SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Venugopala rao/UGC
(గమనిక: కలవరపరిచే అంశాలు ఉన్నాయి)
డేటింగ్ యాప్‌లో పరిచయమైన 29 ఏళ్ల మౌనిక అనే యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో ఇటీవల వెలుగులోకి వచ్చింది.
తూర్పు నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల రవీంద్రను ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.
హత్య తర్వాత కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచి, మరికొన్ని భాగాలను సంచిలో కట్టి అడవివరం సమీపంలోని ధారపాలెంలో రవీంద్ర కాల్చేశాడని గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ పార్థసారథి బీబీసీతో చెప్పారు.
‘‘భార్య ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లి ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్న సమయంలో, ప్రియురాలిని చంపేశాడు’’ అని పోలీసులు చెప్పారు. అయితే.. తొలుత రవీంద్ర తన ఇంట్లోనే మౌనికను చంపినట్లు పోలీసులు భావించారు.. కానీ, సీసీటీవీ ఫుటేజ్ చూశాక కొత్త విషయాలు బయటపడ్డాయి.

సీసీ ఫుటేజీలో ఏముందంటే…
మౌనిక హత్య కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కొత్త విషయాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజ్‌లో.. హత్య జరిగిన స్థలం రవీంద్ర ఇల్లు కాదని తేలిందని గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ పార్థసారథి బీబీసీతో గురువారం చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి ఆయన తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించారు.
‘‘నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు మౌనికతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిందని దర్యాప్తులో తెలిసింది. ఈ ఏడాది మార్చి 29న మర్రిపాలెం నుంచి మౌనికను బైక్‌పై తన ఫ్లాట్‌కు తీసుకెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమెను చంపినట్లు రవీంద్ర ప్రాథమిక విచారణలో చెప్పాడు’’ అని పార్థసారథి తెలిపారు.
‘‘అయితే, సీసీ కెమెరా దృశ్యాల్లో మౌనిక ఎల్బీ నగర్‌లోని రవీంద్ర ఫ్లాట్‌కు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో మేం దర్యాప్తును మరో కోణంలో కొనసాగించాం’’ అన్నారు సీఐ పార్థసారథి.
‘‘రవీంద్ర తన ఫ్లాట్‌కు సమీపంలో నివసించే స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకుని, మౌనికను అక్కడికి తీసుకెళ్లాడు. ఆ రోజు ఉదయం స్నేహితుడు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మౌనిక గట్టిగా అరవడంతో, ఆమె నోరు మూయించే ప్రయత్నంలో రవీంద్ర మోకాలితో గొంతుపై ఒత్తిడి చేయడంతో ఆమె మృతి చెందినట్లు విచారణలో రవీంద్ర తెలిపారు.
ఆ తర్వాత మృతదేహాన్ని కొంతసేపు అక్కడే ఉంచి, సమీపంలోని తన ఫ్లాట్ నుంచి ట్రాలీ బ్యాగ్ తీసుకొచ్చి అందులో మృతదేహాన్ని పెట్టి తరలించి…తరువాత కత్తులు, వైపర్, డస్ట్‌బిన్ కవర్లు కొనుగోలు చేసి, తన ఫ్లాట్ బాత్రూమ్‌లో మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచినట్లు విచారణలో తేలింది’ అని సీఐ పార్థసారథి తెలిపారు.
శరీర భాగాలను తరువాత జీడితోట ప్రాంతంలో పెట్రోలు పోసి దహనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడు రవీంద్రను కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి కేంద్ర కారాగారానికి తరలించారు.
ఫొటో సోర్స్, Venugopala rao
డేటింగ్ యాప్‌లో పరిచయం…
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రవీంద్రకు రెండేళ్ల కిందటే వివాహమైంది. అతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లారు.
‘‘ఈ సమయంలో తన ఇంట్లోనే రవీంద్ర, మౌనిక తరచూ కలుస్తుండేవారు. ఆదివారం ఉదయం (29.03.26) మౌనికని పిలిచారు రవీంద్ర. మౌనికతో రోజంతా వాగ్వాదం జరిగిందని నిందితుడు చెప్పాడు’’ అని పోలీసులు తెలిపారు.
‘‘డబ్బుల కోసం వేధిస్తోందని, తన భార్యకు చెబుతానంటూ బెదిరించిందని రవీంద్ర వెల్లడించారు’’ అని సీఐ పార్థసారథి అంతకుముందు ప్రాథమిక విచారణ సమయంలో తెలిపారు.
ఫొటో సోర్స్, UGC
క్లీన్‌గా ఇల్లు
”ఆదివారం సాయంత్రం మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎల్బీ నగర్‌లో రవీంద్ర అనే నేవీ ఉద్యోగి హత్య చేశాడని, అతను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే వారు చెప్పిన అడ్రస్‌కు వెళ్లేసరికి ఇంటికి గడియపెట్టి ఉంది. కిటికీలు, వెంటిలేటర్ల నుంచి లోపలకు చూసే ప్రయత్నం చేశాం ఏం కనిపించలేదు. దీంతో పొరుగింటి వాళ్లని పిలిచాం’’ అని సీఐ పార్థసారథి తెలిపారు.
‘‘వారు ఇంటి యాజమానికి ఫోన్ చేసి రప్పించారు. అలాగే రవీంద్ర సోదరుడిని కూడా పిలిపించాం. ఆయన సహాయంతో ఇంటిలోపలికి ప్రవేశించాం. ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంది. స్ప్రే చల్లిన వాసన వస్తోంది. అనుమానించదగిన విషయాలేవీ కనిపించలేదు. ఫ్రిజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో తల లేని మొండెం కనిపించింది. ఇంకా సెర్చ్ చేస్తే ఒక సూట్ కేసు కనిపించింది. అందులో కొన్ని శరీర భాగాలున్నాయి’’ అని చెప్పారు.
‘‘వెంటనే రవీంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించాం. అదే సమయంలో అతని తల్లిదండ్రుల నుంచి మాకు ఫోన్ వచ్చింది. వారి సహాయంతో రవీంద్రను పోలీసు స్టేషన్‌ను పిలిపించి, అదుపులోకి తీసుకున్నాం. హత్య చేసిన తర్వాత తలని అడవివరంలోని ధారపాలెం తీసుకుని వెళ్లి కాల్చేసినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు. అక్కడకి మా బృందాలు వెళ్లి పరిశీలిస్తున్నాయి” అని పార్థసారథి బీబీసీకి వివరించారు.
హత్యకు ముందు రోజు కత్తి, స్ప్రే కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితుడు రవీంద్ర చెప్పారని పోలీసులు తెలిపారు.
‘‘భయంతో పరుగులు తీశాం’’
పోలీసులు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రవీంద్ర నివాసం ఉంటున్న అంతస్తులోనే ఉన్న మరో ఫ్లాట్ యజమాని రామకృష్ణ బీబీసీకి వివరించారు.
“ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు మా పక్క ఫ్లాట్ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తున్నారు. ఏంటా అని మేం ప్రశ్నిస్తే…క్రైం జరిగినట్లు సమాచారం వచ్చిందని…తాము పోలీసులమని చెప్పారు. రవీంద్రకు సంబంధించిన కొన్ని వివరాలు అడిగారు. ఆయన మంచిగానే ఉండేవాడని పోలీసులకు చెప్పాం. పోలీసులు లోపలికి వెళ్లిన తర్వాత అంతా శుభ్రంగా ఉండటం, ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు లేకపోవడంతో మేం ఊపిరి పీల్చుకున్నాం. అయితే కొద్ది సేపటికే ఫ్రిజ్‌లో మొండెం, సూట్ కేసులో కొన్ని శరీర భాగాలు బయటపడ్డాయి. అవి చూసిన వెంటనే మేం భయంతో పరుగులు తీశాం. ఇప్పటికీ ఆ భయం పోలేదు” అని రామకృష్ణ చెప్పారు.
ఫొటో సోర్స్, UGC
‘వాళ్లు అద్దెకు వచ్చి సరిగ్గా ఏడాదైంది’
సరిగ్గా ఏడాది క్రితం అంటే మార్చి 29, 2025న రవీంద్రకు ఇల్లు అద్దెకు ఇచ్చానని, మళ్లీ హత్య వార్తతో ఈ ఇంటికి రావాల్సి వచ్చిందని ఫ్లాట్ యజమాని శ్రీరామమూర్తి చెప్పారు.
“ఇల్లు అద్దెకోసం ఆయన వచ్చాడు. ఐడీ కార్డు చూపించాడు. నేవీలో పని చేస్తున్నాడని తెలిసింది. సొంతూరు రాజాం అని చెప్పాడు. నేను కూడా బీఎస్ఎఫ్ రిటైర్డ్ ఉద్యోగిని. వెంటనే అతనికి ఇల్లు అద్దెకు ఇచ్చాను. ప్రతినెలా అద్దె ఇచ్చేవాడు. అతని భార్య కూడా పుట్టింటికి వెళ్లిందని చెప్పాడు. ఇప్పుడు ఇలా జరిగింది” అని శ్రీరామమూర్తి తెలిపారు.
రవీంద్ర కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించింది. వారు అందుబాటులోకి రాలేదు. వారి నుంచి స్పందన వస్తే దానిని అప్ డేట్ చేస్తాం.
‘‘అతన్ని శిక్షించండి’’
మౌనిక తండ్రి వేణుగోపాలరావుతో బీబీసీ మాట్లాడింది.
“మా అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతోనే అతడు ఇంటికి పిలిచాడు. అందుకే ముందుగానే కత్తి, స్ప్రే వంటివి కొన్నాడు. నా కూతురు ఎలాగు తిరిగి రాదు. కనీసం అతడు చేసిన పాపానికి కఠినంగా శిక్షించండి. నా కూతురుకి మనశ్శాంతైనా దక్కుతుంది.” అని వేణుగోపాలరావు అన్నారు
మౌనిక కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



