Home జాతీయ national telgu యూఏఇపై ఇరాన్ దాడులు : గల్ఫ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది, వారేం చెబుతున్నారు?

యూఏఇపై ఇరాన్ దాడులు : గల్ఫ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది, వారేం చెబుతున్నారు?

10
0

SOURCE :- BBC NEWS

భారతీయ పౌరులు

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ముఖ్యస్థావరాలను లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోందని యూఏఈ చెబుతోంది. అత్యంత ముఖ్యమైన చమురు పోర్టును లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది.

ఇది ముఖ్యమైన షిప్ రీప్యూయలింగ్ హబ్. అంటే నౌకలు ఇంధనాన్ని నింపుకునే కేంద్రం.

ఈ ప్రాంతంలోని అతిపెద్ద చమురు నిల్వ ప్రాంతాల్లో ఇదొకటి.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత, గల్ఫ్ దేశాల్లో నివసించే భారతీయ పౌరుల విషయంలో ఆందోళనలు పెరిగాయి.

యూఏఈ ప్రభుత్వం తమకోసం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటోందని భారతీయులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఘర్షణలు పెరుగుతుండటంతో.. చాలామంది భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గల్ఫ్ దేశాల్లో అత్యంత ఎక్కువ మంది భారతీయులు యూఏఈలోనే నివసిస్తున్నారు.

”ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు మొత్తం 1,50,457 మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల నుంచి విమానాల ద్వారా భారత్‌కు ప్రయాణించారు” అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సుమారు 52 వేల మంది భారతీయులు సురక్షితంగా తమ దేశానికి తిరిగి వచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ సమాచారం మేరకు .. యూఏఈలో అతిపెద్ద ప్రవాస సమాజం భారతీయులదే. ఆ దేశం మొత్తం జనాభాలో 35 శాతం భారతీయులే.

యూఏఈలో నివసించే భారతీయ పౌరుల సంఖ్య సుమారు 43 లక్షలు ఉంటుందని 2024 డేటా చెబుతోంది.

వీరిలో సుమారు 15 శాతం మంది ఎమిరేట్స్ ఆఫ్ అబుదాబీలో నివసిస్తున్నారు. మిగిలిన వారు దుబయ్ సహా ఆరు ఉత్తర ఎమిరేట్స్‌లో ఉంటున్నారు.

కేరళ నుంచి ఎక్కువ మంది యూఏఈలో నివసిస్తున్నారు. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా యూఏఈలోని భారతీయ ప్రవాస సమాజంలో ముఖ్య భాగంగా ఉన్నారు.

యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

”డ్రోన్ దాడికి ముందు హెచ్చరిక”

ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. అమెరికాకు యూఏఈలో సైనిక స్థావరం ఉంది.

నగరానికి దక్షిణాన సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అబుదాబీకి సమీపంలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ తెలిపింది.

అబుదాబీ నుంచి క్రమం తప్పకుండా భారత్‌కు విమానాలు వస్తున్నాయి. న్యూదిల్లీకి తిరిగి వచ్చిన షంషేర్ అలీ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా తాను అబుదాబీలో నివసిస్తున్నట్లు చెప్పారు.

”ప్రస్తుత పరిస్థితిలో, ఇరాన్ నుంచి ఏదైనా డ్రోన్ దాడి జరిగినప్పుడల్లా.. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావద్దని ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి. అక్కడున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది” అని తెలిపారు.

యూఏఈలో వీసాల గడువు ముగిసిన భారతీయులు మార్చి 31 వరకు ఆ దేశంలోనే ఉండొచ్చని భారత రాయబార కార్యాలయం తెలిపింది. యుద్ధం వల్ల తిరిగి రాలేకపోతున్న ప్రజలకు నెలరోజులపాటు ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.

ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తమ ఎయిర్ డిఫెన్ వ్యవస్థ 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు, 1,567 డ్రోన్లను అడ్డుకుందని యూఏఈ అధికారులు చెప్పారు. వీటిలో 90 శాతాన్ని మధ్యలోనే అడ్డగించి, ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వీటి శకలాలు దుబయ్‌లోని నివాస ప్రాంతాలతోపాటు, విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పడ్డాయి.

ఎత్తయిన విలాసవంతమైన నివాస భవనాలు, హోటళ్లు, విమానాశ్రయానికి సమీపంలో పడిన క్షిపణులు, డ్రోన్ శకలాల ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.

ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారని, 141 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.

భారత పాస్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

పెరిగిన నిత్యావసరాల ధరలు

దుబయ్‌లో పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, నిత్యావసరాల ధరలు పెరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

”ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు, టమోటాలు, ఉల్లిగడ్డలు ధరలు రెండు దిర్హామ్‌లకు దొరికేవి. కానీ, ప్రస్తుతం ధరలు ఆరు దిర్హామ్‌లకు పెరిగాయి. ఇంకా ఇతర చాలా వస్తువుల ధరలు పెరిగాయి” అని దుబయ్‌లో పనిచేస్తున్న ఓ భారతీయ పౌరుడు చెప్పారు.

విమానాలు సరిగ్గా లేకపోవడం, విమాన టిక్కెట్ల ధరలు పెరగడంతో ప్రయాణాలు చేయడం కష్టతరంగా మారిందని, దీంతో ప్రస్తుతానికి తాము భారత్‌కు తిరిగి రావడం లేదని చాలామంది భారతీయులు చెబుతున్నారు.

యూఏఈలోని భారతీయ ప్రవాసులు నిర్మాణం, ఆరోగ్యం, హాస్పిటాలిటీ, ఆర్థిక, సాంకేతిక వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారత నిర్మాణ కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం ఏమంటోంది?

గల్ఫ్ ప్రాంతంలో భారతీయ దౌత్య కార్యాలయాలు పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నాయని, స్థానిక అధికారులు, భారత కమ్యూనిటీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని భారత ప్రభుత్వం తెలిపింది.

అబుదాబీలోని భారత రాయబార కార్యాలయం, దుబయ్‌లోని భారత కాన్సులేట్ ఎప్పటికప్పుడూ భారతీయ సమాజంతో తాజా సమాచారాన్ని పంచుకుంటోంది. ప్రభావితమైన ప్రయాణికులకు అవసరమైన సలహాలను కూడా అందిస్తోంది.

ప్రయాణ ఏర్పాట్లు లేదా డాక్యుమెంట్లకు సంబంధించి భారతీయులకు సాయం చేసేందుకు హెల్ప్‌లైన్లు, సపోర్టు చానళ్లను ఏర్పాటు చేసినట్టు రాయబార కార్యాలయం తెలిపింది.

”దుబయ్‌లో పరిస్థితి అనుకున్నంత ప్రమాదంగా లేదు. డ్రోన్లు లాంటివి ఎగురుతున్నాయి. కానీ, వాటిని అడ్డుకుంటున్నారు” అని మార్చి 13న యూఏఈ నుంచి దిల్లీకి తిరిగి వచ్చిన రాశీ ఏఎన్ఐకు తెలిపారు.

సున్నితమైన ప్రదేశాల ఫోటోలను, వీడియోలను తీయద్దని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయద్దని భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

అప్పటి నుంచి దుబయ్‌లో నివసిస్తున్న ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన చాలా మందిని అదుపులోకి తీసుకున్నారని పలువురు భారతీయులతో జరిపిన సంభాషణలో వెల్లడైంది.

యూఏఈలో నివసిస్తున్న అనేక మందిని బీబీసీ న్యూస్ సంప్రదించింది. కానీ, వారు అధికారికంగా మాట్లాడేందుకు నిరాకరించారు.

తన కుటుంబంతో కలిసి షార్జాలో పాతికేళ్లుగా నివసిస్తోన్న ఓ భారతీయ మహిళ మాట్లాడుతూ.. ”షార్జాలో యుద్ధ భయం లేదు. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉంది. కానీ, దుబయ్‌లో డ్రోన్లు పడిన శబ్దాలు వింటున్నా” అని తెలిపారు.

”ఇక్కడ మా గురించిన సమాచారం భారత మీడియా నుంచి వస్తోంది. కానీ, మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయటకు వెళ్లడంపై దాదాపు నిషేధం ఉంది” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)