SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తరువాత హార్మూజ్ జలసంధిని మూసివేయడం మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది.
ఈ మార్గాన్ని మళ్లీ పూర్తిస్థాయిలో ఎప్పుడు తెరుస్తారా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. యుద్ధం ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. షేర్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది.
ప్రస్తుతం రోజుకు కొన్ని నౌకలు మాత్రమే ఆ జలసంధిని దాటుతున్నాయి. మరోవైపు ఇంధన మౌలికసదుపాయాలపై దాడులు ధరలను మరింత పెంచుతున్నాయి.
ఈ ప్రభావం ఎక్కువగా పడింది ఆసియా దేశాలపైనే. హార్మూజ్ జలసంధి మీదుగా రవాణా అయ్యే చమురు, గ్యాస్‌లో 90 శాతం ఆసియా దేశాలకు చేరుతుంది.
దీంతో ఈ జలసంధి మీదుగా రవాణా తగ్గాక ఆసియా దేశాలపై ఇప్పటికే తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం’
ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వాలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించాయి. పనిదినాలను తగ్గించాయి. జాతీయ సెలవులు ప్రకటించాయి. విశ్వవిద్యాలయాలను ముందుగానే మూసేశారు.
మూడు నెలల దిగుమతులకు సరిపడా నిల్వలున్నాయని భావించే చైనాలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఇంధన ధరలు 20శాతం పెరగడంతో వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఆసియా అంతటా ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం పడుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
‘ఫిలిప్పీన్స్‌లో మహమ్మారినాటి పరిస్థితుల కన్నా దారుణంగా ఉంది’
ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో దేశంలో ఇంధన లభ్యతపై తీవ్ర ప్రభావం ఉందని పేర్కొంటూ ఫిలిప్పీన్స్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది.
7 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇక్కడ బాగా కనిస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని జీప్నీ(ప్రయాణికుల రవాణా వాహనాలు) డ్రైవర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
కార్లోస్ బ్రాగల్ జూనియర్ అనే డ్రైవర్‌కు 12 గంటల పనికి గతంలో వెయ్యి నుంచి 12వందల పెసోలు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1,450 నుంచి రూ.1,550) వచ్చేవి. ఇప్పుడు ఆ ఆదాయం 200 నుంచి 500 పెసోలకు(290రూపాయల నుంచి 725రూపాయలకు) తగ్గిపోయింది.
ఇప్పటికే పన్నులు, జీతం పెంపు నిలిపివేత వంటి సమస్యలు ఉండగా, ఇప్పుడు పెరిగిన ధరల వల్ల కొందరు డ్రైవర్లు ఏమీ సంపాదించలేకపోతున్నారు.
”ఈ ఉద్యోగం వల్లే నా కూతుళ్లను చదివించాను. ఒకరిది ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఇంకొకరు గ్రాడ్యుయేట్ విద్యార్థి. మేం మంచి జీవితం గడిపాం. కానీ వచ్చే కొన్నివారాల్లో మాకేం జరుగుతుందో తెలియడం లేదు.
ఇదే కొనసాగితే, కచ్చితంగా నేను, నా కుటుంబం నష్టపోతాం” అని కార్లోస్ అన్నారు.
మత్స్యకారులు, రైతులు కూడా అధిక ఇంధన ధరల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
బులాకాన్ ప్రాంతంలోని కూరగాయల రైతులు ఇప్పటికే సాగు ఆపాల్సివచ్చింది.
తాజా పరిణామాలతో ప్రభావితం అవుతున్నవారికి ప్రభుత్వం నగదు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
కానీ కార్లోస్, ఇతరులు ఈ సాయంతో సంతృప్తి చెందడం లేదు.
”ప్రభుత్వం ఇస్తున్న ఇంధన సబ్సిడీ సరిపోదు. అది రెండు రోజుల ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మరి ఆ తర్వాత ఎలా? ఇప్పుడు మా పరిస్థితి మహమ్మారి(కోవిడ్) సమయంలో ఉన్నదానికంటే మరింత దారుణంగా ఉంది” అని కార్లోస్ అన్నారు.
ఫొటో సోర్స్, DRM News
‘థాయిలాండ్‌లో బ్లేజర్లు వేసుకోవడం మానేసిన న్యూస్ ప్రజెంటర్లు’
దాదాపు 20ఏళ్లగా న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేస్తున్న సిరిమా సాంగ్‌క్లిన్ సాధారణంగా ఎప్పుడూ సూట్ వేసుకుని కనిపించేవారు.
థాయిలాండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ‘థాయి పీబీఎస్’లో పనిచేసే ఆమె, ఇతర ప్రజెంటర్లు ఈ నెల ప్రారంభంలో బ్లేజర్లు తొలగించి కనిపించారు. వేడి పరిస్థితుల్లో ఏసీ వినియోగం తగ్గించేందుకు వీలుగా అందుకు తగిన దుస్తులు ధరించి ఇంధనం ఆదా చేయాలనే సందేశం ఇవ్వడానికి వారు బ్లేజర్లు వేసుకోలేదు.
”సూట్లు, బ్లేజర్లు తీసేయడం ఒక్కటే పరిష్కారం కాదు. కానీ పరిస్థితి తీవ్రతను తెలియజేయడానికే మేం ఇలా చేశాం. మేం ఒక ఉదాహరణగా మారాం” అని సిరిమా బీబీసీతో చెప్పారు.
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ సంఘర్షణ ప్రభావం ఇంత చిన్నవిషయంపైనా కనిపించడం ఆశ్చర్యకరం.
నిజానికి జలసంధి మూసివేసిన తర్వాత ప్రభుత్వం జారీచేసిన అనేక ఆదేశాల్లో జాకెట్లు తీసివేయాలని చెప్పడం కూడా ఒకటి.
థాయిలాండ్‌లో ప్రజలను ఎయిర్ కండిషనర్‌ను 26నుంచి 27 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచాలని ప్రభుత్వం కోరింది. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలకు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలిచ్చింది.

‘అప్పుడు శ్రీలంక దగ్గర ఇంధనం కొనడానికి డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నాయిగానీ చమురు లేదు’
శ్రీలంక రాజధాని కొలంబోలో నివసిస్తున్న డిముతకు ఈ సంక్షోభ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మునుపటి సంక్షోభం సమయంలో ఇంధనం కొనడానికి ఆ దేశం దగ్గర డబ్బులేదు. ఇప్పుడు డబ్బు ఉంది కానీ కొనడానికి ఇంధనం లేదు.
శ్రీలంక ఇటీవలే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది. 2022లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అయిపోవడంతో అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం, సరిపడా ఇంధనం కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు.
ఇప్పుడు పరిస్థితి కొంత స్థిరపడింది. అయితే ప్రమాదాలను గుర్తించిన ప్రభుత్వం ఖర్చులను తగ్గించే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వారంలో బుధవారాన్ని ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. ఇంధన రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఇంధనం కోసం పెట్రోల్ బంకుల దగ్గర పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి.
”ఇవాళ నేను పనికి వెళ్లలేదు. రోజువారీ అవసరాలను తీర్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. క్యూలో గంటల తరబడి ఉండడం వల్ల పనికి వెళ్లడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇంధనం తీసుకుని తిరిగి పనికివెళ్లేసరికి ఆ పని కోసం మరొకరిని తీసుకుంటున్నారు”అని కొలంబోకు చెందిన లాన్‌మూవర్ ఆపరేటర్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్‌లో 2021 మే నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులల్లో సైన్యం మద్దతుతో ఉన్న అధికారులు ఇంధనం ఆదా చేయడానికి ప్రైవేట్ వాహనాలకు రోజు విడిచి రోజు నడిపే విధానాన్ని అమలుచేస్తున్నారు.
కోహెత్(అసలు పేరు కాదు)అనే బ్యాంకు ఉద్యోగికి ఈ ప్రభావం అతని ఉద్యోగ జీవితం కంటే సామాజిక జీవితంపై ఎక్కువ పడుతోంది.
”నేను సాధారణంగా వారానికి లేదా నెలకోసారి నా స్నేహితులను కలుస్తాను. ఇప్పుడు మాత్రం మనం సరి లేదా బేసి తేదీల్లో కలవాలా అనే విషయాన్ని ముందుగా చర్చించుకోవాల్సివస్తోంది. అందరూ రావడానికి సౌకర్యంగా ఉందో లేదో చూసుకోవాలి” అని చెప్పారు. ఆయన బ్యాంకుకు వెళ్లడానికి ప్రజారవాణా ఉపయోగిస్తారు.
వచ్చే నెలల్లో ఇంధనం బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన భయపడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న వస్తువుల ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో వంట గ్యాస్ లభ్యతపై ప్రభావం
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ ఫిబ్రవరి 28 నుంచి మిడిల్ ఈస్ట్ పరిణామాలతో ప్రభావితమైంది.
గల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు కోటిమంది భారత ప్రజలపై యుద్ధ ప్రభావం నేరుగా ఉంది. చమురు, గ్యాస్ కొరత ప్రభావం ఇళ్లు, వ్యాపారరంగంలోనూ తీవ్రంగా కనిపిస్తోంది.
గుజరాత్‌లో చమురు కాకుండా గ్యాస్ కొరత కారణంగా సిరామిక్స్ పరిశ్రమలు మూతపడుతున్నాయి.
ఇరాన్ యుద్ధానికి ముగింపు కనిపించకపోవడంతో ఈ రంగంలో పనిచేస్తున్న సుమారు 4 లక్షలమంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
వలస కార్మికుడు సచిన్ పరాశర్ ఒక స్థానిక వార్తాచానల్‌తో మాట్లాడుతూ ”ఇక్కడ పని లేకుండా ఇలాగే ఉంటే నేను ఆకలితో పస్తులుడాల్సి వస్తుంది” అని అన్నారు.
”నా యజమాని భోజనం, వసతి ఇస్తానని చెప్పారు. కానీ ఈ మూసివేత కొనసాగితే ఏమవుతుందో తెలియదు” అని టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరో వలస కార్మికుడు భూమి కుమార్ అన్నారు.
హార్మూజ్ మీదుగా రవాణాకు అంతరాయం ఏర్పడడంతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడింది. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆ దిగుమతుల్లో 90శాతం హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతాయి.
ఇబ్బందులు కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాలేదు.
రెండు కోట్ల 22 లక్షలకు పైగా జనాభా ఉన్న ముంబయి నగరంలో మార్చి మొదటి వారాల్లోనే సుమారు ఐదో వంతు హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. వండేందుకు ఎక్కువ సమయం పట్టే వంటకాలు మెనూలో కనిపించడం లేదు.
సరఫరాకొరతపై భయాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం పొడవాటి క్యూలైన్లలో నిలబడుతున్నారు. రెస్టారెంట్‌లకు వంట గ్యాస్ అసలు అందుబాటులో లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



