SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, SHAHBAZANWAR
8 గంటలు క్రితం
ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో అమిత్ కశ్యప్ అనే వ్యక్తి మరణంపై చర్చ జరుగుతోంది. అమిత్ పాము కాటు వల్ల మరణించారని మొదట వార్తలొచ్చాయి.
అయితే, ఆయన ఊపిరాడక మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక నిర్ధరించింది. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
ఈ కేసులో అమిత్ భార్య 25 ఏళ్ల రవిత, ఆమె ప్రియుడిగా భావిస్తున్న 20 ఏళ్ల అమర్‌దీప్‌లను ప్రధాన నిందితులుగా ప్రకటించారు పోలీసులు. వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారని కూడా పోలీసులు చెప్పారు.
అమిత్, రవిత దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు.

పోలీసుల విచారణలో ఏం తేలింది?
ఈ హత్యను పాము కాటు వల్ల జరిగిన మరణంగా చూపించడానికి, అమిత్ శరీరం కింద పామును ఉంచారని పోలీసులు చెబుతున్నారు.
“ఈ సంఘటన ఏప్రిల్ 12న మేరఠ్ దగ్గరున్న బహసూమాలోని అక్బర్‌పూర్ సాదాత్ గ్రామంలో జరిగింది. మృతదేహానికి ఏప్రిల్ 13న పోస్టుమార్టం జరిగింది.
మృతుడి అన్నయ్య మోను కశ్యప్ ఫిర్యాదు చేయడంతో రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు” అని మేరఠ్ ఏఎస్పీ రమేశ్ కుమార్ మిశ్రా చెప్పారు.
“పాము కాటు వల్ల అమిత్ కశ్యప్ మరణించారని పోలీసులకు సమాచారం అందింది. కానీ అమిత్ ఊపిరాడక చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. నిందితులను విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. రవిత, అమర్‌దీప్ మొదట అమిత్‌ను చంపి, పాముకాటుతో చనిపోయినట్టు చూపించడానికి మృతదేహం దగ్గర ఒక పామును వదిలేశారని వెల్లడయింది. అమిత్ శరీరం కింద నలిగిపోయిఉన్న పామును కూడా సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అమిత్, నిందితుడు అమర్‌దీప్ ఒకే గ్రామంలో కొద్ది దూరంలో నివసిస్తున్నారు” అని ఏఎస్పీ తెలిపారు.

ఫొటో సోర్స్, ShahbazAnwar
అందుకే చంపా: రవిత
అమిత్, అమర్‌దీప్ చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరూ టైల్స్ వేయడం వంటి పనులు చేసేవారు. ఏడాది కిందట రవితకు అమర్‌దీప్‌తో పరిచయమైంది.
“నా భర్త ఎప్పుడూ నాతో గొడవపడేవారు. నన్ను తిట్టేవారు. ఏప్రిల్ 10న, నేను అమిత్‌తో కలిసి శాకంబరి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడే నేను అమర్‌దీప్‌తో కలిసి అమిత్‌ను చంపాలని ప్లాన్ చేశాను.” అని రవిత చెప్పారు.
“ఏప్రిల్ 12న రాత్రి వేళ తన ప్రేమికుడితో కలిసి భర్త అమిత్‌ను హత్య చేసినట్టు విచారణలో రవిత చెప్పారు. అమిత్ చేతులు, నోరు రవిత పట్టుకోగా, అమర్‌దీప్ ఆయన గొంతు నులిమి చంపారు. ప్రయాణం కారణంగా అమిత్ అలసిపోయారు, దీంతో పెద్దగా ప్రతిఘటించలేక పోయారు. అయితే కొంతమేర ప్రతిఘటించడంతో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి.” అని బహసూమా పోలీస్ స్టేషన్ అధికారిణి ఇందు కుమారి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, ShahbazAnwar
అమిత్‌ని పాము కరిచిందా?
అమిత్ మృతదేహం కింద దాదాపు ఒకటిన్నర మీటరు పొడవున్న పాము బాగా నలిగిపోయి కనిపించింది.
అమిత్‌ను పాము కాటు వేయలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
“అమిత్‌ను పాము చాలాసార్లు కరిచింది. దీనిపై మేం వైద్యులతో కూడా మాట్లాడాం. అమిత్ మరణించడంతో ఆయన శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయిందని, దీంతో అమిత్ శరీరంలోకి విషం వ్యాపించలేదని వైద్యులు తెలిపారు. అమిత్ మృతదేహం కింద పామును అమర్‌దీప్ పెట్టారు. ఆయన దానిని ఎవరి నుంచి తీసుకున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది” అని ఇందుకుమారి తెలిపారు.
అమర్‌దీప్‌కు పామును ఇచ్చిన వ్యక్తితో జరిగిన సంభాషణ వీడియోను వార్తా సంస్థ పీటీఐ షేర్ చేసింది.
“మేం పాములను పట్టుకుని అడవిలో వదిలేస్తాం. ఇది మా పని. రాజ్‌కుమార్ అనే బాలుడు ఆ పామును మా దగ్గర నుంచి తీసుకున్నాడు. జాగరణకు అది అవసరమని, తన పని పూర్తయిన తర్వాత తిరిగి ఇస్తానని చెప్పాడు. వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు.” అని ఆ వీడియోలో కృష్ణ అనే వ్యక్తి చెప్పారు.

ఫొటో సోర్స్, ShahbazAnwar
మృతుడి తల్లి ఏం చెప్పారు?
మేరఠ్ దగ్గరలోని బహసూమా ప్రాంతంలోని అక్బర్‌పూర్ సదత్ గ్రామంలో దాదాపు ఆరు వేల జనాభా ఉంటుంది. అమిత్ కశ్యప్ పేద కుటుంబానికి చెందినవారు.
‘‘ ఎనిమిదేళ్ల కిందట రవితను అమిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమిత్ తన భార్యను చాలా ఇష్టపడేవారు. కానీ రవిత అతన్ని చంపేసింది” అని అమిత్ తల్లి మునేశ్ బీబీసీతో అన్నారు.
“ఏప్రిల్ 13 ఉదయం నేను బయట కూర్చుని ఉన్నప్పుడు అమిత్ చిన్న కొడుకు వచ్చి నాన్నను పాము కరిచిందని చెప్పాడు. నేను లోపలికి వెళ్ళేసరికి నా కొడుకు కదలకుండా పడుకుని ఉన్నాడు. ఆయన కింద ఒక పాము ఉంది. దాని నోరు అమిత్ చేయి దగ్గర ఉంది. ఆ పాము బతికే ఉంది. అమిత్‌కు ఏమైందని నేను రవితను అడిగాను. పాము కాటేయడంతో అమిత్ చనిపోయాడని రవిత చెప్పింది.” అని మునేశ్ తెలిపారు.
నలుగురు అన్నదమ్ములలో అమిత్ రెండోవాడు. అమిత్ ఇంట్లో చివరి గదిలో ఉండేవారని, అమిత్ తల్లి మునేశ్, తండ్రి విజయ్‌పాల్ కశ్యప్ ముందు గదిలో ఉండేవారని వారి బంధువు సోను బీబీసీతో చెప్పారు.
“ఏప్రిల్ 12న రాత్రి 9 గంటలకు నేను టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. అమిత్ గదికి వెళ్ళాను. కానీ గది తలుపు మూసి ఉంది. కర్టెన్లు కూడా వేసున్నాయి. తిరిగి వచ్చి పడుకున్నాను. రాత్రి 10 గంటలకు నేను మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు, అమిత్ మంచం మీద నిద్రపోతున్నట్టు చూశాను. బహుశా ఆ సమయంలో అమిత్ హత్య జరిగుండొచ్చు.” అని తల్లి మునేశ్ దేవి అన్నారు.
అమిత్ తల్లి చెప్పిన ఆ సమయంలోనే హత్య జరిగిందని నిందితులను విచారించిన తర్వాత బహసూమా పోలీస్ స్టేషన్ అధికారిణి ఇందు కుమారి కూడా చెప్పారు.
“నా కొడుకు హంతకులకు మరణశిక్ష తప్ప మరేమీ పడకూడదు. అమిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడం రవితకు మొదటి నుంచీ ఇష్టంలేదు. ఈ విషయం గ్రామం అంతటా కలకలం రేపింది.” అని అమిత్ తండ్రి విజయ్‌పాల్ కశ్యప్ అన్నారు.

ఫొటో సోర్స్, Shiv Prakash
నిందితులపై గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహం
అమిత్ మరణంతో గ్రామంలోని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
“అమిత్ చాలా మంచి వ్యక్తి. ఆయన చనిపోయాడని తెలియగానే నేను షాకయ్యాను. మా గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు.” అని గ్రామ సర్పంచ్ దీపక్ కుమార్ బీబీసీతో అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)