Home జాతీయ national telgu మహిళలు సహజంగానే ఎదుటివారిపై ఎక్కువ సహానుభూతితో ఉంటారనేది కేవలం అపోహేనా?

మహిళలు సహజంగానే ఎదుటివారిపై ఎక్కువ సహానుభూతితో ఉంటారనేది కేవలం అపోహేనా?

5
0

SOURCE :- BBC NEWS

మహిళలు, ఎంపతీ, పరిశోధన, సహానుభూతి, సానుభూతి

ఫొటో సోర్స్, Getty Images/ Javier Hirschfeld/ BBC

మహిళలు సహజంగానే ఇతరుల భావాలను ఎక్కువగా అర్థం చేసుకుంటారని, పురుషులు మాత్రం తక్కువగా స్పందిస్తారని చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకం. కానీ, తాజా శాస్త్రీయ పరిశోధనలు ఈ లింగ ఆధారిత పాత మూసధోరణులను ప్రశ్నిస్తున్నాయి.

1705లో తత్వవేత్త మేరీ ఆస్టెల్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మహిళలు గొప్ప పనులు చేస్తే, ఆ విజయాన్ని మహిళలదిగా అంగీకరించకుండా “అవి పెటికోట్ వేసుకున్న పురుషులు చేసిన పనులు” అని భావించేవారని ఆమె విమర్శించారు. అంటే, గొప్ప పనులు చేయడం పురుషుల లక్షణమనే అభిప్రాయం అప్పట్లో బలంగా ఉండేది.

ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ I కూడా ఒకసారి దేశాన్ని “రాజులా పాలిస్తాను” అని ప్రకటిస్తూ, తనకు “బలహీనమైన స్త్రీ శరీరం” ఉన్నప్పటికీ నాయకత్వం చూపగలనని చెప్పారు. ఈ వ్యాఖ్యలో కూడా నాయకత్వం పురుషులతో ముడిపడి ఉన్న లక్షణం అన్నట్లు కనిపిస్తుంది.

ఈ ఉదాహరణలు గతానికి చెందినవైనా, విజయవంతమైన వ్యక్తి ఎలా ఉండాలి? అనే విషయంలో లింగ ఆధారిత పక్షపాతాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పటికీ కొన్ని లక్షణాలను మహిళలకు, మరికొన్నింటిని పురుషులకు ముడిపెట్టే ధోరణి కొనసాగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఉదాహరణకు, ఎంపతీ (సహానుభూతి), సానుభూతి, దయ వంటి లక్షణాలను సాధారణంగా “స్త్రీ లక్షణాలు”గా పరిగణిస్తారు. మరోవైపు ఆధిపత్యం, ధైర్యం, గట్టిగా తన అభిప్రాయాన్ని చెప్పడం వంటి లక్షణాలను “పురుష లక్షణాలు”గా చూస్తారు. ఒకే విధంగా ప్రవర్తించినా.. పురుషుడు అయితే అతన్ని “ఆత్మవిశ్వాసం గలవాడు” అంటారు, మహిళ అయితే “అహంకారంతో ప్రవర్తించింది” అని వ్యాఖ్యానిస్తారు.

ఇలాంటి లింగ ఆధారిత ధోరణులకు ముఖ్యమైన ఉదాహరణ ఎంపతీ. సాధారణంగా మహిళలు సహజంగానే ఎక్కువ ఎంపతీ కలిగి ఉంటారని భావిస్తారు. అదే లక్షణాన్ని పురుషులు చూపితే కొన్నిసార్లు బలహీనమని కూడా భావిస్తారు.

అయితే, నిజంగా మహిళలు సహజంగానే ఎక్కువ ఎంపతీ కలిగి ఉంటారా? లేక సమాజం వారిని అలా ప్రవర్తించేటట్లు చేస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇలాంటి లింగ ఆధారిత మూసధోరణులు పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం, వర్క్ కల్చర్ ఎలా ఉండాలి, నాయకత్వాన్ని ఎలా అంచనా వేస్తాం అనే విషయాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, ఈ మూసధోరణులు చాలా చిన్న వయస్సులోనే ప్రారంభమవుతాయి. తర్వాత అవే మన అంచనాలను బలపరుస్తూ, ఇతరులు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

మహిళలు, ఎంపతీ, పరిశోధన, సహానుభూతి, సానుభూతి

ఫొటో సోర్స్, Alamy/ Javier Hirschfeld/ BBC

ఎంపతీ అంటే ఏమిటి?

ఎంపతీ(సహానుభూతి) అంటే.. ఇతరుల భావాలు, ఆలోచనలను అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా స్పందించడం. దీనిని సాధారణంగా రెండు భాగాలుగా చూడవచ్చు.

కాగ్నిటివ్ ఎంపతీ: ఇతరుల భావాలను గుర్తించడం, వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం.

ఎమోషనల్ లేదా అఫెక్టివ్ ఎంపతీ: ఇతరుల భావాలకు మనం భావోద్వేగంగా స్పందించడం.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సైమన్ బారన్-కోహెన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహిళల మెదడు ప్రధానంగా ఎంపతీకి అనుకూలంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే వారు సంరక్షణ సంబంధిత పాత్రలకు అనుకూలంగా ఉంటారని ఆయన భావిస్తున్నారు. మరోవైపు, పురుషుల మెదడు.. వ్యవస్థలను అర్థం చేసుకోవడం, నిర్మించడం వంటి పనులకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయం.

బారన్-కోహెన్ చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పిల్లలు తర్వాత వ్యవస్థలను విశ్లేషించే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే టెస్టోస్టెరోన్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎంపతీ పరీక్షల్లో తక్కువ స్కోర్లు వచ్చే అవకాశముందని కొన్ని పరిశోధనలు సూచించాయి.

అయితే, ఆయన కూడా చివరికి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు: ఎంపతీ లేదా ఇతర సామాజిక లక్షణాలు జీవశాస్త్రంతో పాటు సామాజిక ప్రభావాల కలయికపై ఆధారపడిన ఫలితాలు.

మహిళలు, ఎంపతీ, పరిశోధన, సహానుభూతి, సానుభూతి

ఫొటో సోర్స్, Alamy/ Javier Hirschfeld/ BBC

‘స్త్రీల మెదడు’ అనే అపోహ?

బారన్-కోహెన్ సిద్ధాంతాన్ని కొన్ని పరిశోధనలు తిప్పికొడుతున్నాయి. న్యూరోసైంటిస్ట్ జీనా రిప్పన్ “మహిళల మెదడు సహజంగానే ఎంపతీ ఎక్కువగా కలిగి ఉంటుంది” అనే భావన ఒక పాత అపోహ మాత్రమే అని అన్నారు.

పిల్లల మెదడు చిన్న వయస్సులోనే ఎన్నో విషయాలతో ప్రభావితమవుతుందని, అంటే పెంపకం, పరిసరాలు, సామాజిక అంచనాల వంటివన్నీ ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి.

లింగ భేదాలను పరిశీలించిన ఒక భారీ అధ్యయనంలోనై పెద్ద తేడాలు కనిపించలేదు. 57 దేశాలలో చేసిన పరిశోధనలో 36 దేశాల్లో మహిళలు కొద్దిగా ఎక్కువ ఎంపతీ చూపించినా, 21 దేశాల్లో పురుషులు – మహిళల మధ్య గణనీయమైన తేడా కనిపించలేదు.

ఎంపతీ స్థాయికి సంబంధించి జన్యువులు కొంతమేర ప్రభావం చూపుతాయని 2018లో 46,000 మందిపై జరిగిన ఒక జన్యు పరిశోధన సూచించింది. కానీ, ఆ జన్యువులు వ్యక్తి లింగంతో ముడిపడి ఉన్నవి కావు.

ఈ పరిశోధనలో పాల్గొన్న న్యూరోడెవలప్‌మెంట్ పరిశోధకులు వరుణ్ వారియర్ ప్రకారం, వ్యక్తుల మధ్య ఎంపతీ తేడాలలో కేవలం పది శాతం మాత్రమే జన్యువుల వల్ల వస్తాయి. మిగతా ప్రభావం వ్యక్తి పెరిగిన సామాజిక వాతావరణం వల్ల ఏర్పడుతుంది.

మహిళలు, ఎంపతీ, పరిశోధన, సహానుభూతి, సానుభూతి

ఫొటో సోర్స్, Getty Images

సమాజం నేర్పే ఎంపతీ..

అనేక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మహిళలు ఎక్కువ ఎంపతీ చూపించడానికి కారణం వారి సహజ స్వభావం కాదు. చిన్నప్పటి నుంచే సమాజం వారిని అలా ప్రవర్తించేలా పెంచుతుంది.

అమ్మాయిలకు తరచుగా మృదువైన, ఎక్కువగా పెంపకానికి సంబంధించిన బొమ్మలను ఇస్తుంటారు, అబ్బాయిలకు మాత్రం సాధారణంగా కార్లు, ఇతర వస్తువులతో ఆడుకునేలా ప్రోత్సహిస్తారు.

“చిన్న వయసులోనే అమ్మాయిలకు ఎప్పుడూ మంచిగా ఉండాలి, ఇతరులకు నష్టం చేయకూడదు అని చెబుతారు. అది కొద్దికొద్దిగా వారి వ్యక్తిత్వంలో భాగమవుతుంది,” అని రిప్పన్ చెబుతున్నారు.

ఇంకో కోణం కూడా ఉంది. అధికారంలో ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు ఇతరుల భావాల పట్ల తక్కువ స్పందించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. చరిత్రపరంగా పురుషులు ఎక్కువ అధికార స్థానాల్లో ఉన్నందున, వారికి ఎంపతీ తక్కువగా కనిపించవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.

ఎంపతీ ఒక స్థిరమైన లక్షణం కాదు. అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతుందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరాలజిస్ట్ నాథన్ స్ప్రెంగ్ చెబుతున్నారు.

“మన భావోద్వేగ అనుభవాలను అర్థం చేసుకుంటూ, ఇతరుల భావాలను గుర్తించడం కూడా నేర్చుకోవచ్చు. ఎంపతీ జీవితకాలంలో మారుతూ ఉంటుంది,” అని ఆయన చెప్పారు.

2023లో జరిగిన ఒక న్యూరోసైన్స్ అధ్యయనంలో పురుషులు, మహిళలు ఇద్దరూ బాధతో ఉన్న ముఖాలను చూసినప్పుడు మెదడులో ఒకే విధమైన ప్రతిస్పందనలు కనిపించాయి. కానీ, ప్రశ్నాపత్రం ద్వారా ఎంపతీని అంచనా వేసినప్పుడు పురుషులకు తక్కువ స్కోర్లు వచ్చాయి.

అయితే, ముందుగా “పురుషులు కూడా ఇతరుల భావాలను పంచుకోవడంలో ముందుంటారు” అని చెప్పినప్పుడు ఆ తేడా పూర్తిగా కనిపించలేదు. ఇది మన అంచనాలు, ప్రేరణలు ఎంపతీపై ప్రభావం చూపుతాయని సూచిస్తుంది.

మహిళలు, ఎంపతీ, పరిశోధన, సహానుభూతి, సానుభూతి

ఫొటో సోర్స్, Getty Images

సమాజంలో మార్పు మొదలైందా?

ఎంపతీ అనే లక్షణం ఎప్పుడూ మంచికే ఉపయోగపడదు. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, కొన్నిసార్లు వారిని ప్రభావితం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చర్చల్లో లేదా వ్యాపార నిర్ణయాల్లో.

కానీ, లింగ ఆధారిత ఎంపతీ ధోరణులు సమాజంలో అసమానతలకు దారితీస్తాయి. నాయకత్వానికి అవసరమైన లక్షణాలు ఆధిపత్యం, ధైర్యం అని భావిస్తారు. ఇవి సాధారణంగా పురుషులతో ముడిపెట్టి చూసే లక్షణాలు. అందువల్ల మహిళల్లో నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉన్నాయని భావించే ప్రమాదం ఉంటుంది.

ఇంకోవైపు, ఒంటరితనం వంటి సమస్యల విషయంలో మహిళలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం కోరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, పురుషులు అలాంటి మద్దతు కోరడానికి వెనుకాడవచ్చు. సామాజిక ఒంటరితనం ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపించే సమస్య.

అయితే, సమాజంలో మార్పు మొదలైంది. భావోద్వేగా నైపుణ్యాలు, సంరక్షణ బాధ్యతలు మహిళలతో పాటు పురుషులకూ అంతే ముఖ్యమని ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నారు.

ఐర్లాండ్‌కు చెందిన సమాజ శాస్త్రవేత్త నియాల్ హాన్లాన్ ప్రకారం, చిన్నప్పటి నుంచి అబ్బాయిలను సంరక్షణ పాత్రలకు దూరంగా ఉంచే విధంగా పెంచుతారు. కానీ ప్రస్తుతం పురుషులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా పాల్గొనాలనే ఆసక్తి పెరుగుతోంది.

పురుషులను కూడా భావోద్వేగాలకు స్పందించే వారిగా, సంరక్షణ బాధ్యతలు తీసుకునే వ్యక్తులుగా చూడటం కొత్త రకం పురుషత్వానికి దారితీస్తుందని హాన్లాన్ అంటారు. ఇది అధికారాన్ని మాత్రమే ప్రాధాన్యంగా చూసే పాత మూసధోరణి కాదు. పరస్పర సహకారం, అనుభూతి, సంబంధాలను విలువైనవిగా చూసే దృక్పథం.

ఈ మార్పు సమాజానికి మొత్తం ప్రయోజనకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. పురుషులు, మహిళలు, పిల్లలు.. అందరికీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)