Home జాతీయ national telgu యూనిఫాం సివిల్ కోడ్: సంప్రదాయ పద్దతుల్లో విడాకులు చెల్లుబాటు కావా, కోర్టు ద్వారానే విడాకులు...

యూనిఫాం సివిల్ కోడ్: సంప్రదాయ పద్దతుల్లో విడాకులు చెల్లుబాటు కావా, కోర్టు ద్వారానే విడాకులు పొందాలా? లివ్ ఇన్ రిలేషన్ చట్టబద్ధత మహిళలకు ప్రయోజనకరమేనా?

12
0

SOURCE :- BBC NEWS

భారతదేశం, యూనిఫాం సివిల్ కోడ్, గుజరాత్, ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు అది చట్టంగా మారనుంది. ఈ బిల్లు మహిళలకు ప్రయోజనకరమని ప్రజావేదికల పైనా, మీడియాతోనూ, శాసనసభలోనూ మంత్రులు పదేపదే చెబుతున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందాక, గుజరాత్‌లో మహిళల స్థితిగతులు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గురించి కూడా చర్చ మొదలైంది.

ఈ బిల్లు వల్ల మహిళలకు పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా సామాజిక సమస్యలు పెరుగుతాయని కొందరు నిపుణుల అభిప్రాయం. మరోవైపు, అణగారిన వర్గాల మహిళలకు ఈ బిల్లు వల్ల మేలు జరుగుతుందని మరికొందరు అంటున్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లులో మహిళల కోసం ఉన్న ముఖ్యమైన నిబంధనలు ఏమిటి, వారికి ఎలాంటి కొత్త హక్కులు కల్పించబోతున్నారు?నిపుణులు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఏమేం నిబంధనలు ఉన్నాయి?

యూనిఫాం సివిల్ కోడ్‌లో మహిళల కోసం అనేక నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటంటే…

  • ప్రతి మహిళకు వారసత్వ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. మతం ఆధారంగా మహిళల కోసం ఎటువంటి ప్రత్యేక నిబంధనలు ఉండవు.
  • సామాజిక సంప్రదాయాల ప్రకారం ఇచ్చే విడాకులు కాకుండా, కోర్టు ద్వారా మంజూరయ్యే విడాకులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
  • వివాహం ప్రతి మతంలో వారి ఆచారాల ప్రకారం చేసుకోవచ్చు, కానీ వివాహం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి.
  • లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను భాగస్వామి వదిలేస్తే, ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుంది, వారికి పుట్టిన బిడ్డకు వారసత్వ హక్కులు లభిస్తాయి.
  • వారసత్వ ఆస్తికి సంబంధించి ఎటువంటి వీలునామా రాయకపోతే స్థిరాస్తులు, చరాస్తులలో మహిళకు సమాన హక్కు లభిస్తుంది.
  • ఏ మతంవారైనా సరే ఒక భార్య ఉండగా రెండో వివాహం చేసుకోకూడదనే నియమం తీసుకొచ్చారు.
  • భర్త విడిచిపెట్టిన మహిళలకు న్యాయం చేసే అంశం కూడా ఈ బిల్లులో ఉంది.
  • బహుభార్యత్వం, నికా-హలాలా పద్ధతిని రద్దు చేసే ప్రతిపాదన ఉంది.
భారతదేశం, యూనిఫాం సివిల్ కోడ్, గుజరాత్, ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

‘కోర్టు ద్వారానే విడాకులు’ నిబంధనతో కొన్ని ఇబ్బందులు…

కోర్టు ద్వారానే కచ్చితంగా విడాకులు తీసుకోవాలనే నిబంధన గురించి రిటైర్డ్ జడ్జి జ్యోత్స్నా యాజ్ఞిక్ బీబీసీతో మాట్లాడారు.

”యూనిఫాం సివిల్ కోడ్‌లో సామాజిక పద్ధతుల్లో ఇచ్చే విడాకులను అంగీకరించే బదులు, కోర్టు ద్వారానే విడాకులు తీసుకోవడం తప్పనిసరి చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, ఫ్యామిలీ కోర్టులలో ఇప్పటికే విడాకుల కేసులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. అటువంటప్పుడు రాబోయే రోజుల్లో విడాకుల కేసుల భారం మరింత పెరుగుతుంది” అన్నారు యాజ్ఞిక్.

”ప్రస్తుతం చాలా కులాల్లో సామాజిక పద్ధతుల్లో జరిగే విడాకులు ఇకపై చెల్లకుండా పోతాయి. దీనివల్ల ఫ్యామిలీ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో తక్కువ వయసున్న అమ్మాయిలు లేదా అబ్బాయిల విడాకుల పిటిషన్లు సరైనవే అయినప్పటికీ, ఇటువంటి పరిస్థితుల్లో కేసులు సుదీర్ఘకాలం కొనసాగుతాయి. దీనివల్ల విడాకుల తర్వాత తిరిగి వివాహం చేసుకునే అవకాశం చాలామందికి తగ్గిపోతుంది” అని జ్యోత్స్నా యాజ్ఞిక్ చెప్పారు.

”చాలా సమాజాలలో ‘లేఖణి’, ‘సాటాపాటా’ వంటి ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటువంటి సంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగే విడాకుల ప్రక్రియ దుర్వినియోగమవుతున్నట్లు 2021 చివరిలో గుజరాత్ హైకోర్టులో జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ నానావతి ధర్మాసనం గుర్తించింది. అయినప్పటికీ, నేటికీ ఈ పద్ధతులు కొనసాగుతున్నాయి. తక్కువ చదువుకున్నవారు, ఆత్మగౌరవం కోసం విడాకులు తీసుకునే మహిళలు ఈ పద్ధతుల ద్వారా విడాకులు పొందినా స్వల్ప కాలంలోనే మరో వివాహం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కోర్టులలో ఇటువంటి కేసుల భారం పెరిగి, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంటే, కొన్ని కులాలకు చెందిన మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫ్యామిలీ కోర్టు సీనియర్ అడ్వకేట్ పూజా ప్రజాపతి బీబీసీతో మాట్లాడుతూ, ”గుజరాత్‌లో తీసుకువచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ వల్ల మహిళలకు చాలా పెద్ద ప్రయోజనాలేమీ ఉండవు. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టుల్లో ఎక్కువగా అగ్రవర్ణాల వారి విడాకుల కేసులు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇతర అనేక కులాల్లో నేటికీ సామాజిక రీతి రివాజుల ప్రకారమే విడాకుల పద్ధతులు కొనసాగుతున్నాయి” అని చెప్పారు.

“కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో నివసించే కొన్ని కులాల వారు విద్యావంతులైనప్పటికీ, నేటికీ ‘సాటాపాటా’, ‘లేఖణి’, ‘దాపు’ (కన్యాశుల్కం వంటి ఆచారం) వంటి పద్ధతులను నమ్ముతారు. అందుకే ఈ చట్టం వల్ల చాలా తక్కువ మంది మహిళలకే ప్రయోజనం లభిస్తుంది” అని అన్నారు.

భారతదేశం, యూనిఫాం సివిల్ కోడ్, గుజరాత్, ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

”లివ్-ఇన్ రిలేషన్‌షిప్” వల్ల కొత్త చిక్కులు వస్తాయా?

లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ వల్ల మహిళలకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

”మహిళలకు అత్యంత ప్రమాదకరమైన నిబంధన ఏదైనా ఉందంటే, అది లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు గుర్తింపునివ్వడమే. ఈ సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. గతంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు సమాజానికి భయపడేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగా, చట్టబద్ధంగా ఇటువంటి సంబంధాల్లో ఉండవచ్చు. కొత్త తరంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు ఈ విధంగా గుర్తింపు లభిస్తే, సమాజాన్ని ఏకంగా ఉంచే వివాహ వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకరం” అని న్యాయవాది పూజా ప్రజాపతి అభిప్రాయపడ్డారు.

”లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ద్వారా జన్మించిన బిడ్డకు కూడా హక్కులు కల్పించే అంశం ఈ చట్టంలో ఉంది. ఈ సంబంధాల వల్ల కలిగే పిల్లల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య కొత్త చట్టపరమైన వివాదాలు తలెత్తుతాయి. లివ్-ఇన్‌లో ఉన్న మహిళపై ఆరోపణలు వస్తే, కొత్త గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మహిళలకు ఎక్కువ నష్టం కలగవచ్చు. అంతేకాకుండా, 18 నుంచి 21 ఏళ్ల లోపు యువతీ యువకులు లివ్-ఇన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలనే నిబంధన ఉంది. దీనివల్ల కొత్త సామాజిక సంఘర్షణలు మొదలవుతాయి. ఈ యూనిఫాం సివిల్ కోడ్ వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం కంటే వివాహ వ్యవస్థకే ముప్పు పొంచి ఉంది” అని చెప్పారు.

”యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా విడాకుల కేసుల్లో మహిళలకు తక్షణమే భరణం అందడం, వివాహం జరిగిన ఏడాది తర్వాతే విడాకుల కేసు దాఖలు చేయాలనే నిబంధనలు మంచి పరిణామాలే. అయితే, మహిళలకు దీనివల్ల ఏవో పెద్దఎత్తున ప్రయోజనాలు కలుగుతాయని మాత్రం అనిపించడం లేదు” అని పూజా ప్రజాపతి అన్నారు.

భారతదేశం, యూనిఫాం సివిల్ కోడ్, గుజరాత్, ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

వారసత్వ ఆస్తి నిబంధనలు

వారసత్వ ఆస్తి నిబంధనల గురించి జ్యోత్స్నా యాజ్ఞిక్ మాట్లాడుతూ, ”2005 నుంచి తండ్రి వారసత్వ స్థిర, చరాస్తులలో మహిళలకు వాటా ఉంది. కాబట్టి ఇదేమీ కొత్తగా వచ్చిన చట్టం కాదు. కొన్ని మతాలలో మాత్రమే మహిళలకు వారసత్వ ఆస్తిలో నిర్దిష్ట వాటా ఉంది. అటువంటి వారికి ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరుతుంది, కానీ భారీ మార్పు ఏమీ ఉండదు” అని అన్నారు.

ఈ చట్టం వల్ల గుజరాత్ ప్రజలలో వీలునామా రాసుకోవడంపై అవగాహన పెరుగుతుందని, కుటుంబంలో సివిల్ కేసులు తగ్గుతాయని ఆమె భావిస్తున్నారు.

మహిళలకు వారసత్వంగా లభించే ఆస్తి విషయంలో తలెత్తే కుటుంబ వివాదాలకు ఈ చట్టం ముగింపు పలుకుతుందని గుజరాత్ హైకోర్టు న్యాయవాది ఆశిష్ శుక్లా అభిప్రాయపడ్డారు.

”మతం మార్చుకుని, ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొంటూ, మొదటి భార్యను వదిలేసే ధోరణికి ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రేమ పేరుతో యువతులను లోబరుచుకుని మతపరమైన నిబంధనల ఆసరాగా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, ఆపై మతపరమైన ఆచారాల ప్రకారం విడాకులు ఇచ్చేసే ఘటనలు కూడా ఆగుతాయి. మోసపూరిత వివాహాల నుంచి కూడా అమ్మాయిలకు రక్షణ లభిస్తుంది” అని అన్నారు.

అయినప్పటికీ, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు గుర్తింపు ఇవ్వడం వల్ల వివాహ వ్యవస్థపై పెద్ద ప్రభావం పడుతుందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు.

భారతదేశం, యూనిఫాం సివిల్ కోడ్, గుజరాత్, ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

‘ముస్లిం, ఆదివాసీ మహిళలకు కొత్త చిక్కులు’

ప్రముఖ ముస్లిం నాయకుడు, గుజరాత్ హైకోర్టు సీనియర్ న్యాయవాది హషీమ్ ఖురేషీ మాట్లాడుతూ, ఈ చట్టంలో కొత్తదేమీ లేదన్నారు.

”అల్పసంఖ్యాక వర్గాల్లో నాలుగు పెళ్లిళ్లకు అనుమతి ఉంది, కానీ నలుగురు భార్యలు ఉన్న ముస్లింలు ఎంతమంది ఉన్నారో ఎవరి దగ్గరైనా గణాంకాలు ఉన్నాయా? కేవలం వేళ్ల మీద లెక్కపెట్టదగినంత మంది ముస్లింలు మాత్రమే బహుభార్యాత్వాన్ని పాటిస్తున్నారు. వాస్తవానికి, మెజారిటీ సమాజానికి చెందిన వారే మతమార్పిడి ద్వారా ముస్లిం చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందుతున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

షరియత్ ప్రకారం తండ్రి వారసత్వ ఆస్తిలో కుమార్తెకు వాటా ఇచ్చే నిబంధన మొదటి నుంచీ ఉందని, షరియత్ ప్రకారం కుమార్తెకు వారసత్వ ఆస్తి, వివాహ సమయంలో ‘మెహర్’ (స్త్రీధనం) లభిస్తాయయని, హక్కులు సమానంగానే ఉన్నాయని హషీమ్ ఖురేషీ అన్నారు.

”బహుభార్యాత్వ పద్ధతిని నిర్మూలిస్తున్నామనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరోవైపు, షరియత్ చట్టాల్లో మార్పుల గురించి మాట్లాడటం అల్ప సంఖ్యాక వర్గాల వారి మనోభావాలను గాయపరచడమే” అని హషీమ్ ఖురేషీ అభిప్రాయపడ్డారు.

”నికా, హలాలాను రద్దు చేసే అంశం ఈ చట్టంలో ఉంది. కానీ, ముస్లిం సమాజంలో హలాలాకు సంబంధించి ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఇటువంటి మాటలు చెప్పి ముస్లింల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే ఇతర నిబంధనలు అమలులో ఉన్నప్పుడు, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ముస్లిం మహిళలకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు” అని చెప్పారు.

ప్రముఖ సామాజిక కార్యకర్త, సంచార జాతుల కోసం పనిచేసే న్యాయవాది విల్సన్ క్రిస్టియన్ మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ వల్ల క్రైస్తవ మహిళలకు లాభనష్టాలేమీ లేవని, కానీ సంచార జాతుల మహిళలకు మాత్రం భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు.

”సంచార జాతుల ప్రజలకు శాశ్వత నివాసం ఉండదు. వీరి దగ్గర ఆధార్ వంటి గుర్తింపు కార్డులు ఉండవు. విద్య లేకపోవడంతో అవగాహన కూడా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో వివాహ నమోదు తప్పనిసరి చేయడం వీరికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. వీరిలో కూడా సామాజిక ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. వీరికి కోర్టుల చుట్టూ తిరిగే స్తోమత లేదు. ఇవన్నీ దీర్ఘకాలికంగా బాగుండవచ్చు కానీ, ప్రస్తుతానికి మహిళలకు దీనివల్ల తక్షణమే ఒనగూరే పెద్ద ప్రయోజనం ఉండదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే సామాజిక కార్యకర్త నీతా హార్డికర్ బీబీసీతో మాట్లాడుతూ, ‘యూనిఫాం సివిల్ కోడ్ నుంచి గిరిజనులకు మినహాయించారని, కానీ వారి వివాహ పద్ధతులు, సామాజిక ఆచారాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు.

”ఒక మహిళ రెండో వివాహం చేసుకున్నప్పుడు, మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానాన్ని తనతో పాటు తీసుకువచ్చే ఆచారం ఉంది. ఇటువంటి పిల్లలకు వారసత్వ ఆస్తిలో ఎటువంటి నిబంధనలు లేవు. వివాహాల విషయంలో ఆదివాసీలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఆ పిల్లల హక్కులు లేదా ‘దాపు’ (కన్యాశుల్కం వంటి ఆచారం) వంటి పద్ధతులపై ఎటువంటి స్పష్టత లేదు. అందుకే ఆదివాసీ మహిళలకు ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరుతుందని అనిపించడం లేదు” అని నీతా హార్డికర్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)