతపడితే వంట సిలిండర్లు, పవర్ ప్లాంట్లకు ఎల్‌ఎన్‌జీ సరఫరా చాలా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

భారతీయులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రవాస భారతీయులు

భారతీయుల వలస క్రమంగా విస్తరించింది.

1990ల్లో విదేశాల్లో నివసించే భారతీయులు 66 లక్షల మంది ఉంటే, నేడు ఈ సంఖ్య సుమారు కోటి 85 లక్షలకు పెరిగింది. ప్రపంచంలో అతిపెద్ద విదేశీ జనాభా వాటా భారత్‌దే.

గల్ఫ్ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌ల్లోనే సుమారు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు.

ఇది భారత ప్రపంచ వలసల్లో సుమారు సగం వంతు.

దశాబ్దాల క్రితం తాత్కాలిక కార్మిక వలసలుగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు అక్కడే స్థిరపడే స్థాయిగా పరిణామం చెందింది.

2025లో యూఏఈలోనే 2,47,000 మంది భారతీయ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్‌లలో కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

చాలా కుటుంబాలు తాత్కాలిక కార్మికులుగా అటు ఇటూ తిరగడం కంటే అక్కడే తమ మూలాలను ఏర్పరుచుకుంటున్నారన్న దానికి ఇది నిదర్శనం.

భారత ప్రభుత్వానికి వీరి భద్రత వ్యూహాత్మక ఆందోళనకర అంశంగా మారింది.

”గల్ఫ్ ప్రాంతంలో సుమారు కోటి మంది భారతీయులు పనిచేస్తూ నివసిస్తున్నారు. వారి భద్రత, సంక్షేమం మా అత్యంత ప్రాధాన్యత” అని ఈ ప్రాంతంలో సంఘర్షణలు రేగినప్పుడు అధికారులు తెలిపారు.

గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా గణనీయంగా ఉన్నాయి.

భారత్ 2024-25లో 135 బిలియన్ డాలర్ల(రూ.12 లక్షల కోట్లకు పైగా) రెమిటెన్స్‌లను పొందింది. ప్రపంచంలోనే రెమిటెన్స్‌లను అత్యధికంగా పొందిన దేశంగా భారత్ తన స్థానాన్ని నిలుపుకుంది.

గల్ఫ్‌లో ఉండే కార్మికులు ఈ రెమిటెన్స్‌ల్లో ఎక్కువ భాగం అందిస్తున్నారు.

నిర్మాణం, సేవా రంగం, ఇంధనం, పెరుగుతోన్న వృత్తి నైపుణ్య రంగాల్లో వీరు ఎక్కువగా పనిచేస్తున్నారు. భారత్‌లోని తమ కుటుంబాలకు బిలియన్ డాలర్లను పంపుతున్నారు.

భారత్‌కు వచ్చే మొత్తం రెమిటెన్స్‌లలో సుమారు ఐదవ వంతు కేరళ రాష్ట్రమే పొందుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు గల్ఫ్ వలసలపై ఎంత లోతుగా ఆధారపడుతున్నాయో ఇది తెలియజేస్తుంది.

ఈ ప్రాంతంలో దీర్ఘకాలం కొనసాగే సంక్షోభం బలవంత తరలింపులకు కారణం కావచ్చు. దీనివల్ల ప్రవాసభారతీయులకు ఉపాధి, విద్యా సౌకర్యాలు దూరమవుతాయి. ప్రవాసులు భారత్‌కు పంపే రెమిటెన్స్‌ల సరఫరాల్లోనూ మందగమనం కనిపించనుంది.

భారత్‌కు గల్ఫ్ కేవలం ఒక చమురు సరఫరా చేసే ప్రాంతంగానే కాక, ఉపాధికి, కుటుంబాల ఆదాయలకు, భారత విదేశీ ద్రవ్య స్థిరత్వానికి సంబంధించినదిగా ఉంది.

చాబహార్ పోర్టు

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images

చాబహార్ పోర్టు

పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాలకు చేరుకోవడానికి వ్యూహాత్మక ముఖద్వారంగా ఉన్న ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుపై భారత్ దశాబ్ద కాలంగా పెట్టుకున్న ఆశలు, వాషింగ్టన్ ఆంక్షలతో ఇబ్బందుల్లో పడ్డాయి.

2016లో ఈ పోర్టు అభివృద్ధి ఒప్పందంపై సంతకం పెట్టినప్పటి నుంచి, దిల్లీ దీన్ని తన ప్రాంతీయ అనుసంధాన వ్యూహానికి మూలస్తంభంగా చూసింది. భూపరివేష్టిత అఫ్గానిస్తాన్‌లోకి, అంతకుమించిన ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు అరుదైన ఓవర్‌ల్యాండ్ కారిడార్ ఇది.

ఇటీవల ఏళ్లల్లో, చాబహార్ పోర్టు ద్వారా భారత్ గోధుమలను, మానవతా సాయాలను అఫ్గాన్‌కు పంపించింది. ఒప్పందం ప్రకారం, ప్రతి ఏటా రెన్యూవల్ చేసే పద్ధతిలో షాహిద్ బెహెష్తీ టెర్మినల్‌ను భారత్ ఆపరేట్ చేస్తూ, పెట్టుబడులు పెడుతోంది.

ఇరాన్‌పై ఒత్తిడిని పునరుద్ధరించే క్రమంలో భాగంగా చాబహార్‌లో పనుల కోసం ఇచ్చిన ఆంక్షల మినహాయింపులను అమెరికా 2025 సెప్టెంబర్‌లో ఉపసంహరించుకోవడంతో భారత్ వ్యూహం కాస్త ప్రమాదంలో పడింది.

దౌత్యపరమైన ఉపశమనంలో భాగంగా.. వాషింగ్టన్ ఆ తర్వాత భారత్‌కు ఆరు నెలల మినహాయింపును అందించింది. సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే, 2026 ఏప్రిల్ 26 వరకు టెర్మినల్‌ వద్ద ఆపరేషన్స్‌ను కొనసాగించవచ్చని చెప్పింది. ఈ ప్రకటన కాస్త ఊరటనిచ్చింది. కానీ, కొంత మాత్రమే.

అయితే, ప్రస్తుత యుద్ధం దీన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది.

ఇరాన్‌లో ఘర్షణలు సద్దుమణిగితేనే, చాబహార్ పోర్టును భారత్ తిరిగి నమ్మకంగా చేపట్టగలదు. వాషింగ్టన్-తెహ్రాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలంతో పాటు ఆచరణాత్మకంగా, నిర్వహణాపరమైన ఆంక్షల వల్ల ఈ పోర్టుతో భారత్‌ భాగస్వామ్యం పరిమితంగానే ఉండనుందని పంత్ చెప్పారు.

ఘర్షణలు సద్దుమణగడానికి సంప్రదింపులు జరపాలని భారత్ తరచూ పట్టుపట్టనుంది. కానీ, దిల్లీ ప్రస్తుతం అరబ్ ప్రపంచంలో ఏం జరుగుతుందనే దానిపైనే ఎక్కువగా ఆందోళన చెందుతోందని పంత్ తెలిపారు.

కచ్చితంగా చెప్పాలంటే, మధ్య ప్రాచ్యంపై భారత్ ఆధారపడటం కేవలం చమురు, రెమిటెన్స్‌లకే కాదు, అంతకుమించినది.

2025లో ఈ ప్రాంతం నుంచి సుమారు 100 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. దానిలో ఎరువులు, పెట్రోకెమికల్స్ నుంచి పారిశ్రామిక ఖనిజాల వరకు ఉన్నాయి. ఈ దిగుమతులు ఆగినా, ఆలస్యం అయినా

వ్యవసాయం, ప్లాస్టిక్స్ వంటి రంగాల నుంచి నిర్మాణ, డైమండ్ కటింగ్ ఇండస్ట్రీవరకు ప్రభావితమవుతాయి.

‘‘హార్ముజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా అంతరాయాలు వారం కంటే ఎక్కువగా కొనసాగితే, దాని ప్రభావం ఇంధన మార్కెట్ల నుంచి ఎరువులు, తయారీ రంగం, నిర్మాణ రంగ సామాగ్రి, వజ్రాల వంటి ఎగుమతి పరిశ్రమలపై ప్రభావం పడుతుంది’’ అని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) థింక్ ట్యాంక్ హెడ్, భారత వాణిజ్య మాజీ అధికారి శ్రీవాత్సవ చెప్పారు.

‘‘ప్రాంతీయ యుద్ధంగా మొదలైనప్పటికీ, ఇది అత్యంత వేగంగా భారత విస్తృత సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించవచ్చు’’ అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)