Home జాతీయ national telgu ‘‘మా కళ్లల్లో భయాన్ని చూసి ఎప్‌స్టీన్ ఆనందించేవాడు’ – బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన...

‘‘మా కళ్లల్లో భయాన్ని చూసి ఎప్‌స్టీన్ ఆనందించేవాడు’ – బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన బాధితులు

9
0

SOURCE :- BBC NEWS

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్

గమనిక : ఈ కథనంలో మిమ్మల్ని కలచి వేసే అంశాలున్నాయి.

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ చేతుల్లో తాను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బయట మాట్లాడగలుగుతామని జొయాన్నా హారిసన్ ఎప్పుడూ అనుకోలేదు.

ఇతర బాధితుల్లానే ఎప్‌స్టీన్ వేధింపులతో తాను తీవ్ర అవమానానికి లోనయ్యానని, సిగ్గుగా అనిపించిందని ఆమె అన్నారు.

అయితే, అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన లక్షలాది ఎప్‌స్టీన్ పత్రాల్లో తన పేరు అనుకోకుండా బయటపడిన తర్వాత, ఇక మాట్లాడాల్సిందేననే భావన కలిగిందని ఆమె బీబీసీ న్యూస్‌నైట్‌ ప్రోగ్రామ్‌లో వ్యాఖ్యాత విక్టోరియా డెర్బీషైర్‌కు తెలిపారు.

“ఒక దశలో మీరు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఊపిరి పీల్చుకోవాల్సిందే. నేను ఇప్పుడు మాట్లాడటం కూడా అలా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం లాంటిదే..” అని హారిసన్ అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్

బీబీసీ న్యూస్‌నైట్ మొదటిసారి హారిసన్‌తో పాటు మరో నలుగురు ఎప్‌స్టీన్ బాధితులను ఒకే వేదికపైకి తీసుకు వచ్చింది.

కొన్ని గంటలపాటు సాగిన చర్చలో వారు పరస్పరం తమ భావాలను పంచుకున్నారు, ఒకరికొకరు మద్దతు తెలుపుకున్నారు.

ఎప్‌స్టీన్‌ను తొలిసారి కలిసిన కాలం నాటి ఫోటోలను చూస్తూ భావోద్వేగానికిలోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో బాధితులు తమ అనుభవాలను, బాధను, ఆగ్రహాన్ని వివరించారు.

కొందరు ఎప్‌స్టీన్ ప్రైవేట్ దీవి ‘లిటిల్ సెయింట్ జేమ్స్’లో గడిపిన రోజులను గుర్తుచేసుకోగా.. మరికొందరు న్యూ మెక్సికోలోని అతని రాంచ్‌లో ఎదురైన భయానక క్షణాలను వివరించారు.

ఎప్‌స్టీన్‌కు పరిచయమున్న శక్తివంతమైన వ్యక్తులకు అక్కడ జరుగుతున్న విషయాలపై అవగాహన ఉండే అవకాశముందని వీరంతా అభిప్రాయపడ్డారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్, హారిసన్

వెలుగులోకి వచ్చిన బాధితుల గుర్తింపు

ఎప్‌స్టీన్‌పై జరిగిన వివిధ దర్యాప్తులకు సంబంధించిన లక్షలాది పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది.

అయితే, కొన్ని పత్రాల్లో బాధితుల గుర్తింపును పూర్తిగా గోప్యంగా ఉంచలేకపోయారు. అలా పేరు బయటపడిన వారిలో హారిసన్ ఒకరు.

తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో ఆ పత్రాలు విడుదల కాకూడదని తాను కోరుకున్నానని ఆమె చెప్పారు.

“మీపై దాడి చేసిన వ్యక్తి ముఖాన్ని ఆరు సంవత్సరాల పాటు ప్రతిరోజూ టీవీలో చూడటం మామూలు విషయం కాదు” అని ఆమె అన్నారు.

ఫ్లోరిడాలో 18 ఏళ్ల వయసులో ఎప్‌స్టీన్‌ను కలిసిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇతరు బాధితుల్లానే తన పరిచయం కూడా ‘మసాజ్’తో ప్రారంభమైందని తెలిపారు.

‘‘మొదట అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ, అతను హస్తప్రయోగం చేయడం ప్రారంభించినప్పుడు నేను పూర్తిగా స్తంభించిపోయాను. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు కారులో నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదనుకుంటా” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

తర్వాత ఎప్‌స్టీన్ అతని పుట్టిన రోజునాడు తనపై అత్యాచారం చేసారని ఆమె అన్నారు.

ఎప్‌స్టీన్ అఘాయిత్యాల గురించి మొదటిసారి బహిరంగంగా మాట్లాడిన హారిసన్, ఎప్‌స్టీన్ మరణించారు కాబట్టి, బాధితులు న్యాయందక్కే అవకాశాలపై అనుమానం వ్యక్తం చేశారు.

“నాకు ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి” అని ఆమె అన్నారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్, డేవిస్

ఫొటో సోర్స్, Chauntae Davies

ఐదు రోజుల్లో ఐదు దేశాలు..

ఎప్‌స్టీన్ ప్రైవేట్ విమానంలో ఆఫ్రికాకు చేసిన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను బీబీసీ న్యూస్‌నైట్‌తో పంచుకున్నారు చౌంటే డేవిస్. ఇవి ఇప్పటి వరకు బయటపడని చిత్రాలు.

ఆ చిత్రాల్లో ఎప్‌స్టీన్ సహచరురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్, నటుడు కెవిన్ స్పేసీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కనిపించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంచే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఈ టూర్ జరిగింది.

“రకరకాల మనుషులు ఒక్కచోట చేరిన జ్ఞాపకం అది. ఐదు రోజుల్లో ఐదు దేశాలకు ప్రయాణించడం ఒక క్యాంపులా అనిపించింది” అని ఆమె చెప్పారు.

విమానంలో వారు స్నాక్స్ తింటూ, కార్డులు ఆడుతూ, కథలు చెప్పుకుంటూ గడిపినట్లు గుర్తు చేసుకున్నారు

“జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అనుభవం అది. కానీ, తెర వెనుక చేదు అనుభవాలతో అది మసకబారిపోయింది” అని ఆమె అన్నారు.

మసాజ్ కోసం నియమించుకున్న తర్వాత ఎప్‌స్టీన్ తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు.

పోర్చుగల్‌లో విమానం రీఫ్యూయలింగ్ సమయంలో తాను బిల్ క్లింటన్‌కు నెక్ అండ్ బ్యాక్ మసాజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆయన వినయంగా, ధైర్యంగా, చార్మింగ్‌గా అనిపించారని తన డైరీలో రాసుకున్నట్లు చెప్పారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్, డేవిస్

ఫొటో సోర్స్, Chauntae Davies

డేవిస్‌తో పరిచయం గురించి అడిగినప్పుడు ఈ విషయం అప్పుడే తెలిసి ఉంటే తాను చర్యలు తీసుకునేవాడినని క్లింటన్ అమెరికా ప్రతినిధుల సభ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

అయితే డేవిస్ మాత్రం, “నేను ఎవరితోనూ ఈ విషయం గురించి చెప్పే స్థితిలో లేను. ఆయన నిజంగా ఏం చేయగలిగేవారు? ఆపగలిగేవారా? మనకు తెలియదు కదా” అని డేవిస్ అన్నారు.

ఎప్‌స్టీన్ దుర్వినియోగాన్ని తాను ప్రత్యక్షంగా చూడలేదని క్లింటన్ పలుమార్లు పేర్కొన్నారు. కేవలం పత్రాల్లో ఆయన పేరు రావడంతో కచ్చితంగా తప్పు చేశారనే అర్థంకాదని స్పష్టం చేశారు.

స్పేసీ మాత్రం అన్ని పత్రాలను పూర్తిగా విడుదల చేయాలని కోరుతూ, “భయపడటానికి ఏమీలేని నాలాంటి వారు నిజం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Thierry Humeau

శక్తివంతమైన వ్యక్తులతో పరిచయాలు

ఈ ఏడాది ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన ఆరోపణల కారణంగా న్యూ మెక్సికోలోని ఎప్‌స్టీన్ రాంచ్‌పై మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది.

‘‘అత్యధిక దాడులు అక్కడే జరిగాయి. నా జీవితంలో అత్యంత చీకటి జ్ఞాపకాలు అక్కడివే” అని డేవిస్ చెప్పారు.

‘‘అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక బందీగా ఉన్నట్టు అనిపించేది. చల్లగా, చీకటిగా, భయానకంగా ఉండేది’’ అని ఆమె వివరించారు.

మరో బాధితురాలు లీసా ఫిలిప్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘ఆ ప్రదేశం చాలా భయంకరంగా అనిపించేది’’ అని చెప్పారు.

శక్తివంతమైన వ్యక్తులతో తన పరిచయాల గురించి ఎప్‌స్టీన్ గొప్పగా చెప్పుకునేవాడని డేవిస్ పేర్కొన్నారు.

యార్క్ మాజీ డచెస్ సారా ఫెర్గూసన్‌కు డబ్బు అప్పుగా ఇచ్చిన విషయాన్ని కూడా అతను ప్రస్తావించేవాడని తెలిపారు. ‘‘అది రహస్యం కాదు’’ అని డేవిస్ బీబీసీ న్యూస్‌నైట్‌కు తెలిపారు.

ప్రిన్స్ ఆండ్రూ (ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్)తో సంబంధాలపై కూడా చర్చలు జరిగేవని చెప్పారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్, ఫిలిప్స్

ఫొటో సోర్స్, Thierry Humeau

తన స్నేహితురాలిని ప్రిన్స్ ఆండ్రూతో సెక్స్ చేయాల్సిందిగా ఎప్‌స్టీన్ ఆదేశాలిచ్చేవాడని ఫిలిప్స్ అన్నారు.

2003లో తన స్నేహితురాలు న్యూయార్క్‌లో ఉన్న ఎప్‌స్టీన్ అపార్ట్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఎప్‌స్టీన్ ఆమెను ఒక రూమ్‌కి వెళ్ళి అందులో ఉన్న వ్యక్తితో సెక్స్ చేయమని చెప్పాడని ఫిలిప్స్ అన్నారు.

ఆ వ్యక్తి ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌గా తన స్నేహితురాలు గుర్తుపట్టినట్లు ఫిలిప్స్ తెలిపారు.

అయితే ప్రిన్స్ ఆండ్రూ ఇప్పటి వరకూ వచ్చిన ఆరోపణలన్నింటిన్నీ ఖండించారు.

‘‘నా స్నేహితురాలితో ఎందుకని అలా చేయించావని నేను ఎప్‌స్టీన్‌ని అడిగినప్పుడు ‘‘నాకు కొందరి మీద పట్టు పెంచుకోవడం ఇష్టం’’ అని అతను బదులిచ్చాడు” అని ఫిలిప్స్ గుర్తు చేసుకున్నారు.

‘‘అతనికి మా కళ్లలో కనిపించే భయమంటే ఇష్టం. మేం భయానికి స్తంభించిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయన లైంగిక ఆనందాన్ని పొందేవాడు’’ అని ఆమె చెప్పారు.

న్యూస్‌నైట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మౌంట్‌బాటన్-విండ్సర్‌ తన స్నేహితురాలిని గురి చేసిన లైంగిక వేధింపుల సమాచారం గురించి తనతో మాట్లాడాలని యూకే పోలీసులను కోరారు.

అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఫిబ్రవరిలో ఆండ్రూను యూకే పోలీసులు అరెస్ట్ చేశారు.

యూకేకు వాణిజ్య రాయబారిగా వ్యవహరిస్తున్న సమయంలో సున్నితమైన సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు చేరవేశారనే ఆరోపణలపై ఆండ్రూను అరెస్టు చేశారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్, బాధితులు, ఇంటర్వ్యూ, బీబీసీ, క్లింటన్, స్పేసీ, మాక్స్‌వెల్, ఫిలిప్స్

ఫొటో సోర్స్, BBC Newsnight

“నా అప్పటి నవ్వు ఇక తిరిగి రాదు”

బాధితులు ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడనే అధికారిక నివేదికపై సందేహం వ్యక్తం చేశారు. “ఆయన గురించి మాకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు” అని వారు గుర్తు చేసుకున్నారు.

2019 ఆగస్టు 10న, న్యూయార్క్‌లోని జైలులో విచారణకు ముందు ఎప్‌స్టీన్ మృతిచెందారు. వైద్యులు దీనిని ఆత్మహత్యగా నిర్ధరించారు.

జెనా-లీసా జోన్స్, వెండి పెసాంటే ఇద్దరూ 14 ఏళ్ల వయసులోనే ఎప్‌స్టీన్‌ను కలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు స్నేహితులుగానే ఉన్నారు . ఆ అనుభవం వారి జీవితాలను దీర్ఘకాలంగా ప్రభావితం చేసిందని వారు తెలిపారు.

“అంత చిన్న వయసులో అలాంటి అనుభవం ఎదురైతే, మీ వాస్తవాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది” అని పెసాంటే అన్నారు.

“14 ఏళ్ళ వయసులో ఒక సెక్స్-వర్కర్ ఆలోచనా విధానానికి మార్చడం సరికాదు” అని ఆమె అన్నారు.

ఇంటర్వ్యూలోని ఒక దశలో బాధితులకు వారు ఎప్‌స్టీన్‌ను కలిసిన కాలం నాటి ఫోటోలు చూపించారు.

“ఇప్పుడు నా నవ్వు మారిపోయింది. అప్పటిలాగే మళ్ళీ నవ్వలేను” అని హారిసన్ అన్నారు.

ఫిలిప్స్ తన ఫోటోను చూస్తూ.. “అప్పుడు నేను ఆనందంగా జీవిస్తున్నాను. నాకు ఏం జరగబోతుందో తెలియదు. నేను దీవి నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఇంత సంతోషంగా లేను” అని వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)