SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Aussom
28 నిమిషాలు క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
సాంకేతిక లోపం తలెత్తిన విమానాన్ని చాకచక్యంగా సముద్రపు ఒడ్డున ఆపిన తమ పైలట్‌ను సోమాలియాలోని ఒక విమానయాన సంస్థ ప్రశంసించింది.
అయిదుగురు సిబ్బంది, 50 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని రాజధాని మొగాదిషులోని అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న సముద్రతీరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయగా, అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
పైలట్ సమయోచిత నిర్ణయం ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో కీలకమైందని స్టార్‌స్కై ఏవియేషన్ తెలిపింది.
మొగాదిషు నుంచి మంగళవారం ఉదయం బయలుదేరిన ఫోకర్ 50 విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన సిబ్బంది విమానాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించారని సోమాలియా పౌర విమానయాన సంస్థ (సీఏఏ) వెల్లడించింది.
విమానం రన్‌వేపై సురక్షితంగా దిగినప్పటికీ, రన్‌వే దాటి వెళ్లి పక్కనే ఉన్న సముద్రపు ఒడ్డున అలల మధ్య ఆగిందని సీఏఏ డైరెక్టర్ అహ్మద్ మాకాలిన్ హసన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Starsky Aviation
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
హిందూ మహాసముద్ర తీరంలో ఆగిన విమానం నుంచి ప్రయాణికులు దిగి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఎక్స్‌లో పోస్ట్ అయిన వీడియోల్లో కనిపించాయి. విమానంలోని వారెవరూ గాయపడలేదని సమాచారం.
రక్షణ చర్యల కోసం ఐక్యరాజ్య సమితి (యూఎన్), ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) దళాలను తక్షణమే పంపినట్లు సోమాలియాలోని ఆఫ్రికన్ యూనియన్ మిషన్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పేర్కొంది.
సంఘటనాస్థలంలో సోమాలియా రవాణా మంత్రి కూడా ఉన్నట్టు తెలిపింది.
ఫొటో సోర్స్, Starsky Aviation
“ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసిన సాంకేతిక లోపం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది,” అని స్టార్‌స్కై ప్రతినిధి హసన్ మొహమ్మద్ అదెన్ తెలిపారు.
“విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటంలో పైలట్ సమయోచితంగా, నిబ్బరంగా తీసుకున్న నిర్ణయం కీలక పాత్ర పోషించింది. పరిస్థితిని ఆయన చాకచక్యంగా నిర్వహించిన తీరు అభినందనీయం” అని అదెన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



