Home జాతీయ national telgu మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ లొంగిపోయారన్న ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్...

మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ లొంగిపోయారన్న ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ?

7
0

SOURCE :- BBC NEWS

మావోయిస్టు పార్టీ, దేవ్ జీ, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌ జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఒక పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది.

మావోయిస్టు అగ్రనేత దేవ్‌ జీ‌తో పాటు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగిపోయినట్లు తెలంగాణ నుంచి సమాచారం అందుతోందని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఏఎన్ఐతో మాట్లాడుతూ , “బసవరాజు హత్య తర్వాత నక్సలైట్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన దేవ్ జీ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలంగాణ నుంచి సమాచారం అందుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో చురుగ్గా పనిచేసిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇది సంతోషించదగ్గ విషయం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నిజమయ్యే దిశగా చురుగ్గా పని జరుగుతోంది” అని అన్నారు.

అయితే, దీనిపై ధ్రువీకరణ కోసం తెలంగాణ పోలీసులను బీబీసీ సంప్రదించింది. వారు స్పందించడానికి నిరాకరించారు. తెలంగాణ పోలీసు శాఖకి చెందిన ఒక అధికారి మాత్రం “దేవ్ జీతో పాటు కొందరు మావోయిస్టులు లొంగిపోయారని బీబీసీకి చెప్పారు.”

అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇంతకుముందు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గత ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన తరువాత దేవ్ జీ ఆ బాధ్యతలు స్వీకరించారు.

అసలు ఎవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కోరుట్ల వాసి

మావోయిస్టు పార్టీ నిర్మాణం ప్రకారం, ఆ పార్టీ అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి.

అంతకు ముందు ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గత ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన తరువాత, దేవ్ జీ ఆ స్థానంలోకి వచ్చారు.

ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 80లలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదవుతుండగానే విద్యార్థి రాజకీయాలవైపు వెళ్లారు.

కాలేజీలో చదివేటప్పుడు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

తరువాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.

మావోయిస్టు పార్టీ, దేవ్ జీ, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

ఫొటో సోర్స్, ANI

దండకారణ్యంలో..

రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి.

”1981-82లలో రైతు కూలీ సంఘం ఒక భారీ సభ నిర్వహించింది. అది అప్పట్లో చరిత్రాత్మక సభ. దాన్ని ఈయనే నిర్వహించారు. తరువాత ఆయనను పార్టీ 1983-84 ప్రాంతంలో దండకారణ్యానికి పంపింది” అంటూ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన కరీంనగర్‌వాసి ఒకరు బీబీసీకి చెప్పారు.

కరీంనగర్ టౌన్‌లోనూ, తరువాత సిరోంచ ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా ఆయన పనిచేశారు. తిరుపతి దాదాపు 15 ఏళ్ళ పాటు గడ్చిరోలిలో పనిచేశారు. అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.

తరువాత 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు.

90ల మధ్య వరకు పార్టీ నిర్మాణంలో ఉన్న దేవ్ జీ, తరువాత మిలటరీ విభాగాల వైపు మళ్ళారు. అప్పటి నుంచి పార్టీ సాయుధ విభాగాల్లోనే ఉంటూ వచ్చారాయన.

1996 ప్రాంతంలో దండకారణ్యంలో మొదటి ప్లటూన్ ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. అది ఒక మిలటరీ నిర్మాణం. దానికి మొదటి కమాండర్‌గా తిరుపతి వ్యవహరించారు.

తరువాత 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. అప్పట్లో కేంద్ర కమిటీలో చేరిన పిన్న వయస్కుల్లో ఈయన ముఖ్యుడు. సెంట్రల్ కమిటీతో పాటు, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ)లో కూడా సభ్యుడు అయ్యారు దేవ్ జీ.

మావోయిస్ట్ పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో ఆయన పనిచేశారు.

”2004లో పీపుల్స్‌వార్ కాస్తా మావోయిస్టుగా అవతరించిన తరువాత కూడా ఆయన సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలటరీ కమిషన్లలో కొనసాగారు. బసవరాజ్ సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా ఉంటే అందులో తిరుపతి కీలకపాత్ర పోషించారు. 2018లో బసవరాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లిన తరువాత, దేవ్ జీ సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతి అయ్యారు” అని మాజీ మావోయిస్టు ఒకరు బీబీసీకి చెప్పారు.

మావోయిస్టు పార్టీ, దేవ్ జీ, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

ఫొటో సోర్స్, NIA

మిలటరీ ఆపరేషన్స్

ఛత్తీస్‌గఢ్‌లో భద్రత దళాలపై జరిగిన కీలక దాడుల్లో దేవ్ జీ పేరు ప్రధానంగా వినిపించింది.

మావోయిస్టు మిలటరీ శిక్షణ, ఆపరేషన్లలో దేవ్ జీ కీలక భూమిక పోషించారని పార్టీని దగ్గర నుంచి పరిశీలించేవారు చెబుతారు.

పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటు వెనుక ఆయన ఉన్నారని కూడా అంటారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవ్ జీ ఉన్నారు. ఆయన పేరుపై రివార్డు కూడా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)