Home జాతీయ national telgu మిలిటరీ స్లీప్: ఈ విధానంతో 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చా? ఇలా చేయడం మంచిదేనా..

మిలిటరీ స్లీప్: ఈ విధానంతో 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చా? ఇలా చేయడం మంచిదేనా..

18
0

SOURCE :- BBC NEWS

మిలిటరీ స్లీప్ మెథడ్, రెండు  నిమిషాల్లో నిద్ర, నిద్ర లేమి సమస్య

ఫొటో సోర్స్, Getty Images

పడుకోగానే నిద్ర పట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిద్ర లేమితో బాధ పడుతున్నారు.

అంచనాలు వేర్వేరుగా ఉండవచ్చు. అయితే 5 నుంచి 50శాతం మంది నిద్రలేమి బాధితులేనని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాలామంది చక్కగా నిద్రపట్టే మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాటిలో బాగా ప్రాచుర్యం పొందింది ‘మిలిటరీ స్లీప్ మెథడ్’. ఇందులో రెండు నిమిషాల్లో నిద్ర గ్యారంటీ.

ఈ ట్రెండ్ టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయింది. ఇలా పడుకోగానే అలా తేలిగ్గా నిద్ర పోవడం ఎలా అనే దాని గురించి వివరిస్తూ చేసిన లక్షల కొద్దీ వీడియోలు టిక్‌టాక్‌లో ఉన్నాయి.

అయితే త్వరగా నిద్రపోవాలనే అంచనాలతో మీరు ఈ విధానాన్ని ఆచరిస్తే అది మీ నిద్ర సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన పరిస్థితికి కూడా కారణమవుతుందని నిపుణులు బీబీసీతో చెప్పారు.

నిద్రలేమితో బాధపడుతున్నవారు సైనికుల నిద్ర విధానాల్లో ఆచరించదగినవి ఏవి అనేదానిపై నిపుణులు కొన్ని వివరాలు అందజేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మిలిటరీ స్లీప్ మెథడ్, రెండు నిమిషాల్లో నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

మిలిటరీ స్లీప్ మెథడ్ ఏంటి?

ఈ విధానం గురించి అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్ లాయిడ్ బడ్ వింటర్ 1981లో రాసిన తన “రిలాక్స్ అండ్ విన్” పుస్తకంలో వివరించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ నేవీ ప్రీఫ్లైట్ స్కూల్ ఏవియేటర్ల కోసం వింటర్ ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా వారు బాగా నిద్రపోతే, తీవ్ర ఒత్తిళ్ల మధ్య కూడా బాగా పని చేయగలరని ఆయన భావించారు. వింటర్ రాసిన పుస్తకంలో విద్యార్థులకు ఏమని సూచించారంటే..

  • నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నుదురు, తల భాగం, దవడ భాగం రిలాక్స్ అయ్యేలా చేయండి.
  • మీ భుజాలను వదులుగా పెట్టి దీర్ఘ శ్వాస తీసుకోండి. గాలి తీసుకుని వదలుతూ ఉండండి. ఛాతీని పూర్తిగా వదులుగా చేయండి.
  • మీ చేతుల్ని మంచం మీద పెట్టండి. అరచేతిని మామూలుగా ఉంచి మోచేతిని ముఖంవైపు మడవండి. రెండో చేతితోనూ ఇలాగే చేయండి.
  • తొడల దగ్గర నుంచి మొదలు పెట్టి మోకాళ్లు, పిక్కలు, మడమలు, అరికాలిని వదులుగా చేయండి. రెండో కాలిని కూడా ఇలాగే చేయండి.
  • మీ మెదడులో ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టండి. మంచి చిత్రాన్ని ఊహించుకోండి. మంచి శీతాకాలపు ఉదయాన్ని లేదా అందమైన సరస్సుని ఊహించుకోండి.
  • అవసరమైతే, ఆలోచించవద్దు అనే మాటను పదే పదే అనుకోవడం ద్వారా కనీసం పది సెకన్ల పాటు మీ ఆలోచనల్ని పక్కన పెట్టండి.

ఈ విధానాన్ని ఆరు వారాలు పాటించడం ద్వారా ఏవియేటర్లు పగలైనా, రాత్రైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకోగలరని వింటర్ చెప్పారు.

మిలిటరీ స్లీప్ మెథడ్, రెండు  నిమిషాల్లో నిద్ర, నిద్ర లేమి సమస్య

ఫొటో సోర్స్, Getty Images

‘ఇది మీకు అసహనం కలిగించవచ్చు’

అయితే నిద్రపోయే విషయంలో అలాంటి వేగవంతమైన ఫలితాలను ఆశించడం మీ నిద్రపోయే ప్రయత్నాలను దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“ఈ విధానంతో మీరు నిద్రపోవడం, రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం అనేది ప్రమాదకరమైన ఆలోచన కావచ్చు” అని మిలిటరీ న్యూరో సైంటిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ అల్లిసన్ బ్రేజర్ చెప్పారు.

సగటు మనుషులకు నిద్ర పోవడానికి కనీసం 20 నిమిషాలు పడుతుందనీ, అందువల్ల రెండు నిమిషాల్లో నిద్ర పోవాలని ప్రయత్నించడం వల్ల మీలో చిరాకు పెరిగి మీ నిద్రపోయే సమయం తగ్గిపోయే అవకాశం ఉందని బ్రేజర్ చెబుతున్నారు.

‘‘నిజం చెప్పాలంటే అసాధ్యమైన దాని కోసం ప్రయత్నిస్తూ మీరు పూర్తిగా నిరాశకు లోనవుతారు’’ అని బ్రేజర్ అన్నారు.

మీరు రెండు నిమిషాల్లో నిద్రపోతే, అది దీర్ఘకాలిక నిద్ర లేమి లేదా నిర్థరణకాని నిద్ర సమస్యలకు సంకేతం కావచ్చు.

ఈ విధానాన్ని పాటించే సైనికుల గురించి తనకు తెలుసని బ్రేజర్ చెప్పారు. అయితే సైనిక ఉద్యోగంలో ఉండే శారీరక శ్రమను బట్టి చూస్తే, కొంతమంది సైనికులు 2 నిమిషాల్లో నిద్ర పోవడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదని ఆమె చెప్పారు.

మిలిటరీ స్లీప్ మెథడ్, రెండు నిమిషాల్లో నిద్ర, నిద్ర లేమి సమస్య

ఫొటో సోర్స్, Getty Images

త్వరగా నిద్రపోవడం ఎలా?

మిలిటరీ స్లీప్ మెథడ్‌తో నిద్రలేమితో బాధ పడుతున్నవారికి లభించే ఉపశమనం చాలా తక్కువేనని స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ హగ్ సెల్సిక్ చెప్పారు.

“నా దగ్గరకు వచ్చిన పేషెంట్లలో చాలామంది అది తమకు సాధ్యం కాలేదని చెప్పారు. సాధ్యమై ఉంటే వాళ్లు నా ముందు కూర్చుని ఉండేవారు కాదు” అని ఆయన బీబీసీతో చెప్పారు.

“మీరు కొన్నిరోజులపాటు రోజంతా మెలకువతో ఉండి తర్వాత విశ్రాంతి తీసుకుంటుంటే మీ నిద్ర దాని పని అది చేసుకుపోతుంది” అని సెల్సిక్ అన్నారు.

రోజులో 8 గంటలు నిద్రపోవడం అనేది చాలాకాలంగా ఆరోగ్యానికి మంచిదని భావించారు. అయితే అది అనవసరమైన ఒత్తిడి పెంచుతుంది.

“8 గంటల నిద్ర అనేది అపోహ. అది విధ్వంసకరమైన ఆలోచన కూడా” అని ఆయన అన్నారు.

వాస్తవంలో వ్యక్తులు నిద్ర పోయే సమయం విషయంలో తేడాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అది జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు. అది దీనికి సంబంధించి కచ్చితమైన గణాంకాలేమీ లేవు.

సెల్సిక్ దీనిని బూట్ల సైజులతో పోల్చారు. ఇందులో సగటు సైజు 6 కావచ్చు. కొంతమంది 8 లేదా నాలుగో నెంబర్ షూ వేసుకుంటూ ఉండవచ్చు. అలాగే కొంతమంది ఏడు నుంచి 8 గంటల నిద్ర అవసరం కావచ్చు. కొంతమందికి ఇంకా తక్కువ సమయం నిద్ర సరిపోతుండవచ్చని ఆయన అన్నారు.

“మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు కావల్సినంత నిద్ర పోవడమే” అని ఆయన అన్నారు.

ఇప్పటికీ మీరు తొందరగా నిద్రలోకి జారుకోవాలని కోరుకుంటున్నారా? అయితే ఈ మూడు సూత్రాలు పాటించండి అంటూ ఆయన సూచిస్తున్నారు.

ప్రతీ రోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం ఒకే సమయానికి నిద్రపోవడానికి కారణమవుతుంది. దీనర్ధం ఏంటంటే మీకు రోజూ ఒకే సమయానికి అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలా రోజూ మీరు నిద్రపోవచ్చని ఆయన చెప్పారు.

పగటి పూట నిద్రపోవడం వల్ల, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు.

చివరిగా, మీకు అలసటగా అనిపించినప్పుడే పడుకునేందుకు ప్రయత్నించండి. మీ శరీరం నిద్ర పోయేందుకు సిద్ధపడకపోతే మీరు మంచం మీద చాలాసేపు దొర్లాల్సి రావచ్చు.

“మీ సాయంత్రాలను ఆనందించండి. మీ కోసం కొంచెం సమయం గడపండి. తల ముందుకు ఊగుతున్నట్లు అనిపించినప్పుడు, కళ్లు మూత పడుతున్నట్లు అనిపించినప్పుడు చదువుతున్న దాని మీద దృష్టి పెట్టలేరు. నిద్రపోవడానికి సరైన సమయం అదే” అని సెల్సిక్ అన్నారు.

మిలిటరీ స్లీప్ మెథడ్, రెండు నిమిషాల్లో నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

సైనికుల నిద్ర నుంచి ఏం నేర్చుకోవచ్చు?

మిలిటరీ స్లీప్ మెథడ్ అనేది కొంత తప్పుడు విధానమని బ్రిటిష్ ఆర్మీలో స్లీప్ సైన్స్ అండ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెక్స్ రాక్లిఫే వాదిస్తున్నారు.

“ఈ పద్ధతికి ఆధారమైన శారీరక, మానసిక విధానాలలో అంతర్గతంగా సైనికపరమైనది ఏదీ లేదు” అని ఆయన అన్నారు.

వాస్తవానికి ఈ విధానం అంత తప్పేమీ కాదు. శరీర భాగాలను రిలాక్స్ చేయడం, శ్వాస తీసుకునే పద్దతులను ఇప్పటికీ బలగాలకు నేర్పుతున్నారని ఆయన చెప్పారు.

12 మంది ఉండే ఉమ్మడి గదుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవడం అనేది శిక్షణ తీసుకునే సైనికులు, సైనికులకు చాలా కష్టమైన వ్యవహారం.

కళ్లకు పెట్టుకునే మాస్కులు, చెవుల్లో ప్లగ్స్ పెట్టుకోవడం, శబ్దం చేయని తలుపు వంటివి వారు త్వరగా నిద్రపోవడానికి ఉపయోగపడతాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో నిద్రపోయేందుకు సైనికులు ఉపయోగించే పద్దతులు కొంతమందికి ఉపయోగపడవచ్చు.

తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య పని చేసే సైనికులు వీలైనప్పుడల్లా నిద్ర పోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వారికి రాత్రిపూట సరిగా నిద్రపోయే అవకాశం దొరక్కపోవచ్చు.

రాత్రి పూట త్వరగా నిద్రపోవాలని భావించేవారు పగటిపూట కునుకు తీయకపోవడమే మేలని సూచిస్తున్నారు. అయితే పాలిచ్చే తల్లులకు రాత్రిపూట నిద్రపోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వారు పగటిపూట కాసేపు కునుకు తీయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

సైన్యం నుంచి పౌరులు నేర్చుకోవాల్సిన మరో కీలక నైపుణ్యం ఒకటి ఉందని న్యూరో సైంటిస్ట్ బ్రేజర్ చెప్పారు.

ప్రతీ రోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల మెదడు కూడా నిద్ర సంకేతాలను పంపిస్తుంది. దీని వల్ల త్వరగా నిద్ర పడుతుంది.

“ఇది క్రమశిక్షణకు సంబంధించినది. సైనికుల రోజువారీ జీవితంలో క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని బ్రేజర్ అంటున్నారు.

మంచం మీద పడుకున్న తర్వాత ఫోన్ ఆపేయండి. పుస్తకం చదవడం, ప్రతీ రాత్రి ఒకే సమయానికి లైటు ఆర్పేయడం మంచిది.

“శరీరం దీనికి త్వరగా అలవాటు పడుతుంది. మీరు దీన్ని ప్రతీరోజూ చేస్తుంటే, నిద్రపోవడానికి మీకు ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు” అని బ్రేజర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)