Home జాతీయ national telgu రోహిత్ శర్మ: టీమిండియాలో చెలరేగి ఆడాడు, కానీ, ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కు వచ్చేసరికి..

రోహిత్ శర్మ: టీమిండియాలో చెలరేగి ఆడాడు, కానీ, ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కు వచ్చేసరికి..

5
0

SOURCE :- BBC NEWS

ముంబయి ఇండియన్స్, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ శర్మ విమర్శల పాలవుతున్నాడు. గత మూడేళ్ల రోహిత్ ఆటతీరు 2025లోనూ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికీ భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న ఈ ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో, 13.66 సగటు(యావరేజ్)తో కేవలం 82 పరుగులు చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 16 బంతుల్లో 26 పరుగులు చేసిన రోహిత్‌కు ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు. మూడు సిక్సర్లతో ఫామ్‌లోకి వచ్చాడనే సంకేతాలు కనిపించిన కొద్దిసేపటికే అవుటయ్యాడు.

‘అతను నిలకడగా రాణించడం చాలా కష్టంగా కనిపిస్తోంది’ అని ఐపీఎల్ మాజీ బ్యాటర్ అభిషేక్ ఝన్‌ఝన్‌వాలా బీబీసీతో అన్నాడు.

రోహిత్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుపై కూడా ప్రభావం చూపుతోంది. నిలకడగా రాణిస్తూ, జట్టుకి విజయాన్ని అందించే అత్యుత్తమ జోడీ దొరక్క ముంబయి ఇబ్బంది పడుతోంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబయి, మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

2024లో టీ20 ప్రపంచ కప్, పోయిన నెలలో చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లతో అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో భారీ విజయాలు నమోదు చేసినప్పటికీ, ఐపీఎల్‌‌లో మాత్రం రోహిత్ పరిస్థితి భిన్నంగా ఉంది.

ముంబయి ఇండియన్స్‌ జట్టుకి రోహిత్ లెజెండ్ కూడా. కెప్టెన్‌గా 11 ఏళ్లలో ఐదుసార్లు టైటిల్ అందించాడు. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో అతని పేరుమీద ఒక స్టాండ్ కూడా నిర్మించబోతున్నారు.

భారీ విజయాలు, హోదా కారణంగా అతనిపై భారీ అంచనాలు ఉంటాయి. మరి, రోహిత్ పేలవ ప్రదర్శనకు కారణమేంటి? అతని ఆటతీరులో వచ్చిన మార్పులేంటి? నంబర్లు పరిశీలించినప్పుడు ఏం తెలుస్తోంది వంటి అంశాలను బీబీసీ స్పోర్ట్ క్రిక్‌విజ్ డేటా విశ్లేషకులు సోహమ్ సర్ఖేల్ వివరించే ప్రయత్నం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్, ఐపీఎల్ 2025

ఫొటో సోర్స్, Getty Images

రోహిత్ పేలవ ప్రదర్శన

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రోహిత్ యావరేజ్ 29.30. కానీ, 2022 నుంచి టాప్ ఆర్డర్‌లో అతని యావరేజ్ 22.89 శాతం. ఐపీఎల్‌లో 20కి పైగా మ్యాచ్‌లు ఆడిన 21 మంది ఓపెనర్లలో ఇది రెండో అత్యల్పం.

ఈ సీజన్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో 13.66 యావరేజ్ సాధించాడు రోహిత్ . 2024లో జరిగిన చివరి మూడు మ్యాచ్‌లను కలిపితే అది 12.89కు పడిపోతుంది.

అయితే, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో రోహిత్ ప్రదర్శన ఈ స్థాయిలో తగ్గలేదు. 2022 ప్రారంభం నుంచి టీ20ల్లో యావరేజ్ 29.34 కాగా, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా యావరేజ్ 22.89.

ఐపీఎల్‌లో నాలుగు (32.7), ఐదు (33.11) స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రోహిత్‌ యావరేజ్ మెరుగ్గా ఉంది. ఓపెనర్‌గా మారిన తర్వాత అది 27.74కి పడిపోయింది. 2016 నుంచి 2024 వరకూ రోహిత్ యావరేజ్ 30కి పైనే. (కనీసం 5 ఇన్నింగ్స్‌లో )

రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్, ఐపీఎల్ 2025

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు?

2022 నుంచి చూస్తే.. ఆరు ఓవర్ల పవర్‌ప్లేలో, పేస్ బౌలింగ్‌లో రోహిత్ సగటు 36.47 నుంచి 24.39కి పడిపోయింది.

2023 ప్రారంభం నుంచి ఆడిన 36 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో కేవలం 12 మ్యాచ్‌లలోనే పవర్ ప్లే ఓవర్లు పూర్తయ్యే వరకూ క్రీజులో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ పవర్ ప్లే దాటలేదు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన రోహిత్ ఆటతీరు గతంలో బ్యాలెన్స్‌డ్‌గా కనిపించేది. ఇంతకు ముందు లెగ్ సైడ్‌లో 51 శాతం పరుగులు చేసేవాడు, ఇప్పుడది 59 శాతానికి పెరిగింది.

అంటే, అవుట్ స్వింగర్లు ఆడే యావరేజ్ తగ్గి, ఇన్‌స్వింగర్లు ఆడే యావరేజ్ పెరిగింది. 2022కి ముందు వరకూ ఇన్‌స్వింగర్లను ఎదుర్కొనే యావరేజ్ 27 కాగా, అవుట్‌ స్వింగర్ల యావరేజ్ 50కి దగ్గరగా ఉండేది. కానీ, ఇప్పుడది వరసగా 44, 19కి మారిపోయింది.

గతంలో, పవర్‌ప్లే ఓవర్లలో కుడిచేతి వాటం పేసర్ల అవుట్ స్వింగర్లు ఆడే యావరేజ్ 63, కానీ ఇప్పుడది 16.

2014 నుంచి 2021 మధ్య కాలంలో ఎడమచేతి వాటం సీమర్ల చేతిలో 7 సార్లు ఔటయ్యాడు. అప్పుడు యావరేజ్ 28.85 ఉండేది. 2022 నుంచి చూస్తే 8 సార్లు ఔటయ్యాడు. యావరేజ్ 22.37.

స్పిన్ బౌలింగ్‌లోనూ రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. 2022 నుంచి చూస్తే, స్పిన్‌ బౌలింగ్‌లో యావరేజ్ 15.33, గతంలో ఇది 34.68గా ఉండేది.

లెగ్‌ స్పిన్‌‌లో మరింత పేలవంగా ఉంది. 2022 నుంచి యావరేజ్ కేవలం 7.88 మాత్రమే.

స్వీప్‌ షాట్ కూడా రోహిత్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. 2014 నుంచి 2021 మధ్య స్వీప్‌షాట్‌ కోసం ప్రయత్నించింది 7 శాతం మాత్రమే. ఈ ప్రయత్నంలో 8 సార్లు ఔటయ్యాడు. 2022 నుంచి అది 21 శాతానికి పెరగ్గా, 6సార్లు ఔటయ్యాడు, యావరేజ్ 15.5.

అన్ని ఫార్మాట్లలో కలిపి, చివరి 30 స్వీప్ షాట్ ప్రయత్నాల్లో 7 సార్లు ఔటయ్యాడు. యావరేజ్ 7.

రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్, ఐపీఎల్ 2025

ఫొటో సోర్స్, Getty Images

కొద్ది రోజులే సమయం…

ముంబయి చివరగా 2020లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 2024లో రోహిత్ స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌ అయ్యాడు. ఈ ఆల్‌రౌండర్ నేతృత్వం వహించిన మొదటి సీజన్‌లో ముంబయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

రోహిత్ లెజెండరీ స్టేటస్, తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి మరికొంత సమయాన్ని కల్పించొచ్చు. కానీ, అతను మెరుగుపడకపోయినా, జట్టు మెరుగుపడకపోయినా మేనేజ్‌మెంట్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు.

”అతనిపై చాలా ఒత్తిడి ఉంటుంది, ముఖ్యంగా భారత్ తరఫున ఆడుతున్నప్పుడు” అని ఝన్‌ఝన్‌వాలా అన్నాడు.

‘‘ఐపీఎల్‌లో, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. చాలామంది ఆటగాళ్ల విషయంలో అది మనం చూశాం. ముంబయి ఇండియన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు. అయితే అతని విషయంలో యాజమాన్యం కాస్త సంయమనంగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఏళ్లుగా అతను ముంబయి జట్టుకి చాలా చేశాడు.’’ అన్నాడు ఝన్‌ఝన్‌వాలా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)