Home జాతీయ national telgu ‘షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదే’నన్న వైస్ చాన్స్‌లర్.. షార్ట్స్‌ వేసుకుని యూనివర్సిటీలో...

‘షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదే’నన్న వైస్ చాన్స్‌లర్.. షార్ట్స్‌ వేసుకుని యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన

25
0

SOURCE :- BBC NEWS

తిరుచ్చి లా యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా

ఫొటో సోర్స్, Handout

విద్యార్థినులు షార్ట్స్ ధరించడం అనేది తమపై లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

విద్యార్థి ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

విద్యార్థులు ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారీ ప్రదర్శనలు చేపట్టారు.

వీటిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఆ మాట అన్నానని వైస్ చాన్స్‌లర్ వివరణ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతంలో కాలేజీ ఉన్నందున అక్కడి పరిస్థితులకు తగినట్లుగా దుస్తులు ధరించాలనే ఉద్దేశంతో అలా చెప్పానని తెలిపారు.

ఆయన వివరణ ఆమోదయోగ్యంగా లేదని విద్యార్థులు అంటున్నారు. అసలేం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏం జరిగింది?

తిరుచ్చిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో ఏప్రిల్ 15న క్లాస్ రిప్రంజెంటేటివ్‌ల సమావేశం జరిగింది. ఇందులో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వి. నాగరాజ్ సహా కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వైస్ చాన్స్‌లర్ నాగరాజ్ సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థినులు షార్ట్స్ (పొట్టి దుస్తులు) ధరించడం కాలేజీ సిబ్బందితో సహా ఇతరుల ధ్యాసను మళ్లిస్తుందని (డిస్ట్రాక్షన్).. అది లైంగిక వేధింపులకు ఆహ్వానం అవుతుందని అన్నట్లు విద్యార్థులు ఆరోపించారు.

”గతంలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశానని, దాని గురించి తాను ‘గర్వపడుతున్నానని’ వీసీ వ్యాఖ్యానించారు. రెండు వేర్వేరు సంస్థల్లో వీసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కేవలం ఆయన వ్యక్తిగత పొరపాటు కాదు. వేధింపులను సాధారణంగా చూసే, బాధితులనే నిందించడం వంటి సంస్థాగత వైఖరికి ఇది అద్దం పడుతుంది” అని విద్యార్థులు విడుదల చేసిన నిరసన లేఖలో పేర్కొన్నారు.

వైస్ చాన్స్‌లర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే సంస్థాగత విచారణ చేపట్టాలని, దుస్తుల ఎంపిక అనేది వేధింపులకు దారితీయదనే విషయాన్ని ఆయన కచ్చితంగా అంగీకరించాలని వారు కోరారు.

తిరుచ్చి లా యూనివర్సిటీ క్యాంపస్

ఫొటో సోర్స్, Handout

ప్రతి నెలా విద్యార్థి ప్రతినిధులతో కాలేజీ అడ్మినిస్ట్రేషన్ విభాగం సమావేశం అవుతుందని బీబీసీతో ఒక విద్యార్థిని చెప్పారు. ఆమె తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

‘సమావేశంలో వీసీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడున్న మహిళా సిబ్బంది సహా ఎవరూ దీనిపై స్పందించలేదు. ఆయన వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యంగా అనిపించాయి. ఆ మాటలతో మేం బాధపడ్డాం’ అని ఆమె అన్నారు.

దీనికి నిరసనగా విద్యార్థులు షార్ట్స్ వేసుకొని కాలేజీ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఎదుట బైఠాయించారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో ధర్నాలు చేశారు.

గురువారం రాత్రంతా నిరసనల్లో పాల్గొన్నప్పటికీ, మేనేజ్‌మెంట్ తరఫున ఎవరూ వచ్చి తమతో మాట్లాడలేదని విద్యార్థులు చెప్పారు.

“రాత్రంతా యూనివర్సిటీలో నిరసనలు చేశాం. ఏదైనా చిన్న విషయం జరిగినా వెంటనే వచ్చి మాట్లాడే మేనేజ్‌మెంట్, ఇంత భారీ నిరసనలు చేసినా ఒక్కరు కూడా ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు’ అని ఆ విద్యార్థిని అన్నారు.

అయితే, మరుసటి రోజైన శుక్రవారం రిజిస్ట్రార్‌ సహా వీసీ, అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన ఇతర అధికారులు వచ్చి తమతో మాట్లాడినట్లు మరో విద్యార్థిని బీబీసీకి చెప్పారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ వైస్ చాన్స్‌లర్ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

”ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు, క్షమాపణ చెప్పలేదు. తర్వాత ఏం చేయాలనే దానిపై విద్యార్థులందరితో చర్చిస్తున్నాం. దాన్ని బట్టి తర్వాతి చర్యలు ఉంటాయి” అని ఆమె తెలిపారు.

తిరుచ్చి యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Social Media

వైస్ చాన్స్‌లర్ ప్రకటనలో ఏముంది?

వైస్ చాన్స్‌లర్ నాగరాజ్ ఏప్రిల్ 19న ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థులు 16, 17 తేదీల్లో చేసిన నిరసనలకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు సహా పలు అంశాల గురించి ఆ సమావేశంలో చర్చించినట్లు తన వివరణలో వీసీ చెప్పారు.

మన విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి, దాని ఇమేజ్‌ను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని విద్యార్థుల్ని అడిగినట్లు ప్రకటనలో తెలిపారు.

”చాలా విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్ గురించి చర్చించరు. ఒకవేళ ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఆ విషయంలో ఏదైనా చేస్తే అది ఈ సంస్థ ప్రతిష్టను పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నాను. అలాగే, డ్రెస్ కోడ్‌ను నేను బలవంతంగా రుద్దలేనని కూడా స్పష్టంగా చెప్పాను. ఆ సమయంలోనే, 2016లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్‌లో డ్రెస్ కోడ్ విషయంలో నాకు ఎదురైన అనుభవాన్ని వారితో పంచుకున్నాను” అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుచ్చి లా యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Handout

”ప్రస్తుతం, మహిళా హాస్టల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొన్ని రకాల దుస్తులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పనిచేసే కార్మికులు, విజిటర్స్, దుకాణదారులు వంటి వారికి డిస్ట్రాక్షన్ కలిగించొచ్చు. ఈ విద్యా సంస్థ, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నందున, విద్యార్థులు తమ దుస్తులు, ప్రవర్తన వంటి విషయాల్లో విజ్ఞతతో వ్యవహరించాలి. తద్వారా బయటి వ్యక్తుల నుంచి అనవసరమైన కామెంట్లు, దృష్టి పడకుండా చూసుకోవచ్చు” అని పేర్కొన్నారు.

మార్చి 29, 2026న సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి (ICC) ఒక ఫిర్యాదు అందిందని, దాని గురించి తాను విద్యార్థులకు చెబుతూ భద్రతపై తన అభిప్రాయాలను పంచుకున్నానని కూడా ఆ ప్రకటనలో వివరించారు.

” నా వ్యాఖ్యలు విద్యార్థులను గానీ, సిబ్బందిని గానీ, లేదా మేనేజ్‌మెంట్‌ను బాధపెట్టి పెట్టటి వారికి క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని తెలిపారు.

అయితే, వైస్ చాన్స్‌లర్ వివరణ ఆమోదయోగ్యంగా లేదని బీబీసీతో మాట్లాడిన విద్యార్థులు అంటున్నారు.

”ఆయన ఏ ఉద్దేశంతో చేసినా ఆ వ్యాఖ్యలు మాత్రం తప్పే. అక్కడ భవన నిర్మాణ పనులు చేసే కార్మికుల ధ్యాస మళ్లుతుందని చెప్పడం వారిని తక్కువ చూపుతో చూసినట్లే అవుతుంది. గ్రామంలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారం దుస్తులు వేసుకోవాలనడం కూడా తప్పే. ఆయన చెప్పినట్లుగా ఐసీసీ కమిటీకి అందిన ఫిర్యాదు గురించి ఈ సమావేశంలో అసలు చర్చించలేదు” అని ఒక విద్యార్థి అన్నారు.

”వైస్ ఛాన్సలర్ తన మాటలను వెనక్కి తీసుకోలేదు. అసలు క్షమాపణే చెప్పలేదు. దానికి బదులుగా, ‘ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి వెనకాడను’ అని అనడం ఆమోదయోగ్యం కాదు” అని మరో విద్యార్థిని అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన వివరణ స్పష్టంగా ఉందని విశ్వవిద్యాలయ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించకూడదనే నిబంధన పెట్టారు.

”తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మాటలను విద్యార్థులు సహా ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అయితే, చివరికి ఆయన వివరణే సరైనది. ఆ సమావేశంలో చాలా విషయాలు చర్చించారు. ఐసీసీకి అందిన ఫిర్యాదు గురించి ప్రస్తావిస్తున్నప్పుడే వీసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలను చూడాలి. అలాగే, డ్రెస్ కోడ్ గురించి ఆయన ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. విద్యార్థుల అభిప్రాయమే కోరారు. తాను ఎటువంటి నియమాలను రుద్దనని కూడా చెప్పారు” అని ఆయన స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)