SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, @Tanumahi042006
-
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
13 ఫిబ్రవరి 2026, 11:50 IST
-
చదివే సమయం: 6 నిమిషాలు
అప్పుడు సమయం మధ్యాహ్నం 11 గంటలు, బిహార్‌లోని సుపౌల్ జిల్లా పిప్రా బ్లాక్‌లో తులాపట్టి గ్రామానికి చేరుకున్నాను. కాస్త ఎండ పడుతుండటంతో ప్రజలు తమ ఇళ్ల ముందు కూర్చొని ఆ ఎండను ఆస్వాదిస్తున్నారు.
కానీ, అదే తులాపట్టి గ్రామంలో, 20 ఏళ్ల యువతి ఓ చిన్న గదిలో ఇంకా నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది.
‘తనూ, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు’ అని ఆమె మామయ్య రెండుమూడు సార్లు పిలిచిన తర్వాత నెమ్మదిగా తను దుప్పటి తీసి బయటకు చూశారు.
అప్పుడామె చేతిలోని ట్యాబ్‌లో ఒక వీడియో ప్లే అవుతోంది.
అది గతించిన తన సంతోషకరమైన రోజులకు సంబంధించిన వీడియో.
ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
కన్నీరు కార్చుతున్న ఆమె పెద్ద కళ్లు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత విషాదకరమైన సంఘటనకు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి.
ఆమె పేరు తనూప్రియ.
భర్త రాహుల్‌ను ఆమె తండ్రే కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఘటనతో ‘జీవచ్ఛవం’లా మారిపోయిన తనూప్రియ, మంచంపై నుంచి లేవడానికీ ఇష్టపడరు. చీకటైపోయిన తన జీవితంలో వచ్చే ప్రతిరోజూ ఏదో రకంగా గడిచిపోవాలనే అనుకుంటారు.

ఫొటో సోర్స్, @Tanumahi042006
కాలేజీలో ఇద్దరికీ పరిచయం
బిహార్‌లోని సహర్సా జిల్లా బన్‌గావ్ గ్రామం తనూప్రియ స్వస్థలం. ప్రేమశంకర్ ఝా, గుంజన్ కుమారి దంపతుల కుమార్తె. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. తనూప్రియ ప్రాథమిక విద్య అంతా సహర్సాలోనే సాగింది.
తండ్రి ప్రేమశంకర్ ఝాకు మందుల దుకాణం ఉంది. తల్లి గుంజన్ కుమారి ఒక ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
బీఎస్సీ నర్సింగ్ చదవడానికి తనూప్రియ దర్భంగా మెడికల్ కాలేజీలో చేరారు. అక్కడే సీనియర్ విద్యార్థి రాహుల్ కుమార్‌తో పరిచయమైంది.
సుపౌల్ జిల్లా తులాపట్టి గ్రామానికి చెందిన రాహుల్‌ది ఒక సాధారణ రైతు కుటుంబం.
ఆయన తండ్రి గణేష్ మండల్ వ్యవసాయం చేస్తున్నారు. తల్లి అనితాదేవి పన్నెండో తరగతి వరకూ చదివినా గృహిణిగా ఇల్లు చూసుకుంటున్నారు.
బిహార్‌లో ‘మండల్’ సామాజిక వర్గం వెనుకబడిన తరగతుల (బీసీ) పరిధిలోకి వస్తుంది.
”రాహుల్ నా కంటే ఒక సంవత్సరం సీనియర్. కాలేజీలో పరిచయం. చదువులో సహకరించేవారు. క్రమక్రమంగా నాకు ప్రాణస్నేహితుడు అయ్యారు. మా మధ్య ఎప్పుడూ గొడవల్లేవు” అంటూ తనూప్రియ తమ గత రోజులను గుర్తుచేసుకున్నారు.
తనూప్రియ తనకు బుల్లెట్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. రాహుల్‌తో కలిసి బుల్లెట్ నడుపుతున్న చాలా వీడియోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి.
వాటిని చూపిస్తూ, ”మేమిద్దరమూ కలిసి చదువుకునేవాళ్లం, బుల్లెట్‌పై కలిసి తిరిగేవాళ్లం. గుడికి కలిసే వెళ్లేవాళ్లం. అలాగని మా మధ్య డేటింగ్ ఏమీ లేదు. మాది బ్రాహ్మణ కుటుంబం. రాహుల్ బీసీ వర్గానికి చెందినవారు. మా స్నేహం కాలేజీలో చాలామందికి నచ్చలేదు. మా ప్రేమ విషయాన్ని మా నాన్నకు చేరవేశారు” అని ఆమె చెప్పారు.
ఫొటో సోర్స్, @Tanumahi042006
ఇష్టపూర్వకంగానే వివాహం…
నిరుడు మార్చి 27న బన్‌గావ్‌లోని తన ఇంటికి వెళ్లినప్పుడు, తన ప్రేమ విషయమై కుటుంబసభ్యులు వేధించడం మొదలెట్టారని తనూప్రియ చెప్పారు.
”రాహుల్‌పై రేప్ కేసు పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అలాంటి తప్పుడు ఉద్దేశంతో అతను నన్నెప్పుడూ తానను కూడా లేదు. అలాంటప్పుడు అతనిపై నేను అలా ఎలా చేయగలను? మనం ఒకరితో స్నేహం చేస్తున్నామంటే, ఎవరో ఒత్తిడి తెచ్చారని మన స్నేహితుడి కెరీర్ నాశనం చేయకూడదు కదా” అని ఆమె అన్నారు.
”కేసు పెట్టడానికి నేను నిరాకరించేసరికి ఇంట్లో నన్ను కొట్టడం మొదలెట్టారు. అది భరించలేక నన్ను కాపడమంటూ రాహుల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాను” అని చెప్పారు.
రాహుల్ సాయంతో తనూప్రియ తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.
”మేం లఖిసరాయ్‌లోని అశోక్‌ధామ్‌లో వివాహం చేసుకున్నాం. కోర్టులో దాఖలు చేయడానికి అఫిడవిట్ తదితర పత్రాలను సిద్ధం చేసుకున్నాం. ఆ తర్వాత బన్‌గావ్ పోలీసుస్టేషన్‌లో మా దగ్గర నుంచి 161, 164 స్టేట్‌మెంట్లు కూడా నమోదుచేసుకున్నారు. నా ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నానని చెప్పాను” అని తనూప్రియ వివరించారు.
”పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ మా కాలేజీకి వచ్చేశాను. యూపీఎస్‌సీకి కూడా ప్రిపరేషన్ ప్రారంభించాను. రాహుల్ నాకోసం ఒక ట్యాబ్ కొనిచ్చి, ‘నువ్వు కేవలం చదువుపై దృష్టి పెట్టు’ అని చెప్పాడు. నిరుడు ఆగస్టు 5న కూడా నాతో మాట్లాడుతూ, ‘పొలిటికల్ సైన్స్ చాప్టర్ పూర్తి చేయు’ అన్నాడు. ‘సాయంత్రం పూర్తి చేస్తాను’ అని చెప్పాను. కానీ ఆ సాయంత్రం ఎప్పటికీ రాలేదు’ అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, Shahnawaz Ahmed/BBC
ఆగస్టు 5న ఏం జరిగింది?
”ఆ రోజు మంగళవారం. ఇద్దరమూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్లాను. సాయంత్రం నేను క్యాంటీన్‌కు వెళ్తునప్పుడు రాహుల్ ఎదురయ్యాడు. అప్పుడే మాస్క్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి, ‘ఈ బుల్లెట్ ఎవరిది?’ అంటూ రాహుల్‌ను పదేపదే అడుగుతున్నాడు” అని తనూప్రియ ఆగస్టు 5న జరిగిన ఘటన గురించి చెప్పడం మొదలెట్టారు.
”మాస్క్ తీసి మాట్లడమని రాహుల్ అతన్ని అడుగుతున్నాడు. అంతలోనే అతను తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తప్పించుకోవడానికి రాహుల్ నావైపు పరిగెత్తుతూ వస్తున్నాడు. నేను కూడా రాహుల్ వైపు పరుగెత్తాను. నా దగ్గరకు వచ్చి పడిపోయాడు. వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాం” అని ఆమె చెప్పారు.
”కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని నా తోటి విద్యార్థులు పట్టుకొని కొట్టారు. మాస్క్ తొలగించి చూస్తే, అతనెవరో కాదు మా నాన్నే. నా భర్తను మా నాన్నే చంపేశారు” అని తనూప్రియ వెల్లడించారు.
స్థానిక పోలీసులు ప్రేమశంకర్ ఝాను అదుపులోకి తీసుకొని, చికిత్స నిమిత్తం పట్నా బోధనాసుపత్రికి తీసుకెళ్లారు.
”నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో, ఆయనే వచ్చి నా భర్త చంపేయడం, అదీ కులం వేరనే కారణంతో ఆ ఘాతుకానికి పాల్పడటం అత్యంత దారుణం. మా నాన్నకు కేవలం మా కులంవారు మాత్రమే మంచివారా? మిగిలినవారి రక్తమేమైనా అశుద్ధమా? అదే నిజమైతే, ఆసుపత్రిలో రక్తం ఎక్కించేటప్పుడు, అది ఏ కులం వారిదని ఎందుకడగరు? తన గోత్రం వారి రక్తం మాత్రమే తనకు ఎక్కించాలని ఏ రోగీ ఎందుకు అనరు” అని తనూప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
గణేష్ మండల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తనూప్రియ తల్లిదండ్రులు, ఆమె ఇద్దరు సోదరులు ఈ కేసులో నిందితులు.
దర్భంగా జైలులో ఉన్న ప్రేమశంకర్ ఝా నిరుడు నవంబర్‌లో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
”ప్రేమశంకర్ ఝా దాఖలుచేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అలాగే పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ కూడా దాఖలుచేశారు” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమరేంద్ర నారాయణ్ ఝా బీబీసీతో చెప్పారు.
”గుంజన్ కుమారికి పట్నా హైకోర్టు నుంచి బెయిల్ మంజూరుచేసింది. మిగిలిన ఇద్దరు నిందితుల ప్రమేయం గురించి దర్యాప్తు కొనసాగుతోంది” బెంతా పోలీసుస్టేషన్ ఇన్‌ఛార్జ్ హరేంద్రకుమార్ బీబీసీకి తెలిపారు.
ఫొటో సోర్స్, Shahnawaz Ahmed/BBC
‘ఇక కోడలే నా కొడుకు’
రాహుల్ మరణం తర్వాత వారి ఇల్లు ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయింది. అంతా నిశ్శబ్దం అలముకుంది.
”ఈ విషాదంలో నేను ఎక్కడ ఏదైనా చేసుకుంటానని వీరికి (రాహుల్ తల్లిదండ్రులకు) భయం. అందుకే నన్ను గదిలోపలి నుంచి గడియ పెట్టుకోనివ్వరు. నన్ను ఏదైనా తినాలంటూ రోజూ నా వెంటే ఉంటారు. నా వల్లే వారి కొడుకు చనిపోయాడని ఎప్పుడూ అనరు” అని తనూప్రియ చెప్పారు.
”సొంత అల్లుడినే చంపేసే ఇలాంటి తండ్రి (ప్రేమశంకర్ ఝా)ని నేనెక్కడా చూడలేదు. నా కొడుకు ఎలాగూ దూరమైపోయాడు. ఇకపై తనూప్రియనే నా కొడుకు. ఆమెనే నా బిడ్డగా చూసుకుంటూ నా మిగిలిన జీవితం గడిపేస్తాను” అని రాహుల్ తల్లి అనితాదేవి అన్నారు.
ఈ విషాదం నుంచి తనూప్రియ ఇంకా తేరుకోలేదు.
రెండు పుస్తకాల బ్యాగులు ఆమె గదిలో వేలాడుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆ పుస్తకాలను మళ్లీ తెరవనేలేదు.
”నేను ఏనాడూ ఒంటరిగా కలలు కనలేదు. నా ప్రతి కల రాహుల్‌తోనే ముడిపడి ఉంది. అతనే లేనప్పుడు నేనేం చేయాలి? నా భర్తకు న్యాయం జరిగేలా చూడటానికే నేను ప్రాణాలతో ఉన్నాను. నా భర్తను చంపేసి మా నాన్నే నన్ను జీవచ్ఛవంలా మిగిల్చారు” అని తనూప్రియ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



